క్రైస్తవుని జీవన శైలిలో - విజయ సామర్థ్యం. ఫిలిప్పీ 4:13
పందెమందు పరుగెత్తేవాడు నేను పరుగెత్తగలను అనే విశ్వాసం కలిగి ఉండాలే కాని, నేను గెలవగలనో లేదో అని పరుగెడితే విజయం పొందకపోగా నిరాశకు గురవుతాడు.
విద్యార్థి నేను ఉత్తీర్నుడవుతానో లేదో అనే సందేహాలతో పరీక్షలు వ్రాస్తే విఫలమయ్యే పరిస్థితికి దారితీస్తుంది కాదా!
ఆత్మవిశ్వాసం లేకుండా విజయాలు పొందటం అసాధ్యమే అవుతుంది.
అనేకసార్లు స్వశక్తితో, స్వస్థబుద్ధితో మనం పోగొట్టుకున్నవి దేవుని శక్తితో తిరిగి పొందుకోగలం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలి, పొందుకోవాలి.
అందుకే అపొ. పౌలు అంటాడు... నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను (ఫిలిప్పీ 4:13). దేవుడు మనలను విజయం పొందడానికే ఉద్దేశించాడు గాని ఓడిపోవాలని మాత్రం కాదు. పరిపూర్ణ క్రైస్తవ విశ్వాసం వలన అనుభవం కలుగుతుందని గ్రహించినప్పుడు మనలోని ఆత్మవిశ్వాసము దేవునివలన బలపరచబడుతుంది.
దేవునిని సంతోషపెట్టే జీవితం గడపాలని ఎంచుకోవడం మన విజయ సామర్ధ్యం.
మానవ జీవిత అనుభవంలో ఎదురయ్యే ప్రతి మానసిక, శారీరక లేదా సామాజిక ఇబ్బందులలో, ప్రభువు మన పక్షమున ఉన్నాడన్న ధైర్యముతో చేసే ప్రార్ధనానుభవం మనల్ని ముందుకు నడిపించాలే గాని కృంగుదలకు గురిచేయకూడదు.
ఇదే శరీరము ఆత్మల మధ్య ఏర్పడిన సంఘర్షణ. క్రీస్తునందు మనకున్న విశ్వాసము అంతకంతకు బలపరచు ఓర్పు, నిరీక్షణలు అభ్యసించటం ద్వారా బలహీనమైన స్థితిలోనే బలపరచు పరిశుద్ధాత్మతో విజయపథం వైపు నడిపిస్తుంది. ప్రభువునందలి ఆనందం పరిపూర్ణమౌతుంది.
మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
కొదమ సింహములను, నాగుపాములను అణగదొక్కగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి, ప్రతి బలహీనతలను మన కాలి క్రింద ఉంచగల సమర్ధుడైన యేసు వైపు చూద్దాం. విశ్వాస-సహనంతో అడుగులు ముందుకు వేస్తూ విజయ సామర్ధ్యాన్ని పొందుకుందాం. ఆమెన్.
Audio Available : https://youtu.be/NTumxrrNPGw