సర్వసమృద్ధి
వారం రోజులు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే, ఆ ప్రయాణానికి కావలసిన సామాన్లు లేదా వస్తువులతో పాటు, కొన్ని బట్టలు సర్దుకొని ప్రయాణానికి సిద్ధపడుతుంటాము. ఎటువంటి సామాన్లు లేకుండా ఖాళీ చేతులతో ప్రయాణాన్ని ఒకసారి ఊహించుకోండి. ప్రాధమిక అవసరతలకు ఏమి ఉండవు, బట్టలు మార్చుకోవలసిన పరిస్థితి ఉండదు, డబ్బులు లేదా క్రెడిట్ కార్డులు, ప్రత్యేకంగా మొబైల్ ఫోను లేకుండా ప్రయాణం ఊహించుకోవడం భయంకరంగా ఉంటుంది కదా.
యేసు క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను మొదటి సారి సువార్తను ప్రకటించడానికి మరియు అనేకులను స్వస్థపరచడానికి పరిచర్యకు పంపించినప్పుడు సరిగ్గా ఇదే చేయమని చెప్పాడు.(మార్కు 6:8,9) “ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను”. (లూకా 22:35) మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు ఏమియు తక్కువకాలేదనిరి.
ఈ సంగతులను బట్టి మనం గమనించవలసిన సంగతి ఒకటి ఉంది. దేవుడు దేని నిమిత్తం తన శిష్యులను పిలిచాడో, దానిని చేయుటకు అవసరమైన వన్నిటిని సమకూర్చడమే కాకుండా అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి స్వస్థతలు చేయుటకు శక్తిని కూడా దయజేసాడు.
2 కొరింథీ 9:8 “మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు” అని అపో. పోలు కొరింథీ సంఘానికి వివరిస్తూ నేడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు.
నిజంగా, నేడు మన విశ్వాసంలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడినప్పటికీ, సందేహాలతో, సంశయాలతో, స్వతహాగా ప్రణాలికలు వేసికొని పరిచర్యను జరిగించుకుంటే ఆశీర్వాదాలు పొందక పోగా సమస్యలే ఎదురవుతుంటాయి. దేవుని ప్రణాళికలో తన పనిని కొనసాగించుటకు అవసరమైన ప్రతీది దేవుడు దయజేస్తాడని విశ్వాసముంచుదాం. అనుదిన జీవితంలో కూడా దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే సంతోషభరితమైన ఆశీర్వాదాలు పొందగలం. ఆమెన్.
Audio: https://youtu.be/ax9RFq5MJM0