అల్పమైన పరిచర్యలు
బైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారని, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేకీయులు గెలిచారని (నిర్గమ 17:8-15) మనందరికీ తెలుసు. అయితే, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆహారోను, హూరులు మోషే చేతులను ఇరువైపులా పట్టుకొని అతని చేతులను ఆదుకొనగా…అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండినందున ఇశ్రాయెలీయులు గెలిచేలా సహాయపడ్డారు.
ఆహారోను గూర్చి మనందరికీ తెలిసినప్పటికీ, హూరు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ వ్రాయబడలేదు. క్షుణ్ణంగా గమనిస్తే ఇశ్రాయేలీయుల చరిత్రలో అమాలేకీయులపై యుద్ధం చేసినప్పుడు వారు పొందిన విజయం వెనుక అతనొక కీలకమైన పాత్రను పోషించాడు. బయటకు తెలియకపోయినా వెనకనుండి నడిపించి... సహాయం చేసి గుర్తింపు లేని పాత్రను పోషించే వారు కొందరుంటారు. గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన సేవకులు, నాయకులను చూసినప్పుడు వారి విజయం వెనుక నెమ్మదిగా, నమ్మకంగా సాక్ష్యం కలిగి సేవ చేసిన హూరు వంటి వారు తప్పకుండా ఉంటారు. వీరి సేవను నాయకులు లేదా ప్రజలు గుర్తించకపోయినా ప్రభువెన్నడు విస్మరించడను సంగతి గమనించాలి.
ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని శుభ్రపరచి, కుర్చీలు సర్ది, సిద్ధపరచి కష్టపడి చేసే ప్రతి పరిచర్యను దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఈ పరిచర్య అల్పమైనదిగా ఉండవచ్చు కాని, మనం చేసే పని అల్పమైనదైనా, దేవుడు మనలను గొప్పగా వాడుకుంటాడు. చేసే ప్రతి అల్పమైన పరిచర్యను గుర్తించిన దేవుడు తగిన ప్రతిఫలితాన్ని మనకు దయజేయగలడని గమనించాలి. ఆమెన్.
Audio: https://youtu.be/2gxdxjZWpvA