సంరక్షణ
నా కుమారుడు ప్రతి రోజు స్కూలుకు వెళుతుంటాడు. స్కూలుకు వెళ్ళిరావడానికి ఒక బస్సును సిద్ధపరచి, స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవరుకి ఫోన్ చేసి చేరుకున్నడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది. అనుకోకుండా బస్సు రావడం లేటయ్యింది అంటే చాలు, ఎక్కడ లేని టెన్షన్ లో ఫోనులు చేసి ఏమైందని విచారణ తప్పదు. నా లాంటి తల్లి, తండ్రి మనలో ఎందరో ఉంటారని నా ఉద్దేశం. అంతేకాదు, మన ప్రియులు ఎవరైనా ప్రయాణం చేస్తుంటే, వారు క్షేమంగా చేరుకున్నారనే వార్త వినేవరకు నిద్రపట్టని పరిస్థితి.
మన బిడ్డలు ఎక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అని మనకు ఎందుకు చింత? ఎందుకంటే మనం వారిని ఎక్కువగా ప్రేమిస్తాము కాబట్టి. బిడ్డలు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో, జీవితంలో ఎలా ఎదుగుతారో అనే ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి వారి పై శ్రద్ధ ఉంటుంది అనే విషయంలో ఎట్టి సందేహములేదు.
దేవుని అద్భుతమైన ప్రేమ, నడిపింపు, ఆయనకు మన పట్ల ఉన్న శ్రద్ధను దావీదు 32వ కీర్తనలో ప్రసిద్ధి చేశాడు. ఈ లోకపు తండ్రి ఆలోచనల కంటే మన పరలోకపు తండ్రి మన జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాలలో మరియు మన హృదయలోతుల్లో ఉన్న అవసరతలు ఎరిగినవాడై యున్నాడు. “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8) అనునది దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం.
ఈ రోజు మన పరిస్థితి ఏదైనా, ఎలా ఉన్నా సరే; ఆయనపై ఆధారపడే మన జీవితాలకు ఈ మాటలు నిరీక్షణను కలుగజేసి సంతోశాన్నిస్తాయి. మన జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లో కూడా దేవుడు మన గూర్చి చింత కలిగి మనము నడవ వలసిన మార్గాన్ని బోధిస్తూ మన ఆలోచనలను చక్కపరుస్తూ మనల్ని నడిపించి సంరక్షిస్తాడని విశ్వసించాలి. ఎందుకంటే “యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది” (కీర్తన 32:10). ఇట్టి కృప ప్రభువు మనందరికీ ఆవరింపజేయును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/NAStDl2CjQc