విశ్వాసంలో పరీక్షించబడే సమయం
జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి లేదా అధిగమించాలో క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోగలం. క్రీస్తులో ఎల్లప్పుడూ సంతోషమే అనుకున్నప్పుడు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. మట్టిలో దొరికే బంగారాన్ని మేలిమైనదిగా చేయాలంటే అగ్నిచేత శుద్ధి చేయబడాలి కదా. శోధించే శ్రమ మనలను శుద్ధి చేసి, దాదాపుగా నలుగగొట్టే క్రమంలో నుండి దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడనుటలో ఎట్టి సందేహము లేదు.
తన జీవనాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కోల్పోయిన తరువాత యోబు నిస్పృహలో మునిగిపోయాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే యోబు దేవుని అనుదినం అరాధించేవాడుగా ఉన్నా, సహాయానికై తను చేసిన మానవులను దేవుడు పట్టించుకోనట్టుగా అనుకున్నాడు. తన జీవితం నుండి దేవుడు తప్పుకున్నాడేమో అనుకున్నాడు. దేవుని కొరకు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశల్లో వెదికినా ఆయన అచ్చట కానరాలేదంటాడు యోబు 23:2-9 లో.
నిస్పృహల నడుమ యోబుకు ఒక్క క్షణం స్పష్టత కనిపించింది. చీకటి గదిలో క్రొవ్వొత్తిలా అతని విశ్వాసం కొత్త వెలుగులు దిశగా సంతరించుకుంది. “నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” (యోబు 23:10) అని అన్నాడు. హృదయలోతుల్లోని విశ్వాసాన్ని, అహంకారాన్ని, భూసంబంధమైన జ్ఞానాన్ని దాహించివేయడానికి దేవుడు శ్రమల ద్వారా విశ్వాసులను శోదిస్తేనే శుద్దులుగా చేయబడుతారు. ఈ క్రమంలో దేవుడు మౌనంగా ఉన్నట్టు, సహాయానికై మన ఆర్తనాదాలకు జవాబు దయజేయనట్టు అనిపిస్తే, మనం విశ్వాసంలో బలంగా ఎదగడానికి బహుశా అవకాశాన్ని ఇస్తున్నాడేమోనని గ్రహించాలి. విశ్వాసంలో పరీక్షించబడే సమయం, విశ్వాసంలో బలపరచబడడానికేనని విశ్వసిద్దాం. ఆమెన్.
Audio: https://youtu.be/cfFfn5GnHaw