ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ.
పరిచయం (Introduction):
అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆత్మీయ సంఘాలమీద ఆనాటి రోమా సామ్రాజ్యపు సంకెళ్ళు, పసి మొగ్గల విశ్వాస జీవితాలను చిదిమేస్తున్న కొద్దీ... రోజు రోజుకి పెరుగుతున్న విశ్వాసుల పట్టుదల ఎందరినో హత సాక్షులుగా మిగిల్చింది. ఆ క్రమములోనే శిష్యుడైన యోహానును బంధీని చేసి పత్మసు ద్వీపం అనే ఒక నిర్జన ప్రదేశంలో పడవేశారు. రాజులకు చక్రవర్తులకు వశము కాని ఆ పరిశుద్ధుడు ఆత్మ వశుడయ్యాడు.
ఆసియాలోని ఏడు సంఘాలను పరిస్థితులను గూర్చిన సంగతులను వివరిస్తూ ఆయా సంఘాలను వధువు సంఘములుగా తీర్చి దిద్దుటకు; అందులోనున్న లోటుపాట్లను సరిచేసుకుంటూ, ప్రభువు రాకడకు సిద్ధ పరచబడునట్లు ప్రోత్సాహిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు యోహానుకు చూపిన దర్శనమే ప్రకటన గ్రంథ సారాంశం. ఆనాడు యోహాను వ్రాసిన ఈ సంగతులను నేడు మనం ధ్యానించి, నేటి దినములలో మన ఆత్మీయ జీవితాలకు మన సంఘాలకు ఎలా భోధించాలో అధ్యయనం చేద్దాం.
ప్రకటన గ్రంథంలో వివరించిన ఏడు సంఘాలు - ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అనునవి నేటి దినాలలో ఆధునిక టర్కీ ప్రాంతంలో మనం చూడగలం. అయితే ఈ సంఘాలు భౌతికంగా ఇప్పుడు లేవు. ఐననూ ఏడు సంఘాలకు వ్రాసిన సంగతులను అధ్యయనం చేసినప్పుడు ఈ దినములలో మనం పాటించవలసిన క్రమమును సరిచేసుకుంటూ, చివరి ఘడియలలో ఉన్నామని గ్రహించి సంభవింపనైయున్న ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొనగల ధృఢ విశ్వాసమును, వాటిని జయించగల శక్తిని పొందగలం.
ఏడు సువర్ణ దీపస్తంభములు ఏడు సంఘములు, ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. యోహాను చూసిన ఆ నక్షత్రముల మర్మమును, దీప స్తంభముల సంగతిని గూర్చి వివరించబడిన అనేక విషయాలను నేర్చుకుందాం. దేవుడు లోకమునకు వెలుగైయున్నరీతిగా, ఆ వెలుగు మన మధ్య మనుష్యకుమారునిగా ఈ లోకంలో జీవించినప్పుడు “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని మనకు బోధించిన యేసు క్రీస్తు, యోహాను దర్శనంలో ఇప్పుడు తండ్రి కుడిపార్శమున కూర్చొని ఏడు దీప స్తంభముల మధ్య నిలుచుచున్నాడు. యుగయుగములు జీవించుచున్న మన ప్రభువుకునూ, ఆల్ఫా ఒమేగా ఐయున్న దేవునికిని మహిమయు ఘనతయు ప్రభావములు యుగాయుగములకు కలుగునుగాక. ఆమెన్.
Intro Audio: https://youtu.be/iES2AFC0ba8
- ఎఫెసు సంఘం: (ప్రకటన 2:1-7) - Ephesus Church
దేవుని నామము నిమిత్తం భారము భరించిన సంఘం...మొదటి ప్రేమను మరచిన సంఘం
(అపో.19 అధ్యా) అపో. పౌలు ఎఫెసు సంఘ వ్యవస్థాపకుడుగా ఉంటూ, 1వ శతాబ్ద కాలంలో ఎన్నో మిషనరీ పరిచర్యలను చేసి, పండ్రెండుగురు పురుషులను సిద్ధపరచి వారిని అభిషేకించాడు. ప్రత్యేకంగా, యేసు తల్లియైన మరియ ఆ సంఘ సభ్యురాలుగా ఉంటూ, శిష్యుడైన యోహాను సంఘ సిర్వహణలో పాలిభాగంగా ఉండడం చరిత్రలో గమనార్హం.
ఎఫెసు సంఘం దేవుని ప్రణాళికలో, బలమైన సంఘదర్శనంతో నిర్మించబడి, సంఘ నియమాల్లో, పరిశుద్ధాత్మ అనుభవంలో కేద్రంగా ఉంది. రోగులను స్వస్థపరచి, దయ్యములను వెళ్ళగొట్టి, దేవుడు కూడా ద్వేషించే నీకొలాయితుల క్రియలను విసర్జించి, దుర్భోధలను ఖండించి వాటిని సరి చేయుటలో గొప్ప అనుభవం కలిగిన సంఘంగా చెప్పవచ్చు. ఎఫెసులో కాపురమున్న యూదులు మరియు గ్రీసు దేశస్థుల వలన శ్రమలు ఎదురైనప్పుడు అధైర్యపడక, శ్రమలను అధిగమించగలిగింది ఈ సంఘం. గొప్ప వనరులతో పాటు అన్యదేవతల సందర్శకులకు కేంద్రబిందువైన ఎఫెసు పట్టణంలో ఈ సంఘం తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నేడు మన సంఘాలకు మాదిరిగా నిలిచింది.
యేసు ప్రేమించిన సంఘంగా, క్రీస్తు శరీరమను ఈ సంఘమునకు క్రీస్తు శిరస్సుగా వున్నట్లు దేవుడు అపో. పౌలుకు బయలుపదచడం ఎఫేసి 5:23 లో గమనించగలం. క్రీస్తు ఈ సంఘం గూర్చి సాక్ష్యమిస్తూ సహనము కలిగిన సంఘంగా, దేవుని నామము నిమిత్తం భారము భరించినదని ప్రకటన 2:2-3లో గమనించగలం.
ప్రకటన 2:4,5 ప్రకారం ప్రభువు మూడు సంగతులను హెచ్చరిస్తున్నాడు :
- మొదటి ప్రేమను జ్ఞాపకము చేసికొనుము (Remember): రక్షించబడిన దినములలో వ్యక్తిగత విశ్వాస అనుభవం; సంఘములో, పరిచర్యలో ఉజీవ జ్వాలలు రేకెత్తించిన ఆ మొదటి అనుభవాన్ని జ్ఞాపకము చేసికోమని..
- మారుమనస్సు పొందుము (Repent): వీటిని జ్ఞాపకము చేసుకుంటూ దేవునివైపు జీవితాలను మరల్చుకోమని..
- మొదటి క్రియలను చేయుము (Repeat): ఆ మొదట ఉండిన క్రీస్తు ప్రేమను తిరిగి పునరుద్ధరించుకోమని జ్ఞాపకము చేస్తున్నాడు, లేని యెడల దీపస్తంభమును అనగా సంఘమును దాని చోటనుండి తీసేవేతునని హెచ్చరిస్తున్నాడు.
క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను (ఎఫేసి 5: 25-27) ప్రభువు కోర్తుతున్న సంఘంగా మన సంఘం ఉండును గాక. అట్టి సిద్ధపరచిన సంఘంలో మనమూ మన కుటుంబము ఉండులాగున ప్రభువు స్థిరపరచి ఆశీర్వదించును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/Gz8nl-lJfpw
- స్ముర్న సంఘం: (ప్రకటన 2:8-11) - Smyrna Church - శ్రమలను ధైర్యంగా ఎదుర్కొనే సంఘం.
స్ముర్న అనగా బోళము లేదా చేదైనది అని అర్ధం. అందమైన నగరం అద్భుతమైన కట్టడాలు కలిగిన స్ముర్న పట్టణంలో నమ్మకంగా నిలబడిన సంఘం, నాటి దినములలోని అన్యదేవతలను మరియు రోమా చక్రవర్తులను పూజించుటకు వ్యతిరేకించి భయంకరమైన ఒత్తిడికి, శ్రమకు, దారిద్ర్యతకు లోనైనది ఈ సంఘం.
అభివృద్ధి చెందిన దేశాల్లోని క్రైస్తవులు నేడు తమ విశ్వాసం కోసం హింసించబడటం గురించి కొంచమే ఆలోచిస్తున్నారు, నేటికి ప్రపంచంలో కొన్ని సంఘాలు అనుదినం హింసకు అణచివేతకు బలవుతుంటాయి అనుటలో ఎట్టి సందేహం లేదు. విశ్వాసంలో అంతమువరకు నమ్మకం కలిగి జీవించి హతసాక్ష్యులైన వారు ఎందరో ఉన్నారు. క్రీ.శ 2వ శాబ్దపు కాలం నుండి 4వ శాబ్దపు కాలంలో ఇటువంటి పరిస్తితులను ఎదుర్కొంటున్న స్ముర్న సంఘం నేటి దినములలో మన సంఘాలకు సాదృశ్యంగా ఉంది.
యేసు క్రీస్తు నుండి ఎటువంటి విమర్శలు లేవు కాని, రానున్న దినములో ఈ సంఘం పొందబోయే శ్రమలను గూర్చిన సంగతులను వివరిస్తూ సిద్ధపాటు కలిగియుండమని రెండు సంగతులను (ప్రకటన 2:9,10) విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు.
- పొందబోవు శ్రమలకు భయపడకుము (Be Fearless): భయపడకుము అంటూ ప్రభువు మన ఆత్మను ధైర్య పరచుచున్నాడు. కాబట్టి, క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. (రోమా 8:35,37) అని జ్ఞాపకము చేసికొని పొందబోవు శ్రమలను ఎదుర్కొనగలవారమై క్రీస్తు ద్వారా శక్తివంతులమై విజయము పొందుకొనవలెను.
- మరణమువరకునమ్మకముగా ఉండుము (Be Faithful): అత్యంత భయంకరమైన వ్యతిరేకత కలిగిన పరిసితులలో ఉన్న సంఘం విశ్వాసంలో నమ్మకము కలిగి జీవించాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు.
క్రైస్తవ విశ్వాస జీవిత అనుభవంలో ఎటువంటి ఒత్తిడిలోనైనా, ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి కూడా మనకు ఎదురవ్వచ్చును. అంతము వరకు నమ్మకము కలిగి జీవించి, శ్రమలను ఎదుర్కొని పోరాడి విజయము పొంది, నిత్యత్వంలో జీవికిరీటము పొందవలెను. అట్టి నిరీక్షణ కలిగిన సంఘంలో మనమూ మన కుటుంబము ఉండులాగున ప్రభువు సిద్ధపరచి ఆశీర్వదించును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/Ry5jH9KddYM
3. పెర్గము సంఘం : ప్రకటన 2:12-17 - Pergamum Church - సమాజంతో రాజీ పడిన సంఘం
పెర్గము అను మాటకు గోపురము లేదా దుర్గము అని అర్ధము. 4 నుండి 12వ శతాబ్ద కాలమునాటి పెర్గము పట్టణము ప్రాచీన దినములలో గొప్ప వనరులు కలిగి, శక్తివంతమైన గ్రీకు సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచి, నేటి కాలములో బెర్గమో అనుపేరుగల పట్టణముగా ఉన్నది. విగ్రహారాధన మరియు అన్యమత ఆచారాలు కలిగిన పెర్గము “సాతాను సింహాసనమున్న స్థలము” లేదా “సాతాను పట్టణం” అని పిలువబడడం గమనార్హం. “అక్రోపోలి” అను ప్రసిద్ధిగాంచిన 100 చ.అడుగుల విస్తీర్ణము గలిగి 40 అడుగుల ఎతైన పునాది కలిగిన ఈ బలిపీఠంపై, కనువిందు చేసే కట్టడాలతో అలకరించబడిన సంఘం అని చెప్పవచ్చు.
ప్రకటన 2:13 ప్రకారం యేసు క్రీస్తు సాక్ష్యమిచ్చిన సంఘము, దేవుని నామము నిమిత్తం హతసాక్షియైన “అంతిపయ”ఈ సంఘమునకు చెందినవాడని గమనించగలం. సాతాను కాపురమున్నఈ స్థలములో ఈ సంఘము దేవుని నామమును గట్టిగా చేపట్టి, విశ్వాస విషయములో దేవుని విసర్జింపలేదని గ్రహించాలి. ఈ సంఘమును మనకు మాదిరిగా చూపుతూ; నేడు మన సంఘములను చక్కబెట్టుకొనుటకు మనలను మనము సరిచేసుకోనుటకు ఆత్మ దేవుడు ప్రోత్సహిస్తున్నాడు.
అన్యమత కార్యకలాపాలకు ప్రసిద్ధి గాంచిన పెర్గము పట్టణంలో ఈ సంఘము ప్రకటించిన దేవుని సువార్త తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న విగ్రహారాధన దేవుని సంఘంలోనికి కూడా ప్రవేశించింది. అంతేకాదు, నీకొలాయితుల బోధను విసర్జించక, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుచు, జారత్వము విషయములో దేవునికి కోపము పుట్టించిన వారని గ్రహించగలం. సమాజంలోని అన్య మత ఆచారాలు, క్రైస్తవ్యత్వాన్ని బలహీనపరుస్తూ ఉన్నప్పట్టికీ, విశ్వాస విషయంలో రాజీ పడక, మారుమనస్సు పొంది పునరుద్ధరించుకోమని ప్రభువు హెచ్చరిస్తున్నాడు.
సమాజములోని నిర్జీవ క్రియలతో ఏకీభవించక, క్రైస్తవేతరుల మధ్య జీవిస్తున్నప్పుడు, నిబ్బరమైన బుద్ధి, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ మంచి సాక్ష్యము కలిగి యుండాలి. దుర్బోధలను విసర్జించి, బుద్ధిచెప్పు వాక్యమును, ఖండించు వాక్యమును బోధించిన యెడల, యేసు క్రీస్తు సాక్ష్యము పొందిన బలమైన సంఘంగా సిద్ధమవుతుంది. ఇట్టి విశ్వాసంలో పట్టుదల కలిగిన సంఘంలో జయించువారమై దేవుడు వాగ్దానం పొందుకొనునట్లు మనమూ మన కుటుంబమును ప్రభువు సిద్ధపరచి ఆశీర్వదించును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/peDvrTfdIbY
4. తుయతైర సంఘం - ప్రకటన 2: 18-29 - Thyatira Church - లోకముతో జారత్వము చేసిన సంఘం
“కుమార్తె” లేక “లోకముతో ఐక్యము” అని అర్ధమిచ్చు 4వ శతాబ్దపు తుయతైర పట్టణము నేటి దినములలో “అఖిసర్” అనే పట్టణంగా పిలువబడుచున్నది. కుమ్మరి పనులు, చేనేత పనులు, వస్త్రాలు తాయారు చేయుటలో ప్రసిద్దిగాంచిన తుయతైర పట్టణంలో ఊదా రంగు పొడి వ్యాపారం చేస్తూ దైవ భక్తి కలిగి, అపో.పౌలు ద్వారా రక్షించబడిన స్త్రీ “లుదియా”. లుదియా ఐరోపా ప్రాంతాల్లో మొదటి క్రైస్తవ విశ్వాసిగా చరిత్రలో గమనించగలం. అంతేకాదు, లుదియా మరియు ఆమె యింటివారందరు బాప్తీస్మము పొంది దేవుని యెడల నమ్మకం కలిగిన కుటుంబంగా తుయతైర పట్టణంలో గమనించగలం. (అపో 16:14,15).
అనేక సంఘాలు మరియు క్రైస్తవులు ఆధ్యాత్మిక విషయాలలో మరియు సమాజం పట్ల నైతికత విషయాల్లో అందరిని కలుపుకుంటూ ముందుకు కొనసాగాలనే ధోరణి కలిగి యుంటారు, లేని యెడల సమాజం నుండి కలిగే వ్యతిరేకతలను ఎదుర్కోవడం కష్టతరమవుతుందని వారి అభిప్రాయం. వాస్తవంగా, నేటి మన సంఘములు మరియు తుయతైర సంఘం ఇటువంటి అభిప్రాయాలు కలిగియుందని గమనించగలం. ప్రత్యేకంగా ఈ సంఘంలోని కొందరు ప్రేమ, విశ్వాసము, పరిచర్య విషయములో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ, సహనము కలిగి జీవిస్తూ యేసు క్రీస్తు చేత ప్రశంశించబడ్డారు. అయితే మరికొందరు అవినీతికి, అనైతిక చర్యలకు, దుర్భోధలకు పాల్పడి, విగ్రహారాధనను విసర్జించక, వాటికి బలిచ్చిన వాటిని తినుచు దేవునికి కోపము పుట్టించిన వారుగా ఉన్నారు.
ప్రకటన 2:20 ప్రకారం ప్రవక్తి అని చెప్పుకుంటూ లోకసంబంధమైన క్రియల చేత సంఘమును పాడు చేయుచున్న యెజెబెలు వంటి వారినికి మారుమనస్సు పొందుమని అవకాశమిస్తు, లేనియెడల దేవుడే సంఘ పక్షంగా పోరాడి దానిని హతము చేసెదనని హెచ్చరిస్తున్నాడు. అంతరెంద్రియములను హృదయములను పరీక్షించగల దేవుడు; దేవుని వాక్యమును, బోధను అనుసరించి, అంతము వరకు నమ్మకము కలిగి దేవుని క్రియలను జాగ్రత్తగా చేయువారిని - శ్రమలనుండి తప్పించి, వెయ్యేళ్ళ పరిపాలనలో దేవునితో కలిసి పాలించే అధికారమిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. (రోమా 16 : 20) అంత్య దినములలో ఎత్తబడనైయున్న సంఘములలో మనము మన సంఘము ఉండునట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికిని తోడై యుండును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/vtsfV1-ITJw
5. సార్దీస్ సంఘం : ప్రకటన 3:1-6 – Sardis Church - జీవన్మరణముల సమస్యలు కలిగిన సంఘము
“శేషము” అను అర్ధమిచ్చు 14వ శాతాభ్దపు కాలంలో మొట్టమొదటిగా క్రైస్తవ సంస్కరణలు చేపట్టిన సంఘం సార్దీస్. ప్రకటన గ్రంధంలోని మిగతా ఆరు సంఘాలు హెచ్చరికలతో పాటు దేవుని చేత ప్రశంసించబడ్డాయి. అయితే, సార్దీస్ సంఘము అంతగా ప్రశంసించబడలేదు గాని, అనేక హెచ్చరికలనుబట్టి గమనిస్తే దేవునికి కోపము వచ్చునట్లు చేసి యున్నారని గమనించగలం. ప్రాచీన ఆచారాలు నవీన సంస్కరణల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవన్మరణముల సమస్యలు కలిగిన సార్దీస్ సంఘమును జ్ఞాపకము చేస్తూ “జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే” (ప్రకటన 3:1) అని పలికిన దేవుడు, నేడు మనము కలిగియున్న నామకార్ధ క్రైస్తవ విధానాలను ఖండిస్తూ, మన సంఘాలను సరిదిద్దుకోమని హెచ్చరిస్తున్నాడు.
ప్రభువు రాకడ కొరకు జాగరూకులమై నడచుకోవాలి. సండేస్కూలు పరిచర్య మొదలుకొని సంఘములో జరిగే ప్రతి పరిచర్యలోను, దేవుని వాక్యాము ఆత్మానుసారంగా అనాగా - యేడాత్మల సంపూర్ణత (ప్రకటన 5:6, యెషయా 11:2-5) కలిగి బోధించబడుతున్నదో లేదో పరీక్షించుకొనవలెనని సార్దీస్ సంమునకు వ్రాయబడిన లేఖ మనకు పాఠముగా ఉన్నది.
క్రైస్తవ సిద్ధాంతాల విషయాల్లో అజాగ్రత్త కలిగి పడిపోయినట్లయితే, ఆత్మీయ మరణం తప్పదని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అయితే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నవారిని దేవుడు బద్రపరుస్తూనే ఉంటాడనుటలో ఎట్టి సందేహము లేదు (ప్రకటన 3:2,4). జీవితాలను సరిచేసి పునరుద్ధరించగల దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొని చేసే పరిచర్యలను దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడు. ప్రాణము లేని శరీరము ఏలాగు మృతమో అలాగే పరిశుద్ధాత్మ ఆవరింపు లేని పరిచర్య మరియు సంఘం మృతమైనది. ప్రార్ధనా పూర్వకముగా మొక్కాళ్ళపై సిద్దపడిన ఉపదేశాలను, హెచ్చరికలను ఎల్లప్పుడూ బోధిస్తూ, ఏ ఘడియలో అయన రాకడ వచ్చునో మనకు తెలియదు గనుక మనమును సంఘమును సిద్ధపాటు కలిగియుండమని ప్రభువు కోరుతున్నాడు.
దేవుని వాక్యముననుసరించి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలకు లోబడి, నిజమైన మారుమనస్సు పొందమని ప్రభువు అవకాశమిస్తున్నాడు. అట్లు మారుమనస్సు పొందిన మన పేరులను జీవ గ్రంథములోనుండి ఎంతమాత్రమును తుడుపు పెట్టక, తెల్లని వస్త్రములను ధరించుకొని నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే భాగ్యమును పొందగలమని నిరీక్షించు చున్నాము. సిద్ధపాటు కలిగి, వాగ్దానం పొందుకొని, నిరీక్షణ కలిగిన కుటుంబాల కుటుంబమైన సంఘములో మనము మన కుటుంబములు ఉండులాగున దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్.
Audio: https://youtu.be/MOEK4fLgBJ4
6. ఫిలదెల్ఫియా సంఘం– ప్రకటన 3:7-13 - Philadelphia Church - సువార్త నిమిత్తం ద్వారములు తెరిచిన సంఘం
“సహోదర ప్రేమ” అను అర్ధమిచ్చు 17వ శాతాభ్దపు కాలం నాటి సంఘం ఫిలదెల్ఫియా. ఏడు సంఘములలో ఫిలదెల్ఫియా అధికమైన దేవుని ప్రశంసలు పొందిన సంఘము. ఈ సంఘమునకు పరలోక ద్వారములు తెరచి ఉంచాను, అవి ఎవడునూ వేయలేడు అంటూ దేవుడు నిత్యమైన వాగ్దానము యిస్తూ వున్నారు. అలాగని అది శక్తి వంతమైన సంఘమూ కాదు. కాని, వాక్యమును గైకొని, దేవుని నామమును ఎన్నడు ఎరుగననలేదని సాక్ష్యము పొందుచున్నది. సువార్త పరిచర్యకు ద్వారములు తెరచి, దేవుని శక్తిపై సంపూర్ణంగా ఆధారపడి, దేవునికిని వాక్యమునకును నమ్మకమైన ఫిలదెల్ఫియా వలే మనము మన సంఘముండవలెనని ప్రభువు కోరుతున్నాడు.
సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉండి, క్రమశిక్షణలో సంఘమంతా పరిచర్యలలో ఏకీభవిస్తేనే జయకరమైన సువార్త జరుగుతుంది, ఆత్మల సంపాదన సాధ్యమౌతుంది. మన సంఘము క్రీస్తు నామమును ప్రకటించే విషయములో పని చేయ శక్తి గలిగిన బలమైన సంఘముగాను మనమంతా సువార్త సైనికులుగాను ఉండాలి.
అనేక సార్లు చిన్న సంఘమని, కొద్దిమందిమె ఉన్నామని, పేద సంఘం అని, పరిచర్య విషయములో అవకాశములు తక్కువగా ఉన్నాయనీ, దేవుని ఆశీర్వాదాలు లేవని...నిరాశపడుతుంటాము. ఎప్పుడు బలహీనులమో అప్పుడే క్రీస్తులో బలవంతులమని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే, సంఘము అనగా మనము కాదు అది క్రీస్తు శరీరము; క్రీస్తే దాని శిరస్సు. ప్రభువు పై సంపూర్ణముగా ఆధారపడినట్లయితే, క్రీస్తు శరీరమైయున్న సంఘాన్ని దేవుడే తన ఆత్మ శక్తితో నింపి మహిమ పొందుతాడు.
సువార్త నిమిత్తం తెరచిన ద్వారాలు, దేవుని శక్తిపైనే ఆధారం, వాక్యాను సారమైన బోధలు ఈ మూడు నియమాలు కలిగిన ఫిలదెల్ఫియా సంఘము తను పొందిన కిరీటమును గూర్చి హెచ్చరించ బడుచున్నది. ఎవడునూ దాని నపహరింపకుండు నట్లు మెలకువ గలిగి ప్రార్ధించి, సంఘము చుట్టూ, కుటుంబాల చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేయాలి. శతృవుకు చోటివ్వని నమ్మకమైన పరిచర్యను జరిగించినప్పుడే, దేవుడు తన శక్తిని దయజేసి అనేక విధాలుగా అభివృద్ధి పరచి దేవుడు ప్రేమించిన సంఘంగాను ఎత్తబడుటకు అర్హతగల సంఘముగాను సిద్ధపరుస్తాడు.
జయించిన వారమై; దేవుని పరలోక ఆలయములో ఒక స్తంభముగా స్థానము పొంది, దేవుని పేరును, రాబోయే నూతనమైన యెరూషలేమను దేవుని పట్టణపు పేరును మరియు దేవుని క్రొత్త పేరును వ్రాయించుకొని ఆ నిత్యత్వములో మనమూ మన సంఘమూ వుండులాగున కృప పొందుదుము గాక. ఆమెన్.
Audio: https://youtu.be/EHVkgHXTlRE
7. లవొదికయ సంఘం – Laodicea Church – ప్రకటన 3:14-22
“నులివెచ్చనిది” అను అర్ధమిచ్చు లవొదికయ సంఘం 20వ శతాబ్ద కాలంలో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ప్రసిద్ధిగాంచిన లవొదికయ అను పట్టణములో ఉన్నది. ప్రకటన గ్రంథంలోని మిగతా ఆరు సంఘాల కంటే లవొదికయను దేవుడు కఠినముగా హెచ్చరించినట్లు కనబడుచున్నది (3:16). సంఘము యొక్క నులివెచ్చని స్థితివలన, దేవుడు తన నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాడు. లోకముతో రాజీ పడి, విశ్వసములో చతికిల పడి, ధనాపేక్ష పునాదుల మీద కట్టబడి, క్రీస్తులేని ఈ క్రైస్తవ సంఘము నేటి మన సంఘాలకు అద్దం పట్టుచున్నట్టున్నది.
ఆర్ధికంగా సంపన్న స్థితి, ఆధ్యాత్మికంగా దీన స్థితి గల సంఘం, లవొదికయ. ఐననూ మారుమనస్సు కలిగి తన ఆరంభ స్థితిని తిరిగి పొందుకొనుమని అవకాశమిస్తున్నాడు. దేవుడు మనలను సంపన్నులుగా జేసి ఆశీర్వదిస్తాడు. ఒకదినములో విడిచి పోయే ధనసమృద్ధి ఆధ్యాత్మికతకు ఆటంకము కాకూడదని దేవుని ఉద్దేశం. దేవుని వాక్య ప్రకారం చూసినట్లైతే, ఆధ్యాత్మిక దిగంబరత్వం ఓటమికి మరియు అవమానానికి సాదృశ్యంగా ఉంది. వస్త్ర హీనత నుండి విడుదల పొంది మారుమనస్సు, రక్షణ యను “తెల్లని వస్త్రములు” పొందుకోనుమని ప్రభువు పిలుపు నిస్తున్నాడు.
మనో నేత్రములు మూయబడి, ఆత్మీయ అంధకారము అలుముకున్న లవొదికయులను నూతన దృష్టి పొందమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రక్షించబడిన దినములలో కలిగిఉన్నభక్తీ, శ్రద్ధ, ఆసక్తి, రోజు రోజుకి దిగజారిపోతున్న స్తితిని జ్ఞాపకము చేసికొని, ఆ మొదటి స్థితిని తిరిగి పొందుకొనుమని నాడు లవోదికయకు నేడు మనకును దేవుడు అవకాశమిస్తున్నాడు.
తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని పలికిన స్వరము మనకు ఏమి సందేశమిస్తున్నది? అది క్రీస్తు లేని క్రైస్తవ సంఘము కాదా! ఇప్పుడే ఆయన స్వరము విని తలుపుతీసిన యెడల, సంఘములో, సహవాసములో మనతో ప్రభువై, ప్రభువుతో మనమై భోజన సహవాసము కలిగియుండగలము.
ప్రవచనాత్మకంగా గమనిస్తే లవొదికయ సంఘము అంత్యదినములలో అనగా ఈనాటి మన సంఘాలకు అన్నివిధాలుగానూ సరిపోల్చబడుచున్నది. సంఘానికి శిరస్సైన క్రీస్తు తన సంఘద్వారమునకు వెలుపట నిలిచియున్నాడను సంగతి బహు బాధాకరమైన విషయం. క్రీస్తు ఆలోచనలను కేంద్రీకరించని పరిచర్యలు చేస్తున్నామా? అనుకూలత కలిగిన బోధనలలో రాజీపడిపోయామా? ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నామా? జ్ఞాపకము చేసికొని, సరిచేసికొనవలెను. తలుపువద్ద నిలుచుని తట్టుచున్న క్రీస్తును నేడే మన హృదయములోనికి సంఘములోనికి ఆహ్వానించుకొని - జయించిన మనలను తనతోకూడా తన సింహాసనమందు కూర్చుండనిచ్చెదనని చెప్పిన వాగ్దానమును స్వతంత్రించు కొందుము గాక. ఆమెన్.
Audio: https://youtu.be/ujsNoaswOLk