ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study


  • Author: Vijaya Kumar G
  • Category: Bible Study
  • Reference: Revelations Detailed Study

Previous - Revelation Chapter 2 వివరణ > >

 

ఉపోద్ఘాతం:

క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాలనే దేవాది దేవుడు తాను నేరవేర్చబోయే కార్యాన్ని యోహాను ద్వారా ప్రకటన గ్రంధ రూపంలో మనకు అనుగ్రహించినారు.

నేటికి 2000 సంవత్సరాలకు ముందునాటి మానవ జీవన శైలి, పరిజ్ఞానము, సాంకేతికత, ఆలోచనా విధానము ఎలావుండేదో ఆలోచిస్తే ..... ఎందుకు పరి.యోహాను గారు అన్ని ఊహాజనితమైన ఆకారాలు (Pictures), గురుతుల (Symbols)తో ఈ ప్రకటన గ్రంధం వ్రాసారని తేటతెల్లం అవుతుంది. చిన్న పిల్లలకు లేదా సంగతులను గ్రహించగల మానసిక స్థాయికి ఇంకా ఎదగని యేవయసు వారికైనా చిత్రపటాల ద్వారా బోధిస్తే సులభంగా అవగాహన చేసుకుంటారని, ఆ ఆకారాలు వారి మనసులో ముద్ర వేయబడతాయట. చాలా సార్లు బైబిలు చదివినా ప్రకటన గ్రంధం అర్ధం అంటూనే ఉంటాము.

ప్రియులారా, మనము ఇప్పుడు కడవరి కాలంలో ఉన్నాము. కాని, ఈ కడవరి కాలంలో సంభవింప బోయే అనేక దైవ మర్మములు ఎరుగానివారిగా వున్నాము. ఈరీతిగా ప్రభువు ద్వారములు తెరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్

ప్రకటన గ్రంధముయొక్క సంక్షిప్త సారాంశం :- మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును (రాకడకు ముందు) , అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట (రెండవ రాకడ) చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు (మత్త 24:30).

దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును (ఆ రాకడలో ప్రభువును మనము ఎదుర్కొనుటకు సిద్ధపడుట) , మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు (1 థెస్స 1:10).

ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు (మృతుల పునరుత్తానము). ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము (సంఘము ఎత్తబడుట). కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ (నిత్యత్వములో) ఉందుము (1 థెస్స 4:16,17).

ఐతే ఇవి ఎప్పుడు జరుగుతాయి? క్రీస్తు ఎప్పుడు వస్తాడు? లోకమునకు అంతం ఎప్పుడు? ఎంత కాలానికి, యే సంవత్సరంలో? రాబోయే ఆ భయంకర విపత్కర మహా శ్రమల కాలంలో క్రైస్తవులు కూడా చనిపోతారా ? ఖచ్చితమైన తేది గాని సమయంగాని వున్నదా !! పోనీ షుమారు ఒక 100 సంవత్సరాలకు నెరవేరుతుందా?

యేసయ్య ముందే చెప్పారు : నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా (మత్త 24:3) కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు (అపో 1:7). ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి (మత్త 24:23-26).

ఊహకందని నిజాలు, జ్ఞానమునకు మించిన మర్మాలు బయలుపరచిన గ్రంధమే ప్రకటన గ్రంధం. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని (ప్రక 1:19), చదువుదాం, ధ్యానిద్దాం. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము (ప్రక 22:20). ఆమెన్

ఐతే ఇవి ఎప్పుడు జరుగుతాయి? క్రీస్తు ఎప్పుడు వస్తాడు? లోకమునకు అంతం ఎప్పుడు? ఎంత కాలానికి, యే సంవత్సరంలో? రాబోయే ఆ భయంకర విపత్కర మహా శ్రమల కాలంలో క్రైస్తవులు కూడా చనిపోతారా ? ఖచ్చితమైన తేది గాని సమయంగాని వున్నదా !! పోనీ షుమారు ఒక 100 సంవత్సరాలకు నెరవేరుతుందా?

యేసయ్య ముందే చెప్పారు : నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా (మత్త 24:3) కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు (అపో 1:7). ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి (మత్త 24:23-26).

ఊహకందని నిజాలు, జ్ఞానమునకు మించిన మర్మాలు బయలుపరచిన గ్రంధమే ప్రకటన గ్రంధం. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని (ప్రక 1:19), చదువుదాం, ధ్యానిద్దాం. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము (ప్రక 22:20). ఆమెన్

------------------------------------------------------------------------------------
ప్రకటన 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవు డాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? (ఆది 18:17) అని పలికిన దేవుడు తాను ప్రేమించిన మనకు ముందుగానే మన మనుగడ భవిష్యత్తును తెలియపరచ ఉద్దేశించియున్నారు. దానియేలునకు కూడా తెలియపరచబడినది: తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను (దాని 9:24).

ఐతే పై వచనము లో, మొదట క్రీస్తుకు అనుగ్రహించబడినది. అందుకు యేసు; పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు (యోహా 19:11) అంటున్నారు. మరియొక చోట ఇలా వ్రాయబడి యున్నది : నా అంతట నేనే ఏమియు చేయలేను (యోహా 5:30), నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు (యోహా 12:49).

కనుక తండ్రిఐన దేవుడు తన కుమారునికి అనుగ్రహించుట వలన యేసుక్రీస్తు వారు తన దూతద్వారా యోహానుతో వ్రాయించిన ప్రకటన గ్రంధం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను (నిర్గ 23:20) అను వాగ్దానము చొప్పున ఆ ప్రత్యక్షతను చదువుటకు మనకునూ అనుగ్రహించబడినది.

ప్రకటన గ్రంధకర్త ఎవరు అని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొదటి వచనం లో విశదమవుతుంది ఏమంటే : పరమందు ఆసీనుడైయున్న తండ్రియైన దేవుడు, ఆయన కుదిపార్శ్వమున కూర్చునియున్న యేసుక్రీస్తు, ఆ వర్తమానము తెచ్చిన యేసుదేవుని దూతకు యేసు శిష్యుడైన యోహాను అందుబాటులో దైవ ధ్యానములో వున్నాడు.

ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ వచనము చదివినప్పుడు యేమి ధ్యానించుచున్నాము ? దేవుడు తాను భూమిమీద నెరవేర్చబోయే ప్రతి కార్యమునకుగాను ఉపయోగించుకునే పాత్రలుగాను, సూచనలుగాను నీవు నేను వుందుము గాక. ఆమెన్

ప్రకటన 1:2 అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.

ప్రకటన అనగా ఒక వ్యక్తీ జ్ఞానయుక్తముగా రచించిన ఒక కావ్యము అసలే కాదు. పై వచనము స్పష్టముగా వుంది – అది ఒక దైవ జనుని దర్శన సాక్ష్యము.

ప్రియ దేవుని పిల్లలారా, మీరు మీ సంఘములో లేదా మీ నియామక కూడికలలో సాక్ష్యము చెపుతూ వుంటారు కదూ. ఏమని చెపుతారు? నేను ఒకప్పుడు త్రాగుబోతును, ఒకప్పుడు పనికిమాలిన జీవితము జీవించాను, ఇప్పుడు మారిపోయాను పరిశుద్ధుడనయ్యాను అనే కదా! లేదంటే నాకో పెద్ద ఆపద వచ్చింది, యే సహాయమూ దొరకనప్పుడు దేవుడు ఆదుకున్నాడు అనే కదా! ఎక్కడికి వెళ్ళినా తగ్గని వ్యాధి వొచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత స్వస్థత కలిగింది అనే కదా ... అది నీ శరీరము పొందిన మేలుల విషయమైన సాక్ష్యము. దానితో దేవునికి యేమి ఘనత, ఎలా మహిమ కలుగుతుంది.

ఈ ప్రకటన (Revelation of Jesus Christ) గ్రంధంలో ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఏసుక్రీస్తును సువార్తలకు భిన్నంగా చూడబోతున్నాము. మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలలో మనం చూసిన యేసు మనుష్య కుమారుడు. ప్రతి సువార్త ముగింపులో క్రీస్తు సిలువధారి. ఈ గ్రంధంలో ఆయన ఒక వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన స్వరము మధురము. పునరుత్థానుడైన యేసు రూపం మహిమాన్వితం. యేసు తన మహిమా స్వరూపమును అనగా తన రూపాంతర రహస్యాన్ని శిష్యులకు ముందుగానే చూపించారు. యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను (మత్త 17:1, 2). ఆయన ఒక న్యాయమూర్తి (a Judge)గా తీర్పు దినమున ఈ లోకానికి రాబోవుచున్న కొదమ సింహం.

ప్రియుడా, నీ సాక్ష్యము ఎలా ఉండాలో ఈ వచనము ద్వారా దేవుడు మనతో మాటాడుచున్నాడు. అవును, యేసుక్రీస్తు నీకేమైయున్నాడు ? ఆపద్భాందవుడుగా వున్నాడా, అనారోగ్యం రాకుండా కాపాడే డాక్టరుగా వున్నాడా, కేవలము యే ప్రమాదమూ రాకుండా నీకు నీ కుటుంబానికీ కాపలాదారుగా వున్నాడా ? ఇలా చెప్పుకుంటే పోతే చాలా వుంది.

దేవుడు నీనుండి కోరే సాక్ష్యము ఏమంటే; ఆయనలో నీవు యేమి చూసావు, నీవు రక్షణ పొందటానికి ఎలా ప్రేరేపించాడు, అప్పటినుండి ఎలా క్రీస్తును ప్రకటించుమని సెలవిచ్చాడు, దేవుని పరిశుద్ధాత్మ నిన్నెలా నడిపిస్తుంది, పరిశుద్ధ గ్రంధము చదువుతుంటే అంతకు ముందు అవగాహన కాని ఎన్నో విషయాలు విశద పరుస్తూ వున్నాడా. నీ సాక్ష్యము మరొక ఆత్మను రక్షించేడిగా వుండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆ సాక్ష్యము నిమిత్తమే కదా పరి.యోహాను గారు అన్నపానములు లేని ఒక నిర్మానుష్య దీవిలో విడిచిపెట్టబడింది. దేవుని ప్రిచార్యలో నీవంతు పనికోసం నీ త్యాగమే దేవుడు నీనుండి కోరే నీ సాక్ష్యము. ప్రభువు అలా నిన్ను నన్ను బలపరచి, తన రాకడకు సిద్ధపరచు గాక. ఆమెన్

ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
సమయము సమీపమైయున్నదని హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుచున్నది. ప్రియ నేస్తం, మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది (రోమా 13:11).

మనము మేల్కొనక ముందే - అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చి యున్నాడని చెప్పెను (ప్రక 12:12). రక్షణ పండకుండా నీవు నేను అనుకుంటున్నాము, ఇంకా సమయము వుందిలే. అదుగో రెండవ రాకడ, ఇదిగో రెండవ రాకడ అంటూ మనం చాలాకాలము నుండి వింటూనే ఉన్నాము. సమయము సమీపించినది అనగా యే క్షణమందైనా ప్రభువు రావచ్చును, మరి నీవు సిద్ధమా.

చదువువాడు (ఏక వచనం) అనగా వాక్య బోధకుడు గైకొనువారు (బహువచనం)అనగా వినువారు లేక సంఘము. చదువువాడు ఈ ప్రవచన వాక్యములు తన నోట ఉచ్చరించు వాడు. అతడు ఆశీర్వదింపబడును. మరి ఈ దినాలలో ప్రభువు రాకడను, రాబోవు ఉగ్రతను బోధించే వారే కరువైపోయారు. ప్రవచనము అనగా రాబోవు సంగతులు లేక జరుగబోవు, సంగతులు. ప్రవచనము ఎప్పుడూ ఊహాజనితము కాదు, పరిశుద్ధాత్మ వరము అని వాక్యము సెలవిస్తుంది. ఆత్మావేశము చేత మాత్రమే దర్శనము చూచుట అవగాహనము చేసుకొనుట ప్రవచనము వ్రాయుట సంభవము. దేవుని మర్మములను తెలియపరచునది ప్రవచన సారము.

గైకొనుట అనగా ఈ గ్రంధమును విధిగా చదివి ప్రభువు యొక్క ఆగమనమును ఎదుర్కొనగల ఆత్మ ఆయత్తము కలిగి జీవించుట. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను (అపో 10:44). నేటి బోధలు ఎందరిని ప్రభువు రాకడకు ఆయత్త పరచుచున్నాయి?

అపోస్తలుల బోధలు చూడండి - వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి (అపో 19:5). అపో. పౌలు ఏమంటున్నాడు - నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని (1 కొరిం 2:5). కనుక ఆత్మీయ సంగతులను ఆత్మచేత గ్రహించుచూ, ఆత్మచేత బోధించుచూ ఆత్మచేతనే గైకోనుచూ క్రీస్తు రాకడకు మనము సిద్ధపడుదము గాక, సిద్ధ పరచుదము గాక. ఆమెన్

ప్రకటన 1:4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,

ప్రకటన 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది; ప్రభువే వ్రాస్తున్నారు. యోహానును తన చేతిలోని ఒక పాత్రగా చేసుకొని వ్రాయిస్తున్నారు. మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను (ద్వితీ 4:13). మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను (నిర్గ 31:18).

సంఘము పరలోకమునకు ప్రతిరూపం. నీవు యే సంఘములో ఉన్నావో గాని, ఒక్కవిషయం చాలా ప్రాముఖ్యమైనది. సంఘము లేకుండా, వున్న సంఘముతో సమాధానము లేకుండా పరలోకము చూడలేవు, గ్రహించు. త్రిత్వమైయున్న దేవుడు సంఘము ద్వారానే కృపా సమాధానములతో ఆశీర్వాదము తెలియజేయుచున్నాడు. మరి నీవు సహవాసము చేయుచున్న సంఘము సరియైనదేనా? ఏడు సంఘములతో దేవుడు యేమి వ్రాయమన్నారో ధ్యానం చేస్తే గాని ఒక నిర్ధారణకు రాలేము.

దేవుని యేడాత్మలు అనగా పరిశుద్ధాత్ముని యొక్క సర్వసంపూర్ణతను సూచించుచున్నది. యెహోవా ఆత్మ 1.జ్ఞాన 2.వివేకములకు ఆధారమగు ఆత్మ 3.ఆలోచన 4.బలములకు ఆధారమగు ఆత్మ 5.తెలివిని యెహోవాయెడల 6.భయ 7.భక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును (యెష 11:2). ఆ ఏడు సంఘములను ఆశీర్వదించిన వర్తమాన భూతభవిష్య త్కాలములలో వున్న దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను (హెబ్రీ :3,4).

త్రిత్వమైయున్న దేవుని ప్రత్యక్షత ఇక్కడ మనకు ప్రస్ఫుటముగా కనబడుచున్నది. 1. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవాడు (దేవుడైన యెహోవా) 2. యేడు ఆత్మలనుండియు అనగా ఏడంతల శక్తిగల ఆత్మ (పరిశుధాత్ముడు), 3.మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన (యేసుక్రీస్తు) అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని దర్శనము. ముందుకు సాగుదాము. ప్రభువు సహాయము చేయునుగాక. ఆమెన్

ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని (లేవి 17:11 ). కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము (రోమా 5:9). దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది (ఎఫే 1:7). ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది (హెబ్రీ 10:20).

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు (1 పేతు 2:9). యూదా గోత్రపు యాజకత్వము, దావీదు గోత్రపు రాజరికము రెండునూ క్రీస్తులో మిళిత ఆశీర్వాదమై, నేటి సంఘమే దాని ప్రతిఫలమై యున్నది. రాజులు పోయారు, రాజరికం పోయింది. ప్రత్యక్ష గుడారాలు పోయాయి, యాజకత్వం పోయింది.

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియూనైన గుడారము ద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను (హెబ్రీ 9:11).

కనుక మనము దినదినము క్షణక్షణమూ మన ప్రభువును ఆరాధించినా ఇంకా రుణస్థులమే. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము (1 యోహా 4:19). మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌.

ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను (ప్రక 1:6). క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి తనను తానే బలిగా అర్పించుకొని, మనలని యాజకులనుగా అనగా ఆరాదికులనుగా చేసినారు. హృదయమార మన ప్రభువుకు మన స్తుతి ఆరాధనలు ఏసుక్రీస్తు నామములో తండ్రికి సమర్పించుకుందామా. మన ప్రభువు నిత్యమూ ఆరాధ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆమెన్

ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

“ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి” (మత్త 25:6). ఇదిగో ఆ గడియవచ్చి యున్నది (మత్త 26:45). ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు (ప్రక 22:7). ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు అను కేక., ఎన్ని హెచ్చరిక వాక్యములు మనల్ని చైతన్యం చేస్తాయి. అనేకసార్లు దేవుడు మనలను మేలుకొలుపుతూనే వున్నారు. ఇదిగో – అనే కేక మనల్ని ఆత్మీయ నిద్రనుండి మేలుకొలుపుతుంది. మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది (రోమా 13:11).

మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును (మత్త 24:27). అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను (యోహా 3:3). ఐతే, ఆకాశంలో మెరుపు అంటే, భూమిమీద నిలిచియున్నప్రతి మానవుడూ యేసుక్రీస్తు రెండవ రాకడను వీక్షిస్తాడు.

పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు (యోహా 18:38). [నిర్దోషివైన] నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును (జక 13:6). తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడునేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను (యోహా 20:25). తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను (యోహా 20:27). మృదువైన ఆ చేతులలో ఎవరు పోడిచినవి ఆ గాయాలు? నీ, నా అవిశ్వాసమే.

వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు (జక 12:14). కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు (2 పేతు 3:9). అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను (ఫిలి 2:9,10,11).

అయితే దేవుడు మనయెడల [భూజనుల యెడల] తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను (రోమా 5:8). దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే (రోమా 3:29). అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను (2 సమూ 22:50). ఆమెన్

ప్రకటన 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ప్రకటన 1వ అధ్యాయములో మొదటి మూడు వచనములు ఉపోద్ఘాతము. 1:4 నుండి 1:7 వరకు దేవుని ఆరాధించుట మనకు కనబడుచున్నది. అక్కడ నుండి అధ్యాయము చివరి వరకు ధ్యానించినట్లైతే, మొదట తండ్రియైన దేవుని అనుగ్రహము (1:8), తరువాత యోహాను భక్తుని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుట (1:10), చివరకు యేసు క్రీస్తు మహిమాస్వరూప దర్శనము.

సృష్టికర్త, దేవుడు అనగా సృష్టించు వాడు, నిర్వహించు వాడు, ముగించువాడు [G.O.D. = Generator, Operator, Destroyer.] ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు (యెష 44:6). పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు (కీర్త 90:2). సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు? (యెష 14:27).

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను (ఆది 2:7). గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని (యిర్మీ 1:5). ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే (యెష 46:4).

నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు (కీర్త 90:3). ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును (కీర్త 48:14). ఆయన సెలవులేక భోజనముచేసి సంతో షించుట ఎవరికి సాధ్యము? (ప్రస 2:25) వర్తమాన భూత భవిష్యత్కాలములలోనుండు తండ్రియైన దేవుడు సమస్త సృష్టిని చేసి నిర్వహించుచున్న తన మహా కృపతో మనతోనుండి ఈ గ్రంధ ధ్యానములు పూర్తియగు వరకూ లేదా మన రక్షకుని రాకదవరకు మనల నడిపించును గాక. ఆమెన్

ప్రకటన 1:9 మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమ లోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు (1 యోహా 2:10, 11). దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు (1 యోహా 3:10). ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (1 యోహా 4:20).

క్రీస్తుతో తన మూడున్నర సంవత్సరముల ఆత్మీయజీవిత అనుభవం ఎంత గొప్పది. పరి. యోహాను, అపో. యోహాను, ప్రవక్త యోహాను, దేవుని స్వరము విని ఆ మహిమా స్వరూపుని దర్శనము పొంది కూడా – మీ సహోదరుడను – అని చెప్పతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంతా సహోదరులమని ఎరిగి ఆ లాగు జీవించుదుము గాక. దేవుడు తన కుమారుడు ఏసుక్రీస్తును సైతము మన సహోదరులలో జ్యేష్ఠత్వము పొందిన వానిగా చేసిన మన తండ్రి స్తుతింప బడును గాక. ఆమెన్ తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను (రోమా 8:29).

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను చూచితిని (ప్రకటన 6:9). ఈ వాక్యము పరి. యోహాను గారి జీవితము ఎలా ముగిసి వుంటుంది అని అర్ధం అవుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును (మత్త 5:11,12)అన్నారు, యేసయ్య.

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు (2 తిమో 3:12) అంటూంది దేవుని వాక్యము. ప్రియులారా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము (రోమా 5:3,4) .ఐతే, ఇది దేవుని ఉగ్రత కాదు, శ్రమ అని గుర్తుంచుకొనవలెను, క్రీస్తు రాజ్య సువార్త కొరకు శ్రమ పడుదుము గాక.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను (యోహా 16:33). శ్రమలలో మనకెప్పుడూ విజయమే, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు (1 థెస్స 5:9).

దేవుని గూర్చి సాక్ష్యము చెప్పాలంటే మొదట మనము పరీక్షించుకోవాలి ఏమంటే; యేసునుబట్టి భూమి మీద వచ్చే శ్రమలను తృణప్రాయముగా నెంచి, స్వతింత్రించుకోబోయే నిత్యరాజ్యము యొక్క నిరీక్షణ గలవారమై, సహనముతో సువార్త ప్రకటించు చున్నామా లేదా. యోహాను గారు తన ప్రస్తుత స్థితిని ఎలా తెలియ జేయుచున్నారో చూడండి.

1).దేవుని వాక్యము నిమిత్తము అనగా, వాక్యమును అనేకమంది అన్యజనులకు ప్రకటించు నిమిత్తమును 2). యేసు నా రక్షకుడు అని సాక్ష్యము ఇచ్చినందులకును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. యోహాను మాటలో దాగిన విశ్వాస రహస్యం - మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని యున్నాము (ఫిలి 3:20).

ప్రకటన 1:10-11 ప్రభువు దినమందు - ఆత్మ వశుడనై యుండగా *(in the spirit) బూరధ్వనివంటి గొప్పస్వరము నీవు చూచు చున్నది పుస్తకములో (on a scroll – old English) వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును (1 థెస్స 5:2). ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న క్రుత్యములును కాలిపోవును (2 పేతు 3:10). ప్రియుడా, ప్రభువుదినము అనగా శనివారమో ఆదివారమో కాదు అని గమనించవలసినది.

యెహోవా దినము” వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును (యెష 13:6). యెహోవా ఉగ్రతదినము (విలా 2:22), ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును (యోవే 2:2). యోహాను భక్తుడు పత్మాసులో విడువబడిన దినము మొదలు తన శేషజీవిత దినములు ప్రభువుకే అంకితము చేసి తన కితాబు వ్రాస్తున్నాడు.

నేను ఆత్మవశుడనై యుంటిని, అనగా శరీరములో ఉండే, ఆత్మ స్వాధీనమైన ధ్యాన ముద్ర. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై (falling into a trance) సర్వశక్తుని దర్శనము పొందెను (సంఖ్య 24:4). దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై (falling into a trance)సర్వశక్తుని దర్శనము పొందెను (సంఖ్య 24:16). అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై (I was in a trance) ప్రభువును చూచితిని (అపో 22:17).

ధ్యానము అనగానే కళ్ళు మూసుకోవాలి అంటూ ఉంటాము. కాని ఇక్కడ స్థితిని గమనించినట్లైతే; దేవుని సన్నిధిలో నీవు నేను కూర్చుని వున్నప్పుడు మన కళ్ళముందు కనిపించేది ఏదీ మన గ్రహిములోనికి రానివ్వ కూడదు. అలాంటి అనుభవం మనలను ప్రభువుకు మరీ దగ్గరగా చేస్తుంది, పరిశుద్ధాత్మ మనమీదికి దిగి వస్తుంది.

బూరధ్వని అన్ని వేళలా ఒకేలా ఉండదని మొదట మనము గ్రహించాలి. ఒక్కో బూర శబ్దము వెనుక సంభవింపనైయున్న సంఘటనలు వేరు వేరుగా వుంటాయి. ఉదా : పెళ్లి బూరధ్వని వేరు, స్తుతి బూరధ్వని వేరు, యుద్ధభూమిలో వినబడు బూరధ్వని వేరు, హెచ్చరిక బూరధ్వని వేరు, విజయధ్వని బూరశబ్ధం వేరు, దుఃఖధ్వని బూరశబ్ధం స్వరము వేరు. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు (1 థెస్స 4:16). బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము (1 కొరిం 15:52).

బూరధ్వని (నిర్గ 19:13), బూర యొక్క మహాధ్వని (నిర్గ 19:16), బూరధ్వని అంతకంతకు బిగ్గరగా (నిర్గ 19:19), జ్ఞాపకార్థశృంగధ్వని (లేవి 23:24), శృంగనాదము (లేవి 25:9), సమాజమును పిలుచుటకు సేనలను తర్లించుటకు (సంఖ్య 10:2), యుద్ధమునకు వెళ్లునప్పుడు (సంఖ్య 10:9), ఆర్భాటముగా ఊదునప్పుడు (సంఖ్య 10:5). దీనిని బట్టి తెలియవలసినది యేమనగా, ప్రకటన గ్రంధములో వ్రాయబడిన 7 బూరలు వేరు వేరు శబ్దములుగలవి. వెండి బూరలు (సంఖ్య 10:1) కలదు, పొట్టేలుకొమ్ము బూర (యెహో 6:4) కలదు, పిల్లనగ్రోవి (మత్త 11:17) కలదు.

అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను (సంఖ్య 10:8). A spiritual leader or a pastor is supposed to blow the trumpet warning the assembly to get ready for the Lords second coming.
ఏడు సంఘములు అనగా సార్వత్రిక సంఘము (Universal Church)నకు గురుతు. ఏడు అనే సంఖ్య సంపూర్ణతను (fullness) తెలియజేయుచున్నది. భూమి మీద ఏడు మందిరాలే వుండవచ్చు, డెబ్బది మందిరాలే వుండవచ్చు గాని, పరలోక ప్రత్యక్షతలో ఒక్కటే గొర్రెపిల్ల (క్రీస్తు) ఒక్కటే వదువు (సంఘము).

ఇక్కడ దేవుడు యోహాను గారితో వ్రాసి పంపుము అంటున్నారు. వ్రాత పూర్వకమైన లేఖనములను మనకనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఐగుప్తులోని సకల విద్యలూ నేర్చిన మోషేతో సైతము దేవుడు మాట మాత్రముగా చెప్పలేదు గాని పది ఆజ్ఞలను వ్రాతపూర్వకముగా ఇచ్చారు. ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను (నిర్గ 31:18). అందుకే, నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము (సామె 3:3). ఆమెన్

ప్రకటన 1:12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

దేవుడు పలికిన ఆ స్వరమే వాక్యము. ఆ వాక్యము దేవుడై యుండెను (యోహా 1:1). అలా తిరిగి చూచిన పరి. యోహాను ఆ మధుర స్వరములో ఉన్న మహిమా స్వరూపదర్శనము పొందుకున్నాడు. దేవుడు మహిమాస్వరూపి (1 కొరిం 2:8), ప్రేమాస్వరూపి (1 యోహా 4:8). సత్యస్వరూపి (యోహా 14:16). అంటే, దేవుడు నిరాకారి కాదు అని మనం గ్రహించాలి.

పరమందున్న యేసుక్రీస్తును చూచిన పరి. యోహాను సుస్పష్టంగా ముందున్న వచన భాగాలలో వర్ణించటం మనం చూద్దాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును (సంఖ్య 24:17).

నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని (యెష 6:5). అనుదినము వాక్యము చదువుతున్నప్పుడు; దేవుడు మనతో మాటాడుతాడు అనియు, ప్రార్ధన చేయునప్పుడు మనము దేవునితో మాట్లాడుతాము అనియు చెప్పుతుంటాము కదా.

మరి నీవు చదువుతున్న దినపాఠములో ఎప్పుడైనా ప్రభువును చూశామా. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథ ములచేతను నిండియుండుట చూచెను (2 రాజు 6:17). మనోనేత్రము తెరువబడి, ఆయన దర్శనము పొంది ఆయనతో వాక్య ధ్యానమే గాని, ప్రార్ధనే గాని చేయగలిగితే ఎంత భాగ్యము. అట్టి భాగ్యము మనందరికీ దేవుడు దయచేయును గాక; ఆమెన్.

ప్రకటన 1:13 తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

సువర్ణ దీపస్తంభములు దేవుని సంఘములు, వాటి నడుమ ఏసుక్రీస్తు దర్శనము. సంఘము అనునది కేవలము విశ్వాసుల సహవాస నిలయం కాదు, అది రాజకీయ ప్రదేశమూ కాదు. సంఘము అనగా భూమిమీద దేవుని పరలోకపట్టణ నమూనా. నా సహోదరులారా, మీలో కలహములు కలవని నాకు తెలియవచ్చెను (1 కొరిం 1:11). ఎవరో ఒకరి వలన సంఘముతో విభేదించటం, వేరొక సంఘమునకు మారటం వంటివి చేసే వారిని మనము ఎరుగుదుము. ఈ సంఘము మాది, మీ ఇష్టమైతే రండి లేకుంటే లేదు అనేవారూ లేకపోలేదు. అట్టి వారికి ఇది మర్మము.

ఎవరీ మనుష్యకుమారుడు ? కుమారుడైన దేవుడు, యేసుక్రీస్తే అని చెప్పగలము. ఐతే ఒక్కసారి వాక్యంలో కూడ గమనిద్దాం. దాని 7:13 లో చూసినట్లైతే రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని (Son of man ) పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను (ప్రక 14:14).

మనుష్యకుమారుడు ఆ దీపస్తంభముల మధ్యనుండుట ఏమిటి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి (అపో 20:28). ఏసుక్రీస్తు తన స్వరక్తముతో కొనుక్కున్న సంఘముపై రేయింబవళ్ళు తన కనుదృష్టి నిలుపుచున్నాడు. ఏలయన క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను తన రాకడలో తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని (ఎఫే 5:25-27).

మరి ఆ సంఘమును ఆరంభించి నడిపిస్తున్న వారు - అధ్యక్షులనుగా ఉంచబడిన వారు; అంటుంది దేవుని వాక్యము. వారు దానిని తమ స్వంత ఆస్తిగానో, శాశ్వత కాలమూ నాదే లేక మాదే అనో అనుకుని నడిపించిన సంఘాలు కొంత కాలము కనబడి వారి తదనంతరం అవి కనుమరుగై పోతాయి.

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా (in the likeness of men) పుట్టి, దాసుని స్వరూపమును (the form of a servant) ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను (ఫిలి 2:6, 7). ఈ దర్శనములో మనుష్యకుమారుడు పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము, రొమ్మునకు బంగారుదట్టి ధరించియున్నారు.. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను (యెష 6:1). సంఘము సురక్షితముగాను, నిత్యమూ పరిశుద్ధముగాను ఉండునట్లు ఆయన యొక్క మహిమ దానిపై వితానముండును. దేవునికి మహిమ కలుగును గాక.

ఏఫోదు నిలువుటంగీ (నిర్గ 28:31), రొమ్మున న్యాయవిధాన పతకము (నిర్గ 28:30), అవి యాజకుడు ధరించవలసిన ప్రతిష్టిత వస్త్రములు. నాడు యాజకుడు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి, దాని మీద రెండు రత్నములు, వాటి మీద చెక్కిన ఇశ్రాయేలీయుల పేళ్లను జ్ఞాపకము చేయుచుండగా, నేడు రొమ్మునకున్న బంగారుదట్టి, ఈ దట్టీపై ఏడు సంఘముల పేరులు ధరించిన మన ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు దర్శనము మనకు కనబడుచున్నది (నిర్గ 28:8-12). అట్లు యేసు నిరంతరము యాజకుడై యున్నాడు (హెబ్రీ 5:6). ఆమెన్

ప్రకటన 1:14 ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;

ఈ దర్శనములో పరి. యోహాను గారు చూస్తున్న యేసు రూపం తండ్రియైన దేవుని మహిమా స్వరూపమే. భక్తుడైన దానియేలు చూసిన ఆరూపమే ఇక్కడ మరలా కనబడుతుంది. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహా సనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను (దాని 7:9). అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను (దాని 10:6).

తండ్రి మహిమ కుమారునిలో ప్రజ్వరిల్లుతున్నది. అట్టి మహిమయొక్క మర్మము లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు (1 కొరిం 2:8). ఆయన తెల్లని ఉన్నినిపోలిన తల వెంట్రుకలు మన యెడల ఆయన తలంపులు సూచించుచున్నవి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి (1 పేతు 5:7). నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు (యెష 55:8). యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు (కీర్త 40:5).

నా సహోదరులారా, మహిమాస్వరూపి యగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటము గలవారై యుండకుడి (యాకో 2:1). యేసు…మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను (మత్త 16:13-15). ఔను, ప్రియ దేవుని బిడ్డా, నీవు ఏమనుకుంటున్నావు?

అగ్నిజ్వాలా మాయమైన ఆ నేత్రములతో అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు (ప్రక 2:23). ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను (యిర్మీ 17:10). మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును (1 సమూ 16:7). ప్రియులారా, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి (2 పేతు 3:14). ఆమెన్

ప్రకటన 1:15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

ప్రవక్తయైన దానియేలు గారి దర్శనం (దాని 10:6) లో ఇలా వుంది : అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను. అట్టి మహిమాయుక్తమైన ఆ సుందర పాదపద్మముల సమాచారం మోసుకువెళ్ళే సువార్తికుని గూర్చి ఇలాగు వ్రాయబడినది : ఇందు విషయమై ఉత్తమమైన వాటినిగూర్చిన సువార్త ప్రకటించు వారిపాదములెంతో సుందరమైనవి (రోమా 10:15).

పరి. యోహాను గారు ఒకప్పుడు కలువరి సిలువలో వ్రేలాడిన యేసును, మేకులతో గ్రుచ్చబడి, రుధిర ధారలలో తడిసిన ఆ పాదములే (పాపి రక్షణార్ధమే దివి నుండి భువికి దిగిన పాదములు) ఇప్పుడు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమైయుండుట (భూలోకమునకు తీర్పు తీర్చ దిగుచున్న పాదములు) చూస్తున్నాడు. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి (నహూ 1:3). ఆకాశము నా(ఆయన) సింహాసనము, భూమి నా(ఆయన) పాదపీఠము (అపో 7:48) అన్నారు.

యోహాను గారు ఆ పాదములు చూసినప్పుడు యేమి జ్ఞాపకము చేసుకుని వుంటాడు - పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను ( యోహా 13:5). కీర్తనాకారుడు అభివర్ణిస్తూ: - నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది (కీర్త 119:105) అని ప్రశంసించాడు. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను (కీర్త 40:2). దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్

యేసు మొట్టమొదట యోహానును అతని సహోదరుని పిలిచిన ఆ స్వరము (యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు ... వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను - మత్త 4:21)’ యేసు సిలువలోనుండి చివరిసారిగా “యిదిగో నీ తల్లి” (యోహా 19:27) అని తనతో పలికిన ఆ స్వరమే ఇపుడు విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉన్నది.

జలములను వేరుపరచిన ఆ స్వరములో దాగిన సార్వభౌమాదికారము, ఆ మహత్తుగల స్వరము వినబడినప్పుడు యోహాను ఆ దర్శనములో విలీనమై పోయాడు. ప్రియ స్నేహితుడా, దినదినము వాక్యపఠనము ద్వారా ప్రభువు నీతో మాటాడుతున్నప్పుయుడు ఆ అనుభూతిలోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా. వాక్యం అంటుంది: మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు (మత్త 13:15). అట్టి గ్రహింపు గల హృదయము దయచేయమని ప్రార్ధన చేద్దామా. అదెంత ధన్యత, ఎంత అద్భుతము. ఆమెన్


ప్రకటన 1:16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.

ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు (ప్రకటన 1:20). నక్షత్రములు దేనికి సూచనగా వున్నవి ? దాని 12:3 లో వ్రాయబడిన ప్రకారం: బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

వారు ముందుగా వాగ్దానము చేయబడిన రీతిగా, అబ్రహాము సంతానము అయివున్నారు. ఆయన వెలుపలికి అతని (అబ్రామును) తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను (ఆది 15:5). వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు (ప్రక 5:10). ఆ నక్షత్రములు ఆయన కుడిచేతిలో వున్నవి.

ప్రియ సంఘ కాపరీ, నీవు ఎవరి అధికారము క్రింద సేవ చేయుచున్నావు? నీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు వున్నారు? అందులో ఎంతమందిని నీతి మార్గము (Rightiousness)నకు మళ్ళించ గలిగినావు? - ఇప్పుడే ప్రభువు తన రాకడలో నిన్నడిగే ఈ ప్రశ్నలన్నిటికీ నీ జవాబు సిద్ధముగా ఉండనీ. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది (2 తిమో 3:16). ఏలయన, ఆ లేఖనము ఆయన నోటనుండి వెడలుచున్న రెండంచులుగల వాడియైన ఖడ్గమే.

అ.పో. పౌలు గారి సాక్ష్యము జ్ఞాపకము చేసుకుందాము. “నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.” (1 కొరిం 2:5). మరి నీవు సంఘములో బోధించ బడుచున్న సంగతులు ఎలా వున్నాయి? అవి సజీవమై బలముగలవై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నవా (హెబ్రీ 4:12). దేవుని మాట నిర్మించగలదు, నాశనము చేయగలదు. పుట్టింప గలదు, గిట్టింప గలదు.

పరి. యోహాను ఇప్పుడు చూచుచున్నది గతంలో తను చూచిన యేసును కాదు. ఇది ఏసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపం. క్రీస్తు పొందబోవు ఆ మహిమను యేసు శిష్యులకు మరుగుచేయలేదు. ఒకదినమున పేతురును, యాకోబును మరియయోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను (మత్త 17:1, 2).

ఆ వెలుగులో ప్రవేశము కొరకు ప్రార్దిద్దాము. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పామునుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహా 1:7). ఆమెన్

ప్రకటన 1:17 నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;

తనను ఆ పరిశుద్ధ పరిచర్యకు పిలిచిన ప్రభువు, తననెంతగానో ప్రేమించి అనేకసార్లు తన రొమ్మున ఆన్చుకొనిన ప్రభువు, సిలువలో తనతో మాటలాడిన ప్రభువు, ఆరోహణ సమయములో మాటలాడిన ప్రభువు చాలా కాలము తరువాత మహిమా స్వరూపుడై కనబడగానే, సంపూర్ణ సాష్టాంగముగా సాగిలపడిన యోహాను చచ్చినవానివలే అని వ్రాస్తూవున్నారు.

ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి (మత్త 28:2, 3, 4). ప్రభువు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపియైన ప్రభువును దర్శించునపుడు ఎప్పుడైనా భయపడినావా? సాగిలపడినావా? అహము, గర్వము, ఆస్తి, ఐశ్వర్యము, అధికారమూ అన్నీ విడిచి చచ్చినవానివలె ఉంటున్నామా?

దేవుడంటే భక్తి బాగానే వుంటుంది మరి దేవుని భయమో !! ఏసుప్రభువు యొక్క అభయ హస్తం తనమీదికి రాగానే చనిపోతానేమో అన్నంతగా భక్తితో కూడిన భయం అతనిని ఆవరించినది. వెంటనే ప్రభువు అంటున్నారు, భయపడకుము.

అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు (ప. గీ. 2:6). పొందబోయే దర్శనము చాలా గొప్పది. దేవుని అభయహస్తము యోహాను గారి మీద వుంచుట; నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుట (యెష 41:13).

పూర్తిగా దేవుని మీద ఆధారాడిన జీవితము ఆయన ఆపన్న హస్తమే నడిపించగలదు. ఆయనుభవమే కీర్తనాకారుని కలమునుండి జాలువారిన ప్రశస్తమైన మాటలు కీర్త 16:11 లో మనలను ధైర్యపరచుచున్నాయి : “జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు”. యెష 45:1 ప్రకారము వాగ్దానము [నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను] పొందినవారమై జయజీవితము పొంది ముందుకు సాగునట్లు ప్రార్ధన చేద్దాం. ప్రభువు ఆత్మ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్


ప్రకటన 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

మొదటివాడను – క్రీస్తు తన పూర్వపరాలను యోహానుగారికి తెలియజేస్తూ వున్నారు. మొదట వున్నది తండ్రియైన దేవుడా? కుమారుడైన ఏసుక్రీస్తు వారా? అనేది ఇక్కడ ప్రశ్న. యోహా 17:5 ప్రకారము యేసు, లోకము పుట్టకమునుపే తండ్రీ, యొద్ద ఆయన మహిమలో వున్నారు. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు (యోహా 1:3).

ఏసుప్రభువు యొక్క ఆత్మీయ రహస్య స్వరూపము ఎరిగినవాడు యోహాను. ఆ మహిమ బయలుపడినప్పుడు వెలుగైయున్న యేసు చీకటిని వేరుపరచాడు (ఆది 1:4). ఆ వెలుగును చూచిన యోహాను “నిజమైన వెలుగు ఉండెను” (యోహా 1:9) అని వ్రాసాడు. ఆ వెలుగే సృష్టికి ఆరంభం. ఆ వెలుగే సృష్టికి అంతము, పరలోకమునకు దీపము. గొఱ్ఱపిల్లయే దానికి దీపము (ప్రక 21:23).

మొదటివాడు కడపటివాడు జీవించువాడు మృతుడు సజీవుడు –అనగా పునరుత్థానమును జీవమును ఆయనే. ఈ వాక్యము నాడు యోహానును, నేడు నన్ను, నిన్ను, ప్రతి విశ్వాసినీ బ్రతికించుచున్నది. ఎలాగనగా; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు(యోహా 11:25). దేవుని కృపవలన క్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు చూచుచున్నాము (హెబ్రీ 2:9).

చావు నిశ్చయము (ఆది 2:17) అని చెప్పిన దేవుడే మరణము ఇక ఉండదు(ప్రక 21:4) అని సెలవిస్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన... నిత్యుడగు తండ్రి (యెష 9:6), మృతుడనైతిని అంటున్నారు. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును (హెబ్రీ 2:15) మన పాపముల నిమిత్తమును, సజీవుడైన దేవుడు మృతుడైనాడు. సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను (ఫిలి 2:8). మన తగ్గింపు ఎలావుంది? ఒక్కసారి పరిశీలించుకుందామా.

మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు గలవాడు చెప్పు సంగతులేవనగా: ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు (యోహా 10:18). మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము (కీర్త 68:20). దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను (యెష 22:22). ఏలయనగా ఆయన భుజముమీద రాజ్యభారముండును (యెష 9:6).

అందుకే ప్రియ సోదరీ, స్నేహితుడా; నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును (కీర్త 55:22). మరణమైనను జీవమైనను (రోమా 8:38) ప్రభువునకే అప్పగించుకుందామా. యేసులో జీవితం, యేసులో మరణం, యేసే పునరుత్థానం, యేసే నిత్యజీవం. ఆమెన్


ప్రకటన 1:19 కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,

ప్రకటన గ్రంధం యొక్క మూలవాక్యం ఇదే అని మనం గ్రహించాలి. ఈ దర్శనమునకు పూర్వము యోహాను ఏమేమి చూచాడో ముందుగానే తన పత్రికలో వ్రాసేశాడు: జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము (1 యోహా 1:1). ఇప్పుడు ఏడు సంఘములను కుమారుడైన క్రీస్తు చూపించుచుండగా, వాటి పూర్వ ప్రస్తుత భవిష్య విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ వున్నారు.

చూచినవాటిని (PAST – యోహానుగారు ఈ మొదటి అధ్యాయములో చూచిన సంఘముల సంగతి), ఉన్నవాటిని (PRESENT – 2. 3 అధ్యాయాలలో ఆయా సంఘముల స్థితిగతులు), కలుగబోవువాటిని (FUTURE - 4 నుండి 22 అధ్యాయాలలో సంఘము ఎత్తబదుడుట, గొర్రెపిల్ల వివాహము, పరలోకము) వ్రాయుమని దేవుని ఆజ్ఞ.

వ్యక్తిగతముగానైతే మన మునుపటి జీవితమునకు రక్షణ పొందిన తదుపరి జీవితమునకూ వ్యత్యాసమున్నదా? ఆత్మ పరిశీలన చేసుకుందాము. మునుపు లోకములో జీవించిన జీవితము ఇపుడు సంఘములో జీవించుచున్నజీవితమునకు తేడా ఉన్నదా? ఎత్తబడే సంఘములోనే వున్నామా? పరలోకానికి వెళతామా? ఈ విషయాలన్నీ ఈ ఒక్క వచన ధ్యానం మనలో ఆలోచింప చేస్తుంది కదూ. మన గత జీవితము, ప్రస్తుత జీవితము, పొందబోవు నిత్యజీవము ఎలావున్నాయి, వుంటాయి?

మారుమనస్సు పొందుట అంటే, కేవలము అలవాట్లు మారటం కాదు మిత్రమా. మనస్సు మారాలి. అంటే ఆలోచన సరళి మారిపోవాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను (మత్త 5:37). నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుండవలెను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో సాధకము చేసికొనవలెను (1 తిమో 4:6, 7).

అలవాట్లు మారినాయి కదా అంటే సరిపోదు. శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే [LITTLE] ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో [ALL THINGS] ప్రయోజనకరమవును. క్రైస్తవ జీవితము సుఖమైనది అని భావించరాదు. ఐతే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను (1 పేతు 4:16).

రక్షణానందము (కీర్త 51:12), చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము (1 పేతు 1:9), ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా జీవించుట అలవరచుకుందామా. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును (1 పేతు 4:3) అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుందుము గాక (తీతు 2:13) ఆమెన్

ప్రకటన 1:20 అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.

దేవదూతలు ఆత్మశరీరులు (spiritual bodies), దేవునికి మానవులకు మధ్య వర్తమానికులు (messengers). కాని, ఈ వచనంలో యోహాను గారు సంఘములకు దూతలు (angels) అని వ్రాస్తున్నారు. ఇక్కడ దూతలు అనగా ఆయా సంఘ స్థాపకులు (Ministers), సంఘముల నిర్వాహకులు (Pastors) మరియు పరిచారకులు (deacons).

యేడు సంఘములకు పరి. యోహాను గారి ద్వారా దేవుడు దేవదూతలకు వ్రాయించారా, లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఒకవేళ దేవుని సేవ చేస్తూ ఏదేని ఒక సంఘమును స్థాపించినా, నిర్వహిస్తున్నా, ఆ సంఘములో పరిచర్య ధర్మమ జరుపుతున్నా; దేవునికి సంఘస్థులకు మధ్య వారధిగా వున్న దూతలు మీరే; మీరే ఆ నక్షత్రములు. ఆ నక్షత్రములు ఆయన కుడిచేతిలో వున్నవి. మరి నీవు ఎవరి చేతిక్రింద పనిచేయుచున్నావు?

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి (1 పేతు 5:6). దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము (2 తిమో 2:15). ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు (1 పేతు 5:4).

ఆయన కుడిచేతిలో ఉన్న యేడు నక్షత్రములను మర్మము ఏమిటి? దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మనకు అనుగ్రహించిన (మార్కు 4:11) ప్రభువుకు వందనములు. అన్యజనులమైన మనము విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడియుయున్నాము (రోమా 16:25). కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసియున్నాడు (ఎఫే 1:8).

ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను (ఎఫే 5:32). అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో (కొల 1:27) తెలియపరచు సువార్త సైనికునిలా ముందుకు సాగుదుము గాక. దైవభక్తిని గూర్చిన మర్మముయొక్క సంక్షిప్త తాత్పర్యమిదే; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను (1 తిమో 3:16). దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను (ప్రక 10:7).

అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా పండ్రెండు నక్షత్రముల కిరీటమును (ప్రక 12:1); కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములు (ప్రకటన 1:20); పండ్రెండు నక్షత్రములు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రకర్తలు, యేడు నక్షత్రములు దేవుని యేడు సంఘముల దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు అనగా ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములు. ఏడు సంఘముల మర్మములు ధ్యానించునట్లు ముందుకు సాగుదము. ప్రభువు మనతో నున్డునుగాక. ఆమెన్