సమాధానము పొందుకోవడం ఎలా?
Audio: https://youtu.be/_hL5_A6KhkQ
జీవితంలో సెటిల్ అవ్వాలి అని ఎవరికీ ఉండదూ? వాస్తవంగా సెటిల్ అవ్వడం అనే మాటను ఈ లోకరీతిగా ఆలోచిస్తే అన్ని విషయాల్లో సహకరించే జీవిత భాగస్వామి, ఎక్కువ సంపాదించ గలిగే ఉద్యోగం లేదా వ్యాపారం, పెద్ద ఇల్లు, ఖరీదైన జీవనశైలి. ఇవన్నీ సంతోషాన్ని కలుగజేస్తాయేమో తెలియదుగాని సమాధానం దొరకడం చాలా కష్టం కదా. సంతోషాన్ని గూర్చి వివరించమని, విజయవంతమైన వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని నేను ప్రశ్న అడిగినప్పుడు అతడిచ్చిన సమాధానం - ఆస్తిపాస్తులుగాని లేదా పలుకుబడిగల వారితో స్నేహంగాని శాంతి కొరకైన తన అంతరంగంలోని తృష్ణను తృప్తిపరచలేక పోయాయి అని తన అనుభవాన్ని వివరించాడు. శ్రమ, కష్టం వీటితోనే జీవితంలో విజయం పొందగలం. మరి సమాధానం ఎలా పొందుకోగలం?
యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనం చేసిన తరువాత త్వరలో జరుగబోయే సంఘటనలకు, అంటే ఆయన మరణము, పునరుత్థానము, మరియు పరలోక ఆరోహణమును గూర్చిన సంగతులను వివరించి వారిని సిద్ధపరచి, వారికి కలుగబోయే శ్రమలను గూర్చి వివరించాడు (యోహాను 14). ఈ లోకం ఇవ్వలేని శాంతి సమాధానములను గూర్చి వారికి వివరిస్తూ, కష్టాల నడుమ కూడా నిశ్చింతగా ఉండడం ఎలాగో వారు నేర్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు.
క్రీస్తు సిలువ మరణాంతరం సందేహల్లో సంశయాల్లో ఉన్న శిష్యులకు మరలా అగుపడి “మీకు సమాధానము కలుగును గాక” (యోహాను 20:19) అని ఆనాడు వారికి నమ్మకాన్ని కలుగజేస్తూ నేడు మనకును అట్టి సమాధానము పొందుకోగలమని జ్ఞాపకము చేస్తున్నాడు. పరిపూర్ణమైన సమాధానం కోసం మనలో అనేకులు ప్రయాసపడుతూ ఉంటాము. మన జీవితంలో ఎక్కడ దొరకని శాంతి సమాధానాలు కేవలం క్రీస్తులోనే పొందగలమనే భావన మనకున్నపుడే వాటిని పొందుకోగలుగుతాము. అట్టి సమాధానం మనం పొందుకున్నప్పుడే, ఎప్పటికప్పుడు మారిపోయే మన భావాలకు మించి, లోతైన నిశ్చయతను గూర్చిన స్పృహను మనము కనుగొనగలిగే అనుభవాన్ని పొందుకోగలము.