న్యాయాధిపతులు


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు". లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వలన మరలా మరలా ఓటమి పొందిన దృశ్యమును చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలను విడిచి పెట్టిన తరువాత తమ ఇష్టము చొప్పున నడచు ఈ ప్రజలు అనేక రకములైన జనాంగముల వలన హింసను, కౄరత్వమునకు బలైయ్యారు. సుమారు 350 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర ఈ పుస్తకములో చెప్పబడుచున్నది. ఈ పరిస్థితుల మధ్య వారిని విడిపించుటకు పరాక్రమము గల నాయకులను దేవుడు లేవుచున్నాడు. ప్రతినాయకుని కాలంలో ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, సమాజములో మంచి పరిపాలన సమాధానము స్థిరపరచబడుచున్నది. అయినప్పటికిని ఆ నాయకుల తరువాత మరలా వారు మహా గొప్ప దేవుని విడిచి పెట్టి పాపములోనూ, విగ్రహారాధనలోను పడిపోవుచుండిరి.

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకమునకు ఇవ్వబడిన పేరుకు తెలుగు తర్జుమాయే “న్యాయాధిపతులు". హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో  “షో పెట్రీమ్" అను పేరునకు న్యాయాధిపతి, ఏలువాడు, విమోచకుడు, రక్షకుడు అను అర్ధాలు ఉన్నవి. గ్రీకు బైబిలులో వాడబడిన "క్రిట్టాయి” అను పేరునకు కూడ న్యాయాధిపతులని అర్థము. “ ఓటమిపుస్తకము” అని కూడా ఈ పుస్తకమును పిలుస్తారు. న్యాయాధిపతుల పరిపాలనా కాలము: యెహోషువ మరణకాలంలో కూడా కనానులో ఆక్రమించుకొనవలసిన ప్రాంతములు ఇంకను అనేకం ఉండినవి. యెహోషువ క్రీ.పూ. 1390లో మరణించెను దానికి సుమారు 10 సంవత్సరములకు ముందు అంటే క్రీ.పూ. 1380 నుండి సుమారు. క్రీ.పూ. 1045 వరకు ఉన్న 335 సంవత్సరముల చరిత్రను ఈ న్యాయాధిపతుల గ్రంథము వివరించుచున్నది. ఒత్నీయేలు నుండి సంసోను వరకు 13 మంది, 1 సమూయేలులో మనము చూస్తున్న ఏలీ, సమూయేలు, యోవేలు, అబీయా అను నలుగురును చేర్చినయెడల మొత్తం 17 మంది. ఇశ్రాయేలులో న్యాయాధిపతులుగా పరిపాలన చేసిరి. సమూయేలు పుస్తకములో జరిగిన సంభవముల కాలమైన 30 సంవత్సరములను చేరిస్తే మొత్తము సుమారు 365 సంవత్సరములు ఇశ్రాయేలులో న్యాయాధిపతుల పరిపాలనా కాలమగును.

ఉద్దేశ్యము: దేవుడు పాపమును శిక్షించును అనేది ఖచ్చితము. అయినప్పటికి పశ్చాత్తాప పడువారిని క్షమించి, ఆయనతో ఉన్న సంబంధమును, నూతన పరచును అనే కార్యము దృఢపరచడమైనది.

గ్రంథకర్త: సమూయేలు

నేపథ్యము: తరువాత ఇశ్రాయేలుగా పిలువబడిన కనాను దేశము దేవునిని ద్వేషించువారు అనేక రాజ్యములుగా నున్న కనానును లోపరచుకొనుటకు దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయము చేసెను. వారు దేవునికి లోబడనందున ఆదేశమును పోగొట్టుకునే పరిస్థితులలో వారున్నారు.

ముఖ్య వచనములు: న్యాయాధిపతులు 17:6

ముఖ్యమైన వ్యక్తులు: ఒత్నీయేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, దెలీలా.

పుస్తకము యొక్క ప్రత్యేక: ఇశ్రాయేలు దేశములో మొట్టమొదటి అంతర్గత యుద్ధమును తెలియజేయుచున్నది.

గ్రంథ విభజన: 1. న్యాయాధిపతుల దినములలో నున్న పరిస్థితులు Judg,1,1-3,6; 2. ఇశ్రాయేలీయులను శ్రమపరచిన రాజ్యములు, Judg,3,7-16,31; 3. విగ్రహారాధన, దేశీయ అంతర్గత యుద్ధము Judg,17,1-21,25

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 7వ పుస్తకము ; అధ్యాయములు 21; వచనములు 618; చరిత్రకు సంబంధించిన వచనములు 585; నెరవేరిన ప్రవచనములు 33; ప్రశ్నలు 92; దేవుని ప్రత్యేక సందేశములు 23; ఆజ్ఞలు 71; హెచ్చరికలు 26; వాగ్దానములు 5.

తుది కూర్పు: న్యాయాధిపతులు 17 నుండి 21 వరకు ఉన్న అధ్యాయములు ఈ పుస్తకము యొక్క తుది కూర్పుగా చెప్పవచ్చును. దేవుని విడిచి స్వంత మార్గములకు తిరిగి ఇశ్రాయేలీయుల అంతర్గత కలహమును, క్రమశిక్షణను మీరిన భయంకర స్థితిని మనము చూస్తున్నాము. న్యాయాధిపతులు 19లో చూచిన విధముగా క్రమశిక్షణలేని హీనమైన జీవితము బైబిలులోని వేరే భాగములలో ఎక్కడైనా చూడవచ్చునా అని సందేహముగా ఉన్నది. పాపము ఎక్కువైన స్థలములో దేవుని కృప కూడా ఎక్కువగుట అనే దేవుని సత్యమును జరిగిన సంగతుల మూలముగా మనము అర్ధము చేసుకొనవచ్చును.