Day 122 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు (కీర్తన 103: 19).

వసంతకాలం అప్పుడు ప్రవేశించింది. ఒకరోజున ఎక్కడికో వెళ్లాలని బయలుదేరాను. హఠాత్తుగా తూర్పుగాలి కొట్టింది. మహా వేగంతో నిర్దాక్షిణ్యంగా, భయం గొలుపుతూ, తనవెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది.

అప్పుడే ఇంటికి తాళం వేశాను. చిరాకుగా మనసులో అనుకున్నాను. "అబ్బ! ఈ గాలి..." "తగ్గిపోతే ఎంత బాగుండు" అందామనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను. ఆ వాక్యం పూర్తిచేయ్యలేదు.

నేను ప్రయాణమై వెళుతుండగా ఈ సంఘటన నాకో ఉపమానంలా అనిపించింది. ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళంచెవి ఇచ్చి అన్నాడు. "నా యాజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు. ఇది నీకిమ్మని నన్ను పంపాడు."

"ఏమిటిది?" "గాలి తాళంచెవి" ఆ దూత అదృశ్యమయ్యాడు.

చాలా సంతోషం వేసింది. త్వరత్వరగా ఎత్తయిన ప్రదేశాలకు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్లి ఆ కొండ గుహలో మధ్య నిలబడ్డాను. "ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి. అది ఇక నన్ను బాధ పెట్టదు" అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళంచెవిలో బంధించాను. శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశబ్దం వినిపించింది ఆగాలి స్తంభించగానే. "ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది" అనుకున్నాను.

"దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి?" అని ఆలోచించాను. దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న గొర్రెపిల్లలు, ప్రతి చోట కళ్లు తెరుస్తున్న పిల్లజీవులు, రహదారుల ప్రక్కన కళ్లు తెరుస్తున్న పూలమొగ్గలు సంతోషిస్తాయి. సందేహించకుండా దక్షిణ వాయువు తలపులోకి తాళం పోనిచ్చాను. నా చెయ్యి మండడం మొదలుపెట్టింది.

"నేను చేస్తున్నదేమిటి!" బాధలో అరిచాను "ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు. పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు. నేను చేయబోయే తెలివితక్కువ పని వల్ల ఎన్ని నష్టాలు నష్టాలున్నాయో కదా!"

ఎటూ తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్లీ తన దూతను పంపి ఈ తాళంచెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను. నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను.

చూస్తుండగానే దేవుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు. ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను - అది ఆయన చేతిలోని గాయపు మచ్చల మీద ఆనింది. ఆయన చేసిన కార్యాలలో దేనిమీదనైనా విసుకన్నందుకు బాధపడ్డాను. అలాంటి ప్రతి పనిలోనూ నాపట్ల ఆయనకి ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది. ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు.

"ప్రభూ, అయితే ఈ తాళంచెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూనూ?" ప్రభువుని అడిగాను. "అవునయ్యా" దయతో జవాబిచ్చాడు ఆయన.

నేను తేరిపారచూస్తే, నా జీవితానికి సంబంధించిన తాళం చెవులు అన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి. నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు "కుమారా, అన్ని నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా?"

"అన్నీనా ప్రభూ?" భయభక్తులతో పలికాను, "అయితే దేని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమంకాదు. నీవే అన్నింటిని నిర్ణయిస్తున్నావు కదా. "ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేసాడు. "కుమారా, ప్రతిదానిలోనూ నీకు క్షేమకరమైనదేమిటంటే, నన్ను ప్రేమించడం, స్తుతించడం, నాపై నమ్మకముంచడం."