నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? (కీర్తన 27: 13).
ఇలాంటి సందర్భాల్లో మనకు కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించరాని క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది! విశ్వాసం ఎంత చలించిపోతుంది! హృదయం ఎంత కలవరపడుతుంది!
ఇక నేను తట్టుకోలేను. ఈ పరిస్థితులు నన్ను కుంగదీస్తున్నాయి. నేనేం చెయ్యాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?
అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరూ ఏమీ చెయ్యలేరు. నీ శరీరం మీ స్వాధీనంలో ఉండదు. స్పృహతప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ స్నేహితుడి భుజాలమీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు. విశ్రాంతి తీసుకుంటావు. నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని అనుకుంటావు.
మనం శ్రమలలో శోధింపబడి సొమ్మసిల్లిప్పుడు ఇంతే. "బలవంతులై ధైర్యంగా ఉండండి" అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్లినాయని ఆయనకి తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే "ఊరకుండండి, నేను దేవుడినని తెలుసుకోండి."
భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమదినాల్లో శారీరకంగా నీరసించిపోయినా స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాసాడు, "కలం పుచ్చుకుని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ ని చదవడానికి కూడా శక్తి లేదు. ప్రార్థన కూడా చెయ్యలేను. నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగ పడుకుని ఆయనమీద నమ్మకం ఉంచడమే."
ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం, అవస్థలు మబ్బులాగ కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయే నమ్మకం ఉంచాడు.
దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల అగ్నిజ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లి పోయినప్పుడు లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు. ఆయన దేవుడని గుర్తించి అన్ని ఆయనకప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకుంటాడు. క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు.
మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి తాగనిస్తాడు.
"ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము" (కీర్తన 27: 14).
నిబ్బరంగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందెన్నడు ఎందుకు విడనాడేడు నేడు?
తన రెక్కల నీడ నీకాశ్రయమని పలికాడు దొరికెను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు!