దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే (1 యోహాను 5:4).
మనం జాగ్రత్తపడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోను మన విజయాన్నీ, మనశ్శాంతినీ దోచుకునేదేదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనంచేసే వ్యవహారాన్నింకా సైతాను విరమించుకోలేదు. ప్రతి మైలు రాయి దగ్గరా ప్రతివారూ ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మామీటర్ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని. కొన్నిసార్లు అపజయపు కోరల్లోనుంచి కూడా విజయాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమే. చెయ్యవలసిందేమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాసధ్వజాన్ని పైకెత్తడమే.
విశ్వాసం ఎలాటి పరిస్థితినైనా మార్చెయ్యగలదు. అది ఎంత చీకటైనప్పటికీ, వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ, ఒక్కక్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి ఎత్తిపట్టుకుంటే చాలు, కనురెప్పపాటులో ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది.
విడిపించే శక్తిమంతుడు మన దేవుడు
దేవుడి పై విశ్వాసం ప్రతిక్షణమూ ఇస్తుంది విజయము
భయము, బాధ, పాపం, దుఃఖం అన్నీ ఓడిపోతాయి
దేవుడి పై, అన్నింటినీ గెలిచే మన విశ్వాసం.
నేడు నల్లమబ్బులు కమ్మినా విశ్వాసం ప్రదర్శిస్తే
సూర్యుడు వెలుగుతాడు
నీ, నా బాటల్ని సిద్ధం చేసాడు దేవుడే
ఇప్పుడూ, ఎప్పుడూ ఉంచండి విశ్వాసం.
విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్రమించరు. శత్రువు తమకి కనిపించిన స్థలంలోనే ఆ శత్రువుని నిరోధిస్తారు.