క్రీస్తునందు ప్రియమైన పాఠకులకు శుభములు, పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో చేసిన నిత్య నిబంధన ఏ విధంగా మన జీవితాలలో నెరవేరింది మరియు మన శేష జీవితంలో ఏ విధంగా నెరవేరబోతుంది అనే అంశాలను ఈ వార్తమానం లో గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకనాడు వస్తాడు అని, తన నిబంధనను మన యెడల స్థిరపరుస్తాడు అని యెషయా భక్తుని ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించి యెషయా 56:6 లో “విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను”.
పరిశుద్ధ గ్రంథంలో గమనించి నట్లయితే ఆదాము నుండి అబ్రహాము వరకు దేవుడు వాగ్ధానం చేసాడు. ఆదాముతో దేవుడు చేసిన వాగ్ధానం ఆది 1:28 ప్రకారం “దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి”. అదే విధంగా నోవహుతో కూడా ఆది 9:8-17 “భూమి మీద నున్న సమస్త శరీరులకు నా నిబంధనను స్థిరపరుస్తాను అని ఒక గురుతుగా” వాగ్ధానం చేసాడు. కాని అబ్రహాముతో రెండు వాగ్ధానాలు చేసాడు. ఆది 13:16 “మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణు వులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింప గలిగిన యెడల నీ సంతానమును కూడ లెక్కింప వచ్చును.” మరియు ఆది 15:5 “నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను”. ఈ రెండు వాగ్ధానాలలో రాబోయే సంతానమునకు అనగా రాబోయే సంతతికి ముందుగా అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ రెండు వాగ్ధానాలు ఒకే విధమైన తాత్పర్యం ఉండవచ్చు కాని లోతైన ఆత్మీయ మర్మం దాగి ఉంది. ఈ రెండు వాగ్ధానాలాలో మొదటిది శరీర సంబంధమైన వాగ్ధానం మరొకటి ఆత్మ సంబంధమైన వాగ్ధానం అనగా భూలోక సంబంధమైన వాగ్ధానం మరియు పరలోక సంబంధమైన వాగ్ధానం.
శరీర సంబంధమైన వాగ్ధానాన్ని తన జీవితంలో నెరవేర్చుటకు శరీర సంబంధమైన సున్నతిని ఒక గురుతుగా వేసి ఆది 17:7,8 ప్రకారం నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని తెలియజేశాడు. శరీర సంబంధమైన వాగ్ధానం ద్వారా కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా అనుగ్ర -హించాడు. ఆత్మ సంబంధమైన వాగ్ధానాన్ని నెరవేర్చుటకు రక్తాన్ని బలిపీఠం పై రక్తం చిందింపబడింది. ఎట్లనగా తన యేకైక కుమారుడైన ఇస్సాకుకు మారుగా ఆది 22:13 ప్రకారం ఒక పోట్టేలును దహబలిగా అర్పించెను. ఆనాడు యెహోవా దేవుడు ఆ పర్వతము మీద చేసిన వాగ్ధానమును జ్ఞాపకము చేసుకొని ఇశ్రాయేలీయుల యెడల అనగా యాకోబు సంతతినంతటిని ఆశీర్వదించెను. అబ్రహాము ఆ వాగ్ధానాన్ని విశ్వసించాడు అది అతనికి నీతిగా ఎంచబడింది. అతనికే కాకుండా తరువాత సంతతికి కూడా ఆ నీతి ధానముగా కృపా బాహుళ్యత వలన ఆశీర్వదించబడ్డారు. పై చదవబడిన వచనం యెషయా 56:6 ప్రకారం అన్యులైన మనలను తన పరిశుద్ధ పర్వతమునకు నడిపించి మనకు కూడా ఆ వాగ్ధానాన్ని నెరవేరుస్తాను అని తెలియజేస్తున్నాడు. అనగా పాపముల చేత అపరాధములచేత చచ్చిన మనలను ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రదికించెను, బ్రదికించి అన్యులైన మనకు ఇప్పుడు శరీర సంబంధమైన సున్నతి లేకుండా, క్రీస్తు ద్వారా ఒక్కసారే సిలువ పై మరణించి, మరణపు ముల్లును విరచి, ఒక నూతన నిబంధనను స్థిరపరచాడు. ఎట్లనగా ఎఫెసీ 2:11-13 ప్రకారం అన్యులైన మనము ఇశ్రాయేలీయులతో సహా పౌరులం కానప్పటికీ, పరదేశులును, వాగ్ధాన నిబంధన లేని పరజనులును, నిరీక్షణలేని వారముగా అనగా మునుపు దూరస్తులమైన మనలను ఇప్పుడు క్రీస్తులో సమీపస్తులుగా చేసికొని ఆ నిబంధనను స్థిరపరచాడు.
ఆత్మ సంబంధమైన వాగ్ధానమునకు రక్తమును శరీరమునుండి వేరుపరచి శరీర సంబంధమైన వాగ్ధానమునకు శరీరం దున్నబడి అర్పించాడు. అనగా ఆత్మ సంబంధమైన వాగ్ధానముగా తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి రక్షణను మనకు అనుగ్రహించాడు. ఇట్లు ఆత్మ సంబంధమైన వాగ్ధానాన్ని నెరవేర్చి శరీర సంబంధమైన వాగ్ధానముగా తన శరీరాన్ని మరణములో నుండి జీవములోనికి అనగా పునరుత్థానం ద్వారా దానిని నెరవేర్చాడు. ఈ నూతన నిబంధన ద్వారా రక్షణ మరియు తన నిత్య రాజ్యము నూతన యెరూషలేమునకు చేరుతాము అనే నిరీక్షణ కలిగింది. ఇదే ఆ పరిశుద్ధ పర్వతం.
క్రీస్తు శరీరం సంఘమును సూచిస్తుంది, ఈ సంఘంలో ఉన్న మనకే ఈ వాగ్ధానం నేరవేర్తుంది కాని వేరుగా ఉన్నవారికి నెరవేరదు. అందుకే ఒకే సంఘమునకు సభ్యత్వం కలిగి ఉండడం అది నీకు మేలు. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. యేసు క్రీస్తు ఏ విధంగా మహిమ శరీరం గా ఎత్తబడ్డాడో ఆయన మరల వచినప్పుడు అదే విధంగా ఈ సంఘం కూడా ఎత్తబడుతుంది. అప్పుడే సంఘము ద్వారా ఎత్తబడిన మనం ఆ పరిశుద్ధ పర్వతముపై అనగా నూతన యెరూషలేములో ఉంటాము అనే నిరీక్షణ కలిగి యుండగలం. అందుకే ఎఫెసీ 5:22-27 ప్రకారం క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైననూ లేక, పరిశుధ్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఉండవలెనని కోరుతున్నాడు. అందువలెనే సిలువలో పలికిన ఆరవ మాట సమాప్తమైనది, అనగా ఈ నిబంధనను నెరవేర్చెను అని తనను తాను సమర్పించుకున్నాడు. పస్కా బలి, పాప పరిహారార్ధ బలి, సర్వాంగ దహన బలి, అపరాధ పరిహారార్ధ బలి, సమాధాన బలి వీటికి బదులుగా అనగా వాటికి మారుగా తనను తాను అర్పించుకున్నాడు.
ప్రియ చదువరీ, ఆనాడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్ధానం ప్రకారం ప్రకటన 7:4 లో పన్నెండు గోత్రములనుండి పన్నెండు వేలమందిని లెక్కించాడు. అనగా లక్షా నలువది నాలుగు వేల మంది. అంతేకాకుండా మన అన్యులైన జీవితాలో మనలను లెక్కింపలేని గొప్ప జనసమూహంగా తన పరిశుద్ధ పరమునకు మనలను పిలిచిన వాని గుణాతిశయమును ఏమని వర్ణించగలం. పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు మన జీవితాల్లో ఆట్టి కృప దయచేసిన విధానమును జ్ఞాపకము చేసికొని ఇంకా ఉచితంగా ఇచ్చిన రక్షణ పొందకుండా నిర్ల్యక్షము చేస్తుంటే వ్యర్ధం. నిత్య నిబంధనను దేవునిని బట్టి అట్టి కృపకు రక్షణకు పాత్రులవుదురు గాక. ఆమేన్.