Day 199 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

తనయెడల యథార్దహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది (2 దిన 16:9).

తనమీద మనసంతా నిలుపుకుని, తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చెయ్యాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది.

నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా ఈ ఛాన్సు రాలేదు. ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు గలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికి పుచ్చుకునేవారి కోసం, ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకొని, తన ద్వారా ఏ ఆటంకమూ లేకుండా సాహస కార్యాలు చెయ్యడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెదకుతున్నాడు.

మహిమ తనకు కూడా చెందాలని పేచీ పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీలేదు.

తన 90వ పుట్టిన రోజున సువార్తికుల, పాస్టర్ల సమావేశంలో జార్జి ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు - "నేను నవంబరు 1825లో మారుమనస్సు పొందాను. కాని నాలుగు సంవత్సరాల తరువాత మాత్రమే అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు, ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజు పోయింది. దేవుడు, కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు. నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది. మరింకేదీ నేను కోరలేదు. దేవుని కృపవల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటి దాకా ఉండిపోయింది. నన్ను పరమానందభరితుడిగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. " నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను. దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పజెప్పారా? లేక ఆ విషయమూ, ఈ విషయమూ దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా? నేను అంతకు ముందు కొంతమట్టుకు బైబిలు చదివేవాడిని గాని ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాణ్ణి. కాని తరువాతి కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేంత ఆశీర్వాదాన్నిచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకో కూడదు.

నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చెయ్యమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను.