అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే యింక రెండు దినములు నిలిచెను (యోహాను 11:6).
ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది "యేసు మార్తను, ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను" అనే మాట. దేవుడు మనపట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ, ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పులేని ఉచిత ప్రేమమీద మనం నమ్మకముంచి దానిగురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనలను కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడి సుస్తీ వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలనూ దాటుకుని వచ్చి అతణ్ణి బాగుపరుస్తాడని మరియ, మార్తలు అనుకున్నారు. పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీషు బైబిలులో చదివితే "వినినప్పుడు" అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి" అని ఉంటుంది.
"కాబట్టి" అనే మాట ఇక్కడ వాడడం ఎంత క్రొత్తగా ఉంది! అయితే వాళ్ళమీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు ఆయన ఆగిపోయింది, ప్రేమ ఉంది కాబట్టే. ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్ళకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపారప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళయితే క్షణాలమీద వాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపజేసి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి, దుఃఖాన్నీ, నిట్టూర్పుల్నీ ఎగరగొట్టే సేవారే. అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తిచేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే.
బాధవల్ల, దుఃఖంవల్ల మనమెంత మేలు పొందామో ఎవరు లెక్కగట్టగలరు? క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మనకలవడడానికి దుఃఖమే కారణం. పరీక్షపెట్టే శ్రమలు లేకుండా విశ్వాసమెక్కడిది? సహించడానికి బాధ లేకుండా సహనమెక్కడిది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవమెక్కడిది?
మార్గం తేలికే, మనతోనే ఉంటూ
మనం ప్రేమని పొందిన వాళ్ళమంటూ
తెలియజెప్తుండేవాడు మనల్ని ప్రేమించేవాడు
ఆకాశం మబ్బు కమ్మితే, బాధలు వేధించితే
ఆయన్నే నమ్ముదాం
మనల్ని ప్రేమించినవాడు కదా
అన్నిటినీ తాకే కాలం
ఆయన ప్రేమని మట్టుకు తాకలేదు
క్రీస్తు హృదయంలోనుండి ప్రేమ పారుతూనే ఉంటుంది.