Day 229 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను (అపొ.కా. 27:25).

కొన్నేళ్ళ క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను. ఆ ఓడ కెప్టెస్ చాలా నిష్టగల క్రైస్తవుడు. న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు "కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది. బ్రిస్టల్ వాడైన జార్జి ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను. అంతలో జార్జి ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు. "కేప్టెన్, శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి" అన్నాడు. "అది అసాధ్యం" అన్నాను. అప్పుడాయన అన్నాడు "సరే, మీ ఓడను అక్కడికి చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు. గత ఏభై ఎనిమిది సంవత్సరాలుగా నేనెప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు. రండి, క్రిందికివెళ్ళి ప్రార్ధన చేద్దాం"

ఆ దైవజనునికేసి చూస్తూ ఈయన ఏ పిచ్చాసుపత్రినుండి తప్పించుకువచ్చాడో అనుకుంటూ "మిస్టర్ ముల్లర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా?" అన్నాను. "నాకు తెలియదు" అతడు సమాధానమిచ్చాడు. "నేను దట్టంగా పట్టిన మంచును చూడ్డంలేదు. సజీవుడైన నా దేవుని చూస్తున్నాను. ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతీ పరిస్థితినీ చక్కబెడతాడు"

అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాడు. అతడు ప్రార్ధించడం ముగించిన తరువాత నేను ప్రార్థన చేయ్యబోయాను. కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చెయ్యవద్దన్నాడు. "ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా? నాకైతే జవాబిచ్చేశాడని నమ్మకముంది. ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు" అన్నాడు.

ఆశ్చర్యంగా అతనివంక చూశాను. అతడన్నాడు "కేప్టెన్, ఏభై ఏడు సంవత్సరాల సుండి దేవుడు నాకు తెలుసు. ఆయననుండి నడిపింపు పొందనిరోజు ఈ సంవత్సరాలన్నింటిలో ఒక్కటి కూడా లేదు. లేచి తలుపు తెరిచి చూడు, పొగమంచు తొలిగిపోయి ఉంటుంది" లేచి చూశాను. నిజమే! అంతా నిర్మలంగా ఉంది. శనివారంనాడు జార్జి ముల్లర్ క్యూబెక్ సిటీలో ఉన్నాడు.

ఆయనపై ప్రేమ ఉంటే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాము
ప్రభువు మధురిమలో బ్రతుకంతా కాంతిమయమే