Day 269 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము (2 కొరింథీ 5:6).

వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం వల్లనే. దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు. స్వార్థం అలా ప్రేరేపిస్తుంది. సైతాను అలా పురికొల్పుతాడు. అయితే దేవుడు మనలను వాస్తవాలనూ, అభిప్రాయాలనూ చూడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలం క్రీస్తు అనే వాస్తవం పైనే, ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచనకార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు ఈ విలువైన వాస్తవాలపై మన దృష్టి ఉంచినప్పుడు దేవుని మాట చొప్పున వాటిపై మనం నమ్మకముంచితే మన అనుభూతులనూ, అభిప్రాయాలనూ దేవుడే సవరిస్తాడు.

దేవునిపై నమ్మకం ఉంచడానికి దోహదంచేసే ఆలోచనలనూ, ఆయనపై నిరీక్షణ ఉంచడానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులనూ మనలో కలిగించడం దేవుని పనికాదు. ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చెయ్యడు. దేవుడు మనకెప్పుడు సహాయపడతాడంటే మన చుట్టూ జరుగుతున్నదాన్ని లెక్కచెయ్యక మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే, ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగల సమర్థుడు అని మనం ముందుగా నమ్మాలి.

ఇలా చెయ్యకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయత రాదు. ప్రతి వ్యక్తికీ తగిన సమయంలో తగినంత మోతాదులో ఆయన నిశ్చయతను అనుగ్రహిస్తాడు.

మనలోని అభిప్రాయాలను నమ్మడమా, లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మడమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మన అభిప్రాయాలు పడి లేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి. దేవుని నిత్యసత్యాలైతే యుగయుగాలకూ స్థిరంగా నిలిచే కొండల్లాంటివి. యేసు ప్రభువు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు.

అందాలొలికే ఆయన ముఖంమీద
అంధకారం తెరవేసినా
ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు
పెనుతుపానులో నావ లంగరై తోడుతుంటాడు