నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి (కీర్తనలు 42:7).
మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి
మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి
క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి.
మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాటిమీద నడిచాడు యేసు
ప్రార్థనకి జవాబు రానివేళ సాయంకోసమో
భీకర నిశ్శబ్దంలో మన తోడుకోసమో.
మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
ఆగని తుపాను ఒరవడిలో శ్రమపడినా
ఘోష పెడుతూ కడలి గోల చేసినా
ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి.
మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
మనం నడిచి వెళ్ళడానికి సముద్రాన్ని
పాయలుగా చేస్తాడాయన
మన దారికవి అడ్డం రావు.
మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాగ్దానం చేసాడాయన మారనిది ఆయన ప్రేమ
మనతో ఉండి, దారిచూపి నడిపిస్తాడు
క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు.
దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తివంచన లేకుండా పనిచెయ్యి. దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు. జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మనయెదుట నిలబెడతాడు. అది ఇచ్చే పిడిగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి. పిల్లగాలులు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టుకంటే మాటిమాటికి తుపాను తాకిడికి కాండమూ, కొమ్మలూ విరిగిపోయేంతగా వంగిపోయిన చెట్టు వేళ్ళే లోతుగా పాతుకొని ఉంటాయి. జీవితంలోకూడా అంతే. కష్టాలలోనే వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకుంటుంది.