యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో నిండినవారై, బాల్యమునుండీ అతనిని ద్వేషింపసాగారు. యాకోబు జ్యేష్ఠ పుత్రుడైన రూబేనుకు తమ్ముళ్ళు అసూయ చెందడం ఏ మాత్రం అంగీకరంగా లేదు. అన్న లేని సమయం చూచుకొని మిద్యానీయులైన బీడారులకు ఇరువది తులముల వెండికి అమ్మివేశారు .(ఆది 39)లో గమనిచండి.ఈ సంగతులన్నీ దైవచిత్తానుసారంగానే జరిగాయి (ఆది 37:28)
ఈజిప్టు దాస్యములో మ్రగ్గుతున్న యోసేపు సత్ ప్రవర్తన గలిగి దైవభక్తితో జీవించుచున్నాడు.ఇతని అందానికి భ్రమసి పోతిఫరు భార్య దుష్కార్యానికి ప్రేరేపించింది. ఎంత వేదించినా అతడు లొంగిపోలేదు గనుక వ్యతిరేకముగా నిందలు వేసి జైలు పాలుజేసింది. యధార్థవాది, లోకవిరోధి అనే సంగతి రుజువైంది. ఇక పోతిఫరు అను మరో వ్యక్తి హెలియోపొలిలో రే అనే సూర్యదేవతకు పూజారి.ఇతడు ఓను పట్టణానికి చెందినవాడు. ఓను అనగా “సూర్యుడు లేక బలము” అని అర్థములు .పోతిఫేరే అనగా సూర్య దేవత యొక్క దానము అని అర్థము. ఇతని కుటుంబీకులంతా ఆ దేవతనే పూజిస్తూ అన్యాచరములలో జీవిస్తుండేవారు. ఇతని ప్రియపుత్రిక పేరు ఆసెనతు. ఈ పేరు అన్యదేవతకు చెందినది.’నాతు’ అను ఈజిప్టు దేవతకు “ప్రియ శిష్యురాలు” అని ఈ పేరుకు అర్థము. యజకుని కుమార్తె అయినందున గొప్ప విగ్రహారాధికురాలు ఆసెనతు. యోసేపు మంచితనాన్ని గుర్తించిన ఫరో రాజు ఆసెనతుతో వివాహము జరిగించాడు. ఆమె కుటుంబము వారంతా దీనికి సమ్మతించారు. అన్యురాలైన స్త్రీకి దైవభక్తి గల పురుషునితో వివాహము జరగడమంటే ఇది దేవుని ఏర్పాటే కానీ మరొకటి కాదు. ఆసెనతు యోసేపుకు తగిన ఇల్లాలు .తన భర్త ఐగుప్తులో గడిపిన దుర్బర జీవితము, పోతిఫరు భార్య వలన పొందిన నింద, జైలులో గడిపిన బాధాకరమైన దినములు ఇట్టే మర్చిపోయేలా చేయుటయే గాక ముచ్చటైన ఇద్దరు కుమారులను కూడా అందించింది .అందుకే సొలోమోను రాజు “భార్య దొరికిన వానికి మేలు దొరకెను , గుణవతియైన భార్య ముత్యములకంటే అమూల్యమైనది “ అని తన గ్రంధములో వ్రాశాడు. యోసేపు తన పెద్దకుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు . మనష్షే అనగా “మరచిపోవుట” అని అర్థము .తన తండ్రి ఇంటివారిచే అమ్మివేయబడి ఒంటరిగా జీవించడము ఐగుప్తు చేదు నిజాలన్నిటినీ మరచిపోయేలా చేశాడని అతనికానామకరణము చేశాడు.రెండోవాడు ఎఫ్రాయిము. ఈ పేరుకు అర్థము “అభివృద్ధి” చెందుట .రిక్తునిగా వచ్చి దారుణ హింసలు అనుభవించిన ఐగుప్తు దేశములోనే దేవుడు హెచ్చుగా అభివృద్ధి పరచాడు. గుణవతియైన భార్యను,గోత్రాన్ని నిలిపేందుకు చక్కని కొడుకులను ఇచ్చాడని సంతోషించాడు. క్రీస్తేసునందు జీవించేవారికి అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది. బైబిలు గ్రంధములో ఎన్నో రకాలైన స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆసెనతు అన్యురాలైయుండి కూడా దైవభక్తుడైన భర్త సహచర్యంతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని పిల్లల పిల్లలను చూచింది.తన తల్లి మరణము వలన ఇస్సాకు మితిలేని దుఃఖాన్ని భార్య రిబ్కా సహచర్యములో మరచిపోగలిగాడు. కుటుంబాల పతనానికి కూడా దోహదకారులైన లోతు భార్య, యోబు భార్యలాంటి స్త్రీలు కూడా లేక పోలేదు. పరిశుద్ద గ్రంధములో ఆసెనతు లాంటి మంచి భార్యలను ప్రతి స్త్రీ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. ఫలించు కొమ్మయైన యోసేపుతో ఆసెనతు ఎలా అంటుకట్టబడిందో మనము కూడా మన భర్తలతో అంటు కట్టబడాలి. మన కుటుంబాలన్నీ క్రీస్తేసుతో కట్టబడాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కదా ఫలించేది.