నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది (1రాజులు 19:7).
అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏంచేశాడు? తినడానికి ఆహారమిచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలీయా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథంకంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలిసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి మరి. మనుష్యుల్లో గొప్ప గొప్పవాళ్ళకి కూడా ఏలీయా లాగా బదరీవృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదదీరుస్తాయి. "నీ శక్తికి మించిన ప్రయాణమిది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మసంబంధమైన బలహీనతగా ఎంచి దిగులుపడకండి."
ప్రార్థించడానిక్కూడా ఓపిక లేదు
అలసిన దేహం సొమ్మసిల్లింది
మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన
ఆదమరచి కొంత సేపు నిదురపోవాలి
అలా పడి నిద్రపోతే
దేవుడేమంటాడో
అనుమతి లేకుండా నిద్రలోకి జారితే
ప్రార్థించకుండా పవ్వళిస్తే
క్షమిస్తాడా లేదా, ఆలోచించు
నీకు మాటలైనా రాని ప్రాయంలో
నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా
తన ఒడిలో లాలించి జోల పాడలేదా
నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో
అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా
నిద్రలో నీ గగుర్పాటును
తన కౌగిట చేర్చి ఓదార్చలేదా
నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ
ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా
ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపికలేని అలసటలో
మానవసహజమైన బలహీనత లొంగదీసినవేళ
నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో
తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిదురపో
నీ పరమతండ్రికి తెలుసు నీ అలసట
పసిపాపలాగా హాయిగా నిదురపో.
తలవాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు
నువ్వు అలిసిపోయిన విషయం తండ్రికి తెలుసు
నోటిమాటల ప్రార్థనొక్కటే కాదు ఆయన్ని చేరేది
నీ హృదిలోని ప్రేమని చూడగలడాయన.
నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకి తెలుసు
ప్రార్థించే ఓపిక తెలుసు
క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు
ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన.
తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు
కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు
నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు
ఇక భయమే లేకుండా ఆయనలో పవ్వళించు