యేసుక్రీస్తు సంఘమును చిత్రించు పత్రికగా ఎఫెసీ కనిపించగా సంఘమునకు శిరస్సైన క్రీస్తును కొలొస్సయి వత్రిక బయలుపరచుచున్నది. ఎఫెసీ శరీరమును గూర్చి జాగ్రత్త వహించగా కొలొస్సయి శిరస్సు మీద దృష్టియుంచుచున్నది. చిన్న పుస్తకమైన కొలొస్సయుల ప్రారంభభాగము (అధ్యాయము1,2) బోధనను గూర్చినదియు, చివరి భాగము (అధ్యాయము 3,4) అనుచరణ - జీవితమునకు చెందినదగును. క్రీస్తును సమస్తమునకు ముందున్నవారిగా చూపుటయే దీని ద్వారా పౌలు ఉద్దేశమై యున్నది. క్రైస్తవుని జీవితము కూడ ఆ సత్యమును బయలుపరచి చూపవలెను. విశ్వాసులు క్రీస్తునందు వేరు పారి జీవించువారిగను, క్రీస్తునందు మరుగై ప్రభువు యొక్క సంపూర్ణతను పొందువారగుటచే ఆయన లేని జీవితము నిరుపయోగము.
కొలొస్సై విశ్వాసులకు యీ పత్రికను వ్రాయుచున్నట్లు కొలొస్సయులకు 1:1-2 వచనములలో పౌలు పలికెను. దీనికి సమీప పట్టణమైన లవొదికయలో నున్న వారికిని యీ పత్రికను చదువవలెనని ఆయన పలికెను. (కొలొస్సయులకు 4:16)
గ్రంథ రచయిత:- కొలొస్సై పత్రిక రచయిత పౌలని పారంపర్యముల వివరణలును దానితో కలియుచున్నవి. వ్యక్తిగత సూచనలు, ఎఫెసీ పత్రికతో గల పోలికలు మొదలగునవి దీనిని మరల దృఢపరచుచున్నవి. దీని నాల్గు అధ్యాయములలో పౌలు యొక్క యితర వత్రికలలో చూడలేని 55 గ్రీకుపదములు కనిపించుచున్నవి. పౌలుకు గ్రీకు భాషను ఉపయోగించుట కొరకైన విడుదల అతడు గైకొను విషయముతో ప్రకాశించుటయు, కొలొస్సై సంఘము యొక్క తప్పుడు బోధలను గూర్చిన సూచనలును, యీ అత్యధిక పదములకు చాలినంత వివరణనిచ్చుచున్నది. కొలొస్సైలో వచ్చు క్రీస్తును గూర్చిన అభిప్రాయమును (కొలొస్సయులకు 1:15-23), యోహాను 1:18 వరకు గల లోగోస్ ను గూర్చిన అభిప్రాయముతో పోల్చవచ్చును. క్రీస్తును లోకసృష్టికర్తగ చూపు భావము యొక్క ప్రారంభము ఫిలిప్పీయులకు 2:5-11 వరకు గల భాగమునందు బయలుపడుచున్నది.
వ్రాయబడిన కాలము:- ఎఫెసుకు దాదాపు 100 మైళ్ళు తూర్పున సమృద్ధియైన లైకస్ లోయలో అమరియున్న ఒక పట్టణమే కొలొస్సయి.
శ్రేష్ఠమైన నల్లగొఱ్ఱ రోమమునకు ప్రఖ్యాతి గాంచిన సంతగానుండెను. కొలొస్సయులకు 1:4-8; కొలొస్సయులకు 2:4 మొదలగు భాగములందు వచ్చు సూచనల ద్వారా పౌలు ఎన్నటికి కొలొస్సైకి వెళ్ళనప్పటికిని పౌలు యొక్క ఒక శిష్యుడును, తోటి సేవకుడునైన ఎపఫ్రా చేత అచ్చట సంఘము స్థాపించబడెనని ఊహించవచ్చును. తరువాత పౌలు యొక్క చెరసాల దినములలో ఎపఫ్రా అతనిని కలసి కొలొస్సైయుల వర్తమానములను అతనికి తెలియజేసెను. (కొలొస్సయులకు 4:12-13; ఫిలేమోనుకు 1:23).
కొలొస్సయులు, ఎఫెసీయులు, ఫిలేమోను మొదలగు మూడు పత్రికలందు కనిపించు ఏకత్వము గల అభిప్రాయములను, ప్రకటనలను, వ్యక్తి గత పేర్లను బట్టి యీ మూడు పత్రికలను ఒకే కాలమందు, ఒకే పరిస్థితి యందు వ్రాయబడెనని తీర్మానించగలము. (కొలొస్సయులకు 4:9-17; ఫిలేమోనుకు 1:2, ఫిలేమోనుకు 1:10, ఫిలేమోనుకు 1:23-24). చెరసాల పత్రికలు నాలుగును పౌలు యొక్క మొదటి చెరసాల నివాసకాలమందు వ్రాయబడి యుండవచ్చును. ( ఎఫెసీ, ఫిలిప్పీ వీటి కాలమును చూడుము) అట్లైనచో క్రీ.శ.60లో లేక 61లో యీ పత్రికను వ్రాసి తుకికు దగ్గర ఇచ్చి కొలొస్సైకి పంపెను. కొలొస్సయులకు 4:7-9; ఎఫెసీయులకు 6:21; ఫిలేమోనుకు 1:10-12 మొదలగు భాగములను చూడుమ
ఎపఫ్రా పౌలును సంధించి కొలొస్పై సంఘ పరిస్థితులను చెప్పుట ద్వారా యీ పత్రికను వ్రాయుటకు ప్రోత్సహించి యుండవచ్చును. ఇంచుమించు అన్యజనులు జీవించిన కొలొస్సై సంమమునకు తప్పుడు బోధ యొక్క శక్తి వంతమైన బెదరింపులను ఎదుర్కొనవలసి యుండెను. వారు దానికి ఓడిపోనప్పటికిని యేసు క్రీస్తు యొక్క సువార్తకు దుర్బోధలు అధిక హానికరముగ నుండెను. దానిని నిరాకరించు పత్రిక భాగమే కొలొస్సయులకు 2:8-23. ఈ భాగము నుంచి ఆ దుర్బోధల స్వభావము ఏమిటని కొంత వరకు ఊహించగలము. ఇది గ్రీకు తత్త్వజ్ఞానము. (కొలొస్సయులకు 2:4; కొలొస్సయులకు 2:8-10). యూదుల ధర్మశాస్త్రము (కొలొస్సయులకు 2:11-17). తూర్పు దేశముల దైవత్వము పొందుట యొక్క సిద్ధాంతము (కొలొస్సయులకు 2:18-23) మొదలగునవి కలిసిన ఒక సమయ విధానముగ నుండెను. శరీరమును అలక్ష్యము చేయుట, సున్నతి, ఆహార కొలతలు, సంస్కారములకు ముఖ్యత్వమునిచ్చుట, శరీరమును హింసించుకొనుట, దేవదూతారాధన, యోగాసనములకు స్థలమునిచ్చుట వంటివి దాని భాగములుగా నుండెను.
ముఖ్య పదజాలము:- సమస్తమునకు ముందుగా నున్న వాడైన క్రీస్తు.
ముఖ్య వచనములు:- కొలొస్సయులకు 2:9-10; కొలొస్సయులకు 3:1-2.
ముఖ్య అధ్యాయము:- కొలొస్సై 3. క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. క్రీస్తునందుగల స్వాతంత్ర్యము, క్రీస్తునందు విధేయత యీ విధముగ కొలొస్సైనందు వచ్చు మూడు ముఖ్య అభిప్రాయములును మూడవ అధ్యాయమునందు ఏకమగుచున్నవి. విశ్వాసి క్రీస్తుతో కూడ లేపబడిన వాడగుటచేత అతడు ప్రాచీన పురుషుని పరిత్యజించి నవీన పురుషుని ధరించుకొనవలెను. జీవితపు అన్ని పరిస్థితుల యందును పరిశుద్ధతయే దాని ఫలము.
అందం గ్రంథ విభజన: - పరిశుద్ధ గ్రంథమునందు అత్యధికముగ క్రీస్తును కేంద్రీకరించి మాట్లాడు పుస్తకము ఇది. ఇందు కొలొస్సై సంఘమును బెదరించిన దుర్బోధనలను ఆటంకపరచుటకు క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వమును, ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క పరిపూర్ణతను దృఢముగ చెప్పుచున్నాడు. ఈ ఆజ్ఞలకు అనుదిన జీవితమందు కలుగవలసిన ఫలమును గూర్చి గ్రంథపు చివరి భాగమున చెప్పుచున్నాడు. అనగా బోధన యొక్క వాస్తవ అనుచరణ విధానము జీవితములో ఆ ఫలమును చూపవలెను. పత్రిక యొక్క రెండు ముఖ్య విషయములు క్రింద యివ్వబడెను.
(1) క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. అధ్యా. 1,2.
(2) క్రీస్తుకు సమస్తమును లోబడి యుండవలెను. అధ్యా 3,4.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 51వ పుస్తకము, అధ్యాయములు 4; వచనములు 95; ప్రశ్న 1; చరిత్రక వచనములు 92; నెరవేర్చబడని ప్రవచనములు 3.