క్రైస్తవుని జీవన శైలిలో - దేవుని అదృశ్య జ్ఞానం
దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 1 కొరింథీయులకు 2:12
మన జీవితంలో లోక సంబంధమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు వాటిని అధిగమించగలననే సామర్థ్యం తనకున్నప్పటికీ, అంతకంతకు అధికమయ్యే సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితిలో ఆత్మ విశ్వాసాన్ని పక్కనబెట్టి, ఇతరులిచ్ఛే సలహాలపై ఆధారపడుతుంటాము. మనుష్యులపై ఆధారపడే లౌకిక జ్ఞానం మనలను విశ్వాసంలో బలహీనత కలుగ జేస్తుందని గ్రహించాలి. కాబట్టి, మన విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనే అనుభవం కలిగి యుండాలి. ఈ శక్తి ప్రతివిధమైన సవాళ్ళను అధిగమించగలననే సామర్ధ్యాన్ని పెంచి జ్ఞానయుక్తమైన దేవుని అదృశ్య జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది.
దేవుని అదృశ్య జ్ఞానాన్ని పొందిన జీవితాలు లౌకిక సంబంధమైన ఆత్మ కాకుండా దేవుని యొద్దనుండి వచ్చే ఆత్మను పొందే అనుభవం లోనికి నడిపించబడుతారు. ఈ జ్ఞానం దేవుని మర్మాలను పరిశోధించే శక్తిని దయజేస్తుందని గ్రహించాలి. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన జీవితాలు, లోకములో జీవిస్తున్నప్పటికీ లోకమునుండి వేరై జీవించే అనుభవం కలిగియుండాలి. ఇది అతి ప్రాముఖ్యమైన అనుభవం.
క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును ఎరిగి జీవించుట కాదు; క్రీస్తును కలిగి జీవించుట. ఇపుడు మనము జీవించుచున్న జీవితము కాలానుగుణంగా సుఖ దుఖాలతో సాగిపోతూ ఎదో ఓ లాగ జీవించి ముగించేది కాదు. నిత్యత్వంలో మనము ఏమై వుండాలని దేవుని రహస్య సంకల్పమో మన అంతరాత్మకు బయలుపరచబడునట్లు ప్రార్ధనతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించే లోతైన అనుభవం కలిగియుండాలి.
లౌకికాత్మను ఇరుకున పడేసి, దేవుని పరిశుద్దాత్మకు మనపై సంపూర్ణాధికారమునకు ఒప్పుకుంటే గాని తాను స్వరక్తమిచ్చి కొనుక్కున్న క్రీస్తు సంకల్పం మన అవగాహనకు రాదు. దేవుని ఆత్మకు మన అంతరాత్మను అనుసంధానం చేసుకుని, పొందబోయే మహిమకు అర్హులమగునట్లు సంసిధ్దులమై జీవించుదము గాక. ఆమెన్
Audio Available: https://youtu.be/XD62fK-MwZs