ప్రతిస్పందన
Audio: https://youtu.be/Iwmzxos0Qis
మనలను అతిగా ప్రేమించేవాళ్ళు లేదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు, వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఎన్నో సంగతులను మాట్లాడుకుంటాం. ఎక్కడలేని సంగతులు ఎక్కడనుండో పుట్టుకొచ్చి సమయం వృధా అయిపొతుంది అని అనిపించపోగా, ఇష్టమైన వాళ్ళతో కాస్త సమయం గడిపాము అనే ఆనందాన్ని పొందుతుంటాం. అంతేకాదు, వారితో పంచుకున్న విషయాలను చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం.
ప్రత్యేకంగా యవనస్తుల్లో ఇటువంటి ఆలోచనలను మనం గమనించినప్పటికీ, వ్యక్తిగతంగా నా అనుభవంలో కలిగిన ఒక సంఘటన ఇటువంటి సందర్భాన్ని గుర్తు చేసింది. రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా కుమారుడు నాకు ఫోన్ చేసి, వచ్చిరాని మాటలతో మాట్లాడడం మొదలు పెట్టాడు. వానికి నా స్వరం తెలుసు కాబట్టి నా మాటలకు ప్రతిస్పందించాడు. ఆఫీసులో బిజీగా పని చేస్తున్నప్పటికీ, వాడితో మాట్లాడి, వానిని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పగలిగాను. ఆ సందర్భాన్ని నేను ఎంత కాలమైనా గుర్తుపెట్టుకోగలను. బహుశా ఈ అంశాన్ని చదివే ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం ఖచ్చితంగా ఉండి యుండడం గొప్పసంగతి.
నా కుమారుని స్వరం వినగానే నేను పొందిన ఆనందం, మనతో సంబంధం కొరకు దేవుని తీవ్రమైన ఆశ నాకు గుర్తుచేసింది. ఆరంభం నుండి దేవుడు మనకొరకు చురుకుగా వెంటబడటాన్ని బైబిలు మనకు తెలియజేస్తుంది. ఆదాము హవ్వలు పాపము చేసి ఆ తరువాత తోటలో దాగుకున్నాక “దేవుడైన యెహోవా ఆదామును పిలిచి”నట్లుగా మనము గమనించగలం. ఆతరువాత, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మానవాళితో వెంటపడుతూనే ఉన్నాడు. దేవుడు మనతో సంబంధం కలిగియుండడం కొరకు ఆశపడుతాడు అనుటలో ఎట్టి సందేహం లేదు. పాపము వలన మనం దూరమైనప్పుడు; యేసు ప్రభువును మన పాపములకోరకు క్రయాన్ని చెల్లించి సిలువపై మరణిచడానికి, మన తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపినాడనే సంగతి మనందరికీ తెలుసు.
“మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. “ 1 యోహాను 4:9,10.
దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనము కూడా ఆయన ప్రేమకు ప్రతిస్పందించాలని ఆశపడుతున్నాడనే సంగతిని ఎరగడం ఎంత బాగుంటుంది కదా. ఏమి పలకాలనే విషయం మనకింకా తెలియకపోయినా, మన తండ్రి – మనము ఆయనతో అనుదినం ఏదైనా మాట్లాడితే వినాలని ఇష్టపడుతున్నాడు. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్ధనే కదా; ఆ ప్రార్ధనతో దేవుని ఆశను తీర్చేద్దామా? ఆమెన్.