యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు వంటి అనేక మార్గములలో చెరలో తనతో ఉన్న ప్రజలకు ప్రవచించాడు. చెదరిన ఎముకలవలె వారి అప్పటి స్థితి కనిపించుచున్నను దేవుడు వారిని మరల తనతో చేర్చుకుంటాడు. వారికి జీవమును పోసి మరల ఒక దేశముగా వారిని నిలుపుతాడు. భూత కాలములో సంభవించిన శిక్ష రాబోవు మహిమకు మార్గమును సిద్ధపరుస్తుంది. ఈ విధముగా నేను యెహోవానని మీరు తెలిసికొనెదరు అనునదే యెహెజ్కేలు యొక్క వర్తమానము.
హెబ్రీ భాషలో యెహెజ్కేలు అనియు గ్రీకు భాషలో యెజేక్కియేలు అనియు స్వల్ప భేదముతో కనపడు ఈ పేరు యొక్క అర్థము దేవుడు బలపరుస్తాడు అనునదే. దేవుడు పిలిచి ఏర్పరచిన ప్రవచనా సేవ నిమిత్తము యెహెజ్కేలును ఆయన బలపరుచుటను మనము చదువగలము (యెహెఙ్కేలు 3:8-9), యెహెజ్కేలు అను ఈ పేరు ఈ గ్రంథములో రెండు చోట్ల తప్ప పాత నిబంధనలో మరెక్కడను చూడలేము.
గ్రంథకర్త : బూజీ కుమారుడైన యెహెజ్కేలు వివాహమైన వాడు. నెబుకద్నెజరు చివరిసారిగా యెరూషలేమును ముట్టడించినపుడు యూదులకు ఒక సాదృశ్యముగా ఆయన భార్య మరణించినది. (యెహెఙ్కేలు 24:16 -24) యిర్మీయా వలె ఒక యాజకుడుగా ఉన్న ఈయనను తన ప్రవచన సేవ చేయుటకు దేవుడు పిలిచాడు. దేవాళయము, యాజకత్వము, బలులు, దేవుని మహిమ అనునవి ఆయన ప్రవచనములలో గట్టిగా చెప్పబడుటను చూడగలము. దేవుని శక్తి, దేవుని ప్రణాళిక అనువాటిని బయలుపరచే అనేక దర్శనములు యెహెజ్కేలుకు కలిగినవి. పొందిన దర్శనములను ఉపయోగకరమైన రీతిలో వివరించి వ్రాయుటకు ఆయన ఇష్టపడ్డాడు.
ఈ గ్రంథములో అక్కడక్కడ నేను అను సర్వనామమును ఉపయోగించి ప్రవక్త తన వర్తమానములను తెలియజేశాడు. ఈ విధముగా చెప్పేవాడు యెహెజ్కేలే అని యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 24:24 అను వచనములు తేటపరచుచున్నవి. కనుక ఈ గ్రంథకర్త యెహెజ్కేలు అనుటలో సందేహము లేదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా నేను యెహోవానని తెలిసికొనెదరు అను పదజాలము పదేపదే వచ్చుచున్నది. ప్రారంభము నుండి చివరి వరకైన ఒకే వ్రాతశైలి ఈ గ్రంథమంతటిని యెహెజ్కేలే వ్రాశాడు అని సాక్ష్యమిచ్చుచున్నవి.
ఉద్దేశము : ఇశ్రాయేలులోను, అన్యదేశములలోను రాబోవు దేవుని శిక్షను గూర్చి చెప్పుట, దేవుని ప్రజల చివరి రక్షణను ముందుగానే తెలియజేయుట.
గ్రంథకర్త : యెహెజ్కేలు, లేవి గోత్రకుడును, యాజకుడునైన బూజీ కుమారుడు.
ఎవరికి వ్రాశాడు : బబులోను చెరలో ఉన్న యూదులకు, సమస్త దేశములలో ఉన్న దేవుని ప్రజలకు.
కాలము : సుమారు క్రీ.పూ. 571
గత చరిత్ర : యూదాను యెహోయాకీను రాజు పరిపాలించుచున్న క్రీ.పూ. 597 లో బబులోను రాజు యూదాను హస్తగతం చేసుకుని జనులను బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధముగా చెరగొన్నబడినవారిలో ఒకడు ఈ యెహెజ్కేలు. బబులోను చెరనివాసుల మధ్య తన ప్రవచన సేవను చేసినవాడు యెహెజ్కేలు. యిర్మీయా కంటే వయస్సులో చిన్నవాడైన యెహెజ్కేలు బబులోనులోను, యిర్మీయా యూదాలోను ఒకే సమయములో ప్రవక్తలుగా జీవించారు.
ముఖ్యమైన వచనములు : Eze,36,24,26
ముఖ్యమైన వ్యక్తులు : యెహెజ్కేలు, ఇశ్రాయేలు నాయకులు, యెహెజ్కేలు భార్య, నెబుకద్నెజరు,
ముఖ్యమైన స్థలములు : యెరూషలేము, బబులోను, ఐగుప్తు
ముఖ్యమైన పదజాలము : భవిష్యత్ కాల మహిమ. బబులోను చెరలో జీవించుచున్న దేవుని ప్రజలకు వారికి సంభవించిన కీడునకు కారణము వారి పాపములే కారణమని యెహెజ్కేలు జ్ఞాపకము చేయుచున్నాడు.
దానితో రాబోవు కాలములో మహిమ కరమైన విడుదల వారికి ఉందని బోధించుచున్నాడు. దేవాలయమును విడిచి తొలగిన దేవుని మహిమ మరల దానిని నింపునట్లుగా చిత్రించిన భాగములను చూడుము. (యెహెఙ్కేలు 43:27; యెహెఙ్కేలు 44:4).
ముఖ్య మైన వచనములు : యెహెఙ్కేలు 36:24-26; యెహెఙ్కేలు 36:33-35.
ముఖ్యమైన అధ్యాయము : యెహెజ్కేలు 37. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల నమ్మకమును రమ్యముగా బయలుపరచే ఒక భాగముగా చెదరిన ఎముకల ప్రవచనము ఉన్నది. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాలము ఎంత మహిమకరముగా ఉంటుందో అనునది ఈ భాగము తేటపరచుచున్నది.
గ్రంథ విభజన : నాలుగు భాగములుగా ఈ ప్రవచన గ్రంథమును విభజింపవచ్చును.
(1). యెహెజ్కేలుకు కలిగిన దేవుని దర్శనము, దేవుని నడిపింపు. అధ్యా 1 -3 వరకు, (2). యూదాపైకి రాబోవు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 4 - 24 వరకు, (3). చుట్టు ఉన్న అన్యజనులకు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 25 - 32 వరకు, (4). ఇశ్రాయేలీయుల విమోచన, దేవాలయము యొక్క పునర్వీకరణ ఆధ్యా 33 - 48 వరకు.
వాగ్దాన దేశమైన కనానులో నుండి పెరికి వేయబడిన పిమ్మట స్వంతముగా ఒక దేశమో, రాజు లేకుండా, స్వాతంత్ర్యమైన ఒక జీవితమునకు, కార్యమునకు, ఆరాధనకు అవకాశము లేకుండా పాడైన గుంటలో పడిపోయిన చెరనివాసులకు దేవుని వర్తమానములను తెలియజేయులాగున యెహెజ్కేలు ఏర్పరచబడ్డాడు. మొదటి అధ్యాయములో ఆయన చూచినట్లుగా ఉన్న దేవుని దర్శనము పాతనిబంధనలో మోషేకు, యెషయాకును, కొత్త నిబంధనలో యోహానుకును కలిగిన దర్శనములకు సమానమైనది. యెషయా, యిర్మీయా వలె ఒకే సారి దేవుని న్యాయ తీర్పు శిక్షను గూర్చి మరియు మహిమాయుక్తమైన భవిష్యత్ కాలమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని మహిమ యెరూషలేము దేవాలయమును విడిచి వెళ్లుచున్నట్లుగా ఆయన పొందిన దర్శనము పదవ అధ్యాయములో వివరించబడియున్నది.
పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుట ద్వారా క్రైస్తవ సమాజమునకును, వ్యక్తులకును నేడు సంభవించిన స్థితి ఇదే. కోల్పోయిన మహిమను తిరిగి పొందుటకు ఒకే మార్గము పాపములను విడిచి దేవుని వైపుకు తిరుగుట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. (యెహెఙ్కేలు 18:31-32), ఇటువంటి సజీవమైన మానవహృదయములో నుండి సమాజములో నుండి దేవుని జీవజలనదులు బయలుదేరి చుట్టు సశ్యశ్యామలముగా చేయుటను గూర్చి 47వ అధ్యాయములో వివరించుచున్నాడు.
కొన్ని సంఖ్యా వివరములు : దేవుని గ్రంథములో 26వ గ్రంథము; అధ్యాయములు 48; వచనములు 1273; చరిత్రాత్మిక వచనములు 310; నెరవేరిన ప్రవచనములు 530; నెరవేరని ప్రవచనములు 433; హెచ్చరికలు 953; నెరవేరిన హెచ్చరికలు 659; నెరవేరని హెచ్చరికలు 294; ఆజ్ఞలు 345; వాగ్దానములు 25; ప్రశ్నలు 80; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 179.