ఆమోసు


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా స్థానమును కపటాచారములు ఆక్రమించుట ప్రారంభమాయెను. భద్రత విషయముతో గట్టి నమ్మకము, దేవుని శిక్షను అలక్ష్యము చేయు పరిస్థితి హెచ్చగుచుండెను. దేశములో కరువు కాటకములు పెరిగినను అపాయకరమైన వ్యాధులు వ్యాప్తిజెందినను, యుద్ధము నాశనము పైబడినను, ఇవి ఏవియు ప్రజలలో పశ్చాత్తాపమును పుట్టించలేదు. మారుమనస్సు పొందుటకు ప్రజలు సిద్ధముగా లేరు. ఆమోసు పశువుల కాపరియైన ఒక గ్రామీణ యువకుడు. ఈయన దేవుని పిలుపుకు లోబడి దేశము మీదికి దేవుని తీర్పు త్వరగా రాబోవుచున్నదని హెచ్చరించి, మారుమనస్సు పొందవలెనని దేశ ప్రజలుకు పిలుపు నిచ్చెను. వేషధారణతో కూడియున్న వారి భక్తియు, నిర్లక్ష్యముతో కూడిన వారి మతాచారములును వారిని గంపలో కుళ్లిపోవుచున్న పండ్లవలే మార్చెను. క్రమశిక్షణా రాహిత్యము వృద్ధియయ్యెను. వారిలో హింసా ప్రవృత్తి పెరిగినందున దేవుని నీతి న్యాయములు ప్రజలను వీడిపోయెను.

     ఆమోసు అను హెబ్రీపదమునకు భారము భరించుట అని అర్థము. ఆమోసు తన పేరుకు తగినట్లుగా కలహకారులైన ఇశ్రాయేలీయుల పాప భారమును భరిస్తూ, వారికి దేవుని సందేశమును అందించెను. దేవుడు తనకు అప్పగించిన పనిని ఆమోసు నెరవేర్చి, తన సేవను సంపూర్తి గావించుకొనెను.

గ్రంథకర్త : ఆమోసు

ఆమోసు కాలము : యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజైన యోవాసు కుమారుడైన యరొబాము దిసములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములకు ముందు, ఆమోసు ప్రవచనము చెప్పుట ప్రారంభమాయెను (ఆమోసు 1:1). ఉజ్జియా యూదాను యేలిన కాలము క్రీ.పూ 792 నుండి 749 వరకు. రెండవ యరొబాము ఇశ్రాయేలును పాలించిన కాలము క్రీ.పూ 793 నుండి 753 వరకు పరిపాలన చేసెను. ఉజ్జియా కాలములో సంభవించిన ఈ భూకంపమును గూర్చి సుమారు 200 సంవత్సరములకు ముందే జెకర్యా ప్రవక్త ప్రవచించియుండెను. జెకర్యా 14:5). ఆమోసు 7:11 లో ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రవచించెను. ఇది క్రీ.పూ 722లో నెరవేరెను. ఆ సంవత్సరములో అష్హూరు రాజు ఇశ్రాయేలీయులను అష్హూరు దేశములోనికి చెరకొని పోయెను. ఆమోసు ఈ ప్రవచనము చెప్పియున్నప్పుడు యరొబాము చనిపోలేదు అనునది స్పష్టము. ఆమోసు దక్షిణ రాజ్యమైన యూదాలో జన్మించినప్పటికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములోని బేతేలులో తన ప్రవచన కార్యమును క్రీ.పూ 760 నుండి 750 వరకు జరిగెను.

     ఓబద్యా, యోవేలు, యోనా మున్నగు ప్రవక్తల తరువాతను, హోషేయ, మీకా, యెషయా మున్నగు ప్రవక్తల కంటే కొంచెము ముందుగాను ఆమోసు ప్రవచించెను. ఆ కాలములో ఉజ్జీయా యూదా దేశమును చక్కగా పరిపాలించెను. ఆయన అమ్మోనీయులను, ఫిలిప్తీయులను, ఎదోమీయులను జయించెను. ఉత్తర దేశమును బలవంతుడైన రెండవ యరొబాము పాలించుచుండెను. దేశము ధనవృద్ధిని, సైనిక బలమును, అభివృద్ధిని కలిగియుండెను. లోకాశ, భక్తిహీనత, అవినీతి ప్రజల జీవితములో అధికమాయెను. (ఆమోసు 2:6-8; ఆమోసు 3:10; ఆమోసు 4:1; ఆమోసు 5:10-12; ఆమోసు 8:4-6) చెప్పబడలేదు. ఈ కాలములో అష్హూరియా, బబులోను, సిరియ, ఐగుప్తుయను రాజ్యములు ఇశ్రాయేలుతో పోల్చినపుడు బలహీనముగాయున్నవని చెప్పవచ్చును. ఈ స్థితిలో ఆమోసు పలికిన అపాయమేదనగా అష్హూరియా చెరవాసము జరుగ అవకాశము లేదని ప్రజలకు తోచినది. అయినప్పటికి 30 సంవత్సరములు జరిగిన తరువాత ప్రవచన నెరవేర్పుగా ఇశ్రాయేలీయుల పతనము జరిగినది.

గ్రంథ విభజన : ఆమోసు యూదయలో తాను జన్మించిన గ్రామమును విడిచి, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లెను. తాను ఎన్నడును ఎదురుచూడని ఊహించని ఒక వర్తమానమును ఇశ్రాయేలీయులకు ప్రకటింవవలెనని దేవుడు ఆయనను పిలిచెను. సుఖ భోగములలో జీవిస్తున్న ఇశ్రాయేలీయులకు న్యాయ తీర్పును గూర్చిన ఆమోసు ప్రవచనములు తమ జీవిత కాలములోనే సంభవించుటకు ఆస్కారము లేదని తలంచిరి. ప్రవక్త అందించిన ఆ వర్తమానము అంగీకరించుటకు అయోగ్యముగానున్నట్లు వారు తలంచిరి.

ముఖ్య పదజాలము : ఇశ్రాయేలీయుల మీదనున్న న్యాయతీర్పు

ముఖ్యవచనములు : ఆమోసు 3:1-2; ఆమోసు 4:11-12

ముఖ్య ఆధ్యాయము : అధ్యాయము 9, ఆమోసు మిక్కిలి ఖచ్చితముగా భయంకర న్యాయ తీర్పును గూర్చి ఇచ్చు వర్తమానములకు మధ్యలో పరిశుద్ధ గ్రంథములోని ఇతర భాగముల కంటే, మిక్కిలి విశదముగా ఇశ్రాయేలీయుల రక్షణను గూర్చి ఈ అధ్యాయములో చెప్పుట చూడగలము. అబ్రహాముతోను దావీదుతో కూడ దేవుడు ఇశ్రాయేలీయులలో చేసిన నిబంధన “మెస్సియా” రాకడలో నెరవేరుటను గూర్చి, ఐదు వచనములలో మాత్రమే ప్రవక్త స్పష్టముగా వివరిస్తున్నాడు.

     గ్రంథమును ఐదు భాగములుగా విభజింపవచ్చును.

ఆమోసు 1:1-2 వచనములలో ముందున్నవి మినహాయించి నాలుగు ముఖ్య భాగములు ఈ గ్రంథములో కనిపించుచున్నవి. గ్రంథములోని ముఖ్య భాగములు క్రింద ఇవ్వబడినవి.

  1. ఉపోద్ఘాతము : ఆమోసు 1:1- 2. 2. ఎనిమిది న్యాయ తీర్పులు : (దయస్కు, గాజా తూరు, ఎదోము, అమ్మోనీయులు, మోయాబు యూదా, ఇశ్రాయేలులపై) న్యాయ తీర్పు ఆమోసు 1:3; ఆమోసు 2:16. 3. న్యాయ తీర్పును గూర్చిన మూడు ప్రసంగములు : Amos,3,1-6,14. 4. న్యాయ తీర్పును గూర్చిన ఐదు దర్శనములు : Amos,7,1-9,10 (మిడుతలు, అగ్ని, మట్టపుగుండు , వేసవి కాలపు పండ్ల గంప, పైకమ్ములు). 5. విమోచనను గూర్చిన ఐదు వచనములు ఆమోసు 9:11-15.

సంఖ్యా వివరములు : దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇది 30వ పుస్తకము; అద్యాయములు 9 ; వచనములు 146; ఆజ్ఞలు 28; ప్రశ్నలు 31; వాగ్దానములు 2; హెచ్చరికలు 117, ప్రవచనములు 121; నెరవేరని ప్రవచనములు 8; నెరవేరిన ప్రవచనములు 113; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 35.