యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజని మార్పులేని ఒకే ఉద్దేశములోనికి చదవరుల దృష్టిని నడిపించుచున్నవి. ఈ రాజు మరణము చెందుట వలన మొదట తన దృష్టికి ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుత్థానము చెందుట ద్వారా విజయకరముగా మారెనని భావించెను. యూదుల రాజు జీవించుచుండెను అను సందేశము పదే, పదే ప్రతిధ్వనించుచుండెను.
మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవీ అనే మరొక పేరు కూడా కలదు. (మార్కు 2:14; లూకా 5:27)
ఉద్దేశము : నిత్యుడైన రాజు, మెస్సీయ అని యేసును నిరూపించుట.
గ్రంథకర్త : మత్తయి (లేవీ)
కాలము : క్రీ.శ 60 - 65కు మధ్యలో
గత చరిత్ర : రోమా గౌరవ్నమెంటు కోసం సుంకమును వసూలు చేయు ఒక ఉద్యోగస్తుడైన మత్తయి. ఇతడు యేసు ప్రభువు యొక్క శిష్యుడుగా మారెను. ప్రవచనముల నెరవేర్పుకు దృఢత చేకూర్చుట ద్వారా యీ సువార్తను పాత, క్రొత్త నిబంధనలను కలిపె గొలుసువలె నుండెను.
ముఖ్య వచనములు : ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయు వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు మత్తయి 5:17
ప్రముఖ వ్యక్తులు : యేసు, మరియ, యోసేపు, బాప్తీస్మమిచ్చు యోహాను, యూద మత గురువులు పెద్దలు, కయప, ఫిలాతు, మగ్దలేనే మరియ, యేసు శిష్యులు.
ముఖ్య స్థలములు : బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, గలలియ, యూదయ.
గ్రంథ విశిష్టత : ఈ సువార్త ఒక మెస్సీయ శైలిలో రచింపబడెను. (ఉదాహరణకు దావీదు సంతతివాడు అని పలుమారు ఉపయోగించెను. పాత నిబంధన వాక్యములు యాభైమూడు, స్పష్టముగా లేని డెభైరు హెచ్చరికలు ఇందులో కలవు, సంభవములు కాలక్రమమును అనుసరించి ఇవ్వబడలేదు. యేసును మెస్సీయగాను రాజుగా నిరూపించుటయే ముఖ్య ఉద్దేశం.
ముఖ్య పద సముదాయము : యేసు అను రాజు.
ముఖ్య వచనములు : మత్తయి 16:16-19; 28,19-20}
ముఖ్య అధ్యాయము : 12
పండ్రెండ అధ్యాయములో పరిసయ్యులు యేసును ఇశ్రాయేలు జనులకు నాయకత్వం వహించు స్థానము నుండి బహిరంగముగా ఆయనను తృణీకరించెను. యేసు ప్రభువు యొక్క శక్తి దేవునిని నుండి కాక సాతాను నుండి వచ్చుచున్నదని వారు చెప్పుటతో మత్తయి సువార్త ఒక మలుపు తిరుగుచున్నది. సాధారణ ప్రజలకు యేసు ప్రభువు బోధించునపుడు ఉపమానములతో బోధించుచు ఆయన శ్రద్ధ ముఖ్యంగా తన శిష్యులకు తర్ఫీదునిచ్చునట్లు త్రిపచుండెను. ఈ సందర్భములోనే తన సిలువ మరణము సమీపించుచున్నదని పలుమార్లు చెప్పుచుండెను.
గ్రంథ విభజన : మత్తయి సువార్తను క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథముగా చేర్చుటతో కొన్ని కారణములు లేకపోలేదు. 1వ అధ్యాయము, 1వ వాక్యము గమనించినచో అబ్రాహాము కుమారుడగు దావీదు. కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈ ప్రారంభములోని సత్యమును పలుమారు మారులు చెప్పుట ద్వారా ఈ సువార్త పాత, క్రొత్త నంబంధనలను కలిపే వంతెన వలె ఉండెను. యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్య మైన ఐదు ప్రసంగము యీ సువార్తలో నుండెను. కొండ మీద ప్రసంగము (Mat,5,3-7,27) శిష్యులకు కావలసిన బోధ (మత్తయి 10:5-42) పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానములు (మత్తయి 13:3-52) శిష్యత్వమునకు కావలసిన విధులు (మత్తయి 9:3-38) ఒలీవ కొండ పై ప్రసంగం (Mat,24,3-25,46) మొదలగునవన్ని యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా చూపుచున్న ఈ సువార్త గ్రంథ విభజన ఈ క్రింది విధముగా నున్నది.
- రాజు వంశావళి, రాకడ Mat,1,1-4,11. • రాజు కట్టడలు Mat,4,12-7,29. రాజు అధికారము Mat,8,1-11,1. • రాజు తృణీకరింపబడుట Mat,11,2-16,12. • రాజు రాయబారుల సిద్ధపాటు Mat,16,13-20,28. • రాజుగా నగర ప్రవేశము, నిరాకరింపబడుట Mat,20,29-27,66. • రాజు అధికార నిరూపణ మత్తయి 28:1-20.
సంఖ్యా వివరములు : - పరిశుద్ధ గ్రంథములో ఇది 40వ పుస్తకము; అధ్యాయములు 28; వచనములు 1071; ప్రశ్నలు 177; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 25; క్రొత్త నిబంధన ప్రవచన వాక్యములు 47; చరిత్రాత్మక వచనములు 815; ప్రవచన వాక్యములు 256; నెరవేరిన ప్రవచనములు 164; నెరవేరని ప్రవచనములు 92.