యోహాను వ్రాసిన మొదటి పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

దేవుడు వెలుగైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుడు జీవమైయున్నాడు. వెలుగును ప్రేమయు జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసము యోహాను అనుభవించి యుండెను. అందుచేతనే యోహాను యీ పత్రికను వ్రాయుచున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును” యోహాను తన సువార్త పుస్తకమును వ్రాసెను. (1 యోహాను 20:31) అయితే మొదట పత్రిక వ్రాసిన ఉద్దేశము ఏమిటను దానిని 1 యోహాను 5:13 లో చూపుచున్నాడు. “మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనునట్లు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు తెలిసికొనునట్లు నేను యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను" అనునదే అది. విశ్వసించుడి అను పదమునకు యీ పత్రికయందు ముఖ్యత్వమివ్వబడియున్నది. ఈ చిన్న పత్రికయందు 30 కంటే ఎక్కువసార్లు “తెలిసికొనుడి " అను పదము మరల మరల వచ్చుచున్నది. ఒక్కొక్కమారు ఆపదము దేని కొరకు వచ్చుచున్నదని పరిశోధించి నేర్చుకొనుట ప్రయోజనకరమైన విద్యగా నుండును.

     దేవుడు వెలుగైయున్నాడు. కనుక ఆ దేవునితో ఐక్యముగల వారము కావలెనన్నచో మనము చీకటియందు నడువక వెలుగులో నడచువారముగనుండవలెను. అట్లు వెలుగులో నడచినచో మనలను మనమే తీర్పు తీర్చుకొని మన పాపములను ఒప్పుకొందుము. ఆ విధముగా యేసుక్రీస్తు యొక్క రక్తము సకలపాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు క్రీస్తు తండ్రి యెదుట మన కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా క్రియ జరిగించును. ఈ విధముగా ఐక్యమందు నడచుట యొక్క ఫలమే ప్రేమ. దేవుడు ప్రేమలేని వాడని ఎవడైన తలంచినట్లయితే వాడు దేవునిని ఎరిగి యుండలేదు. ప్రేమ అనునది వట్టి మాట కాదు; అది క్రియ. ప్రేమ పొందవలసినది కాదు. ఇచ్చునది. ఎట్టి నిబంధనయు లేని ప్రేమయే దేవుని ప్రేమ. సత్య దేవుడును నిత్య జీవము గల క్రీస్తుతో గల సహవాసమందు జీవించు ఒకనికి ఆయన యొక్క జీవము గల అనగా స్వభావము యొక్క శ్రేష్ఠత వుండి తీరవలెను. యోహాను యొక్క పేరు యీ పత్రికలలో ఎచ్చటను కనిపించనప్పటికిని యోహాను వ్రాసిన మొదటి పత్రికలని శీర్షిక దీనికివ్వబడెను.

ఉద్దేశము:- క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచుట: అబద్ధ బోధనలను ఖండించుట.

గ్రంథ కర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- ఏదైనను ఒక గుర్తించబడిన సంమమునకు వ్రాసినది కాదు. అన్యజనుల సంఘముల కొరకైన ఒక కాపరి పత్రికగా యిది వ్రాయబడెను. సర్వమునందుగల విశ్వాసులకందరికిని వ్రాయబడినది.

వ్రాయబడిన కాలము:- క్రీ.శ.90లో ఎఫెసునందుండి వ్రాయబడెను.

ఆంతర్యము:- పత్రికను వ్రాయునపుడు యోహాను వృద్ధుడును ఆనాడు జీవముతో నున్న ఒకే అపొస్తలుడగును. అప్పుడతడు పత్మాసు దీవికి కొనిపోబడలేదు. క్రీస్తును నేరుగ చూచినవాడను రీతిలో ఆనాటి నూతన తరము వారైన విశ్వాసులకు దేవుని పై గల స్థిరమైన విశ్వాసమును, ధైర్యమును భాగించుటకు మిక్కిలి అధికారముతో వ్రాయబడిన పత్రిక.

ముఖ్య పదజాలము:- దేవునితో గల సహవాసము.

ముఖ్య వచనములు:- 1 యోహాను 1:3-4; 1 యోహాను 5:11-13.

ముఖ్య అధ్యాయము:- 1యోహా:1. యోహాను 15, 1 యోహాను 1 మొదలగునవి దేవునితో గల సహవాసమును ముఖ్య పరచు ఒక ముఖ్యమైన లేఖన భాగములగును. యోహాను 15 క్రీస్తునందు జీవించవలసిన ముఖ్యత్వమును గూర్చి వివరించుచున్నది. దాని మరియొక్క భాగమును 1యోహాను 1లో చూడగలము. క్రీస్తుతో గల సహవాసమునకు నాశనము వచ్చునప్పుడు మనము దేవుని చెంత నుండి పాప క్షమాపణను, పరిశుద్ధతను పొందుకొని తిరిగి ఆ సహవాసమునకు మరలి రావలెనని యీ అధ్యాయము బోధించుచున్నది.

గ్రంథ విభజన:- అబద్ధ బోధనల తుఫాను వంటి ప్రచారము అపొస్తలుల ఉపదేశమును సవాలునకు పిలుచు పరిస్థితిలో దానిని ఎదిరించి పరిశుద్ద క్రైస్తవ జీవితమును స్థిరపరచుకొనుటకై విశ్వాసులను ప్రోత్సహించుట కొరకు యీ పత్రిక వ్రాయబడెను. 2 పేతురు, యూదా వంటి పత్రికలవలె ఎదిరించుటయును, నెలకొల్పుటయునైన రెండు వైపులు యీ పత్రికకు గలవు. ఒక వైపు అబద్ద బోధనలను విసర్జించగా మరియొక వైపు సత్యము యొక్క జ్ఞానము ప్రకారము జీవించుటకు చదువరులకు సలహానిచ్చు చున్నది. దేవునితో గల సహవాసమే యీ పత్రిక యొక్క మూలభావము. రెండు ముఖ్య భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.

(1) దేవుని సహవాసము యొక్క మూలము. – 1Joh,1,1-2,27.

(2) సహవాసము యొక్క అనుచరణ విధానము - 1Joh,2,28-5,21.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 62వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 5; చారిత్రక వచనములు 100; నెరవేర్చబడని ప్రవచనములు 5.