యోహాను వ్రాసిన మూడవ పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యోహాను తనకు అతి ప్రియమైన గాయుకు ఈ పత్రికను వ్రాసెను. 1 కోరింథీయులకు 1:14; రోమీయులకు 16:23 మొదలగు వచనములలో గాయు అని గుర్తింపబడియున్నాడు. ఇతడు ముందు కాలములో అపొస్తలుడైన యోహానుకు వ్రాయుటకు సహాయపడు సహాయకుడుగా మారినట్లుగా ఒక శాస్త్రము తెలుపుచున్నది. నాల్గవ వచనములో గాయు యోహాను యొక్క ప్రియమైన పిల్లలలో ఒకడుగా అనగా అతని ద్వారా విశ్వాసములోనికి నడిపింపబడిన ఒకడుగా చిత్రించబడుచున్నాడు. ఇతడు ఎవరైనప్పటికిని, మిక్కిలి నమ్మకమైన ఒక క్రైస్తవ సేవకుడుగా ఉండి యుండవలెను. అపొస్తలుడు నాలుగుసార్లు ప్రియమైనవాడు అని పిలుచుచున్నాడు.

     యోహాను మొదటి పత్రికలో అపొస్తలులు దేవునితో కలిగియున్న ఐక్యతను గూర్చి చెప్పుచున్నాడు. రెండవ పత్రికలో అబద్ధ బోధకులతో కూడిన ఐక్యతను గూర్చి వివరించుచున్నాడు. మూడవపత్రికలోనైతే క్రైస్తవ సహోదరులతో కూడిన ఐక్యతకు ఊతనిచ్చుచున్నాడు.

     సత్యములో నడచుట యనునదే దీనియొక్క ప్రధాన సందేశమని చెప్పవచ్చును. గాయు సువార్త సేవకులను ఆహ్వానించి పరిచర్య చేసి వారికి ఉపకారములను చేసెను. అతనికి కలిగినదంతయు సువార్త సేవ కొరకే సమర్పించిన అతడు సత్యములో నడచుట అనునది ఒక శ్రేష్టమైన మాదిరియే. దీనికి మారుగా అపొస్తలులు వ్రాసిన పత్రికను నిరాకరించి అతనిపై నేరము మోపి సువార్త సేవకులను అవమానపరచి వారిని చేర్చుకొన్న వారిని సంఘము నుండి వెలుపలికి త్రోసిన దిమిత్రఫే దీనికి వ్యతిరేకమైన సాక్ష్యముగానున్నాడు. అందరి యెడలను మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు కూడ దియొత్రఫే చేత వెలివేయబడిన ఒకడుగానున్నాడు.

ఉద్దేశము:- తన యొక్క ఆతిథ్యము కొరకుగాయును పొగడుట, క్రైస్తవ జీవితములో అతనిని ప్రోద్బలపరచుట.

గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- యోహానుకు సన్నిహితుడైన ఒక సంఘములో మనతవహిచిన గాయునకు.

వ్రాసిన కాలము:- క్రీ.శ.90 ఎఫెసులో నుండి

ఆంతర్యము:- క్రొత్త సంఘములను స్థాపించుట కొరకై బోధకులు పట్టణముయందు సంచరించిరి. వారు సహవిశ్వాసుల యొక్క అతిథులుగా ఒక్కొక్కచోటను నివసించిరి. ఇటువంటి ప్రయాణము చేయు బోధకులను ఇంట చేర్చుకొను వారిలో ఒకడుగా కీర్తి చెందినవాడు గాయు.

ముఖ్య పదజాలము:- సహోదర ప్రేమ.

ముఖ్య వచనములు:- వచనము 11.

గ్రంథ విభజన:- పరిశుద్ధ గ్రంథములో నున్న అతి చిన్న పుస్తకము. అయితే అది మిక్కిలి ప్రత్యేకమైనదియు తేటయైన స్వభావము గలది. అపొస్తలులు పంపిన సువార్తికులు ఒకరికొకరు విరోధముగా నున్న స్థితిలో అట్లు జరిగి తన ఇద్దరు సహోదరులను మధ్యస్తము చేసినట్లు పత్రిక వ్రాయబడియున్నది. యదార్థమైన గాయు విశాల హృదయముతో ఆతిథ్యమును, మంచి గుణముతో నడచుకొనునపుడు యదార్థత లేని దియెత్రిఫే గర్వముతోను, ఎదిరించుటను నడుచుకొన్నట్లు చూచుచున్నాము.

కనుకనే పత్రికలోని రెండు ముఖ్య భాగములు ఇవియైయున్నవి.

  1. గాయును గూర్చిన పొగడ్త. 3 యోహాను 1:1-8.
  2. దియెత్రిఫేను గూర్చిన కొరతలు. 3 యోహాను 1:9-14.

కొన్ని ముఖ్య గుర్తింపులు: - పరిశుద్ధ గ్రంథములోని 64వ పుస్తకము. వచనములు 15. ప్రశ్నలు లేవు. ప్రవచనములు లేవు.