ఈ మహనీయమైన కీర్తన దేవుని వాక్కును పొగడుతూ రాసినది. దాదాపు ప్రతి వచనంలోనూ రచయిత దేవుడు తెలియజేసిన సత్యాలను సూచించే పదం ఏదో ఒకటి ఉపయోగించాడు – ఉపదేశం, వాక్కు, చట్టాలు, ఆజ్ఞలు మొదలైన పదాలు. హీబ్రూ అక్షరమాలలోని 22 అక్షరాలతో ఈ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. ఒక భాగంలోని ప్రతి వచనం ఆ భాగాన్ని సూచిస్తున్న అక్షరంతోనే ఆరంభం అయ్యేది. ఈ విధంగా ఈ కీర్తన 22 ముత్యాల హారాన్ని పోలివుంది. ఇది విశ్వాసులకు దేవుని వాక్కు విషయం స్తుతి, ప్రేమ, ఉపయోగం గురించిన అ,ఆ,ఇ,ఈ లు. ఈ కీర్తనలో రచయిత దేవుని వాక్కును తన జీవితంలో ఉపయోగించుకున్నట్టుగా మనం కూడా చేయడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మార్గం. ఈ సందర్భంలో యేసు క్రీస్తు సజీవమైన దేవుని వాక్కు అనీ, దేవుడు మనుషులకు చెప్పబూనుకున్నదాని శ్రీకారం, మంగళ వాక్యం, ఆదీ అంతమూ, అల్ఫా ఓమెగ ఆయనేననీ మనం గుర్తుంచుకోవాలి. యేసుప్రభువునూ దేవుని లిఖిత వాక్కునూ వేరు చేయడం సాధ్యం కాదు. ఆ వాక్కును మన జీవితాల్లో అనుసరిస్తూ ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభువునుంచి ప్రభావం, బలం, కృప మనకు సరఫరా అవుతున్నదన్నమాట. దేవుని వాక్కు పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు యేసుప్రభువు పట్ల కూడా మన ప్రేమ అధికం అవుతూ, మన బ్రతుకుల్లో కృపాపుష్పాలు వికసిస్తూ ఉంటాయి. కీర్తనల గ్రంథము 1:1-3 లో కీర్తనలు గ్రంథంలోని ముఖ్యాంశం ఉంది. అక్కడ టూకీగా వర్ణించబడిన ధన్యతకు దారి ఇక్కడ పూర్తిగా వెల్లడి అయింది. ఇక్కడ మొదటి వచనంలో (ఈ కీర్తన అంతటిలో) “ఉపదేశం” అని తర్జుమా చేసిన హీబ్రూ పదాన్ని ధర్మశాస్త్రం అని కూడా రాయవచ్చు. ఆ పదానికి ఈ రెండు అర్థాలున్నాయి. మనుషులకు దీవెనలు కలగడం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన తన వాక్కును మనకిచ్చాడు. వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల లేక విన్నందువల్ల లేక ప్రకటించడం, ఉపదేశించడంవల్ల ధన్యత కలగదు. దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది. పవిత్రతలో నుంచి ఆనందం కలుగుతుంది. విశ్వాసులు దేవుని వాక్కుకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటే, పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వతానందం వస్తుంది. ధన్యత, దీవెనల గురించి ఇతర నోట్స్ ఆదికాండము 12:3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; మత్తయి 5:3-12; లూకా 11:28; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:9 గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:3.