Revelation - ప్రకటన గ్రంథము 11 | View All

1. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
యెహెఙ్కేలు 40:3, యెహెఙ్కేలు 40:47, జెకర్యా 2:1-2

“ఆలయం”– పరలోకంలో ఉండేది కాదు (ప్రకటన గ్రంథం 7:15) గాని ఈ లోకంలో ఉండేది. అది ఉన్న స్థలం జెరుసలం (వ 8). అది దేవునికి అంకితమైన యూద ఆలయం గనుక అది దేవుని ఆలయం. దాని బయటి ఆవరణం మాత్రమే యూదులు కాని జనాల వశంలో ఉండడం అనేది లోపలి భాగంలో ఆరాధించేవారు యూదులని సూచిస్తుంది. ప్రస్తుతం జెరుసలంలో యూద దేవాలయం లేదు, యోహాను ఈ గ్రంథాన్ని రాసినప్పుడు దేవాలయం లేదు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దేవాలయం క్రీ.శ. 70లో నాశనానికి గురైంది (మత్తయి 24:2; లూకా 19:41-44). కాబట్టి యోహానుకు ఇవ్వబడిన ఈ సందేశం ఈ యుగాంతం కాక ముందు జెరుసలంలో కొత్త దేవాలయాన్ని కట్టడం జరుగుతుందని సూచిస్తున్నట్టు ఉంది. మత్తయి 24:15; 2 థెస్సలొనీకయులకు 2:4 కూడా చూడండి. “కొలతలు తీసుకొని”– ఇలా చేయడం దేన్ని సూచిస్తుందంటే ఒక స్థలాన్ని నాశనం కోసం గానీ సంరక్షణ కోసం గానీ ప్రత్యేకించడం. 2 రాజులు 21:13; యెషయా 34:11; విలాపవాక్యములు 2:8; జెకర్యా 2:1-5 పోల్చి చూడండి.

2. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
కీర్తనల గ్రంథము 79:1, యెషయా 63:18, దానియేలు 8:13, జెకర్యా 12:3

“నలభై రెండు నెలలు”– ప్రకటన గ్రంథం 13:5. ఇదే సమయాన్ని 1260 రోజులు (వ 3; ప్రకటన గ్రంథం 12:6), “కాలం, కాలాలు, సగం కాలం” (ప్రకటన గ్రంథం 12:14 – ఇది మూడున్నర సంవత్సరాలు అనిపిస్తుంది), “ఒక్క ఘడియ” (ప్రకటన గ్రంథం 17:12) అని చెప్పడం జరిగింది. ఈ సమయం స్వల్పమైనది, మితమైనది అని తేటగా కనిపిస్తున్నది. ఈ 42 నెలలు అక్షరాలా 42 నెలలు కాదని అనుకోవడానికి బైబిలంతట్లో ఏ కారణమూ ఈ రచయితకు కనబడడం లేదు. దానియేలు 7:25; దానియేలు 9:27; దానియేలు 12:7 కూడా చూడండి. “యూదులు కాని జనాలకు...నగరాన్ని కాళ్ళక్రింద త్రొక్కుతారు”– ఈ నోట్స్ రాసిన సమయంలో జెరుసలం యూదుల వశంలో ఉంది. కొన్ని ఏళ్లనుంచి అలా ఉంది. అయితే దీన్ని బట్టి చూస్తే ఈ యుగాంత కాలంలో ఇతర జనాలు జెరుసలంను వశపరచుకొంటారని అనుకోవాలి. జెకర్యా 14:2 పోల్చి చూడండి.

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

“ఇద్దరు సాక్షులు”– వీరు ఈ యుగాంత కాలంలో మహా బాధ కాలంలో క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పబోయే యూదుల గుంపుకు సూచనగా ఉన్నారని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు. “రెండు దీప స్తంభాలు” అనే మాటనుబట్టి ఈ ఇద్దరూ సాక్ష్యం చెప్పే సంఘాలకు సూచనగా ఉన్నారని కొందరి అభిప్రాయం (ప్రకటన గ్రంథం 1:20 పోల్చి చూడండి). మరి కొందరైతే వారు ఇద్దరు వ్యక్తులై ఉంటారని చెప్పారు. వ 5-12లో వారిని గురించి రాసిన మాటలను బట్టి చూస్తే బహుశా ఈ ఆఖరు అభిప్రాయం సరైనదని అనిపిస్తుంది. వారు మోషే, ఏలీయాలు అని కొందరు వ్యాఖ్యాన కర్తలు నేర్పారు (పర్వతంపై క్రీస్తుకు దివ్యమైన మార్పు కలిగినప్పుడు ఈ ఇద్దరు కలిసి వచ్చి కనిపించారు – మత్తయి 17:3). మోషే లోకానికి తిరిగి వచ్చి చనిపోతాడని బైబిలులో ఎక్కడా లేదు. ఏలీయాను గురించి (అతడు చనిపోలేదు – 2 రాజులు 2:11) మలాకీ 4:5; మత్తయి 17:11 చూడండి. ఏలీయా తప్ప మానవ చరిత్రలో చనిపోకుండా పరలోకానికి వెళ్ళినవాడు ఒక్కడే – హనోకు (హెబ్రీయులకు 11:5).

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
జెకర్యా 4:2-3, జెకర్యా 4:11, జెకర్యా 4:14

“రెండు ఆలీవ్ చెట్లూ”– జెకర్యా 4:3-14. “రెండు దీప స్తంభాలు”– ఆ ఏడు దీపస్తంభాలు ఆ ఏడు సంఘాలు. ఈ రెండు దీప స్తంభాలు ఇద్దరు వ్యక్తులను గానీ, సాక్ష్యం చెప్పే రెండు గుంపులను గానీ సూచించవచ్చు.

5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
2 సమూయేలు 22:9, 2 రాజులు 1:10, కీర్తనల గ్రంథము 97:3, యిర్మియా 5:14

“నోటినుంచి మంటలు వచ్చి”– ఈ మంటలు ఒక చిహ్నంగా ఉందని స్పష్టమే. అయితే అవి దేనికి చిహ్నం? 2 రాజులు 1:9-12 పోల్చి చూడండి. వారు మాట్లాడితే చాలు, వారి సంరక్షణ కోసం దేవుడు చర్య తీసుకొంటాడు. చెప్పేది వారు, మంటలు పంపేది దేవుడు. “శత్రువులను మ్రింగివేశాయి”– ఈ ఇద్దరు సాక్షులు ఈ యుగంలోని క్రీస్తు సంఘాలలో వేటికీ సూచనగా లేరని దీన్నిబట్టి కనిపిస్తున్నది. ఈ యుగం సంఘాల పని తమ శత్రువులను నాశనం చేయడం కాదు.

6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
నిర్గమకాండము 7:17, నిర్గమకాండము 7:19, 1 సమూయేలు 4:8, 1 రాజులు 17:1

“ఆకాశాన్ని మూసివేసే అధికారం”– 1 రాజులు 17:1; యాకోబు 5:17 పోల్చి చూడండి. “రక్తంగా...ఈతి బాధల”– నిర్గమకాండము 7:20; నిర్గమకాండము 8:5-6, నిర్గమకాండము 8:16; మొ।।. చరిత్రలో ఇలాంటివి అక్షరాలా జరిగాయి. రాబోయే కాలంలో ఇవి అక్షరాలా మళ్ళీ జరగవని అనుకోవడానికి బైబిలులో ఏ కారణమైనా ఉందా?

7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.
దానియేలు 7:3, దానియేలు 7:7, దానియేలు 7:21

“సాక్ష్యం పూర్తిగా”– దేవుడు వారి పనికోసం ప్రత్యేకమైన సమయాన్ని నియమిస్తాడు. ఆ పని పూర్తి అయ్యేవరకు వారిని కాపాడుతాడు. ఒకప్పుడు ఈ దేశంలో దేవుని సేవకుడొకడు ఇలా అన్నాడు: “నేను చేయాలని దేవుడు నియమించిన పని ఇంకా ఉంటే నేను ఇప్పుడు చనిపోలేను.” “క్రూరమృగం”– ప్రకటన గ్రంథం 13:1-8; ప్రకటన గ్రంథం 17:3, ప్రకటన గ్రంథం 17:7-11 చూడండి. 2 థెస్సలొనీకయులకు 2:3-4; 1 యోహాను 2:18 పోల్చి చూడండి. “అగాధం”– ప్రకటన గ్రంథం 9:1 నోట్. “అగాధంలో నుంచి పైకి వచ్చే” అనేది క్రూర మృగం చనిపోయినవారి లోకంనుంచి వస్తాడని సూచిస్తున్నది. ప్రకటన గ్రంథం 13:3; ప్రకటన గ్రంథం 17:8 కూడా చూడండి. “చంపుతుంది”– ప్రకటన గ్రంథం 13:7 పోల్చి చూడండి. క్రీస్తు విరోధికి చాలా శక్తి, బలప్రభావాలు ఉంటాయి. దేవుని ప్రజలలో చాలామందిని చంపేందుకు అతనికి అనుమతి ఇవ్వబడుతుంది. అయితే అప్పుడు కూడా ప్రపంచాన్ని దేవుడు తన వశంలో ఉంచుకొంటాడు. జరగబోయే దానంతట్లోనూ జ్ఞానం గల ఉద్దేశం ఆయనకు ఉంటుంది.

8. వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
యెషయా 1:10

ఆ “మహా నగరం” జెరుసలం అని ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తున్నది. యేసుప్రభువు సిలువ మరణం పొందినది జెరుసలంలోనే. అంతేగాక యెషయా 1:8-10 లో జెరుసలంను అలంకార భాషలో సొదొమ అనడం కనిపిస్తుంది. బైబిల్లో ఈజిప్ట్ అలంకార భాషలో ఆత్మ సంబంధమైన బానిసత్వాన్ని సూచిస్తుంది. జెరుసలం ఇలాంటి బానిసత్వానికి చిహ్నంగా ఉంది. గలతియులకు 4:25 చూడండి.

9. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.

అంత కొద్ది కాలంలో అంతమంది ప్రజలు వారి మృత దేహాల్ని చూడడం ఎలా? టెలివిజన్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటిది కష్టమేముంది? “మృత దేహాలు”, “సమాధి” అనే మాటలు ఈ ఇద్దరు సాక్షులు ఇద్దరు వ్యక్తులని సూచిస్తున్నట్టు ఉంది.

10. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.
యెహెఙ్కేలు 37:5-10

మానవకోటి స్వభావ సిద్ధంగా ఎలా ఉందో ఇందులో చూడండి. దేవుని ప్రవక్తల మరణమంటే వారికి శుభవార్తగా అనిపిస్తుంది. మనుషులు మొత్తంమీద దేవుని సత్యమంటే ఇష్టపడరు. దేవుని సత్యం వారిని బాధిస్తుంది. ఎందుకంటే వారికి దాని ప్రకారం నడవడానికి మనసు లేదు. ఇకనుంచి దాన్ని విననక్కర లేదంటే వారికి ఉపశమనమే కలుగుతుంది. యోహాను 3:19-20; రోమీయులకు 8:5-8; అపో. కార్యములు 7:54; అపో. కార్యములు 7:57 పోల్చి చూడండి.

11. అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
యెహెఙ్కేలు 37:5-10

ఈ వచనంలోని మాటలు పునరుత్థానాన్ని అంటే చనిపోయినవారు సజీవంగా లేవడం అనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్టు ఉంది. “హడలిపోయారు”– దయ్యాలకు అనుగుణమైన దుర్మార్గుల సంబరం దీర్ఘ కాలం ఉండదు (యోబు 20:5 చూడండి).

12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
2 రాజులు 2:11

ఇది కూడా అసలైన సంఘటనను, అంటే చనిపోయి తిరిగి బ్రతికినవారు పైకి వెళ్ళడం అనే సంగతిని తేటగా సూచిస్తున్నట్టు ఉంది. “మేఘం”– అపో. కార్యములు 1:9 పోల్చి చూడండి.

13. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
యెహోషువ 7:19, యెహెఙ్కేలు 38:19-20, దానియేలు 2:19

ఈ భూకంపం 7,000 మందిని మాత్రమే చంపుతుందనే విషయం, ఆ “నగరం” (వ 2,8) జెరుసలం అని ఒక సూచనగా ఉంది. ఆ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా ఉండబోయే విపత్తు కాదు గాని స్థానికమైనదే. దానివల్ల మంచి ఫలితం ఒకటి కలుగుతుంది (ప్రకటన గ్రంథం 16:9, ప్రకటన గ్రంథం 16:11 కూ దీనికీ ఉన్న తేడా చూడండి).

14. రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

“రెండో విపత్తు”– అంటే ఆరో బూర ఊదితే జరిగే సంఘటనలు. ప్రకటన గ్రంథం 8:13; ప్రకటన గ్రంథం 9:12 చూడండి. “మూడో...వస్తూ ఉంది”– కథలో ప్రకటన గ్రంథం 10:1 తో ఆరంభమైన అంతరాయం, ఆరో బూరకూ ఏడో బూరకూ నడుమ ఉన్న మాటలు అయిపొయ్యాయి. ఏడో బూర ఊదే సమయం వచ్చింది. ఈ ఏడో బూర ఊదడంలోనుంచి ఏడు కోప పాత్రలు వస్తాయి. అవే మూడో (ఆఖరు కూడా) విపత్తు.

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.
నిర్గమకాండము 15:18, కీర్తనల గ్రంథము 10:16, కీర్తనల గ్రంథము 22:28, దానియేలు 2:44, దానియేలు 7:14, ఓబద్యా 1:21, జెకర్యా 14:9

ఏడో బూర ఈ బూరల వరుసలో చివరిది, ఈ గ్రంథంలో చివరిది, ఆ మాటకొస్తే ఈ యుగంలో చివరిది. మత్తయి 24:30-31; 1 కోరింథీయులకు 15:51-52; 1 థెస్సలొనీకయులకు 4:16. ముందు అధ్యాయాల్లో వెల్లడి అయిన విషయాలనూ తరువాతి వచనాల్లో వెల్లడి అయిన విషయాలనూ బట్టి చూస్తే ఈ బూరను ఊదడం మహా బాధ కాలం తరువాత, క్రీస్తువిరోధి బయలుదేరిన తరువాత జరుగుతుంది. “పలికాయి”– ఈ మాటలు పలికేవారు క్రీస్తు రెండో రాకడ సమయంలో నిలుస్తూ ఏడో బూర కింద జరిగే ఇతర సంఘటనలను దాటిపోయి ఆఖరి సంఘటన గురించే మాట్లాడుతున్నట్టు ఉంది. లేదా, రాబోయే క్రీస్తు రాకడ గురించి భూతకాలం వాడుకొంటూ మాట్లాడుతున్నారు (యెషయా 53వ అధ్యాయాన్ని, యెషయా 55:10-11 నోట్ చూడండి). “భూలోక రాజ్యం”– దుర్మార్గులు (అదృష్ట దుష్టశక్తులు కూడా) ఈ లోకంపై చేస్తున్న పరిపాలన అన్నమాట. మత్తయి 4:8-9; యోహాను 14:30; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 2:2; ఎఫెసీయులకు 6:12; 1 యోహాను 5:19 చూడండి. “అభిషిక్తుని రాజ్యాలు అయ్యాయి”– ప్రకటన గ్రంథం 19:15-16; మత్తయి 6:10; మత్తయి 13:40-43; మత్తయి 19:28; మత్తయి 25:31; లూకా 1:32-33; అపో. కార్యములు 1:6-7; కీర్తనల గ్రంథము 2:1-12; యెషయా 11:1-9; దానియేలు 2:44-45 చూడండి. ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలలో ఒకటి ఇది. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద బహిరంగంగా స్థాపిస్తాడు. ఇతర పరిపాలనంతటినీ అధికారాన్నంతటినీ నాశనం చేసే విధానం, భూలోకాన్ని పరిపాలించడానికి క్రీస్తు రావడం ఈ గ్రంథంలో తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17. “శాశ్వతంగా”– యెషయా 9:7; దానియేలు 7:14, దానియేలు 7:27. క్రీస్తు పరిపాలన రెండు భాగాలుగా విభజించబడి ఉంటుందని కనబడుతున్నది. ప్రకటన గ్రంథం 20:4, ప్రకటన గ్రంథం 20:6; 1 కోరింథీయులకు 15:24-25 చూడండి. వెయ్యేళ్ళ పరిపాలన శాశ్వత పరిపాలనకు ఆరంభం మాత్రమే.

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి

“పెద్దలు”– ప్రకటన గ్రంథం 4:4

17. వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
నిర్గమకాండము 3:14, యెషయా 12:4, ఆమోసు 4:13

“పూర్వముండి ప్రస్తుతమున్నవాడా”– ప్రకటన గ్రంథం 1:4, ప్రకటన గ్రంథం 1:8; ప్రకటన గ్రంథం 4:8 కూ దీనికీ తేడా గమనించండి. ఏడో బూర తరువాత ఆయన ఇంకా భవిష్యత్తులో వచ్చేవాడు కాదు. ఎందుకంటే అప్పుడు వచ్చి ఉంటాడు. ఏడో బూర రోజులలో (ప్రకటన గ్రంథం 10:7) ప్రకటన గ్రంథం 19:11-16 లో ఉన్న సంఘటన ఇమిడి ఉంది. “కృతజ్ఞతలు”– అది గొప్ప కృతజ్ఞతలు అర్పించడానికి కారణం అవుతుంది – లోకంలో పాపం పరిపాలన తీరిపోతుంది. అప్పటినుంచి క్రీస్తు ఏలుతాడు. కృతజ్ఞతార్పణ గురించిన నోట్స్ లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

18. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
కీర్తనల గ్రంథము 2:1, కీర్తనల గ్రంథము 46:6, కీర్తనల గ్రంథము 99:1, కీర్తనల గ్రంథము 115:13, దానియేలు 9:6, దానియేలు 9:10, ఆమోసు 3:7, జెకర్యా 1:6

“కోపగించాయి”– జనాలమధ్య ఒక జాతికి విరోధంగా మరో జాతికి, దేవునికీ ఆయన ప్రజలకూ విరోధంగా సైతాను రేపే కోపం ఇది. ప్రకటన గ్రంథం 12:12 చూడండి. ఈ కోపం క్రీస్తువిరోధి పరిపాలన కాలంలో పూర్తిగా కనిపిస్తుంది – ప్రకటన గ్రంథం 6:4, ప్రకటన గ్రంథం 6:10; ప్రకటన గ్రంథం 13:7; ప్రకటన గ్రంథం 16:9, ప్రకటన గ్రంథం 16:11; ప్రకటన గ్రంథం 19:19. “నీ కోపం వచ్చింది”– ప్రకటన గ్రంథం 6:17; ప్రకటన గ్రంథం 14:19; ప్రకటన గ్రంథం 15:1, ప్రకటన గ్రంథం 15:7; ప్రకటన గ్రంథం 16:19; ప్రకటన గ్రంథం 19:15; కీర్తనల గ్రంథము 2:4-5. 16వ అధ్యాయంలోని కోప పాత్రలన్నీ ఈ ఏడో బూర సమయంలో ఉంటాయి. అవి కుమ్మరించబడినట్టే ఈ పెద్దలు మాట్లాడుతున్నారు. “చనిపోయినవారికి తీర్పు తీర్చే సమయం”– ఇక్కడ చనిపోయినవారు అనే పదానికి అర్థం ఏమిటో దానిగురించి మూడు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, వీరు పాప విముక్తి లేకుండా చనిపోయినవారు. రెండోది, పాపాలలో చచ్చినవారై (ఎఫెసీయులకు 2:1) లోకంలో ఇంకా జీవిస్తున్న అవిశ్వాసులు. మూడోది, క్రీస్తులో నమ్మకముంచి చనిపోయినవారు. మొదటి అభిప్రాయం అసంభవం. 20వ అధ్యాయాన్ని బట్టి చూస్తే క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన తరువాత పాపవిముక్తి లేకుండా చనిపోయినవారికి తీర్పు జరుగుతుందని అనుకోవాలి (ప్రకటన గ్రంథం 20:7-15). రెండో అభిప్రాయం అసాధ్యం కాకపోయినా ఈ సందర్భంలో అసంభవం. మూడో అభిప్రాయం సరైనదని అనిపిస్తుంది. “భయభక్తులున్న”– హెబ్రీయులకు 12:28; 2 కోరింథీయులకు 7:1; ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7. “బహుమతులు ఇచ్చే సమయము”– యేసుప్రభువు తాను లోకానికి తిరిగి వచ్చిన తరువాత తన సేవకులకు బహుమతులిస్తాడు, గాని అంతకు ముందు కాదు. – ప్రకటన గ్రంథం 22:12; మత్తయి 16:27; మత్తయి 25:19-21; లూకా 19:15-17. “భూమిని నాశనం చేసేవారిని”– పాపులకు ఒక కొత్త పేరు. దేవుడు మంచిదిగా చేసినదాన్ని వారు నాశనం చేస్తారు.

19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
నిర్గమకాండము 9:24, నిర్గమకాండము 19:16, 1 రాజులు 8:1, 1 రాజులు 8:6, 2 దినవృత్తాంతములు 5:7, యెహెఙ్కేలు 1:13

“ఆలయం”– ప్రకటన గ్రంథం 7:15; ప్రకటన గ్రంథం 16:1. “ఒడంబడిక పెట్టె”– నిర్గమకాండము 25:10-22; హెబ్రీయులకు 9:4. ఈ లోకంలోని ఒడంబడిక మందసం పరలోకంలోని నిజ మందసానికి సూచన (హెబ్రీయులకు 8:1-2, హెబ్రీయులకు 8:5). ఒడంబడిక పెట్టె దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇస్రాయేల్ జాతితో చేసిన ఒడంబడికను సూచించేది (నిర్గమకాండము 25:15; ద్వితీయోపదేశకాండము 10:1-5). ఇక్కడ పరలోకంలోని ఒడంబడిక పెట్టె గురించిన మాట మనల్ని ఇస్రాయేల్ గురించీ ఆలోచించేలా చెయ్యదా? తరువాతి అధ్యాయంలో దేవుడు ఈ యుగాంతంలో ఇస్రాయేల్ జాతి పట్ల తన విశ్వసనీయతను ప్రదర్శించే సంగతి కనిపిస్తున్నట్టు ఉంది. “వడగండ్లు”– ప్రకటన గ్రంథం 4:5; ప్రకటన గ్రంథం 8:5; ప్రకటన గ్రంథం 16:18 పోల్చి చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 11:1 మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

ప్రకటన 11:2 ఆలయ మునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు (మూడున్నర సంవత్సరములు) పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
ప్రకటన 10:8 - 11 లో ఒక చిన్న పుస్తకము దేవుని పరిశుద్ధ గ్రంధమైన బైబిలు అని ధ్యానిస్తూ వచ్చాము. రెండవ శ్రమల కాలములో ఆరవ దూత బూర ఊదినప్పుడు భూమిమీద దేవుని ప్రజలను గూర్చిన ప్రవచనము ఇక్కడ మనము ధ్యానిస్తూ ఉన్నాము.
ఇప్పుడు దేవుడు భూమిమీద వున్న దేవుని ఆలయమును యోహాను గారికి చూపిస్తూ వున్నారు. ఆ ఆలయపు కొలత అందున్న ఆరాదికుల లెక్క దేవుడు చూస్తారని మనము గ్రహించాలి. దేవుని మందిరమునకు వెళ్ళుచున్న నీవు ఆరాధన సమయానికి వెళుతున్నావా? ఆరాధనా సమయములో బయట తిరుగుతున్నావా? అది అన్యుల స్థలము. ఈ దర్శనములో వున్న దేవాలయము సార్వత్రిక మందిరము అనగా కట్టబడబోతున్న ఎరుషలేము దేవాలయమునకు సాదృశ్యము.
ఇది నేటి మన క్రైస్తవ మందిరముల, మన ఆరాధనల విషయమై ముందుగా యోహానుగారికి అనుగ్రహింపబడుచున్న దర్శనము. క్రమము లేని ఆరాధకుడా ఆత్మ దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించలేని విశ్వాసీ, ప్రభువు నీతో అంటున్నాడు: నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?( యెష 1:12).
ప్రవక్తయైన యేహెజ్కేలు దేవాలయమును కొలుచు దేవదూతను తన దర్శనములో చూసినప్పుడు అతనితో ఇట్లనెను; నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము (యెహే 40:4). కొలత వేయబడుచున్నవి: 1.ఆలయము 2.బలిపీఠము మరియు లెక్కింపబడుచున్నది అందున్న ఆరాధకులు.
ఇక కొలతకు ఉపయోగించినది బంగారు కొలకఱ్ఱ (ప్రక 21:15), అది న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను వున్నది (యెష 28:17), కొలుచువాడు మెరయుచున్న యిత్తడి వలె కనబడినాడు (యెహే 40:3). ఆమోసు ప్రవక్త దర్శన హెచ్చరిక దేవుడు మరలా మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను (ఆమో 7:8).
అందుకే కాదా, ప్రసంగి గ్రంధకర్త అంటున్నాడు: నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము (ప్రస 5:1). ఏలయన నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను (యిర్మీ 4:18). అందుకే, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును (సామె 3:6). ప్రభువు ఆత్మ మనతో నుండి నడిపించును గాక. ఆమెన్

ప్రకటన 11:3 నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు (మూడున్నర సంవత్సరములు) ప్రవచింతురు.

ప్రకటన 11:4 వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

ప్రకటన 11:5 ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.

ప్రకటన 11:6 తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
ఈ స్వరము చాలా గంభీరముగా వుంది కదూ. నా సాక్షులు అనే పదము ఇక్క్డడ వాడబడుచున్నది. ఐదవ ముద్రను విప్పినప్పుడు అనగా ప్రక 6:9 నుండి 6:11 వచనములలో మనము ధ్యానించినప్పుడు బలిపీఠము క్రిందనున్న హతసాక్షుల ఆత్మలను చూచాము.
ఆయాత్మలతో దేవుడు వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క ఇంకా పూర్తికాలేదు అని చెప్పారు. ప్రియ నేస్తం, ప్రకటన 20:4 వచనములో యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్చేదనము చేయబడిన వారి ఆత్మలు తిరిగి బ్రదికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసినట్లు వ్రాయబడి యున్నది. అనగా అప్పటికి ఆ లెక్క పూర్తి కావలసియున్నది అని అర్ధము.
అపో. పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో: కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి (1 కొరిం 12:31). ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి (1 కొరిం 14:1) అన్నారు. అట్లు ప్రవచానాత్మ గల ఇద్దరు సువార్తికులు పంపబడబోవుచున్నారని ప్రకటనగ్రంధ ప్రవచనము.
ఈ వచనములు చదువుతున్నప్పుడు మనకు దైవజనుడైన ఏలీయా, మోషే మరియూ ఆహారోనులు జ్ఞప్తికి వస్తున్నారు. ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను (2 రాజు 1:12). అలాగే, ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు (యాకో 5:17). యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చిరి (నిర్గమ 7:20).
క్రొత్త నిబంధన కాలములో మొట్ట మొదటి క్రీస్తు సాక్షి బాప్తిస్మమిచ్చు యోహాను గారు అని మనకు తెలుసు. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను (యోహా 1:8). ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము (మత్త 3:4). యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను (యోహా 5:35).
మూడున్నర సంవత్సరములు వారు ప్రవచించుతారు అను మాట మనకు యేసుక్రీస్తు వారి పరిచర్య కాలమును గుర్తు చేయుచు ఆ పరలోక రాజ్య సువార్త కాలమును ఘనపరచుచున్న సత్య వాక్యములు ఇవే. ఆ యిద్దరు సాక్షులు ఎలాంటి వారు ఆనే ఆనవాళ్ళు దేవుడు తెలియపరచు చున్నారు.
వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్న దేవదూతలని (జక 4:14) కొందరు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలీయా (మలా 4:5) వస్తాడు అని కొందరు వ్యాఖ్యానాలు వ్రాస్తూవున్నారు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను (కీర్త 52:8) అంటున్నారు కీర్తనాకారుడు దావీదు గారు.
నేడు దైవ సేవకులు అని పిలువబడుచున్న మనలో కొందరు ఎలావున్నారు అని ప్రశించు కోవలసిన అవసరము ఎంతైనా వుంది. ఒలీవ చెట్టు స్వభావము ఏమి చెబుతున్నది : దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని అంటున్నది (న్యాయా 9:9). దీపస్తంభములు అనగా సంఘములు (ప్రక 1:20). క్రీస్తు సాక్షులే సంఘము; సంఘము అంటేనే క్రీస్తు సాక్షులు.
ఎలావుంది నీ సాక్షి జీవితము ?? ప్రియ స్నేహితుడా, ఆత్మ వరములు వున్నవా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నదా (3 యోహా 1:2)? బాప్తిస్మము, హస్త నిక్షేపణము ద్వారా సంఘములో సాక్ష్యమిచ్చిన నీవు ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము (1 తిమో 4:14) అని, అపో. పౌలు గారి హెచ్చరిక. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే (1 కొరిం 12:4). ఆత్మ దేవుడే నిన్ను నన్ను అభిషేకించి నడిపించి ప్రభువు రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్

ప్రకటన 11:7 వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.

ప్రకటన 11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.

ప్రకటన 11:9 మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనము లకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవము లను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.
ధర్మశాస్త్రోపదేశకులారా, -అని సంబోధిస్తూ యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాము: అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగానేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు (లూకా 11:49,50). ఐతే దేవుడు నియమించిన పరిచర్య పూర్తియగు వరకూ యేశక్తీ వారిని ఆపలేదని మనము గ్రహించాలి.
యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్ధన చేస్తూ: చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని (యోహా 17:4) అంటున్నారు. అట్లు దేవుని సేవ పూర్తిచేసినవారు తిరిగి తమను పంపిన దేవుని యొద్దకు వేల్లవలసినదే. జెకర్యా సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను (లూకా 1:23) అను వాక్యము మనకు గుర్తుకు వస్తుంది కదూ!
ప్రభువు సిలువ వేయబడిన స్థలమదే అనగా గొల్గొతా ఐయుండవచ్చును. ఐతే వీరి మరణము శారీరక మరణముగాను, అది సాతాను గెలుపుకు సూచనగాను వున్నదని యోచించుట ఎంతమాత్రమునూ తగదు. క్రీస్తు సాక్షులను చంపుట అనగా, క్రీస్తు విరోధి లోకములోనికి ప్రవేశించుట అని మనము గ్రహించాలి. ప్రతి విషయమునూ అక్షరార్ధముగా ఆలోచించ కూడదు.
గమనించినట్లైతే వారు భూలోకమునకు పంపబడినప్పుడు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు, కాని వారి శవములకు ఉపమాన రూపకమైన పేరులు సొదొమ అనియు ఐగుప్తు అని వున్నవి. లోకము వారి ప్రవచనమును, పరలోక రాజ్య సువార్తను నమ్మక, మరణించిన పిమ్మట వారిని సాతాను దూతలుగా భావించుచున్నది.
నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు (యెష 14:19) అంటూ సాతానును దేవుడైన ప్రభువు గద్దించుట మనకు కనబడుచున్నది. ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు అనగా అన్యజనులు ఆ సాక్షుల సమాధి విషయములో ఆటంకముగా వున్నారు.
ఇట్టి విషయము ముందుగానే దేవుడైన యెహోవా ప్రవచన పూర్వకముగా పలికించినదేమనగా: దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి యున్నారు. ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టువారెవరును లేరు (కీర్త 79:1-3).
ప్రియ స్నేహితుడా, దేవుని పరిశుద్ధ గ్రంథములోని ఏ మాటా ఏ పొల్లు నెరవేర్చబడక పోదని గుర్తించుదాం. ప్రభుని ఆత్మ మనతో నుండును గాక. ఆమెన్

ప్రకటన 11:10 ఈయిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్స హించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.

ప్రకటన 11:11 అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.

ప్రకటన 11:12 అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి

ప్రకటన 11:13 ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.

ప్రకటన 10:9 లో దేవుని పరిశుద్ధ బైబిలు గ్రంధమును ధ్యానించినాము.
ప్రకటన 11:1 లో దేవుని మందిరమునూ, అందు ఆరాధన చేయువారినీ ధ్యానించినాము.

ప్రకటన 11:3 లో ప్రవచనము గల సువార్తికులను అనగా క్రీస్తు సాక్షులను చూచినాము. ఇప్పుడు వారిరువురు సజీవులై లేచుట, ప్రభువు ఆహ్వానము అందుకొని పరమునకు ఎత్తబదుట చూస్తున్నాము.
ఇది క్రీస్తు మధ్యాకాశాములోనికి మేఘారూఢుడై వచ్చుట, సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము (1 థెస్స 4:17) అను వాక్య నేరవేర్పు ఈ దర్శనములో చూచుచున్నాము.
క్రీస్తు పునరుత్థాన శక్తి పొంద నర్హుడుగా వున్నావా.? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును (యోహా 6:54) అంటున్నారు ప్రభువు. సిద్ధ పడుదమా, ఎత్త బడుదుము; లేనియెడల విడువబడుదుము. జాగారూకుదవై యుందుము గాక. ఆమెన్

ప్రకటన 11:14 రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

ప్రకటన 11:15 ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.

ప్రకటన 11:16 అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి

ప్రకటన 11:17 వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

ప్రకటన 11:18 జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

ప్రకటన 4 వ అధ్యాయములో మనము జ్ఞాపకము చేసుకున్నట్లైతే దేవుడు ఒక నరుని పరలోకమునకు ఎక్కిరమ్మని పిలిచినప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచూ స్తుతించి ఆరాధించుట గమనించినాము.
తిరిగి ఏడవ దూత బూర ఊదినప్పుడు అనగా కడవరి బూర మ్రోగినప్పుడు వర్తమానభూతకాలములలో ఉండు ప్రభువును, సర్వాధికారియూనైన దేవుని నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నవాడని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు.
ఇది క్రీస్తు రెండవ రాకడకు సూచన మాత్రమే గాని రాకడ కాదు అని మనము గ్రహించాలి. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును (మత్త 24:30).
ఐతే కడబూర మర్మము ఏదనగా, బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము (1 కొరిం 15:52). కనుక ఇది ప్రకటన 11:14 ప్రకారం రెండవ శ్రమ ముగిసి; మూడవ శ్రమ ఆరంభం. ప్రార్ధనాపూర్వకముగా ముందుకు సాగుదామా. ప్రభువు మనతో నుండును గాక. ఆమెన్

ప్రకటన 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
నాడు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెనని దేవుడైన యెహోవా మొషే తో ఆజ్ఞాపించిన సంగతి (నిర్గ 25:10-16) మనకు విదితమే. మొదట దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలు (ద్వితీ 9:10) ఆ మందసములో ఉండెను.
ఆ తదుపరి ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత, యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి (ద్వితీ 31:24, 25).
మూడవ శ్రమల కాలములో ఏడవ దూత బూర వూదిన మీదట సంభవింపనైయున్న సంగతులన్నియూ ముందున్న అధ్యాయములలో ధ్యానించబోవుచున్నాము. ఏడు దేవుని ఉగత పాత్రల దర్శనములో అమలు కానున్న దేవుని తీర్పులన్నియూ, ముందుగానే దేవుడు మానవులకిచ్చిన ధర్మశాస్త్రానుసారమే సంభవిస్తాయి.
దానికి ముంగుర్తు గానే ఈ దర్శనము దేవుడు మనకు వ్రాయించి యున్నారు. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?( 1 పేతు 4:17) అను వాక్య భావమిదే అని మనము గ్రహించాలి.
శాసనములను ఆ మందసములో నుంచవలెను (నిర్గ 25:21) అని దేవుని ఆజ్ఞ. ఆలాగే మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి ( ద్వితీ 31:25).
చివరకు మందసము ఏమైనది? నేడది పరలోకములో మహిమాస్వరూపముగా వున్నది. కనుక రానున్న కాలములో ప్రతి శ్రమ వెనుక, ఒక ధర్మశాస్త్ర నియమము వుంటుంది. మరి నీవు నేను సిద్ధమా? క్రీస్తు ప్రేమ మనలనెడబాయక నడిపించునుగాక. ఆమెన్




Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |