ప్రకటన 13:1 మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
ప్రకటన 13:2 నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ఈ దర్శనములో అపవాది క్రూరమృగము వలే కనబడుచున్నది. ఐతే దానికి తలలు ఏడు వుండగా, కొమ్ములు పది ఎలా సాధ్యము అని ఆలోచించాలి. మరి కిరీటములు తలల మీద ఉంటాయా కొమ్ముల మీద ఉంటాయా మరో సందేహం. ఇది కేవలము దాని దుష్క్రియలను తెలుపు వర్ణన మాత్రమే.
ప్రక 6:8 లో భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగము పైన అధికారము కలదని ధ్యానించియున్నాము. దేవ దూషణ దాని ప్రవృత్తి దేవుని పిల్లలను భయపెట్టుట దాని నైజం. ప్రవక్తయైన యెషయా దర్శనములో ఈ క్రూరమృగము కనబడినప్పుడు (యెష 30:6) క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలు అని వ్రాయబడియున్నది.
లోకము మీదికి రాబోవు శ్రమలు ఎలా వుంటాయి తెలిపే చిత్ర దర్శనములో (Pictorial Vision) దేవుడు; 1. సింహీ 2. సింహములును 2. పాములును 3. తాపకరమైన మిడునాగులు చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ మొదట (1)పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము కనిపించినది. ఆతదుపరి (2)చిరుతపులిని పోలిన మృగము కనిపించినది, ఆతరువాయి (3)ఘటసర్పము కనిపించినది. ఇవి అపవాది తెచ్చే శోధనలు పలు రకాలు అని మనము గ్రహించాలి.
యేసుక్రీస్తు వారు మొదటే చెప్పారు: పాములను ఎత్తి పట్టుకొందురు (మార్కు 16:18), తేళ్లను త్రొక్కుదురు (లూకా 10:19) అని. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు ( కీర్త 91:13) అను వాగ్దానము మనకున్నది. అది అపవాది సాతానుమీద ప్రభువు మనకు ఇచ్చిన అధికారమే గాని, ఆయా జంతువుల మీదనో, పాములు తేళ్ళ మీదనో కాదని ఆత్మీయ భావన.
అందుకే ప్రభువు వాగ్దానము చేసాడు, నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును (యిర్మీ 33:3). ఆమెన్
ప్రకటన 13:3 దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
ప్రకటన 13:4 ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్ప మునకు నమస్కారముచేసిరి. మరియు వారుఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.
ప్రకటన 13:5 డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను
ప్రకటన 13:6 గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.
దాని దెబ్బ మానిపోయెను. ఔను, సాతానును దేవుడే ఏమీ అనటంలేదు, దాని ఇష్టం వచ్చినట్లు తిరుగాడుతున్నది, దేవుడు చూస్తూ కూడా ఊరుకున్తున్నాడు; అని కదా మనిషి అభిప్రాయం. అందుకేనేమో మృగము వెంట వెళ్ళుచున్నారు, నమస్కారము చేయుచున్నారు, దానితో సాటి యెవడు?అని పొగడుచున్నారు, దానితో యుద్ధము చేయగల వాడెవడు? అంటూ దానిని ఘనపరచుచున్నారు.
ఇందుకే కదా దాని గర్వము హెచ్చినది. డంబముతో దేవదూషణ మాటలను పలుకుచున్నది. దేవుని దూషించుచున్నది, ఆయన నామమును దూషించుచున్నది, ఆయన గుడారమును అనగా దేవుని నివాస మందిరమును దూషించుచున్నది, పరలోకనివాసులను అనగా పరమునకేగిన పరిశుద్ధులను, పరిశుద్ధ దేవ దూతలను దూషించుచున్నది.
నాకొక సంగతి గుర్తుకు వస్తుంది; మా బంధువులకు ఒకరికి బాగాలేదని ప్రార్ధనకు తీసుకు వెళ్ళారు. వారికి ఒక ప్రార్ధన ఇలా వ్రాసి ఇచ్చారు. దానిని దినమునకు ఏడు మారులు చదవమన్నారు. *సాతాను సర్పమా, సర్వ కార్యములయందు చావు నీకు. హార్ మెగిద్దోను యుద్ధము హడలు నీకు..... * అంటూ సాగింది ఆ ప్రార్ధన.
యేసుక్రీస్తు వారు “పరలోకమందున్న మా తండ్రీ” అని ఆరంభిస్తే, సాతాను సర్పమా అని ఆరంభిస్తారు వారు. ఇంకొందరు “యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సాతాను క్రియలకు అనంత నాశనం” అంటుంటారు. నాకుతెలియక అడుగుతాను, యేసు రక్తము యేసు నామము ఎన్ని సార్లు పలికితే అన్ని సార్లు సాతాను పేరు పలకాలా ?? యేసు రక్తమే జయం, యేసు నామమే జయం అని ఊరుకుంటే చాలదా?
మనం చేసిన తప్పు యేదో, దేవుడు చేస్తున్న పరీక్ష యేదో ఎరుగరుగాని, చీటికి మాటికి సాతాను శోధన అంటుంటారు. అలా పదే పదే దాని పేరు తలుచుకుంటుంటే అది చాలు దానికి. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు (యోబు 2:10). చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము (కీర్త 34:13). ప్రభువు ఆత్మ మనలను నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.
ప్రకటన 13:8 భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.
ఆయా వంశములలోనున్న, ఆయా భాషలు మాటాడు వారిలోనున్న మరియూ ప్రతి ప్రజలో ప్రతి జనములో నుండే పరిశుద్ధుల మీద మృగమునకు యుద్దమును జయమును పొంద అనుగ్రహించుచున్నది ఆ ఘటసర్పము. ఐతే దానికి విజయము వచ్చినట్టుగాని, అది విజయము పొందెననిగాని వ్రాయబడలేదు అని గ్రహించాలి మనము. క్రీస్తు సిలువలో దానికి ఏనాడో అపజయము ఓటమి కలిగినాయని ఏ విశ్వాసీ మరచిపోకూడదు.
ప్రియ స్నేహితుడా, ఓటమి పాలయ్యావా; జీవగ్రంధములో నీ పేరు వ్రాయబడదు అని మరువకు. సార్దీస్ సంఘముతో ప్రభుని ఆత్మ మాటాడుతూ: జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనుననియూ; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టబడదనియు ప్రక 3:5 లో మనము ధ్యానిస్తూ వచ్చాము కదా.
జయహో జయహో - విజయమందు మరణము మింగివేయబడెను (1 కొరిం 15:54). ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక (1 కొరిం 15:55-57). ఆమెన్
ప్రకటన 13:9 ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;
ప్రకటన 13:10 ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
చెవిగలవాడు, ఆత్మ చెప్పు మాటలను వినగలవాడు అనే అంశాలను ప్రక 2:7 లో సంపూర్ణముగా ధ్యానించియున్నాము. ఒక్క ప్రకటన గ్రంధములోనే ఎనిమిది మారులు ఇదే విధముగా హెచ్చరించబడియున్నాము.
1. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక (ప్రక 2:7).
2. సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక (ప్రక 2:11).
3. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 2:17).
4. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక (ప్రక 2:29).
5. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:6).
6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:13).
7. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:22).
8. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక (ప్రక 13:9).
పరిశుద్ధాత్మ దేవుడు చివరిసారి చెప్పుచున్నాడు. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును (యెష 55:3).
నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును (యెష 51:4).
ఆత్మ దేవుని స్వరము వినువారమై యుందుము గాక. ఆమెన్
ప్రకటన 13:11 మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను;
ప్రకటన 13:12 అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.
ప్రకటన 13:13 అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.
ప్రకటన 13:14 కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.
ప్రకటన 13:15 మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
ఘటసర్పమువలె మాటలాడుచున్న క్రూరమృగము అబద్ద ప్రవక్తను సూచించుచున్నది. దానికి అందరూ నమస్కారము చేయాలట. అది యేసు ప్రభువును సహా : నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను (మత్త 4:9) అంటూ వున్నది. అది అట్లు మనుష్యులను బలవంతము చేయుచున్నది.
అంతమాత్రమే కాదు, మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. గమనించినట్లైతే అది సూచనలు చేయుచున్నది గాని సూచక క్రియలు చేయలేక పోవుచున్నది. అంత్య దినములలో మాయలు (magics) చేస్తూ ఇవే దేవుని అద్బుతములు అని నమ్మించేవారు ఉంటారని విశ్వాసులు జాగరూకులై వుండాలి.
అది మొత్తం మోసమే అని పరిశుద్ధులు అప్రమత్తంగా వుండాలి. ఆ ఘటసర్పము యొక్క దయ్యపు ఆత్మఆ ప్రతిమ మాటాడినట్లు భ్రమింపచేయు చేష్టలు చేసి మనుష్యులను మోసము చేయగలదు. దానికి నమస్కరించుమని వారికి హానిచేయు దుర్గుణము దానికి కలదు.
మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము ప్రార్ధన ద్వారా సత్య స్వరూప మైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొన గలము (1 యోహా 4:6). క్రీస్తు ఆత్మ మనతోనుండి నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 13:16 కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
ప్రకటన 13:17 ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది.
ప్రకటన 13:18 బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ఆత్మీయ సంగతులను శారీరక విషయాలను కలగలిపి ధ్యానించుట దైవత్వము కాదు. ఇహలోక విషయములను పరలోక విషయములను ఒకటిగా ఆలోచించుట ఆత్మజ్ఞానము కాదు. క్రీస్తు: నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను (యోహా 8:23) అంటున్నారు.
దాని ముద్ర సంఖ్య 666 అని చదివి, చాలా విషయాలను సరిపోల్చి చూస్తూ ఉంటాము. ప్రియ విశ్వాసీ; ప్రక 7:2,3,4 లో తెలుపబడిన సజీవుడగు దేవుని ముద్ర యొక్క సంఖ్య ఎంత? 333 అందామా లేక 777 అందామా పోనీ 12 అందామా !! ఆ భాగములో దూత మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించుదుము అని ప్రకటిస్తూ వున్నాడు. ఆ ముద్ర సైతము నొసళ్ళ మీదనే ముద్రింప బడుచున్నది. ముద్రింపబడినవారి లెక్క ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో కలిపి లక్ష నలువది నాలుగు వేలమంది.
ఐతే, ఆ దేవుని ముద్రలో ఏమున్నది మనకు వివరించబడి యున్నది గదా. ఎట్లనగా; ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ వాగ్దానములో ఆత్మదేవుడు “నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను” అంటున్నారు.
అలాగే మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను అను మాటను మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. దాని పేరులో ఒక సంఖ్య వున్నది లేక దాని పేరు ఒక సంఖ్యను సూచించుచున్నది అని అర్ధము. హెబ్రీ భాషలో అంకెలు లేవు అక్షరములే అంకెలు, గ్రీకు భాషలో మరియూ రోమన్ భాసలో సైతము అక్షరములే గాని అంకెలు లేవు. మనము వాడుచున్న 0 – 9 అరబ్బీ అంకెలు. అదే రోమన్ అంకెలు కూడా మనకు తెలుసు, ఈ భాషలో అంకెలు అక్షరములే: 1=I, 5=V, 10=X, 50=L, 100=C, 500=D, 1000=M (DCLXVI=666).
ఐతే, ప్రక 17:5 లో దాని ముద్ర వివరించబడుచున్నది. బబులోనును ఒక స్త్రీతో పోల్చినప్పుడు దాని నొసట ఆ అపవాది పేరు ఈలాగు వ్రాయబడి యున్నది: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లి. దీనిని తెలిసికొనుటకు కూడా జ్ఞానముగల మనస్సు (ప్రక 17:9) కావాలి అంటుంది వాక్యము. అంతేగాని, కేవలము సంఖ్యను మాత్రమే తీసుకొని, అది 5G వచ్చేసిందని, బ్లూ చిప్ ఒకటి మనుషి శరీరములో అమర్చుతారని, అదే 666 అని భయపెడుతున్న అబద్ద అజ్ఞానపు బోధలకు చెవియొగ్గరాదు.
ఇందునుబట్టి చూచితే; చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను విడచి అబద్ద బోధలకు చెవియొగ్గు దినములు దాపురించినవని అర్ధమగు చున్నది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను (నిర్గ 31:1-5). ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు (రోమా 11:33).
మరి ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లు చేయబడితే మన మనుగడ ఎలా?
నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న మరిదేనికినీ హాని కలుగజేయకూడదని ఆజ్ఞ ఇయ్యబడెను మరియూ వారిని చంపుటకు [సాతానుకు] అధికారము ఇయ్యబడలేదు (ప్రక 9:4,5) అని ధ్యానిస్తూ వచ్చాము కదా.
ప్రియ క్రైస్తవుడా, మానవునికి దేవాది దేవుడు ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానమును సాతాను సంబంధమైనదిగా అభివర్ణించుట ఎంతమాత్రమునూ సబబుకాదని నా అభిప్రాయము. ప్రకటన 21:17 లో అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే. మూర అను మాట ఎలా ప్రామాణికముగా భావించ గలము చెప్పండి. అది మనుష్యుని కొలత చొప్పున అనగా ఎవరి మూర? దర్శనము చూచుచున్న యోహాను గారిదా, ఈ వాక్యమును వివరించు బోధకునిదా లేక దేవదూత గారిదా?
కోసులు, అంగుళములు, అడుగులు, గజములు, మైళ్ళు, మీటర్లు వంటి కొలత ప్రమాణములు అన్నీ ఏమైనాయి. మూరలు, వాడబడిన సంఖ్యలు మన పరిభాషలో అనువదించుకొని ఆలోచించుట అక్షరార్ధ భావమే గాని, ఆత్మీయ ధ్యానము కాదు అని మనము గ్రహించాలి. అవి సంజ్ఞలు మాత్రమేనని మనము గ్రహించాలి.
ఇందులో జ్ఞానము కలదు అనువాటి మాట ఏమిటి? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే (1 కొరిం 3:19). సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమైజ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది (1 కొరిం 1:18,19). కనుక మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెను (1 కొరిం 2:4). అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకో 3:17).
ప్రియ నేస్తం, ఆత్మజ్ఞానము సంపాదించు దేవునికి మహిమ కరముగానూ జ్ఞానయుక్తముగానూ ఆలోచించు. అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్ (రోమా 16:27).