ప్రకటన 17:1 – 17:3 ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న ... ... ... కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
ఏడు ఉగ్రత పాత్రలు క్రుమ్మరించిన దేవ దూతలలో ఒకడు ఇక్కడికి రమ్ము అంటున్నాడు. యోహాను గారు ఆయా సందర్భాలలో అతడు దృష్టి సారించవలసిన ముఖ్యమైన విషయముల వైపుకు “రమ్ము” అని పిలువబడుట మనకు కనబడుచున్నది.
ప్రకటన 4వ అధ్యాయము ఆరంభములో యేసు ప్రభువు [మొదట వినిన స్వరముతో] యోహాను గారిని పరలోకములోనికి పిలుచుచూ “ఇక్కడికి ఎక్కి రమ్ము” అన్నారు.
ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలను విప్పుచున్నప్పుడు నాలుగు జీవులు “రమ్ము” అంటూ మొదటి నాలుగు ముద్రలు విప్పబడుటకు ముందు పిలిచినట్టు వ్రాయబడి యున్నది.
తిరిగి ఇప్పుడు మహావేశ్యకు చేయబడు తీర్పు చూపించుటకు “రమ్ము” అని ఆ ఏడుగురు దూతలలో ఒకడు పిలుచుట చూచుచున్నాము.
అలాగే ప్రకటన 21:9లో మరో దూత “ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱపిల్లయొక్క భార్యను నీకు చూపెదను” అని పిలిచినట్లు చదువగలము.
ఆత్మవశుడైన ఫిలిప్పు రధము దగ్గరకు పరుగెత్తికొనిపోయి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచున్న నపుంసకునితో నీవు చదువునది గ్రహించుచున్నావా? (అపో 8:30) అని అడుగుచున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవునూ “రమ్ము” అని పిలువబడుచున్నావు, గ్రహించుచున్నావా. లోకమునకు అంతిమ తీర్పు, వధువు సంఘము సిద్దపరచబడి దేవుని సన్నిధి నుండి దిగివచ్చుట, వరుడు క్రీస్తు వివాహము యిత్యాది విషయములు ధ్యానించబోవుచున్నాము.
నాడు యోహాను గారితో వుండిన ఆత్మ దేవుడు నేడు మనతో నుండి నడిపించునుగాక. స్త్రీ సంఘమునకు సాదృశ్యము. ప్రకటన 13వ అధ్యాయములో కూడా ఒక స్త్రీని గూర్చి ధ్యానించాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను (ప్రకటన 12:1). పరి. యోహాను గారు చూచుచున్న ఈ రెండవ స్త్రీ ఎవరు? ఇది కూడా సంఘమే.
పరిశుద్ధ సంఘము అంటే అది పరిమళ వాసన కలిగి వుండాలి, ధవళ వస్త్రము ధరించాలి అని సామాన్యముగా చెప్పవచ్చును. ఐతే ఈ స్త్రీ అనగా ఈ సంఘము ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై యున్నది. అపవిత్ర కార్యములు అందు జరుగుచున్నవి. దాని పేరులో మర్మమున్నది, ఐననూ దాని పేరు మహా పేరు లేక మహా బబులోను. “పేరు గొప్ప ఊరు దిబ్బ” – అన్న చందాన వున్నది సంఘము.
దర్శన కారునికి ఆశ్చర్యము గొలిపినది ఏమంటే, అది హత సాక్షుల సంఘము. దానిలో నమ్మకస్తులైన వారిని ఎవరినీ బ్రతుక నివ్వరు. అందుకేనేమో ఏసుక్రీస్తు – నేను సాతానును జయించాను అనరు; నేను లోకమును జయించియున్నాను అంటారు. ఈ అధ్యాయములో గొర్రెపిల్ల విజయము గూర్చి ధ్యానించుచున్నాము. ఆత్మ దేవుడు మనతోనుండి నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 17:4 – 17:18 ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని ... ... ... ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే.
బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు (ప్రక 13:18). ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు (ప్రకటన 17:90). అట్లు ఆ పట్టణము ఎరుషలేము పట్టణమును భ్రమింప చేయుచున్నది ఎట్లనగా, యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు (కీర్త 125:2) అది వున్నది.
ఆత్మ జ్ఞానము చేత మాత్రమే దానిని గుర్తించ గలము. లేనియెడల అదే దైవికమైనదని నమ్మి మోసపోతాము, అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకో 3:17).
ప్రియులారా. అబద్ద క్రీస్తును విశ్వసించు ప్రజలు ఆయా భాషలు మాటలాడువారిలో నుండి వున్నారు. వారు చివరకు ఒకరికి ఒకరు విరోధులై దానిని ద్వేషించి విడిచి దాని నాశనమునకు కారకులైనట్టు గ్రహించ గలము. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు (మత్త 12:25).
అది దేవుని సంకల్పమే. నేటికీ సువార్తకు చోటివ్వని ప్రజలు గల పట్టణాల గతి ఏమిటీ? యేసయ్య ముందుగానే చెప్పారు: ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను (మత్త 10:14,15).
పట్టణము లోకమునకు సాదృశ్యము. అది మహా పట్టణము మహా బబులోను. అవును ఒక్కసారి లోకమువైపు చూడు అది గొప్పగానే కనిపిస్తుంది. ఐతే దాని అంతము దుఃఖకరము. దానిమీదికి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అది ఎలా తీర్పు పొందినదో 18వ అధ్యాయములో ధ్యానము చేద్దాం. కృప మనకు తోడై యుండును గాక. ఆమెన్