ప్రకటన 19:1 అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటినిప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;
ఈ అధ్యాయములోని అటుతరువాత అను ఈ మాట క్రొత్త నిబంధన చివరి అంకములోనికి తీసుకు వెళుతుంది. ఎట్లనగా ప్రకటన 19వ అధ్యాయము నుండి గొర్రెపిల్ల వివాహసమయము ఆసన్నమగు చున్నది. దశలవారిగా దేవుని కార్యముల ముగింపులు గమనిద్దాం :
1. యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది (యోహా 4:34).
2. యేసు ; చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని (యోహా 17:4).
3. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను (యోహా 19:30).
4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు (రోమా 10:4).
5. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు (హెబ్రీ 12:2).
6. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను (ప్రక 10:7).
7. మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను (ప్రక 15:1).
ఇక పరలోకములో ఎటు చూసినా ఆరాధన, స్తుతి, దేవునికి ఘనత మహిమ చెల్లించుటే కనబడుచున్నది. అదే సమయములో నరకము అగ్నిగుండము కూడా బయలు పరచ బడినది. ముందుకు సాగునట్లు ప్రభువు సహాయము చేయును గాక. ఆమెన్
ప్రకటన 19:2 – 19:7 ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి ... ... ... ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
దేవుని ఆరాధన ఎలా చేయాలో ఈ వచనముల ధ్యానములో మనము నేర్చుకొను చున్నాము.
ప్రభువును స్తుతించుడి; ఎందుకనగా, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును గనుక.
ప్రభువును స్తుతించుడి ఎందుకనగా, సత్యమును న్యాయములునైన యున్నవి గనుక;
ప్రభువును స్తుతించుడి; ఎందుకనగా, ఆయన తీర్పులు భూలోక మును చెరిపిన గొప్ప వేశ్యకు తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను గనుక.
ప్రియ స్నేహితుడా, నోవహు కాలములో ఆదిలో దేవుని తీర్పు మనము గుర్తు చేసుకున్నట్లైతే, నోవాహు పీఠముమీద దహనబలి అర్పింఛినప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను (ఆది 8:21) అన్నారు. అది దేవుని మహిమార్ధమై చెల్లించబడిన ధూపార్పణ.
ఐతే ఇప్పుడు ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అది భూలోకమునకు దిగివచ్చిన దేవుని ఉగ్రత. ఆ దేవుని కోపమునకు సంబంధించిన అగ్నినుండి వేదలుచున్న పొగ. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
రక్షించబడిన ఆత్మలతో; మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్దనుండి వినవచ్చుచున్నది. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి అని పలుకుతూ, గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయమును ప్రకటించుచున్నారు.
ఆయన భార్య సంఘము సిద్ధ పడియున్నది; గనుక సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పు చున్నారు. అవును, మహిమ పరచెదము. ఆమెన్
ప్రకటన 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
ప్రకటన 11:12 అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట ద్వారా పరిశుద్ధుల సంఘము ఎత్తబదుటను మనము ధ్యానించి యున్నాము. దేవుడైన యెహోవా సెలవిచ్చినది యేమనగా, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును (హోషే 2:19,20).
వాగ్దానపూరితమైన ఈ ప్రవచన నేరవర్పును అపో. పౌలు గారు ప్రకటిస్తూ, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని (2 కొరిం 11:2). సంఘము క్రీస్తు సిలువలో పరిమళించి, రక్షణ సువాసన వెదజల్లినది. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను (ఎఫే 5:2). అది నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నది (2 కొరిం 2:16).
ఇక సంఘ వధువు అలంకరణ విషయము పరి. యోహాను గారు చూస్తున్నారు. ఆమె వస్త్రములు ప్రకాశములును నిర్మలములునై యున్నవి. క్రీస్తు రూపాంతర స్వరూప దర్శనములో గమనించినట్లైతే; ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను (మత్త 17:2). ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు (మార్కు 9:3). ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను (లూకా 9:29). అవి మహిమ వస్త్రములు.
ఐతే వధువు సంఘమునకు యీయబడినవి పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘములోని పరిశుద్ధులు వీరే. అందుకు సూచనగా సార్దీస్ సంఘముతో మాటాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు: అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు (ప్రక 3:4).
ప్రియ స్నేహితుడా, నీ సంఘమును వధువుగా అలంకరించు చున్నావా? గమనించావా, మన క్రియలే లేక మన నీతి క్రియలే మన సంఘవదువుకు పెళ్లి వస్త్రములు. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు [మనము] నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను (రోమా 5:16). యేసు క్రీస్తు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్
ప్రకటన 19:9 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.
ప్రకటన 19:10 అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడువద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.
యేసుక్రీస్తు వారు ప్రకటించిన సువార్త, ఆయన పంపిన అపోస్తలుల సువార్త ఒక్కటే; “పరలోకము సమీపించియున్నది”. అది తరలి వస్తున్న పెండ్లి కుమారుని స్వరమేనని మనము మరువ రాదు. ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ: పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి (మత్త 22:2,3).
పెండ్లి ఆహ్వానము ఎవరికీ వినబడలేదా లేక ఆత్మీయ నిర్లక్ష్యమా !! కాదు కాదు జీవన వ్యాపారములలో చిక్కు కొనిన (2 తిమో 2:4) ఒకడు ఏలాగు చేవియొగ్గ గలడు? అందరికీ ఏదో ఒక సాకు వున్నదని వాక్యోపమానము.
మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని వేడు కొనుచున్నాననెను.
మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.
మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను (లూకా 14:18-20).
యోహాను సువార్త గ్రంధమును వ్రాసిన యోహాను గారు గొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము అను మాట వినగానే అట్లు ప్రకటించిన దేవదూత పాదములపై బడినాడట. అంతట ఆ దూత నేను నీతోను యేసుక్రీస్తు సాక్షులతోను నేనూ ఒకనిని అని పలికినట్లు వ్రాయబడుచున్నది. ఇపుడు యోహాను దేవదూతలలో ఒకని వలే ఉన్నాడని మనము గ్రహించవలసి యున్నది.
అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు (లూకా 20:34-36).
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము (1 యోహా 3:2). పరలోకమందున్న నా తండ్రి ముఖమును వారు ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని ప్రభువు చెప్పుచున్నారు (మత్త 18:10).
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక (మత్త 13:43). అట్టి ధన్యత కొరకై ప్రార్ధన చేద్దామా, అదే జీవ పునరుత్థానము (యోహా 5:29). ప్రభువు మనతో నుండునుగాక. ఆమెన్
ప్రకటన 19:11 – 16 మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
పరి. యోహాను గారు తెరువబడిన పరలోకమును చూచుట ఇది రెండవ సారి. మొదట ప్రక 4:1 లో ఒక తలుపు తెరువబడి యుండెను అనియూ, ఇక్కడికి రమ్మని పిలిచిన ఒక స్వరము వినగానే అతడు ఆత్మావశుడ నైనాననియు తెలిపినాడు. అంతట సింహాసనాసీనుడై యున్న ప్రభువును చూచినట్టు వ్రాయబడిన సంగతి మనము ధ్యానించినాము. ఐతే ఇప్పుడు పరలోకము తెరువబడినది అని వ్రాయుచున్నాడు. ఒక విశ్వాసి పరలోకములోనికి వెళ్ళిన తరువాత ఆత్మ నేత్రములతో సమస్తమునూ చూడగలడని మనకు అర్ధమగుచున్నది.
అలా చూసిన మరో ప్రవక్తను కూడా మనమెరుగుదుము. ప్రవక్తయైన యెషయా గారు తాను దేవుడైన యెహోవాను కన్నులారా చూచినట్టు లేఖనములో చదువుచున్నాము. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని (యెష 6:5) అంటున్నారు.
ప్రక 1:14లో చూచిన ప్రభువును మరోసారి చూస్తున్నట్టు గమనించాలి మనము. ఐతే మొదటి దర్శనములో యేసు మరణ భూస్థాపన పునరుతానములను జ్ఞాపకము చేస్తూ; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను (ప్రక 1:18) అన్నారు. ఈ దర్శనములో యేసు చేసిన సిలువ త్యాగమును వేల్లదిపరచుచున్న ఈ దర్శనములో రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి యున్నాడు. అట్లు కేవలము మన రాక్షణార్ధమై, అనగా మనలను పాపమునుండి, శాపమునుండి రక్షించి నరకమునుండి తప్పించుట కొరకే క్రీస్తు బల్యర్పణ గావించబడినారు. అందుకు ప్రభువుకు లెక్కలేనన్ని స్తోత్రములు.
యోహాను గారు తన సువార్త గ్రంధములో యేసును గూర్చి వ్రాస్తూ, ఆ వాక్యమే శరీర ధారియైయున్నది అన్నారు. ఔను, ఇదిగో ఆయన నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు మరియూ వాక్యము అను నామము గలవాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను ఆయన అధికార నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది
ఆయనను వెంబడించుచున్న వీరెవరు? వీరు సార్దీస్ సంఘ విశ్వాసులే. వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాటాడుతూ: తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు (ప్రక 3:4). వారు తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచున్నారు. ఇప్పుడు రక్షణ వస్త్రమే లేని వాడు రేపు ఆ ధవళ వస్త్రం ఏలాగు దరించగలడు. అవును ప్రియుడా, త్వరపడి రక్షణ పొందుదాము. ఇదే రక్షణ దినము. ఈనాడే అనుకూల సమయము. ప్రభువు నాతోనూ చదువుతున్న నీతోనూ వుండును గాక. ఆమెన్
ప్రకటన 19:17 – 21 మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
సూర్యబింబములో దూత అను మాట స్వచ్ఛతను సూచించు చున్నది. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును (మత్త 24:27,28). క్రీస్తు ముందుగా ప్రకటించిన మాటయే ఇక్కడ మరలా వినిపిస్తున్నది.
ఆ అంతిమ దినమున భూమిమీద సంభవించు సామూహిక మరణములను గూర్చిన ప్రవచనమే ఈ వచన సారాంశము. తన ముద్ర వేయించుకున్న తనవారి సంహారము చూచినా అపవాది తన సైన్యముతో యుద్ధమునకు సిద్ధపడుట ఈ దృశ్యములో కనబడుచున్నది. ప్రియ స్నేహితుడా, యే సైన్యములో వున్నావు నీవు? సువార్త సైనికుడిగా వున్నావా, సిలువ వీరునివలె క్రీస్తు విజయమును ప్రకటించుచున్నావా??
అబద్ద బోధలు, చేసిన సూచక క్రియలు, స్వస్తతలు సైతము అక్కరకు రావు ఆ దినమున జ్ఞాపకముంచుకో. ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును (మత్త 7:22,23) అని ముందే యేసయ్య చెప్పిన మాట నెరవేరిన దినము అదే.
ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును (2 తిమో 2:11,12). ఇదే రెండవ మరణము. మెలకువ కలిగి ప్రార్ధన చేద్దాం.