ప్రకటన 21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా; క్రొత్త నిబంధన గంధములో మనము చదువుచున్న ప్రతి మాటకు వెనుక ఒక ప్రవచనము వున్నది అని మొదట మనము గ్రహించవలెను. ముందుగానే ప్రవ. యెషయా: ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు (యెష 65:17).
అది ఇప్పటి లోకమువలే ఎన్నటికినీ లయమై పోవునది కాదు. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు (యెష 66:22).
మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును (2 పేతు 3:13).
అది లయమై పోవునది కాదు .యేసు: నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను (యోహా 18:36).
ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది (దాని 4:3). ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక (1 పేతు 4:11). ఆమేన్.
ప్రకటన 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
పరిశుద్ధ యెరూషలేము విషయమై ప్రభువు ముందుగా పలికిన మాటలు: సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను (యెష 62:1). యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు (యెష 62:6).
అలాగే నూతన నిబంధనలో చూసినట్లైతే: పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి (గల 4:26). నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము (హెబ్రీ 13:14). మరియూ హెబ్రీ 12:22-24 భాగములో పరలోకపు యెరూషలేము జ్యేష్టుల సంఘము అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. యేసు ప్రభువు: నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును (యోహా 14:3) అంటున్నారు.
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను (హెబ్రీ 11:10). ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనము లన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు (యిర్మీ 3:16,17).
ఒక సంగతి మనసున వుంచుకోవాల్సి వుంటుంది ఏమంటే: సంఘము యెరూషలేమనియూ, లోకము బబులోను అనియూ సాదృశ్య పేరులు. ప్రక.19 వ అధ్యాయములో ఎత్తబడిన సంఘము ఇప్పుడు దిగి వచ్చుచున్నది. ముందు ధ్యానించిన లేఖన భాగాలను ఒక్కసారి మనము స్మరణకు తెచ్చుకొనినట్లైతే; భూమిమీద నున్నప్పుడు అపోస్తలుల ద్వారా ప్రధానము చేయబడి, వాక్యమనే వుదక స్నానముచేత సిద్ధపరచబడి, అది మచ్చలు ముడతలు మరకలు డాగులు లేనిదిగా శుద్ధి చేయబడి దేవుని సన్నిధికి ఎత్తబడిన సంఘము పరిశుద్ధుల నీతి క్రియలే సన్నపు నారబట్టలుగా ధరించుకొని మధ్యాకాశము లోనికి అనగా వివాహ వేదిక మీదికి దిగి వచ్చుట ఈ అద్భుత దృశ్యం. అది కేవలము ఆత్మనేత్రములకు మాత్రమే గోచరము, బాహ్య నేత్రములకు అగోచరము.
ప్రకటన 21:3 అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
ప్రకటన 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
ప్రకటన 21:5 అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడుఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు
ప్రకటన 21:6 మరియు ఆయన నాతో ఇట్లనెనుసమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
ప్రకటన 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
దేవుని నివాసము మనుష్యులతో అనగా దేవుని మందసము పరలోకములో స్థిరపరచబడి, దేవుని పరిశుద్ధులు అక్కడనే ఉండునట్లు దేవుడు అనుగ్రహించుచున్నాడు. అందుకే ఆయన వారితో కాపురము వుండును అని వ్రాయబడుచున్నది.
ఎట్లనగా: కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము (2 సమూ 6:2) అను వాక్యము మనకున్నది. మరణము ఇక వుండదు అనగా నిత్యత్వము లేదా నిత్య జీవము అని అర్ధము. అక్కడ కన్నీటి ప్రార్ధనలు వుండవు, సువార్త నిమిత్తము అనుభవించిన దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఉండదు. ఆత్మలకు నిత్య సంతోషము అక్కడ వుంటుంది. నూతనముగా చేయబడుట అనగా లోకము, శరీరము కొట్టివేయబదినదని తాత్పర్యము.
పిరికివారును (క్రైస్తవుడను అని అనిపించుకొనుటకునూ ఆయన సిలువను రెండవ రాకడను ప్రకటించుటకునూ భయపడు వారు) , అవిశ్వాసులును (దేవుని పుట్టుకను, ఆయన అద్భుత కార్యములను, సువార్తను మరియూ క్రీస్తు మరలా వచ్చి పరలోకానికి తీసుకు వెళతాడు అని నమ్మని వారు), అసహ్యులును (నామమాత్రపు క్రైస్తవులు), నరహంతకులును (సహోదరుని ద్వేశించువారు), వ్యభిచారులును (తిండి పోతులూ, త్రాగు బోతులు), మాంత్రి కులును (వారములు తిధులు నక్షత్రములు పున్నమి అమావాస్యలు ఆచరిన్చువారు), విగ్రహారాధకులును (దేవునిదే అంటూ పావురాలకు క్రీస్తుదేనంటూ విగ్రహాలకు మ్రొక్కె వారు) , అబద్ధికులందరు (వాక్యమును వక్రీకరించు వారు, అక్షరార్ధముగా బోధించు వారు)ను అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
నరకమును, పరలోకమును చూస్తున్న యోహానుగారు ఒక ప్రక్క అగ్ని గుండమును మరో ప్రక్క వివాహ వేదికను చూస్తున్నారు. అవును, ఇదే వివాహ సమయము. ఇకమీదట సంఘము వధువు అని గాని, పెండ్లి కుమార్తె అని గాని పిలువ బడక, గొఱ్ఱెపిల్లయొక్క భార్య అని పిలువబడుచున్నది.
ప్రకటన 21:9 అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
ప్రకటన 21:10 ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని దేవదూత పలికినప్పుడు యోహాను గారు వివాహము ఎప్పుడు ఐనది నాకు చూపలేదే అని అడుగలేదుగాని, ఆ మహిమను చూసి అంతా మరిచిపోయాడు కాబోలు. ఇది మొదలుకొని వధువు సంఘము పెండ్లి కుమార్తె అని పిలువబడక, గొఱ్ఱెపిల్లయొక్క భార్య అని పిలువబడుచున్నది;
అంటే ఈ వచనములో వరుడు క్రీస్తుకు వధువు సంఘంనకు వివాహము జరిగినది అనే మర్మము దాగియున్నది. ఇక మీదట గొర్రెపిల్ల భార్యయైన సంఘము దేవుని మహిమ గలదిగా వున్నది. దాని చూచుటకు యోహాను గారు ఒక ఎత్తైన పర్వతము మీదికి కొనిపోబడు చున్నారు.
దిగుచున్న పరిశుద్ధ పట్టణమును చూచుటకు యోహాను గారు పర్వతము ఎక్కుట ఎందుకు? అనగా అది మహిమగల సంఘము యొక్క ఔన్నత్యమును చూపుచున్నది. కీర్తనాకారుడు 61:2 వ్రాస్తూ నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకినన్ను ఎక్కించుము అంటున్నాడు. భావమేమనగా దేవా, నాకు నీ మహిమ యొక్క ఔన్నత్యమును కనుపరచుము అని అర్ధము.
ప్రియ స్నేహితుడా, నీ వేరుగుదువా మన ప్రభువు యొక్క మహిమను ఆయన పరిశుద్ధత యొక్క ఔన్నత్యమును. ప్రార్ధన చేద్దాం. ప్రభుని ఆత్మ మనతో నుండును గాక. ఆమెన్
ప్రకటన 21:11 దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
ఆ పట్టణపు మహిమ వర్ణించ నెవనికినీ సాధ్యపడదు. ఐననూ యోహానుగారు పోలికలు చూపించుచున్నారు. సూర్య కాంతి వేరు, రత్నముల వెలుగు వేరు. సీయోను కొండలోని ప్రతి నివాసస్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును (యెష 4:5).
ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును. (యెష 60:19-21).
అదియే జీవపు వెలుగు.
ప్రకటన 21:12 ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
ప్రకటన 21:13 తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
పరలోకము ఇహలోక నమూనాలో భౌతిక నిర్మాణములు కావు అని మనము మొదట గ్రహించాలి. ప్రియులారా, మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి (కొల 3:1,2) అని ప్రభువునుబట్టి మిమ్ము బ్రతిమాలుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు (యెష 60:18).
నలుదిక్కుల మూడేసి గుమ్మములు ఎందుకు వున్నవి తెలుపబడ లేదు. వాటిపై ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల పేరులు వ్రాయబడి యున్నవి. ఉత్తరమున ఎవరి పేరులు వున్నవి తూర్పున ఎవరి పేరులు వున్నవి దక్షిణమున ఎవరి పేరులు వున్నవి పడమట ఎవరి పేరులు వున్నవి తెలుపబడ లేదు.
భూలోకములో యేర్పరచబడిన దేవుని సంఘము పరలోక నమూనాయే అని ఎప్పుడూ మనము జ్ఞప్తికి వుంచుకొనవలసినదే. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణములో వారు ఎక్కడ విడసినా ఎవరు యే దిక్కున దిగవలెనో కూడా దేవుడు వారికి నియమించియున్నారు. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను (సంఖ్య 1:52,53).
ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను (సంఖ్య 2:2).
తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను (సంఖ్య 2:3-9).
రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను (సంఖ్య 2:10-17).
ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను (సంఖ్య 2:18-24).
దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను (సంఖ్య 2:25-31).
అట్లు పరలోక గుమ్మములు నలుదిక్కుల వ్యాపించి ఒక్కో దిక్కున మూడేసి గుమ్మములు ఉన్నవని దేవుని దర్శనము. ఆయనకే మహిమ ఘనత స్తుతి ప్రభావములు చెల్లును గాక. ఆమెన్
ప్రకటన 21:14 ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
సామాన్యముగా చూచినట్లైతే ఒక ఇల్లు లేదా ఒక భవనము పునాదుల మీద కట్టబడుతుంది. కాని పరలోకంలో ఒక పట్టణమే పునాదుల మీద కట్టబడినది. దాని ప్రాకారమునకు సైతము పండ్రెండు పునాదులున్నవి. పునాదుల మీద పండ్రెండు పేరులు వ్రాయబడి యున్నవి, అవి అపోస్తలుల పేరులు. అపోస్తలులు ఎవరు?ఎందరు? పునాదులు పండ్రెండు గనుక పండ్రెండుగురు అని సులభముగానే చెప్పవచ్చును. ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను (లూకా 6:13).
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా (మత్త 10:2-4)., 1. పేతురనబడిన సీమోను, 2. అంద్రెయ; 3. యాకోబు, 4. యోహాను; 5. ఫిలిప్పు, 6. బర్తొలొమయి; 7. తోమా, 8. మత్తయి, 9. యాకోబు, 10. తద్దయియను మారుపేరుగల లెబ్బయి; 11. సీమోను, 12. ఇస్కరియోతు యూదా. ఈ యూదా లేఖనాను సారము క్రీస్తును సిలువకు అప్పగించినట్లు మనకు తెలియును. ఐతే, ఇస్కరియోతు యూదా పేరు కూడా ఆ పునాదుల మీద వ్రాయబదినదా?? వ్రాయబడరాదు. ఎందుకనగా అతడు ఆత్మ హత్య చేసుకొని నందున పెంతెకోస్తు పండుగ దినమున తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను పొందలేక పోయాడు.
అతని స్థానములో యోసేపు, మత్తీయ అను పేరులు గల ఇద్దరినీ గూర్చి శిష్యులు ప్రార్ధన చేసి, చీట్లు వేసి మత్తీయను ఏర్పరచుకున్నారు. ఐతే, మత్తీయ దేవుని పరిచర్యలో గాని అపొస్తలత్వములో గాని ఎక్కడా ప్రస్తావించబడినట్లు మనకు కనబడదు. ఆశ్చర్య మేమనగా; యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును, దేవుని సువార్తనిమిత్తము ప్రత్యే కింపబడినవాడునైన పౌలు (రోమా 1:1,2) అపోస్తలులలో చేర్చబడుట గమనించగలము.
అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామ మునుబట్టి ధైర్యముగా బోధించెననియు సాక్ష్యము పొందెను. నాటనుండి అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను (అపో 9:27-29). నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను (రోమా 11:13) అని కూడా పౌలు ఆత్మచేత తెలియపరచున్నాడు.
అట్లు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై (అపో 13:9) అపోస్తలులలో పండ్రెండవ వాడుగా ఎంచబడినాడని మనము గ్రహించవలెను.
ప్రకటన 21:15 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
ప్రకటన 21:16 ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
ప్రకటన 21:17 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
ప్రకటన 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
పరలోక పట్టణపు ప్రాకారము కొలువ బడుట ప్రవక్తయైన యేహెజ్కేలు సైతము చూఛినట్లు వ్రాయబడియున్నది. దేవుని దర్శనవశుడ నైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను.
ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను. ఆ మను ష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.
నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను (యెహే 40:2-5).
అట్లు కొలిచి చూపించుట దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము (రోమా 11:33) అని తెలియబడుచున్నది. ప్రవక్తయైన జకర్యా సైతము అటువంటిదేయైన దర్శనము పొందినాడు. నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను. నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడుయెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను (జక 2:1,2).
అది దేవుని ప్రేమయొక ఎత్తు, లోతు, నిడివి లకు సూచనగా వున్నది. ఆ పట్టణపు పరిశుద్ధతను సూచించు వర్ణన యోహాను గారు వివరిస్తూ, సాదృశ్యముగా సూర్యకాంతము స్వచ్ఛమగు స్పటికము మరియూ శుద్ధసువర్ణము అను పదములను వ్రాయుచున్నారు.
ప్రకటన 21:19 ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
ప్రకటన 21:20 అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
ప్రకటన 21:21 దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
పరలోక వైభవము వర్ణించుటకు గ్రంధకర్త ప్రయత్నము మనకు ఇక్కడ బాగుగా కనబడుచున్నది. అంత వెలగల రాళ్ళు పరలోకములో ఉన్నాయా? – ప్రశ్న. అది ఆత్మల దేశము పరమాత్ముని ప్రదేశము. దేవాది దేవుని మహిమ అక్కడ వితానముండును. ఆ మహిమ యొక్క తేజస్సు పండ్రెండు వర్ణములుగా కనబడుచున్నది.
ఆదికాండము లో మనకు బాగుగా జ్ఞాపకమున్న సంగతి : నోవహుతో దేవుడు చేసిన నిబంధన సప్తవర్ణ మయమై వినీల ఆకాశములో విరాజిల్లుచుండుట నేటికినీ మనము చూచుచున్నాము కాదా!! మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును (ఆది 9:13). ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను (ఆది 9:16).
అది కేవలము ఆకాశ సూచన మాత్రమే కాదు, అది దేవుని మహిమా ప్రతిబింబము అని మనము గ్రహించాలి. వర్ష కాలమున కనబడు ఇంద్రధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను (యెహే 1:28). ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను (ప్రక 4:3).
ఆ ఏడు రంగుల పేరులు : 1.ఊదా రంగు (Violet) 2.ఇండిగో రంగు (Indigo) 3.నీలం రంగు (Blue) 4.ఆకుపచ్చ రంగు (Green) 5.పసుపుపచ్చ రంగు (Yellow) 6.నారింజ రంగు (Orange) 7.ఎఱుపు రంగు(Red).
ఆ ప్రకారముగా చూచినట్లైతే; ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు పండ్రెండు వర్ణములతో మేరయుచున్నవి అని అర్ధమగుచున్నది. 1. సూర్యకాంతపురాయి 2. నీలము 3. యమునారాయి 4. పచ్చ 5. వైడూర్యము 6. కెంపు 7. సువర్ణరత్నము 8. గోమేధికము 9. పుష్యరాగము 10. సువర్ణల శునీయము 11. పద్మరాగము 12. సుగంధము.
ఇక పండ్రెండు గుమ్మములన్నియూ ఒకే వర్ణము కలిగియున్నవి. పట్టణపు రాజవీధి సైతము రెండు రంగుల కలయికగా కనబడుచున్నది, 1. స్వచ్చమైన బంగారు మయమై 2.స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. స్వచ్ఛత అను మాట పరిశుద్ధతను తెలియపరచుచున్నది.
ప్రకటన 21:22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
ప్రకటన 21:23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.
ప్రకటన 21:24 జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
ప్రకటన 21:25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
ప్రకటన 21:26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
ప్రకటన 21:27 గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
దేవాలయము అనగా ధవుని ఆరాధించు ప్రత్యేక స్థలము. అది ఈ పాపపు లోకములో దేవుడు తాను మాత్రము మరియూ తన మహిమయూ ప్రసన్నతయూ నిలిచి యుండు స్థలము. అదియూ గాక దేవుడు తన పరిశుద్ధులతో గాని యాజకులతో గాని కలుసుకొను స్థలము లేక పరిశుద్ధులు గాని యాజకులు గాని దేవుని దర్శించుకొను స్థలము.
హోరేబు కొండమీద దేవుడు మోషేతో “నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము (నిర్గ 3:5) అని ఒక ప్రదేశమును ప్రత్యేక పరచుట మనము చూచుచున్నాము. దేవ దూతలు సైతము “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ” (లూకా 2:14) అంటూ ప్రకటించుట మనము చదివాము. ఐతే పరలోకము పరిపూర్ణ పరిశుద్ధ స్థలము. ఆయనయందు సర్వసంపూర్ణత నివసించు చున్నది (కొల 1:19).
అందువలన అక్కడ దేవాలయము అను ప్రత్యక స్థలము లేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు అను మాట భావమేమనగా: యేసు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పిన మాట (యోహా 10:30). సూర్య చంద్ర నక్షత్రాదులు సృష్టింప బడక మునుపే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను (ఆది 1:3). భూదిగంతములవరకు రక్షణ కలుగజేయు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు దేవుడాయనను నియమించి యున్నాడు (యెష 49:6).
మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగాదేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు (1 యోహా 1:5). మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను (యోహా 8:12). కనుక అక్కడ రాత్రి లేదు, దీపము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆ పట్టణపు గుమ్మములు ఎన్నటెన్నటికినీ మూయబదుట లేదు.