ప్రకటన 22:1 మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహా సనమునొద్దనుండి
ప్రకటన 22:2 ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.
జీవజలముల నది అనే మాటలోనే జీవమున్నది. ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాల మందును ఆలాగుననే జరుగును (జక 14:8). ఆ జలములకు మరో పేరు ఆనంద ప్రవాహము. నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు (కీర్త 36:8,9).
కీర్తన గ్రంధ కర్త వ్రాస్తూ : ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి (కీర్త 46:4) అంటున్నాడు. ఆ నది చాలా లోతైనది అని ప్రవ. యేహెజ్కేలు చూచిన దర్శనము మనకు తెలియజేయుచున్నది. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గ మున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను (యెహే 47:3-5).
నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును (యెహే 47:7,9). నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును (యెహే 47:12).
పరి. యోహాను గారు చూచున్న ఈ దర్శనము ద్వారా మనము ధ్యానించ వలసిన బహు గొప్ప మర్మము దాగియున్నది ఏమనగా; దేవుని పరిశుద్ధ గ్రంధము బైబిలు ఆరంభములో అగాధ జలములున్నవి బైబిలు చివరలో ప్రవహించుచున్న లోతైన జలములున్నవి. ఆదిలో అగాధ జలములమీద ఆత్మ అల్లాడుచున్నది అని వ్రాయబడి యుండగా, ఇక్కడ ఆ జలములు జీవమునిచ్చు నవిగా తెలుపబడుచున్నది. త్రిత్వమైయున్న దేవుని తత్వము మనకు గ్రాహ్యమగుచున్నది.
అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడుగా తండ్రియైన దేవుని దర్శనము పదే పదే చూస్తూ వచ్చాము. అలాగే రక్షకునిగాను వధింపబడిన గొర్రెపిల్ల గానూ క్రీస్తు ఆ తండ్రి కుదిపార్శ్వమున కూర్చుని వున్నట్లుగానూ చూస్తూ వచ్చాము. ఐతే, పరిశుద్ధాత్ముడు అనగా త్రియేక దేవునిలోని మూడవ అదృశ్యశక్తి ఇక్కడే ఉన్నది అని చూపించు దర్శన దృశ్యమే జీవ్జలముల నది. తండ్రియైన దేవుని మహిమా ప్రభావములు మనకు అగ్ని రూపములోనో మేఘము రూపములోనో బయలుపరచ బడుచుండగా పరిశుద్ధాత్మ దేవుని దర్శనము ఒక గంభీర స్వరముగానో సంచరించు లేక ప్రజ్వలించు అగ్ని జ్వాలలుగానో అలాగే ప్రవహించు అగాధ జలములగానో లేక మనపై దిగివచ్చుఆశీర్వాదముగానో దర్శన మిచ్చుచున్నాడు అని మనము గ్రహించాలి.
అప్పుడే మనము త్రిత్వము యొక్క మూర్తిమత్వమును పరిపూర్ణతనూ సంపూర్ణముగా తెలుసుకొన గలుగుతాము. కేవలము క్రీస్తును ఎరుగుట లేదా తండ్రియైన దేవుడు యెహోవాను మాత్రమే ఎరుగుట అసంపూర్ణ దైవ జ్ఞానము. పరిశుద్ధాత్మ నెరుగక బైబిలు చదువు వాడు పరిశుద గ్రంధమును కాదు గాని కేవలము ఒక పుస్తకము చదువుచున్నాడు. పరిశుద్ధాత్మ నెరుగక తండ్రిని ధ్యానించు వాడు సృష్టికర్తను అనగా ఒక అదృశ్య శక్తిని ధ్యానించుచున్నాడు. పరిశుద్ధాత్మ నెరుగక క్రీస్తును ఆరాధించువాడు ఒక మహాపురుషుని పూజించుచున్నాడు.
పరిశుద్ధాత్మ నెరుగక తండ్రిని ధ్యానించు వాడు సృష్టికర్తను అనగా ఒక అదృశ్య శక్తిని (పరబ్రహ్మను) ధ్యానించుచున్నాడు. పరిశుద్ధాత్మ నెరుగక క్రీస్తును ఆరాధించువాడు ఒక మహాపురుషుని పూజించుచున్నాడు. తండ్రియైన దేవునికిని, కుమారుడైన క్రీస్తుకును, మనలను అనుసంధానము చేయు మహత్తర శక్తి పరిశుద్ధాత్ముడు. అది ఎరుగని వాడు తండ్రిని క్రీస్తును విడివిడిగా ఎరిగిన వాడు. వారిద్దరూ ఏకమై యున్నారను జ్ఞానము అతనికి మరుగైయున్నది.
ప్రకటన 22:3 ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
ప్రకటన 22:5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
శాపగ్రస్తమైనదేది అని మనము ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే: ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది (ఆది 3:17) అని పలికిన మాట గుర్తుకు వస్తుంది. మానవుని పాపమునకు అంతము తీర్పు దినమే.
ఎందుకంటే, ఈ శపితమైన నేల దహించబడియున్నది. నూతన ఆకాశము నూతన భూమి ఎలా ఉన్నదో యోహాను గారు వివరిస్తూ వున్నారు. అక్కడ తండ్రి యొక్క సింహాసనమును గొఱ్ఱపిల్ల క్రీస్తు యొక్క సంనిదియూ వున్నది. అది ఆయన నామము నొసళ్లయందు ముద్రింపబడిన వారునూ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును దూత గణములును చేయుచున్న నిత్యఆరాధనలతో నిండిన పవిత్ర పట్టణమది.
వారు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబవళ్ళు దేవుని ఆరాదిస్తున్నారని మనము రెండు సార్లు చదివాము: 1. యెష 6:3 లోనూ 2. ప్రక 4:8 లోనూ చూసాము. అచట ఆయన ముఖ కాంతి నిత్య ప్రకాశముగాను సకల పరిశుద్ధులకు జీవపు వెలుగుగాను వున్నది. అదే పరలోకము అనగా దేవుని మహిమ రాజ్యము.
శాపమునకును శాపగ్రస్తమైన దానికినీ అక్కడ చోటులేదు.ఏలయన దేవుని ఉగ్రత లేని లోకమది. అది ప్రేమప్రపంచము. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను (యోహా 1:4). యేసు; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని చెప్పెను (యోహా 8:12). దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు (కీర్త 84:11). దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియ నేస్తమా, వెలుగైయున్న క్రీస్తులో క్రీస్తుతో జీవిద్దామా, నిత్యమైన ఆ వెలుగు రాజ్యములో కలుసుకుందామా. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్.
***ఇంతటితో యోహాను గారికి దేవుడనుగ్రహించిన ప్రకటన దర్శనము సమాప్తమగు చున్నది.***