ఒక వివరణతో కూడిన విజ్ఞాపన :
క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు మూడు ప్రాముఖ్యమైన భాగములు ధ్యానించుటకు దేవాది దేవుడు కనికరించినందుకు స్తోత్ర్రములు చెల్లించుచున్నాను. చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుడు ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజకసమూహముగాను, పరిశుద్ధజనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను (1 పేతు 2:9) చేసి, సంభవింపబోవు అనేక సంగతులను క్రీస్తువారే వ్రాయించి అందించినారు.
ఆ మొదటి అధ్యాయములో మహిమా స్వరూపియైన క్రీస్తును దర్శించినాము. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?( 1 పేతు 4:17).
రెండవ మరియు మూడవ అధ్యాయములలో యేడు సంఘములకు వ్రాయబడిన లేఖలను ధ్యానించినాము.
ఎత్తబడిన సంఘము నకు సాదృశ్యముగా యోహాను గారి ఆత్మ పరలోకములోనికి ఆహ్వానించబడినట్లు నాలుగవ మరియు ఐదవ అధ్యాయములలో ధ్యానించినాము. అత్యున్నత సింహాసనము, నాలుగు జీవులు, ఇరువదినలుగురు పెద్దలు, దూతలు, వారి ఆరాధన, అక్కడ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల చూచినాము. ఆ గొర్రెపిల్ల పరమ తండ్రి చేతిలో నుండి యేడు ముద్రలుగల గ్రంధమును తీసుకొనుట; ఆ ముద్రలు విప్పుటకు పొందిన అర్హతను గ్రహించినాము.
గొర్రెపిల్ల యొక్క శక్తి ప్రభావములు ప్రకటించబడినప్పుడు సర్వ సృష్టి ఆరాధన ధ్యానిన్చినాము. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని (ప్రక 5:13) అని వ్రాయడినది.
ఆరవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయము వరకు లోకము మీదికి రాబోవుచున్న తీర్పులు ధ్యానించబోవుచున్నాము. క్రీస్తు న్యాయాధిపతిగా వుండి, లోకాంతము వరకు ఆ యన విధింపబోవుచున్న శిక్షలు చదువ వలసియున్నాము.
ఆరు ముద్రలు విప్పినప్పుడు శ్రమలును, ఏడవ ముద్రను విప్పినప్పుడు మహాశ్రమలును సంభవింపనైయున్నవి అని గ్రహించవలసియున్నది. ఈ మహా శ్రమలు మూడు విడతలుగా సంభవిస్తాయి అని చూస్తాము.
ఆ తదుపరి పందొమ్మిది మరియు ఇరువదియవ అధ్యాయములలో క్రీస్తు రాజ్యము స్థాపించబడి రాజులకు రాజు యొక్క వెయ్యి యేండ్ల పరిపాలన గూర్చి చదువుతాము.
ఇరువది ఒకటవ అధ్యాయములో నూతన సృష్టి, గొర్రెపిల్ల వివాహము. చివరి అధ్యాయము అనగా ఇరువది రెండవ అధ్యాయము నిత్యత్వమును వివరించు చున్నది.
ఇంతవరకు యేడు సంఘములు, యేడు ఆత్మలు, యేడు నక్షత్రములు, యేడుగురు దూతలు, యేడు దీపములు, యేడు దీప స్తంభములు యేడు ముద్రలు, యేడు బూరలు, యేడు కొమ్ములు, యేడు కన్నులు చూస్తూ వచ్చాము.
ఇక ముందు యేడు బూరలు, యేడు ఉరుములు, యేడు తెగుళ్ళు, యేడు పాత్రలు, యేడు తలలు గూర్చి ధ్యానించబోవుచున్నాము.
దేవుడు తన మహాకృపను బట్టి ఇంతవరకు నడిపించాడు. పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది (యాకో 3:17). కనుక పైనుండి ఇవ్వబడితేనే తప్ప నేనేమీ మీతో పంచుకొనలేను. కనుక ఇకముందుకు కూడా తన పరిశుద్ధాత్మను పంపి, మనకు వివరించి మహిమ పొందునట్లు ప్రతి ఒక్కరమూ ప్రార్ధన చేద్దాం. మీ అనుదిన ప్రార్ధనలలో నన్ను జ్ఞాపకము చేసుకుంటారు కదూ. ఆమెన్
ప్రకటన 6:1 ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
ఏడు ముద్రలు గల ఆ గ్రంధమును తండ్రి చేతిలోనుండి కుమారుడైన ఏసుక్రీస్తువారు తీసుకొనుట 5వ అధ్యాయములో చూశాము. ఆ ముద్రలను విప్పుటకు భూలోక పరలోకములలో ఎవరికీ యోగ్యత లేదనియు గొర్రెపిల్ల మాత్రమే వధింపబడినదై మనలను తన రక్తమిచ్చి మనుష్యులను కొన్నందున ఆ అర్హత పొందేననియూ ధ్యానిన్చియున్నాము.
ఐతే ఇప్పుడు 6వ అధ్యాయము మొదలు ముద్రలు విప్పబడుట యోహాను గారు చూస్తూ వున్నట్లు వ్రాయుచున్నారు. నేను చూడగా – అనే మాట ప్రకటన గ్రంధములో 33 సార్లు వ్రాయబడినది. 4వ అధ్యాయము మొదటి వచనములో యోహానుగారితో మొదట మాటాడిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎక్కి *రమ్ము* అని పరలోకమునకు పిలుచుకున్నారు. ఇప్పుడు సింహాసనము ముందున్న నాలుగు జీవులలో ఒకటి *రమ్ము* అని పలికినది.
ఆ సింహాసనాసీనుడైన ప్రభువును, ఆయన చేతిలో వున్న ఏడుముద్రలు గల ఆ గ్రంధమును చూస్తూనే; ఆ ముద్రలు ఎవరు విప్పుతారు అని ఆత్మ వేదనతో యోహాను ఏడ్చినారని చదివినాము. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ముద్రలను విప్పుతుండగా, దగ్గరకు పిలిచి మరీ వారి మర్మమును యోహాను గారికి చూపించబడుట బహు ఆశ్చర్యము కలిగించుచున్నది.
ఈ సంగతిని మనము వ్యక్తీకరించుకొని ధ్యానించి నట్లైతే దేవుని పరిశుద్ధ గ్రంధమును, అందున్న మర్మములను చదవాలంటే మనకొరకు రక్తము చిందించిన ఆయన రక్తములో మనకు యోగ్యత కావాలి, దానిని తెరిచేందుకు ఆయన అనుమతి కావాలి, ఈ దినము ఈ వాక్యము చదువు అంటూ పరిశుద్ధాత్మ దేవుని పిలుపుకావాలి.
ఒక్కసారి ఆ యోగ్యత అనుమతి పిలుపు పొందిన నీవు జీవితకాలము బైబిలు చదువుతూనే వుండాలి. ఎందుకంటే పొందినవానికే గాని మరి ఎవనికీ దాని రుచి తెలియదు. అది బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనది (కీర్త 19:10). ఈ వాక్యమే నన్ను బ్రదికించుచున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది (కీర్త 119:50). వాక్యముతో ఉదకస్నానము నన్ను దినదినము పవిత్రపరచి, పరిశుద్ధపరచుచు ప్రభువు కొరకు నన్ను నేను అప్పగించుకొనునట్లు ఆయన రాకడ కొరకు సిద్ధపరచు చున్నది (ఎఫే 5:27).
ప్రియ నేస్తం, ప్రకటన గ్రంధం 6వ అధ్యాయం ఒక్కసారి చదువుకొని రేపటి ధ్యానము కొరకు సిద్ధముగా ఉందామా. దేవదేవుని దీవెన, క్రీస్తు యొక్క కృపా సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనతోనుండి ముందుకు నడిపించు గాక. ఆమెన్
ప్రకటన 6:2 మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
ఏడు ముద్రలుగల ఆ గ్రంధమును విప్పుచున్న గొర్రెపిల్లను, దానిని చూడుము అని పిలిచిన ఒక జీవి స్వరమును గూర్చి ముందున్న వచనములో ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు యోహాను గారు చూచుచున్నది ఆ గ్రంధములో నున్న ఒక చిత్రపటమా? లేక కదులుతున్న దృశ్యమా??
అది ఒక చిత్రపటమైనట్లైతే; అతడు ఒక తెల్లని గుఱ్ఱము బొమ్మ. దాని మీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యున్నట్లు గీయబడిన బొమ్మ. అంతే కాదు, అతని చేతిలో ఒక విల్లు వున్నట్లున్నది. ఆ బొమ్మలో వున్న వ్యక్తీ కిరీటదారి. అట్లు గుఱ్ఱముపై కూర్చున్న వ్యక్తీ తానున్న ప్రదేశము నుండి బయటికి వేల్లిపోతున్నట్లున్నది ఆ దృశ్యము.
ప్రియ స్నేహితుడా, అది బొమ్మల పుస్తకము కాదు. అది దేవుని సన్నిధిలో దేవుని చేత సిద్దపరచబడి భద్రపరచబడిన గ్రంధమది. అది దర్శనముల గ్రంధము [It is a book of visions]. మరో మాట ఏమిటంటే; నిషిద్ధమైనదీ, నిర్జీవమైనది ఏదియూ పరలోకమందు లేదు, వుండదు. మాటాడుచున్న జీవులు, చలించుచున్న దూతలు, జీవ గ్రంధము, జీవనది, జీవ వృక్షము – జీవములేని దేదియూ పరలోకములో లేదు. అంతమాత్ర్హ్రమే కాదు అక్కడ నిత్యజీవమున్నది.
తెల్లని రంగు మనకు తెలుసు పరిశుద్ధతకు గురుతు. గుఱ్ఱము యుద్ధమునకు సన్నద్ధమైనట్టును జయించుచు జయించుటకును బయలు వెడలుచున్నది. దాని మీద ఒకడు అనగా మరిషిని పోలిన వాడున్నట్లు వ్రాయబడుచున్నది. ఆ కూర్చ్బున్నది ఎవరు? ప్రకటన గ్రంధములో తెల్లని గుఱ్ఱము అని రెండుసార్లు ప్రస్తావించబడినది.
ప్రక 19:11 లో తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు అని వ్రాయబడినది. 19:11 లో యూదా గోత్రపు సింహము యేసు క్రీస్తు రెండు పేళ్లతో పిలువబడుచున్నాడు, నమ్మకమైనవాడును సత్యవంతుడును అని. ఐతే ప్రస్తుతము మన ధ్యాన భాగములో వున్నవాని పేరేమీ తెలుపబడలేదు కాని అతడు క్రీస్తు ప్రతినిధిగా వున్నాడని మనము గ్రంహించాలి.
గొర్రెపిల్ల ఆ గ్రంధపు ఏడు ముద్రలు ఒక్కొక్కటి విప్పుచుండగా, ఒక్కో ముద్రకు ఒక్కో ప్రతినిధి పరలోకమునుండి భూమిమీదకు వెడలుచున్నట్లున్నది. ఇతడు విల్లు పట్టుకొనియున్నాడు. క్రీస్తు ఖడ్గము ధరిస్తాడు గాని విల్లుపట్టడు. ఒకవేళ మహిమా స్వరూపియైన యేసు అలా వెడలితే తప్పక ఆయన వెంబడి దూతల లేదా సైన్యముల సమూహము వుంటుంది.
కిరీటము అనగా ఘనతకు గురుతుగా ఇవ్వబడునని సంఘములకు వాగ్దానమున్నది. అలాగే ఇరువదినలుగురు పెద్దలు సైతము కిరీటములు ధరించియున్నారు. సాతాను తోను దాని దూతలతోను జరుగనైయున్న యుద్ధమునకు సూచనగా ఈ మొదటి గుఱ్ఱము మీద ఒకడు బయలు వెడలినట్టు మనము గ్రహించాలి. ముందున్న ముద్రల మర్మములు ఎరుగగలుగునట్లు ప్రబువు మనకు సహాయము చేసి నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 6:3 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
ఇప్పుడు సింహాసనము ముందున్న నాలుగు జీవులలో రెండవ జీవి *రమ్ము* అని పలికినది. ప్రక 4:8 లో మనము ధ్యానించినప్పుడు ఆ నాలుగు జీవులు భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును అని వ్రాయబడినట్లు చూశాము. ఆ నిత్యమైన ఆరాధననాపి యోహాను గారిని రమ్మని పలుకుట కొంత ఆశ్చర్యమునే కలిగించుచున్నది.
ఈ మాట వ్రాస్తున్న యోహాను గారు ఆ స్వరము యొక్క శబ్దము ఎలావున్నది తెలుపలేదు. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది (ప్రక 4:7 ) కనుక మొదటి జీవి మాటాడినప్పుడు సింహపు గర్జన వలే వున్నది అని అనుకుంటే, మరి రెండవ జీవి దూడవంటిది. తన స్వరము ఎట్లున్నది? తెలియదు.
ఐతే ఇక్కడ మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకము లోనికి తెచ్చుకోవాలి, ఏమంటే; మొదటి ముద్ర విప్పడానికి ఎంత సమయము పట్టినది ? మొదటి ముద్ర విప్పబడుటకు రెండవ ముద్ర విప్పబడుటకు మధ్య వ్యవధి ఎంత కాలము ? ఇదమిద్ధముగా చెప్పబడలేదు.
నేటి దినములలో మనము ఫలాని ముద్ర విప్పబడిన కాలములో వున్నాము అని చెప్పువారు వున్నారు. ప్రియ స్నేహితుడా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు వుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు (అపో 1:7) అంటున్నారు ప్రభువు.
ఒకవేళ అలా చెప్పే వారికి దర్శనమో పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచ బడుతూనో వుంటే మంచిదే. లేని యెడల గ్రుడ్డి వానికి గ్రుడ్డి వాడు త్రోవచూపిన చందమే. వ్యక్తిగతముగా ప్రార్ధన చేద్దాం. ప్రభువే మనకు మంచి బోధకుడు. నాడు యోహాను గారికి చూపించిన దృశ్యములు వినిపించిన స్వరములు మనకు అవగాహన కలుగునట్లు ప్రభువు మన మనోనేత్రములను వెలిగించునుగాక. ఆమెన్
ప్రకటన 6:4 అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్య బడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.¸
సాతాను తోను దాని దూతలతోను జరుగనైయున్న యుద్ధమునకు సూచనగా ఈ మొదటి గుఱ్ఱము మీద ఒకడు బయలు వెడలినట్టు మనము ధ్యానించాము. ఇపుడు రెండవ వాడు బయలు వెడలినట్టు చూచుచున్నాము. అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎఱ్ఱని గుఱ్ఱము. ఇది భూలోకములో అసమాధానము కలిగించుటకు వెడలుచున్నట్టు స్పష్టమౌచున్నది.
నేను [యెహోవా] రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని (యెహే 38:19. క్రీస్తు తాను ముందుగానే ప్రకటించిన రీతినే నెరవేరుచున్నది. నేను [యేసు] భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు (మత్త 10:34). నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు (యిర్మీ 25:16).
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని (మత్త 10:35). ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు (మత్త 10:36). జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును (మత్త 24:7). అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు (మత్త 24:9).
దేవుడే ఇలా చేస్తే మన మనుగడ అరణ్యరోదనమేనా!! లేదు ప్రియులారా, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్న (లూకా 2:14) దూతల సంగీతములు వినబడుచునే వున్నవి.
ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమే. నీజీవితములో ఎవరి ఇష్టము నేరవేరుచున్నది? మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను (యెష 53:6). ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక (లూకా 19:38). ఆమెన్
ప్రకటన 6:5 ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
ముద్ర విప్పుటకు ఎంత సమయము, ముద్రకు ముద్రకు మధ్య ఎంత సమయము అనే విషయమును ప్రక 6:3 లో ధ్యానించి యున్నాము. మూడవ ముద్ర విప్పబడినది. ఇప్పుడు సింహాసనము ముందున్న నాలుగు జీవులలో మూడవ జీవి *రమ్ము* అని పలికినది.
ఈ మాట వ్రాస్తున్న యోహాను గారు మూడవ జీవి యొక్క స్వరశబ్దము ఎలావున్నది తెలుపలేదు గాని మనుష్యుని ముఖము వంటి ముఖము గలది గనుక, ఆ జీవి మానవ స్వరముతో యోహాను గారిని పిలిచినట్టు వూహించగలము. బయలు వెడలిన ఒకడు నల్లని గుఱ్ఱముపై నున్నాడు, అతడు ఒక త్రాసు చేతపట్టుకొని వున్నాడు. త్రాసు న్యాయమును మరియు తూకమును సూచించుచున్నది.
ఈ దృశ్యము దేవుడైన యెహోవా సెలవిచ్చిన రీతిగానే కరవు సంభవింపనై యున్నది. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు (లేవి 26:26).
ప్రవక్తయైన యెహెజ్కేలుతో ప్రభువు తన దర్శనమును అనుభవ పూర్వకముగా ఎరుగునట్లు యెహే 4:10 లో నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను అని సెలవిచ్చి యున్నాడు. ఇది భూమిమీద నేరవర్చబోవు బహు శోచనీయమైన సంగతి.
ఏ తరము వారి కాలములో ఇది సంభవించునో గాని వారికి భోజనము వుండియూ అసంతృప్తి గానే అది వుంటుండ వచ్చును. యేసయ్య ఐదు రొట్టెలను రెండు చేపలను పంచి పెట్టినప్పుడు; వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి (మత్త 14:20). ఏడు రొట్టెలును కొన్ని చిన్నచేపలును పంచి పెట్టినప్పుడు వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి (మత్త 15:37).
యేసయ్య చెప్పారు: మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును (మత్త 24:20-22).
మన పిల్లల తరము వారికొరకు బలముగా ప్రార్ధన చేద్దాం. వారిని ప్రభువు దగ్గరకు నడిపించుదాం. క్రీస్తు కృప మీకు తోడై వుండును గాక. ఆమెన్
ప్రకటన 6:6 మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
తూకమును గూర్చిన నియమావళి మనకు యేహెజ్కేలు గ్రంధములో కనబడుచున్నది; ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను. తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను (యెహే 45:10-12).
నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు హెచ్చరిక స్వరము వినబడుచున్నది. అవును ప్రియులారా, ఇప్పటికే మనము వర్షపు నీటిని భద్రపరచుము [SAVE WATER], ఇంధనములను భద్రపరచుము [SAVE FUEL] అనే నినాదములు వింటున్నాము.
ప్రభువు రాకడకు ముందు రానున్న కరవు దినములను సూచించు ప్రవచనమును మనము ధ్యానించు చున్నాము. యేసయ్య సెలవిచ్చిన రీతిగానే: జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము (మత్త 24:7, 8).
అబ్రహాము దినములలో కరవులు వచ్చినట్టు చరిత్ర చెబుతున్నప్పటికీ, షోమ్రోనులో వచ్చిన కరవు గురించి వింటే తనువు గగుర్పొడుస్తుంది సుమా!! షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను (2 రాజు 6:25).
ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును (మత్త 24:22). ఇందు విషయమై ప్రార్ధన చేద్దామా. ప్రభువు మనతో నుండును గాక. ప్రభువు ఆత్మ మనల ముందుకు నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 6:7 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. దాని స్వరమేలాగున్నదో ఎరుగలేకున్నాము గాని *రమ్ము* అని పలుకుట వినబడినది.
మొదటి నాలుగు ముద్రలు విప్పబడుచున్నప్పుడు నాలుగు జీవులు యోహాను గారిని పిలుచుట, జరుగనైయున్న లేక సంభవింపనైయున్న సంగతులను చూపించుట మనకు కనబడుచున్నది. ఆ జీవులు ముందు వెనుక కన్నులతోనిండి యున్నవి (ప్రక 4:6). ఆయా సమయములందు నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పుచున్నవి (ప్రక 5:14).
మొదటి జీవి సింహమువంటిది, దాని స్వరము ఉరుమువంటి స్వరము; రెండవ జీవి దూడవంటిది, దాని స్వరము తెలుపబడలేదు; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది, కనుక మానవ స్వరము ఐయుండవచ్చునని భావించి యుంటిమి; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది, దాని స్వరము తెలుపబడలేదు.
స్వరమేదైననూ పలికినది ఒకే మాట *రమ్ము*. ప్రక 4:1 ప్రకారం యోహాను గారిని పరలోకమునకు రమ్మని పిలిచినదే ఇక జరుగవలసినవి చూపుటకు. కనుక యోహానుగారు చూసినదేమో, ఆయనగారు వ్రాసినదేమో, ఇక ముందుకు మనము ధ్యానించవలసినదేమో గాని, మర్మభూయిష్టమైన ఈ ప్రవచనన భాగాలను గ్రహింపగల ఆత్మను దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్
ప్రకటన 6:8 అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవభాగముపైన అధికారము వానికియ్యబడెను.
మొదటిది తెల్లనిగుఱ్ఱము, దానిమీద కూర్చున్న ఒకడు విల్లుపట్టుకొని యున్నాడు, అతనికి ఒక కిరీట మియ్యబడినది. అతడు జయించుచు, జయించుటకు వెళ్లెను. రెండవది ఎఱ్ఱని గుఱ్ఱము, భూలోకములో సమాధానము లేకుండ చేయువాడు దానిమీద కూర్చుని యున్నాడు. మూడవది నల్లని గుఱ్ఱము, దానిమీద కూర్చున్న వాడు ఒక త్రాసుచేత పట్టుకొని యున్నాడు. నాలుగవది పాండుర వర్ణముగల గుఱ్ఱము, దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. మొదటి ముగ్గురి పేళ్లు తెలుపబడలేదు.
సాతానుకును, దాని అనుచరులకును మరియూ జీవముగల దేవుని విడిచి దానిని వెంబడించిన వారికినీ మూడు శిక్షలు *అసమాధానము*, *కరవు*, *మరణము*. దేవుడు తన సైనికులను భూమి మీదకు పంపబోవుచున్నాడు. ప్రవక్తయైన జెకర్యా ప్రవచన దర్శనములో ఆ గుఱ్ఱములు రధములతో బయలు వెళ్లినట్టును, అవి భూమి మీదికి వచ్చి నలుదిక్కులకు వెళ్లినట్టునూ వ్రాయబడినది.
మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱ ములు, మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను. నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును. బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోక మందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను ( జక 6:2-8).
ఖడ్గమువలనను, కరవువలనను, మరణమువలనను, భూమిలోనుండు క్రూర మృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను. భూమి యొక్క ఉపరితలములో వున్న భూ భాగమే 29.2 శాతము మిగిలిన 70.8 శాతము నీళ్లు. దానిలోనే నాలుగవ భాగము మరణ శాసనమేలు చున్నట్లైతే మానవ జీవితములు అగమ్యగొచెరములే, కదా.
రక్షించుటకు గుఱ్ఱము అక్కరకురాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది (కీర్త 33:17-19). దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము (కీర్త 68:20).
యెహోషాపాతు ప్రార్ధనయే మనకు శరణ్యము. మా దేవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప పరలోక సైన్యముతో పోరాడి జయించుటకు మాకు శక్తి చాలదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేద్దాం. దేవ దేవుని కృప మనకు తోడై యుండును గాక. ఆమెన్
ప్రకటన 6:9 ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
ప్రకటన 6:10 వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
ప్రకటన 6:11 తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
ముందు మనము ధ్యానించిన నాలుగు ముద్రలకు యిపుడు ధ్యానించనైయున్న ఐదవ ముద్రకు చాలా వ్యత్యాసమున్నట్టు మనము గ్రహించ వలెను. మొదటి నాలుగు ముద్రలు విప్పబడినప్పుడు నాలుగు జీవులు మాటాడినట్టును, నలుగురు నాలుగు వేరు వేరు వర్ణములు గల గుఱ్ఱములపై బయలు వెళ్లినట్టును గమనించినాము.
క్రీస్తుయేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు (రోమా 8:1) అను వాక్య భావమేమిటో ఈ వచనము ద్వారా మనకు స్పష్టత కలుగు చున్నది. కనుక క్రీస్తు యేసులో వుండుట అనగా, క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తు కొరకు మరణించుట. అట్లు మరణించిన వారే హతసాక్షులు అనబడతారు. ఈ ముద్ర విప్పబడుట ద్వారా యోహాను గారు పరలోకములో తాను పొందబోవు స్థానమును చూడగలుగు తున్నాడు.
ప్రక 1:9 లోనే యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని అని వ్రాసి యున్నాడు. పత్మాసులోనే అతడు తన ఆత్మను దేవునికి అప్పగించుకొనినట్లు అతని జీవిత చరిత్ర చెబుతున్నది. యేసు: జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు (మత్త 24:9 ). తీర్పు మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు కారణమై యుండగా (రోమా 5:18) వారు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్న వారని [యోహాను గారు వ్రాసిన] యోహాను సువార్త 5:24 లో ముందుగానే యేసయ్య మాటలను తెలియ జేసినారు.
ఐదవ ముద్ర విప్పబడినప్పుడు వారు పరలోకములో దేవుని బలిపీఠము క్రింద దేవునికి మొరపెడుతున్న ఆత్మలుగా వున్నారు. ఇందు విషయమై వ్రాయబడినదేమనగా, యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను (లేవి 4:7).
ఐతే వారు మొరపెట్టుచున్న మొర ఏమి ? అని మనము ఆలోచించ వలసిన అగత్యము ఎంతైనా వున్నది. మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయక యింకా ఎంత కాలము ప్రభువా అని మొరపెట్టుచున్నారు. యేసు క్రీస్తు వారు ముందుగానే ఈ మర్మమును తెలిపిన విషయము ఆశ్చర్యము కలిగించు చున్నది. యేమనగా: నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును (మత్త 23:35).
ఆమేరకు వారు అనగా హత సాక్షులైన వారు లేక తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై శిరచ్చేదనము చేయబడిన వారు బ్రదికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసెదరు (ప్రక 20:4). వారికి ప్రభువు యిచ్చుచున్న వాగ్దానము ఏమైనది గ్రహించుదుము గాక. వారివలే చంపబడబోవువారి సహ దాసులయొక్క లేక సహోదరులయొక్క లేక విశ్వాసులయోక్క లెక్క పూర్తికాలేదు, అది పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడినది.
కనుక క్రీస్తు రాకడ సమీపించిన కొలది క్రైస్తవులు చంపబడుటకు దేవుని ప్రణాళికలో ఒక లెక్క వున్నది, ప్రియులారా. ఆది అపోస్తలుల కాలములో ఆది సంఘము హిసింపబడినప్పుడు అనేకులు హతసాక్షులు అయిన సంగతి మనకు విదితమే. ఐనప్పటికీ, ప్రకటన గ్రంధ ప్రవచనము నెరవేర్చబడినదని తలంచ వద్దు. ఈ ఐదవ ముద్ర మర్మము అంతా పరలోక దర్శనమే గాని భూమి మీదకు ఏమీ దిగివచ్చినట్టు కనబడలేదు.
ఒక్క విషయము మాత్రము విదితమైనది యేమనగా, యింకను అనేకులు హతసాక్షులుగా మారవలసి యున్నది. గత కొద్ది కాలము క్రితమే సిరియా దేశములో కొందరు క్రైస్తవ విశ్వాసులు వరుసగా మోకరింపజేసి శిరచ్చేదనము చేయబడినట్టు వీడియోలు చూసు క్రైస్తవ లోకము కన్నీరు కార్చినది. ఇంకెన్ని సంభవింపనై యున్నవో.
సంఘ కాపరుల కొరకు, సువార్తికుల కొరకు, బోధకుల కొరకు, క్రీస్తు సాక్షుల కొరకు ప్రార్ధన చేద్దాం. క్రీస్తు ఆత్మ మనల ముందుకు నడిపించునుగాక. ఆమెన్
ప్రకటన 6:12 ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
ప్రకటన 6:13 పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
ప్రకటన 6:14 మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
ఆరవ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందున్న యోహాను గారి ఆత్మ నేత్రము ఒక్కసారి భూమ్యాకాశముల వైపు మళ్లుకొని నట్టు గ్రహించ గలము. ఆకాశములోని గ్రహములు గతి తప్పినట్లున్నవి. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది (రోమా 8:19) అను పౌలుగారి మాటలు మనకు స్మరణకు వచ్చున్నవి కదా.
యేసయ్య సైతము చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును (మత్త 24:29) అని చెప్పారు. క్రీస్తు సిలువ దృశ్యము చూడలేక నాడే సూర్యుడు అదృశ్యుడాయెను (లూకా 23:45). కొండలు ద్వీపములు స్థానములు తప్పుట అనగా మహా భూకంపము కలిగెను.
ఆదిలోనే ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది (ఆది 3:17) అన్నారు. మనుష్యుల పాపములు ఆకాశమునంటుచున్నవి (ప్రక 18:5). వారి పాపము బహు భారమైనది (ఆది 18:20).
అవును ప్రభువా, మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది (ఎజ్రా 9:6). కనికరించి కరుణ చూపుము ప్రభువా అని ప్రార్ధన చేద్దాం. ప్రభువు మన ఆత్మలకు తోడై యుండును గాక. ఆమెన్
ప్రకటన 6:15 భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
ప్రకటన 6:16 బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
ప్రకటన 6:17 మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
పై వచనములో అనగా ప్రక 6:11 లో అనేకులైన క్రైస్తవులు లేక పరిశుద్ధులు చంపబడిన మీదట ఆరవ ముద్ర విప్పబడుట ద్వారా భూమ్యాకాశములు దేవుని వుగ్రతపాలు అయినట్లు కనబడుచున్నది. క్రైస్తవ లోకానికి అది చీకటి కాలము, అవే మహాశ్రమలు. ఆ బలిపీఠము క్రింద నుండి మొరపెట్టిన హతసాక్షుల ఆత్మల ఆర్తనాదము విన్న దేవుడు నిమిష మాత్రం కోపించినప్పుడు భూమ్యాకాశముల వైనం చూసిన యోహానుగారు ఇప్పుడు అన్యజనుల స్థితి ఎలా వున్నది అనే కోణం వైపు దృష్టి సారించినట్టు కనబడుచున్నది.
నాడు వధింపబడిన గొర్రెపిల్ల నేడు కొదమ సింహమై రాబోవుచున్నాడని వారెరుగరైరి. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు (యెష 2:19). వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు (కీర్త 115:4-7).
విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగ ద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును (యెష 2:9-11). ఈలోకపు అధికారము హోదా బలము ఐశ్వర్యము అక్కరకు రావు.
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు నట్లును నేను చేసెదను (యెష 13:13). యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును (యోవే 3:16).
ప్రియ స్నేహితుడా, ఇది లోకము రక్షణ పొందుటకు ఇవ్వబడుచున్న ఆఖరి తరుణం. మనము చూస్తూ వూరుకునే సమయం అంతకంటే కాదు. సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి (యూదా 1:22) అంటుంది వాక్యము.
రెండంచులు ఖడ్గము పూని సత్యసువార్త వీరుడవై ముందుకు సాగుము, జయము నీదే. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు (దాని 12:3). కాపరులు వారి సంఘమునకే పరిమితమై పోయి, సంఘస్తులు వారి వారి సంఘములలో నాయకత్వమునకే అమ్ముడుబోయి ఇంటింటి సువార్త, వీధి వీధి సువార్త కరువైపోయిన వైనం నేడు మనము చూస్తున్నాము. ఇకనైనా క్రీస్తు సువార్త ధ్వజము నెత్తుదాం. ఆత్మల సంపాదన దాహం కలిగియుందాము. ప్రభుని ఆత్మ మనల నడిపించును గాక. ఆమెన్.