ప్రకటన 8:1 ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
పరలోకములో నిశ్శబ్దము ఏమి సూచించుచున్నది? పరలోకములో అరగంట అనగా భూమి మీద మనకు ఎంత సమయము ? ప్రక 6 వ అధ్యాయములో నాలుగు ముద్రలు విప్పబడినప్పుడు నాలుగు జీవులు ఆరాధన నాపి యోహాను గారిని “రమ్ము” అని పిలిచినట్లు వ్రాయబడి యున్నది.
మరి ఇప్పుడైతే నిశ్శబ్దము అని వ్రాయబడుచున్నది. ఎందుకు నిశ్శబ్దము. గమనించ వలసిన ముఖ్యమైన సంగతి ఏదనగా, పరలోకములో సంభవించే చర్యలన్నిటికీ ప్రతి-చర్య భూమి మీద జరుగుచున్నది. క్లుప్తంగా చూచినట్లైతే ప్రకటన దర్శనము అంటేనే పరలోకములోను భూలోకములోనూ యేక కాలంలో జరిగే సంగతులు అని మనము గుర్తుంచు కోవాలి.
ఆరవ ముద్రను మనము ధ్యానించినప్పుడు ప్రక 7:1 లో భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని యున్నారు. ఎందుకు అంటే వారు దేవుని దాసులకు వారి నొసళ్ల మీద సజీవుడగు దేవుని ముద్ర ముద్రించుచున్నారు (ప్రక 7:3).
స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండి (1 పేతు 2:16) ఆ ముద్ర వేయించు కుందామా. అది ఎరుగని లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకుంటారట (1 థెస్స 5:3). యేసయ్య అదే మాటను యిలా చెప్పారు: నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండిరి (మత్త 24:37, 38).
కనుక ఆ దినము సమీపించిన కొలది మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి (లూకా 21:34). పరిశుద్దాత్మ దేవుడు మనలను ఆయన రాకడ వరకు శాంతముగలవారి గాను ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు (2 పేతు 3:14 ) మనలను సిద్ధపరచును గాక. ఆమెన్
ప్రకటన 8:2 అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను
దేవుని యెదుట నిలుచు దూతలు – దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును (లూకా 1:19); అలాగే యేసుక్రీస్తు వారు: చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచు చుందురని మీతో చెప్పుచున్నాను (మత్త 18:10).
అట్లు దేవుని సముఖములో వుండు దూతలు ఏడుగురు అని అర్ధం అవుచున్నది. వారిచేతిలో ప్రతి ఒక్కరికీ బూర యియ్యబడినది. వారు ప్రకటన 8:6 లో వూదుటకు సిద్ధముగా వున్నారు. దానికి ముందు ప్రకటన 8:3 నుండి ప్రకటన 8:5 వరకు వ్రాయబడిన సంగతులు విడిగా ధ్యానించుదాము. ప్రాముఖ్య మైన సంగతి ఏదనగా, ఏడవ ముద్ర చివరిది, అనగా సంపూర్ణ సంఖ్య యేడు తో ముద్రల మర్మం సంపూర్ణ మగుచున్నది.
ప్రక 7:14 లో మహాశ్రమలనుండి వచ్చిన వారు అనే మాట చదివినాము. అట్టి మహా శ్రమల కాలము ఆరంభమైనదని మనము గమనించాలి. శ్రమలు అనగా దేవుని కోపము అనియూ మహా శ్రమలు అనగా దేవుని ఉగ్రత అనియూ మనము ఎరుగవలెను. బూరలు యియ్యబడుట అనగా రాబోవు ఉగ్రత విషయమై హెచ్చరించ బడుట లేక ప్రకటించబడుటను సూచించు చున్నది.
గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారామీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి (హోషే 5:8).
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక (యోవే 2:1).
మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును (ఆమో 2:2).
యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువ బడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును (జక 9:14).
ప్రియ స్నేహితుడా, ఆ వాక్యము ద్వారా ప్రభువు నిన్ను నన్ను సిద్ధపరచు చుండగా, వినగల చెవులు గలవాదవై ఆ బాకా నాదపు స్వరము లేక ఆ బూరశబ్దము నీకు వినబడును గాక. ఆమెన్
ప్రకటన 8:3 మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహా సనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
ప్రకటన 8:4 అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
ప్రకటన 8:5 ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
ప్రకటన 8:6 అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
సువర్ణ దీపస్తంభములు (ప్రక 1:13), సువర్ణ కిరీటములు (ప్రక 4:4), సువర్ణపాత్రలు (ప్రక 5:8) సువర్ణధూపార్తి (ప్రక 8:3), సువర్ణ బలిపీఠము (ప్రక 9:13), సువర్ణ పాత్ర (ప్రక 17:4), పట్టణము శుద్ధసువర్ణ మయము (ప్రక 21:18), ప్రాకారపు పునాదులలో ఏడవది సువర్ణరత్నము, పదియవది సువర్ణల శునీయము (ప్రక 21:20), రాజవీధి శుద్ధ సువర్ణమయము (ప్రక 21:21).
సువర్ణ మయమైన ఆ పరలోకములో పరిశుద్ధుల ప్రార్ధన ఒక సుగంధ ద్రవ్యమై ఒక ధూప ద్రవ్యమై దేవాది దేవునికి అర్పించబడుచున్నది. కీర్తనాకారుడు నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక (కీర్త 141:2) అని ప్రార్ధించు చున్నాడు.
యాజకుడు యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను (లేవి 16:12).
అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసెను (సంఖ్య 16:46).
అట్లు యాజకుని దూపార్పణ లేక ఒక సంఘ కాపరి ప్రార్ధన సంఘములోని ఆత్మల నిమిత్తము చేయవలెను. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము (నిర్గ 30:7).
ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు (ప్రక 5:8). గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ 4:16).
ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని [సాతానును] శిక్షించును (యెష 29:6). ఈ వాక్య ధ్యానము అంతరంగములో ఉంచుకుని ఒక్కసారి మనసులో ప్రార్ధన చేద్దామా. ప్రభువు నీ నా ప్రార్ధనలను ఆస్వాదించి ఆఘ్రాణించి మహిమ పొందును గాక. ఆమెన్
ప్రకటన 8:7 మొదటి దూత బూర ఊదినప్పుడు ....... ప్రకటన 9:1 అయిదవ దూత బూర ఊదినప్పుడు .......
ప్రకటన 9:12 మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.
ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడియుండగా (ప్రకటన 8:6) పరిశుద్ధుల ప్రార్ధనలు దేవుని సన్నిధికి దూపముగా వేయబడుట ధ్యానించినాము. దూత ధూపమువేసి దేవుని ప్రజల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసిన (సంఖ్య 16:46) తరుణమే బూరలు వూదబడుట చూస్తున్నాము.
అట్లు మొదటి దూత బూర ఊదినప్పుడు ఆరంభమైన శ్రమలు ఐదవ దూత బూర వూదువరకూ కొనసాగినట్లు చూడగలము. మొదటి నాలుగు బూరల కంటే మిగిలిన మూడు బూరల ధ్వనితో ఇంకా కఠినమైన శ్రమలు కలుగబోవు చున్నట్టు తెలుపబడుచున్నది.
ఇది కేవలము సాతాను పై క్రుమ్మరించబడుచున్న దేవుని కోపమా!! సాతాను కూడా ఆత్మ స్వరూపియే కదా. మరి మానవులకు శ్రమలెందుకు? కాగా అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను దూతలు దానితో కూడ పడద్రోయబడిరి (ప్రక 12:9). ఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కా రముచేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను (ప్రక 13:4, 5). యూట్యూబ్ తెరిచి చూడు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా ఇంటర్నెట్ లో దేవదూషణతో కూడున వీడియోలు వైరల్ అవుతున్నాయో లెక్కపెట్ట లేము.
మొదటి దూత బూర ఊదినప్పుడు భూమిపైన వడగండ్లును అగ్నియు పడవేయబడెను; భూమిలో మూడవ భాగము కాలి పోయెను.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని సముద్రములో పడ వేయబడెను. సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణులు మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
మూడవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి పడెను. నీళ్లు చేదై పోయినందున అనేకులు చచ్చిరి.
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము కొట్టబడెను.
అయిదవ దూత బూర ఊదినప్పుడు మిడతలు భూమి మీదికి వచ్చెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులను అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
మరణము తధ్యమే కాని, దుర్మరణము పాలు కాకూడదు. ప్రియ స్నేహితుడా, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము (కీర్త 68:20). తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను (ప్రస 6:3). సామూహిక సమాధులు చూస్తూనే ఉన్నాము. బూరలు వూదబడతాయి, దేవుని ప్రణాలికను ఏ శక్తీ ఆపలేదు. మరి, నీవు సిద్ధమా ??