Matthew - మత్తయి సువార్త 5 | View All

1. ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

యేసుప్రభువు ఇక్కడినుంచి మత్తయి 7:28 వరకు ఇచ్చిన ఉపదేశాన్ని “కొండమీద ప్రసంగం” అంటారు. ఎందుకంటే ఆయన దీన్ని ఒక కొండపై చేశాడు. ఇంతకుముందు పరలోక రాజ్యం దగ్గరగా ఉన్నదని తెలియజేశాడు (మత్తయి 4:17), రాజ్య శుభవార్తను బోధించాడు (మత్తయి 4:23). ప్రజలను పశ్చాత్తాపపడాలని ఆయన ఆజ్ఞాపించడంలో ఆయన భావమేమిటో ఈ ప్రసంగం వివరిస్తున్నది. ఒక వ్యక్తి అంతరంగంలోను, బయటి ప్రవర్తన విషయంలోను దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఏమిటో ఇది తెలియజేస్తున్నది. ఆ రాజ్యంలో అమలులో ఉండే నియమాలనూ, మనుషుల్ని అందులో ప్రవేశించనియ్యకుండా చేసే విషయాలనూ ఇది వెల్లడి చేస్తున్నది. ఈ ప్రసంగం ఆరంభంలోనే “ధన్యులు” అనే మాట కనిపిస్తుంది. దీనిలో ఇంకా అనేక సార్లు కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రసంగం ధన్య జీవితం గురించీ, ధన్యులు అంటే ఎవరు, వారు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను గురించీ వివరిస్తున్నదనవచ్చు. పరలోక రాజ్యంలో ఉన్నవారే ధన్యులు (మత్తయి 5:3). దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎలా అనే విశేషమైన ఉపదేశం ఇక్కడ లేదు గాని అందులో ఎలాంటి మనుషులు ఉన్నారు, వారు ఏ విధంగా కావడానికి, ఏం చెయ్యడానికి పాటుపడాలి అనే విషయాలిక్కడ ఉన్నాయి. ఈ ప్రసంగం యేసుప్రభువును అనుసరించేవారికే, అందరికీ కాదు (వ 2). ఆయన్ను తమకు గురువుగా ఉపదేశకునిగా అంగీకరించనివారూ, అన్నిటిలోనూ ఆయన్నుండి నేర్చుకోవాలని ఇష్టం లేనివారూ ఈ ప్రసంగాన్ని నిజంగా, పూర్తిగా అర్థం చేసుకోలేరు. దీన్ని ఆచరించనూ లేరు. పశ్చాత్తాపపడి, యేసుప్రభువుపై నమ్మకం ఉంచడం ద్వారా దేవుని రాజ్యంలో ఉన్నవారికే ఈ ప్రసంగం గానీ అందులో లేనివారు వాస్తవంగా దీని ప్రకారం ప్రవర్తించడం అసాధ్యం (అక్కడొకటి, ఇక్కడొకటి వచనాలను బయటికి తీసి వాటి ప్రకారం జీవిస్తున్నట్టు కొందరు కనిపించవచ్చు). అలా ఎవరైనా చేస్తే ప్రయత్నం అనుకరణ, భ్రమ మాత్రమే అవుతుంది గాని వాస్తవం కాదు. భ్రష్టమైన పతనమైన మానవ స్వభావం (పుట్టుకను బట్టి మనందరిలోనూ ఉన్నది ఇదే – ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; యిర్మియా 17:9; రోమీయులకు 3:9, రోమీయులకు 3:23 చూడండి) దేవుని పవిత్రమైన ఆధ్యాత్మిక ఆదేశాలనూ, శాసనాలనూ పాటించడం అసాధ్యం (రోమీయులకు 8:6-7). వాటి ప్రకారం నడుచుకోవాలంటే మనలో మార్పు అవసరం. నూతన ఆధ్యాత్మిక జీవాన్నీ దేవుని పవిత్రాత్మనూ మనం పొందాలి. పశ్చాత్తాపపడి, యేసుప్రభువును నమ్మకం మూలంగా స్వీకరించినవారికే ఆయన ఆ ఆత్మను ఇస్తాడు (మత్తయి 3:11; యోహాను 7:37-39; యోహాను 14:16-17). ఆత్మలో జీవించడం మూలంగా మాత్రమే ఈ ఆధ్యాత్మిక నియమాలను మనం పాటించగలం. గలతియులకు 5:16-25 చూడండి. మనం ఎంతవరకు దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటామో క్రీస్తు ఉపదేశించిన రీతిలో అంతవరకు నడుచుకోగలుగుతాం. దేవుని ఆత్మ లేకుండా ఆధ్యాత్మికంగా ఉండడం అసాధ్యం. అందరూ దేవుని ఆత్మ ఉన్నవారు కారు (యోహాను 14:17; రోమీయులకు 8:9; 1 కోరింథీయులకు 2:14; యూదా 1:19). కొండమీద ప్రసంగాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేయడంవల్ల మనం దేవుని పిల్లలం, ఆధ్యాత్మిక జీవులం కాలేము. అయితే మనం దేవుని పిల్లలమైతే, ఈ ఉపదేశం ప్రకారం జీవించేందుకు ఆయన ఆత్మ సహాయంతో ఆరంభించాలి. ఎందుకంటే నిజంగా దేవుని పిల్లలుగా ఉండడం ఏమిటో, యేసులో నిజ విశ్వాసులుగా, నిజమైన శిష్యులుగా ఉండడం ఏమిటో ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. “శిష్యులు” గురించి మత్తయి 10:1 దగ్గర నోట్ చూడండి.

2. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను

“వారికి”– అంటే తన శిష్యులకు, ఆయన వెంట వెళ్తూ ఆయన్నుండి నేర్చుకునేందుకు సమస్తాన్నీ విడిచిపెట్టినవారికి. అయితే మత్తయి 7:28 ని బట్టి ఆయన పిలిచిన కొద్దిమంది శిష్యులే గాక చాలామంది ఇతరులు కూడా ఆ కొండకు వచ్చి యేసు ప్రసంగం విన్నారని అర్థం అవుతున్నది. ఈ మాటల్లో కొన్ని, ముఖ్యంగా ప్రసంగం ఆఖర్లో చెప్పిన మాటలు వీరికి కూడా వర్తిస్తున్నట్టు ఉన్నాయి.

3. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
యెషయా 61:1

“ధన్యులు”– “సంతోషంగా ఉన్న” అని అర్థాన్నిచ్చే గ్రీకు పదానికి తర్జుమా. అయితే మనస్సులో ఆనందం ఉండడం అని దీని అర్థం కాదు. ఇది ఒక ఆనంద స్థితి, ధన్యత, దీవించబడిన స్థితి, ముఖ్యంగా చివరికి దేవుని సన్నిధిలో శాశ్వతానందానికి దారి తీసే స్థితి. గ్రీకు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ పదం 50 సార్లు కనిపిస్తుంది – మత్తయి, లూకా శుభవార్తల్లోనే 28 సార్లు, ప్రకటన గ్రంథంలో 7 సార్లు ఉంది (మత్తయి 11:6 దగ్గర రిఫరెన్సులు చూడండి). దేవుణ్ణి గురించి ఈ పదాన్ని రెండు సార్లు వాడడం కనిపిస్తుంది – 1 తిమోతికి 1:11; 1 తిమోతికి 6:15, ఆ శాశ్వతుని పరిపూర్ణ పరమానందాన్ని గురించి ఇది తెలియజేస్తున్నది. క్రొత్త ఒడంబడికలో ఈ మాటను వ్యక్తులను ఉద్దేశించి వాడినప్పుడు ఆధ్యాత్మిక దీవెనల గురించీ, దేవుని రాజ్యంలో దేవుని పరిపాలన కింద ఉన్నవారి దీవెనల గురించీ చెప్తున్నది. దేవుని ఆనందమయమైన స్థితిలో అలాంటి వారికి భాగం ఉంది. అంటే దేవుని రాజ్యంలో ధన్యులైనవారికి దుఃఖాలు ఎప్పుడూ ఉండవనీ వారు ఎప్పుడూ ఆనందిస్తుంటారనీ అర్థం కాదు. వారి ఆనంద సంపూర్ణత భవిష్యత్తులో కలుగుతుంది. అయితే ఇప్పుడే దాని రుచి కొంత ముందుగా వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో తన ఆనందాన్ని పంచుకుంటాడు (యోహాను 15:11; యోహాను 17:13; రోమీయులకు 14:17; రోమీయులకు 15:13; 1 పేతురు 1:8). మనకు నిజ దేవునితో, ఆయన ధన్యతతో సంబంధం ఉన్నప్పుడే నిజమైన ధన్యత కలుగుతుంది. మనుషులు ఈ ధన్యతను తెలుసుకుని, దీన్ని తనతో పంచుకోవాలనే అసలు బైబిలు గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. “ధన్యత”, “దీవెన”ల గురించి నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; లూకా 11:28; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:3. ఈ లోకంలో ధన్యులెవరు? ధనికులా, గర్విష్ఠులా, అధికారం గలవారా? తమపై తమకు నమ్మకం ఉండి, తాము చాలా మంచివాళ్ళమని ఎంచుకొనేవారా? మనుషులు ఊహించేది ఈ విధంగానే. అయితే దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనల్లాంటివి కాదు (యెషయా 55:8-9; లూకా 16:15). తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్తించినవారు, దీనులు, వినయమనస్కులు ధన్యులు అని యేసు చెప్తున్నాడు. కారణం? పరలోక రాజ్యం వారిదే. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పశ్చాత్తాపం అవసరం (మత్తయి 3:2; మత్తయి 4:17). పశ్చాత్తాపపడేవారు ఎవరంటే తమ ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించినవారు. వారి పాపాల విషయం పవిత్రాత్మ వారిని ఒప్పిస్తాడు కాబట్టీ, తమ ఆధ్యాత్మికమైన లేమిని వారు గుర్తిస్తారు కాబట్టీ వారలా చేస్తారు. దేవుని ఎదుట చెప్పుకునేందుకు తమలో ఎలాంటి నీతిన్యాయాలూ, ఎలాంటి యోగ్యతా లేవని గ్రహిస్తారు. అందువల్ల వారు యేసుప్రభువు ఎదుట తమను తాము ధూళిలా ఎంచుకుని తగ్గించుకుంటారు. ఆయన్ను రక్షకుడుగా ప్రభువుగా స్వీకరిస్తారు. ఈ ధన్యతల్లో దీన్ని మొదటగా చెప్పినది ఎందుకంటే ఇది దేవుని రాజ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం. దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చవిచూశారు. అందుకని యేసు వారిని “ధన్యులు” అంటున్నాడు. ఈ ధన్యులు తమ గురించి గొప్పగా భావించేవాళ్ళు కాదు, తక్కువగా ఎంచుకునేవాళ్ళే. లూకా 18:10-14 చూడండి. ఇతర ఉదాహరణలు – ఆదికాండము 18:27; సంఖ్యాకాండము 12:3; యోబు 40:4; యోబు 42:5-6; కీర్తనల గ్రంథము 32:5; కీర్తనల గ్రంథము 40:17; కీర్తనల గ్రంథము 51:1-5; కీర్తనల గ్రంథము 90:8-9; యెషయా 6:5; యిర్మియా 3:25; దానియేలు 9:3-6, దానియేలు 9:20; రోమీయులకు 7:18-25; ఎఫెసీయులకు 3:8; 1 తిమోతికి 1:15. దీనికి వ్యతిరేకమైనవి లూకా 18:9; అపో. కార్యములు 8:9; ప్రకటన గ్రంథం 3:17 లో చూడండి. వినయ మనస్సు అనే ఈ గుణాన్ని దేవుడు చాలా విలువైనదిగా ఎంచుతాడు (మత్తయి 18:2-3; యెషయా 57:15; యెషయా 66:2; యాకోబు 4:6). తమ ఆధ్యాత్మికమైన పేదరికాన్ని గుర్తించినవారికి నిజమైన జ్ఞానప్రకాశం కలిగించి – కొంతవరకు తాము ఎలాంటివారో తమ నిజ స్థితి ఎలాంటిదో, దేవుడు ఎలాంటివాడో గుర్తించగలుగుతారు. తమను తాము దేవుడుగా వారెన్నటికీ ఎంచుకోరు. పైగా మనుషుల్లో తాము అధములమనీ, దేవునినుండి ఎలాంటి మేలైనా పొందడానికి యోగ్యులము కామనీ అనుకొంటారు. కేవలం దేవుని కృప ఒక్కటే మనలో ఈ గుణాన్ని కలిగించగలదు. స్వతహాగా స్వభావ సిద్ధంగా మనలో ఇది ముమ్మాటికీ లేదు. సహజంగా కొందరిలో ఉన్నట్టు సామర్థ్యం లేనివాణ్ణనే భావం, పిరికితనం, న్యూనతా భావం ఇలాంటివాటికి ఇప్పటిదాకా చెప్పినదానితో, సాధుగుణంతో (వ 5) ఏ సంబంధమూ లేదు.

4. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
యెషయా 61:2

“దుఃఖించేవారు ధన్యులు”– “విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు” అని చెప్పడంలాంటిది ఇది. యేసు ఇక్కడ తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానంవల్ల ఇది ఆయన ఉపదేశాలన్నిటిలోనూ ప్రాథమిక విషయమనీ, ఆయన రాజ్యం కట్టబడ్డ పునాదిలో ఒక ముఖ్యమైన రాయిలాంటిదనీ చూడగలం. ఈ వచనానికి ఇంతకుముందు వచనంతో సమీప సంబంధం ఉంది. ఎవరైతే తమ ఆధ్యాత్మిక దరిద్రాన్నీ తమ పాపాలనూ భ్రష్ట స్వభావాన్నీ గుర్తిస్తారో అలాంటివారు దుఃఖపడతారు. తాము అలాంటి పాపాత్ములమని శోకిస్తారు. బహుశా రానురాను మానవజాతి అంతా పడిపోయిన విచారకరమైన భ్రష్టస్థితిని బట్టి కూడా విలపిస్తారు. యేసు చెప్తున్నది ఇహలోక దుఃఖం, అంటే మనుషులకు తాము కోరినది దొరకనందువల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు. ఏదో నష్టపోయినందుకు, ఏదో విషయంలో ఆశాభంగం చెందినందుకు అనుభవించే దుఃఖం గురించి కాదు యేసు చెప్పేది. అలాంటి లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది (2 కోరింథీయులకు 7:10). దేవుని రాజ్యంలోనివారి దుఃఖం పశ్చాత్తాపాన్ని కలుగజేసే దైవ సంబంధమైన దుఃఖం. అందువల్ల అది దేవుని రాజ్య ధన్యతకు దారి తీస్తుంది. యాకోబు 4:8-10 పోల్చిచూడండి. కీర్తన 51లో ఇలాంటి దుఃఖం ఆ కీర్తనా రచయితలో ఏవిధంగా పని చేసిందో చూడండి. అలాంటివారికి ఇప్పుడే కొంతవరకు దేవుని ఓదార్పు లభిస్తుంది (యెషయా 40:1-2; యోహాను 14:1; యోహాను 16:33; 2 కోరింథీయులకు 1:3-5). రాబోయే కాలంలో సంపూర్ణంగా శాశ్వతంగా లభిస్తుంది (లూకా 16:25; ప్రకటన గ్రంథం 21:4).

5. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
కీర్తనల గ్రంథము 37:11

సాధుగుణం అంటే బలహీనత కాదు. నిజానికి అది గొప్ప ఆత్మబలం. ఇది దేవుని కుమారుడైన యేసుప్రభువులో ఉన్న లక్షణమే (మత్తయి 11:29; మత్తయి 21:5; 2 కోరింథీయులకు 10:1). ఆయన జీవితాన్ని గమనించడం ద్వారా అదేమిటో మనం అర్థం చేసుకోగలం. సాధుగుణం సైతానుకూ, పాపానికీ వ్యతిరేకంగా సత్యం పక్షాన బహు బలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైన లక్షణం (ఎఫెసీయులకు 6:10-17). దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడో వాటిని వినయంతో అంగీకరించడమే సాధుగుణం. దేవునికోసం బాధలను అనుభవించడానికి సమ్మతించడం, హేళన, తిరస్కారం పాలైనా కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడడమే సాధుగుణం (1 పేతురు 2:21-23 చూడండి). దేవుని సంకల్పానికీ, తమపై దేవుని పరిపాలనకూ తమను తాము లోబరచుకుని ఆయనకోసం భరించవలసినవాటిని భరించేవారే సాధుగుణం గలవారు (మత్తయి 26:39, మత్తయి 26:42; యోహాను 18:11). అలాంటివారు నేడు భూమిపై ఆధ్యాత్మికంగా బలిష్ఠులు, రాబోయే కాలంలో లోకమంతటినీ వారసత్వంగా పొందబోయేవారు. దేవుడు ఈ భూమిని సాధుగుణం గలవారికి ఇచ్చే సమయంలో అత్యాశపరులకూ, లోభులకూ, అవకాశ వాదులకూ, తమకే అంతా లభించాలని ముందుకు తోసుకువచ్చే వారికీ, స్వార్థంతో అధికారం, ఆస్తిపాస్తులు, పేరుప్రతిష్ఠలు దండుకోవాలని చూచేవారికి ఏమీ దక్కదు. కీర్తనల గ్రంథము 37:1, కీర్తనల గ్రంథము 37:11 పోల్చిచూడండి. ఆ కీర్తన అంతా సాధుగుణం గలవారికీ, లేనివారికీ మధ్యగల తేడా చూపుతుంది. ఈ సాధుగుణం కలగడం ఎలాగా? ఇతర ఆధ్యాత్మిక గుణాలు కలగడం ఎలాగో ఇదీ అలాగే. దీన్ని వాటన్నిటినీ దేవుని ఆత్మ మాత్రమే మనలో కలుగజేయగలడు. మనం దేవునికి లోబడుతూ ఉంటే ఆయన అలా చేస్తాడు. మనిషికి తన గురించీ, ఇతరుల గురించీ సరైన అభిప్రాయాన్నీ, దేవునిపట్ల సరైన మనసునూ కలిగించడం మూలంగానే ఆయన ఇలాంటి గుణాన్ని మనలో పుట్టించి పెంపొందిస్తాడు.

6. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.

నీతినిజాయితీ అనేది బైబిల్లో కనిపించే గొప్ప మాట. నీతి నిజాయితీ, న్యాయం, లేక అదే అర్థాన్ని ఇచ్చే పదాలు బైబిల్లో దాదాపు 740 సార్లు కనిపిస్తున్నాయి. దేవుడు పరిపూర్ణ న్యాయవంతుడు, ఆయన రాజ్యం, ఆయన ఉద్దేశాలు, ఆశయాలు, చర్యలు, మనుషులతో వ్యవహరించే తీరు నూటికి నూరు పాళ్ళూ నీతినిజాయితీ గలవి, న్యాయమైనవి (ఎజ్రా 9:15; కీర్తనల గ్రంథము 11:7; కీర్తనల గ్రంథము 19:9; కీర్తనల గ్రంథము 36:6; కీర్తనల గ్రంథము 97:2; కీర్తనల గ్రంథము 145:17; దానియేలు 9:14; యోహాను 17:25). ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో ఉండగోరినవారు నీతిన్యాయాలు గలవారై ఉండాలని ఆయన నియమం. సుఖాల కోసం, ధనం కోసం, లేక ఆధ్యాత్మిక అనుభవాలకోసమైనా సరే ఆకలిదప్పులు ఉన్నవారు ధన్యులని చెప్పడం లేదు. స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు (మనమందరికీ అన్నమాట) అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనవి నీతిన్యాయాలు. దేవునితో కలిసి ధన్య స్థితిలో శాశ్వతంగా జీవించగోరితే వారు వెతకవలసినది దీన్నే. మనం కోరేది, వెతికేది ఏమిటో దాన్ని బట్టి మనం ఎలాంటివారమో అర్థం చేసుకోవచ్చు. క్రీస్తులో నమ్మకం పెట్టడం ద్వారా దేవుని పిల్లలైనవారు (యోహాను 1:12-13) నీతిన్యాయాలను అపేక్షిస్తారు. తాము న్యాయవంతులం కావాలనీ, భూమిపై న్యాయానికి పైచేయి కావాలనీ ఆశిస్తారు. దేవుని ఆత్మ వారిలో ఇలాంటి కోరిక పుట్టిస్తాడు. ఇది కనీసం కొంతవరకైనా మన అనుభవం కాకుంటే దేవుని నీతిన్యాయాలు గల రాజ్యం గురించి మనకు ఏమీ తెలియదన్నమాటే. ఏమీ ఆకలి లేకుండా ఏమీ దాహం లేకుండా ఉన్న వ్యక్తికి జబ్బు చేసిందన్నమాట. నీతినిజాయితీ కోసం ఏమీ ఆకలిదప్పులు లేనివారు ఆత్మ సంబంధంగా చనిపోయినవారు (ఎఫెసీయులకు 2:1). అన్ని కోరికలనూ త్యజించాలని బైబిలు చెప్పదు. మనకు న్యాయమైన కోరికలు ఉండాలనీ, తగిన విషయాలపట్ల తీవ్రమైన ఆకలిదప్పులు కలిగి వాటిని ఆశించాలని బైబిలు నేర్పుతున్నది. తన గురించి తాను తృప్తిపడి ఊరుకునేవారితో దేవుని రాజ్యానికి పనిలేదు. శరీరం అన్నం, నీళ్ళకోసం ఎలా అలమటిస్తుందో ఆ విధంగా అన్నిటికీ తెగించి, బాధలకోర్చి నీతి న్యాయాలను కోరుకునే వారికే దేవుని రాజ్యం. తమ గుణాలు ఎలా ఉన్నాయో వాటితో తృప్తిపడి ఊరుకుని, లోకమంతా వెళ్ళేదారిలో వెళ్తూ ఉండేవారు నిజమైన ధన్యతను అనుభవించరు, అది ఏమిటో వారికి తెలియదు. నీతినిజాయితీ కోసం ఆకలిదప్పులు గల మనిషిని గురించి 119వ కీర్తనలో చూడండి. నీతినిజాయితీని వెతకడమంటే న్యాయవంతుడైన దేవుణ్ణి గురించి ఆకలిదప్పులు కలిగి వెదకడం (కీర్తనల గ్రంథము 42:1-2; కీర్తనల గ్రంథము 63:1 చూడండి). ఆయనతో ఎడతెగని సహవాసం, సరైన సంబంధం కోసం వెదకడం. పరిపూర్ణ న్యాయవంతుడైన యేసుప్రభువు లాగా (అపో. కార్యములు 3:14; 1 పేతురు 2:21-22; 1 పేతురు 3:18; 1 యోహాను 2:1) ఉండడానికి ఆకలిదప్పులు కలిగి వెదకడం. అంధకారం, అవినీతి, అధర్మం, నీచం, అనర్హం, అపవిత్రం, కల్మషం అయినవాటి జోలికి ఇక పోకుండా ఉండాలన్న దృఢమైన అభిలాష కలిగి ఉండడం. ఇలాంటి వారికి తృప్తి కలుగుతుంది. ఎప్పుడు? ఈ జీవితంలో క్రమంగానూ (2 కోరింథీయులకు 3:18; ఎఫెసీయులకు 4:24; ఫిలిప్పీయులకు 3:12), క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు సంపూర్ణంగానూ కలుగుతుంది (రోమీయులకు 8:29-30; ఎఫెసీయులకు 5:25-27; 1 యోహాను 3:1-3).

7. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

మనం ఇతరుల పట్ల కరుణ చూపాం గనుక దేవుడు కూడా మనపట్ల కరుణ చూపి, మనల్ని రక్షించి తన రాజ్యంలోకి చేరుస్తాడని అనుకోకూడదు. పాపులు అంతకుముందు ఎవరినన్నా కరుణించారా లేదా అన్న విషయంపై వారిని రక్షించే దేవుని కరుణ ఆధారపడదు. అపో. కార్యములు 9:1-6; 1 తిమోతికి 1:13-14 పోల్చి చూడండి. పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం ఉంచడం మూలానే రక్షణ, పాపవిముక్తి కలుగుతుంది (యోహాను 3:16; అపో. కార్యములు 16:31; ఎఫెసీయులకు 2:8-9; తీతుకు 3:3-6). అయితే దేవుని కరుణవల్ల రక్షణ, పాపవిముక్తి అనుభవించిన వారు ఇతరులపట్ల కరుణ చూపాలి. అలాంటివారిని వారి జీవిత కాలమంతా దేవుని కరుణ వెన్నంటే ఉంటుంది (కీర్తనల గ్రంథము 23:6). ఈ వచనంలో దేవుని రాజ్యం గురించిన ఆధ్యాత్మిక సూత్రం రాసి ఉంది. ఇది బైబిల్లో వేరే చోట్ల కూడా ఉంది (మత్తయి 6:14-15; కీర్తనల గ్రంథము 18:25-26; గలతియులకు 6:7). మనుషులు తన కరుణ అనుభవించి తన రాజ్యంలోకి ప్రవేశించిన తరువాత ఆధ్యాత్మిక సూత్రాలను దేవుడు పక్కన పెట్టేయ్యడు. మనుషులు తమ సాటివారిని దయ చూడకపోతే దేవుడు తమను దయ చూడాలని ఎదురు చూచే హక్కు వారికేమి ఉంది? నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో, కొంతవరకైనా ఎలా ఉన్నారో ఈ వచనం తెలుపుతున్నది. దేవుడు మనుషులను పాపం నుంచి విడిపించి రక్షించినప్పుడు వారు ఎలాంటివారై ఉండాలో ఆ విధంగా వారిని మలచడం ఆరంభిస్తాడు. మనం కరుణ గలవారంగా తయారు కాకపోతే దేవుడు మనల్ని మార్చలేదనీ, ఆయన కరుణామయ రాజ్యంలోకి మనల్ని చేర్చలేదనీ మనకు మనమే బయట పెట్టుకుంటున్నామన్నమాట. కరుణ చూపడమంటే ఏమిటి? కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి సహాయకరమైన దయ గల పనులు చేయడమే (మత్తయి 25:31-46; లూకా 10:37; ఎఫెసీయులకు 4:32; హెబ్రీయులకు 6:10; యాకోబు 3:17), మనల్ని బాధ పెట్టినవారిని క్షమించి వారికి మేలు చేయడమే. మత్తయి 18:21-35; లూకా 10:30-37 పోల్చి చూడండి. దీనికి అమోఘమైన మాదిరి యేసుప్రభువే.

8. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
కీర్తనల గ్రంథము 24:2

శుద్ధ హృదయులు అంటే ఇప్పుడు ఈ లోకంలో పాపమేమీ లేనివారు అని కాదు. అలా అయితే భూమిమీద ఉన్నవారెవరూ ఎన్నడూ “దేవుణ్ణి చూడరు. మత్తయి 7:11; రోమీయులకు 7:18; గలతియులకు 5:16-17; యాకోబు 3:2; 1 యోహాను 1:8 చూడండి. “మా అపరాధాలను క్షమించు...” అని ప్రార్థన చెయ్యాలని యేసు తన శిష్యులందరికీ నేర్పించాడు (లూకా 11:4). “శుద్ధ” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి కల్తీ లేకుండా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. కల్తీ లేని పాలు అంటే నీరు గానీ మరి ఏదైనా గానీ కలపని పాలు. శుద్ధమైన ధాన్యం అంటే పొట్టు వేరుచేసిన ధాన్యం. “శుద్ధ” అంటే కల్మషం, దోషం లేకుండా అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల శుద్ధ హృదయం (ఒక వ్యక్తి అంతరంగ స్థితి) అంటే నింద లేకుండా, యథార్థంగా కపటం లేకుండా ముక్కుసూటిగా, ఉద్దేశాలు, తలంపులు, భక్తిభావాల విషయంలో రెండు మనసులు లేకుండా, మోసం, అంధకారం లేకుండా ఉన్న హృదయం అనే అర్థం చెప్పుకోవచ్చు. యాకోబు 4:8 చూడండి. దేవునిపైనా, నీతిన్యాయాలపైనా సంపూర్ణంగా లగ్నమైన హృదయం అది (కీర్తనల గ్రంథము 86:11; 1 రాజులు 15:14; 2 దినవృత్తాంతములు 16:9 పోల్చి చూడండి). మన బ్రతుకులో బయటి విషయాలను శుద్ధంగా చేసుకుంటే సరిపోదు (మత్తయి 23:25-28 చూడండి). మనం అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు (కీర్తనల గ్రంథము 51:6, కీర్తనల గ్రంథము 51:10). దేవుడు, ఆయన ప్రజలు శ్రద్ధ చూపేది, చూపవలసినది మానవ హృదయం గురించి. విభజనకు గురికాని పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వవలసింది దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా వారు తమ హృదయాల్ని కాపాడుకోవలసింది (సామెతలు 4:23; 2 కోరింథీయులకు 7:1). క్రీస్తు ఉపదేశం గురి ఇదే – పవిత్రత, హృదయంలో ఏకీభావం, నిజ దైవదర్శనం. హృదయ పవిత్రత పశ్చాత్తాపంతోనూ క్రీస్తు పైని నమ్మకంతోనూ ఆరంభమౌతుంది (అపో. కార్యములు 15:9). పాపులకోసం క్రీస్తు తానే బలి అయినందువల్ల వారి అంతర్వాణినీ, అంతరంగాన్నీ శుద్ధీకరిస్తాడు (హెబ్రీయులకు 9:14; హెబ్రీయులకు 10:22). ఆ తరువాత విశ్వాసులు వెలుగులో నడుచుకొంటూ, ఇది తప్పు అని దేవుడు చూపించిన దానంతటినీ విసర్జించాలి (1 యోహాను 1:5-7). “దేవుణ్ణి చూస్తారు”– ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులకు ఆధ్యాత్మిక జ్ఞానప్రకాశం ఉంది. దేవుడు వారికి తెలుసు (యోహాను 9:39; యోహాను 17:2-3, యోహాను 17:6; అపో. కార్యములు 26:17-18; 2 కోరింథీయులకు 4:4-6; 1 పేతురు 2:9). వారు తమ ఆత్మ నేత్రాలతో చూస్తారు. చివరికి వారు క్రీస్తును ఆయన దివ్య మహిమాప్రకాశంతో సహా చూస్తారు (1 యోహాను 3:1-3; 1 కోరింథీయులకు 13:12; ప్రకటన గ్రంథం 22:3).

9. సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.

“సమాధానం”– ఇదీ, శాంతి అనే మాటా బైబిల్లో సుమారు 250 సార్లు కనిపిస్తాయి. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో సుమారు 90 సార్లు ఇవి కనిపిస్తాయి. యోహాను మొదటి పత్రికలో తప్ప మిగతా పుస్తకాలన్నిటిలోనూ ఇవి లేక వీటిలో ఒకటి కనిపిస్తాయి. సమాధానం చేకూర్చేవారు అంటే ఏమిటి? దేవుని విధానంలో శాంతిని కోరి దానికి పాటుపడడం. సత్యాన్ని లేక నీతినిజాయితీని, లేక న్యాయాన్ని పక్కన పెట్టి శాంతికోసం ప్రయత్నించడం కాదు. శాంతి అనేది లేనప్పుడు శాంతి, శాంతి అనడం కాదు (యిర్మియా 6:14). చెడుతనంతో రాజీపడడం కాదు. నిజమైన శాంతి సమాధానం నీతిన్యాయాలపై ఆధారపడి ఉండాలి. దుర్మార్గులకు సమాధానం అనేది ఉండడం అసాధ్యం (యెషయా 32:17; యెషయా 48:22). వ్యక్తులు, కుటుంబాలు, దేశాల మధ్య పోరాటాలు, కక్షలు, సంఘర్షణలు, యుద్ధాలు ఎందుకు వస్తాయి? పాపం వల్ల – గలతియులకు 5:9-21; యాకోబు 3:16; యాకోబు 4:1-2 చూడండి. సమాధానం చేకూర్చేది ఏది? మనుషులను వారి పాప స్వభావ దాస్యం నుంచి విడిపించేదే. ఇలా చేసేది ఏదైనా సమాధానం చేకూరుస్తుంది. అంటే మనుషులకు దేవుని సత్యాన్ని నేర్పడం, దేవునితో సఖ్యపడడం ఎలాగో చూపించడం – ఇలాంటివాటికి మనిషి సమ్మతిస్తే – అది సమాధానం చేకూరుస్తుంది. దేవునితో సమాధానం, హృదయంలో దేవుని శాంతి ఉంటే ఇతరులతో సమాధానం ఉంటుంది. క్రీస్తులో దేవుడు గొప్ప సమాధానకర్త. 2 కోరింథీయులకు 5:18-21; ఎఫెసీయులకు 2:14-18; కొలొస్సయులకు 1:21-22 చూడండి. శాంతి ప్రయత్నాలు చేసే మనుషులు ఒకటి గమనించాలి. శాంతి సమాధానాలు లేకపోవడానికి నిజమైన కారణం పాపం. దానికి నిజమైన నివారణ క్రీస్తు శుభవార్త. అలాగే సమాధానం చేకూర్చేవారికి ఇంతకుముందు చెప్పిన ధన్యతల్లోని లక్షణాలు కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే వారు సత్యం, న్యాయం, నమ్మకం కోసం గట్టిగా నిలబడతారు (ఎఫెసీయులకు 6:10-17; 1 తిమోతికి 6:12; 2 తిమోతికి 4:7; యూదా 1:3). ఇదే సమయంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ, మనుషుల మధ్య సమాధానం పెంపొందించేందుకు ప్రయత్నిస్తారు (రోమీయులకు 12:18; రోమీయులకు 14:19; 1 కోరింథీయులకు 7:15; హెబ్రీయులకు 12:14; 1 పేతురు 3:11). సమాధానం చేకూర్చేవారిని దేవుని సంతానం అనడం ఎందుకు? ఎందుకంటే దేవుడు శాంతికి దేవుడు (రోమీయులకు 15:33; హెబ్రీయులకు 13:20). మనుషులను తనతో సమాధాన స్థితికి తీసుకువచ్చేందుకు ఎంత వెలనైనా సరే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్యాయం తప్ప దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో మనుషులు ఆయనను పోలి ఉంటే వారిని సమాధానకర్త అయిన దేవుని సంతానంగా ఇతరులు గుర్తిస్తారు (వ 16 పోల్చిచూడండి).

10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

ధన్యతల్లో ఇది చివరిది – వ 11,12లోది కొత్తది కాదు. ఆ వచనాల్లో ఈ ధన్యత గురించే మరింత సమాచారం ఉంది. ఈ ధన్యత విన్నవారికి వింతగా అనిపించవచ్చు. అయినా ఇది సత్యం. “నీతి న్యాయాల కోసం”– దేని విషయం హింసకు గురి కావాలి? రాజకీయ, సామాజిక, మత కారణాలవల్ల కాదు, రంగు, కులం, జాతి భేదాల గురించి కాదు, వెర్రి భక్తి, తీవ్రవాదం, నేరాల మూలంగా కాదు. నీతిన్యాయాల కోసం హింసకు గురి కావాలి. ఈ గుణం దేవుని సంతానానికీ, ఇతరులకూ ఉన్న తేడాను చూపిస్తుంది (యోహాను 15:20-21; 2 తిమోతికి 3:12; 1 పేతురు 4:14-16). వారు దేవుని నీతిన్యాయాల పక్షాన నిలబడుతున్నవారు కాబట్టీ, దాని కోసం హింసల పాలై చనిపోయేటంతగా దాన్ని ప్రేమించినవారు కాబట్టీ వారు ధన్యులు. ఇది నిజంగా ధన్యకరమైన స్థితి. ప్రపంచం చెడు కోరికలతో, గర్వంతో, సత్యం గురించిన ద్వేషంతో నిండి ఉంది. పాపంలో ఉన్నవారికి నీతిన్యాయాలంటే గిట్టదు. దానికోసం నిలబడేవారితో వారు పోరాడతారు, న్యాయవంతుడైన దేవుణ్ణి ఎదిరిస్తారు – యోహాను 3:19-20; యోహాను 7:7; యోహాను 15:18, యోహాను 15:24; రోమీయులకు 1:29-32; రోమీయులకు 8:7; రోమీయులకు 12:2; 1 యోహాను 2:16;1 యోహాను 3:12; 1 యోహాను 5:19. (వారు దేవుని న్యాయవంతుడైన కుమారుణ్ణి హింసించి చంపారు – అపో. కార్యములు 3:13-15). యేసుప్రభు శిష్యులు నీతిన్యాయాలు గలవారు, సమాధానం చేకూర్చేవారు. అయితే మనుషులు వారిని తిరస్కరించి, కొరడాలతో, రాళ్ళతో కొట్టి, చెరసాల పాలు చేసి చంపారు (అపో. కార్యములు 5:40; అపో. కార్యములు 7:57-58; అపో. కార్యములు 12:1-4; అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 16:22-24; 2 కోరింథీయులకు 11:23-26; 2 తిమోతికి 3:10-12). అయినప్పటికీ ఈ లోకంలో ధన్యులు వారే. పరలోక రాజ్యం వారిదే. వారి బాధలు, కష్టాలు కొద్ది కాలమే ఉండేవి. వారి ధన్య స్థితి శాశ్వతం.

11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

వ 10 లోని ధన్యత గురించే ఈ వచనంలో కూడా ఉంది. నీతిన్యాయాల కోసం హింసకు గురి కావడమంటే తనకోసం హింస పొందడమేనని యేసు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతిన్యాయాలు గలవారిని మనుషులు హింసించే ఒక పద్ధతి వారిని గురించి అబద్ధాలు, అపనిందలు పలకడం. అయితే దుర్మార్గులు అసహ్యించుకునే వ్యక్తులుగా ఉండగలగడం ధన్యతే.

12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
2 దినవృత్తాంతములు 36:16

నీతినిజాయితీ కోసం, క్రీస్తు కోసం హింసకు గురి కావడం అనేది ఆయన ప్రజల మేలుకే అని తెలియడం మూలంగా హింసల్లో ఆనందించగలిగే స్థితి కలుగుతుంది. రోమీయులకు 8:17-18; 2 కోరింథీయులకు 4:17-18; 1 పేతురు 1:6-7 పోల్చి చూడండి. దేవుడు తన సేవకులకు ప్రతిఫలమిస్తాడన్న సత్యం క్రొత్త ఒడంబడిక గ్రంథంలో తరచుగా కనిపిస్తుంది (మత్తయి 10:41-42; మత్తయి 16:27; మార్కు 9:41; లూకా 6:35; 1 కోరింథీయులకు 3:8, 1 కోరింథీయులకు 3:14; కొలొస్సయులకు 3:24; హెబ్రీయులకు 10:35; 2 యోహాను 1:8; ప్రకటన గ్రంథం 11:18; ప్రకటన గ్రంథం 22:12). “మీకు పూర్వం ఉన్న”– మత్తయి 23:34-37; అపో. కార్యములు 7:52; హెబ్రీయులకు 11:35-38 చూడండి. బాధల్లో ఆనందించడం క్రీస్తు రాయబారుల లక్షణం – అపో. కార్యములు 5:41; అపో. కార్యములు 16:22-25; కొలొస్సయులకు 1:24; 1 పేతురు 4:13.

13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

దేవుని ప్రజలు లోకానికి ఉప్పువంటివారు. మిరియాల పొడి, లేక చక్కెరవంటి వారు కాదు. “మీరు” అంటే దేవుని రాజ్యానికి చెందినవారు, 3-12 వచనాల్లో చెప్పిన లక్షణాలు గలవారు, ముఖ్యంగా నీతినిజాయితీకోసం క్రీస్తుకోసం బాధలు అనుభవించినవారు. అయితే ఇలాంటివారు ఈ లోకానికి ఉప్పుగా ఉండడం వల్ల ఈ లోకం దేవునికి రుచికరంగా అనిపిస్తుందని కాదు. ఇక్కడి అర్థం వేరు. ఉప్పు పదార్థాలను నిలువ ఉంచేందుకు తోడ్పడుతుంది. ఈ లోకం పూర్తిగా కుళ్ళిపోకుండా, దేవుని కోపంవల్ల నాశనం అయిపోకుండా ఉంచుతారు వీరు (ఆదికాండము 18:26; ఆదికాండము 19:22 పోల్చిచూడండి). “త్రొక్కబడడానికి”– వ 3-12లోని లక్షణాలు లేని క్రైస్తవ్యం పనికి రానిది, బయట పారేసి నాశనం చెయ్యడానికే అది తగినది (లూకా 14:34-35).

14. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.

వ 3-12లో వర్ణించబడినవారు దేవుని నూతన సృష్టి. భూమిపై ఆధ్యాత్మికమైన వెలుగును ఇచ్చేందుకు సృష్టించబడ్డారు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి వెలుగుగా ఉన్నాడు (యోహాను 8:12; యోహాను 9:5). ఇప్పుడు ఆయన్ను అనుసరించేవారు “వెలుగు సంతానం”, ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారు (యోహాను 12:35-36; రోమీయులకు 13:12; 2 కోరింథీయులకు 4:4-6; ఎఫెసీయులకు 5:8; 1 థెస్సలొనీకయులకు 5:5).

15. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.

16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.

కాంతిని ప్రకాశించనియ్యాలంటే అన్నిట్లో ఇది మంచి విధానం. మంచి మాటలు కాదు, మంచి ఉద్దేశాలు కాదు, మంచి పనులు చెయ్యాలి. ఇతరులకు ఎప్పుడూ దయ చూపకుండా సహాయం చేయకుండా చాలామంది తమకేదో వెలుగు, జ్ఞానప్రకాశాలు కలిగినట్టు గొప్పలు చెప్పుకుంటారు. అదంతా వ్యర్థం. “తండ్రి”– దేవుణ్ణి గురించి యేసు ఉపయోగించిన పేర్లలో ఈ పేరును ఎక్కువ సార్లు, అంటే దాదాపు 170 సార్లు ఉపయోగించాడు. క్రొత్త ఒడంబడిక అంతట్లో ఈ పేరు 350 కంటే ఎక్కువ సార్లు ఉంది. దేవుడు ఎంతో శ్రద్ధ, ప్రేమ కలిగి, నిజమైన మంచి తండ్రిలాగా తన పిల్లల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్న వ్యక్తి అని దీని అర్థం. ఆయనకు ఆధ్యాత్మికంగా పిల్లలు ఉన్నారని కూడా ఈ పేరు సూచిస్తున్నది (వ 9; యోహాను 1:12-13). మనం మంచి పనులు చేయవలసినది మనుషులు ఆయన్ను స్తుతించాలని గాని మనకు మెప్పు కలగాలని కాదు (1 కోరింథీయులకు 10:31 పోల్చిచూడండి).

17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
యెషయా 42:21

ధర్మశాస్త్రం, ప్రవక్తలు అనే మాటలను పాత ఒడంబడిక అంతటినీ ఉద్దేశించి యూదులు ఉపయోగించారు. తన ఉపదేశాలు పాత ఒడంబడికకు అనుగుణంగా ఉన్నాయనీ, దాని శాసనాలు, సాదృశ్యాలు, సూచనలు, అర్పణలు, భవిష్యద్వాక్కులు తననే సూచిస్తున్నాయనీ యేసుప్రభువు చెప్తున్నాడు. అందులోని ఆధ్యాత్మిక సూత్రాలన్నీ, అందులోని నీతిన్యాయాల సంపూర్ణత అంతా ఆయన మూలంగా నెరవేరాయి. అందులో వెల్లడి అయిన దేవుని సంకల్పాన్నంతటినీ సాధించేందుకు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రం, ప్రవక్తలూ చిత్రీకరించిన, వర్ణించిన, ముందుగా చెప్పిన, వాగ్దానం చేసిన వాటన్నిటి నెరవేర్పూ ఆయనే. యేసుతో కలుపుకుని చూస్తే పాత ఒడంబడిక గ్రంథం లోతైన అర్థాలతో నిండి ఉన్న గంబీరమైన దివ్య పుస్తకం. ఆయన లేకపోతే అది నెరవేరక, చాలా మట్టుకు అర్థరహితంగా మిగిలిపోతుంది. లూకా 24:27, లూకా 24:44; యోహాను 1:45; యోహాను 5:39, యోహాను 5:46; అపో. కార్యములు 3:24-26; అపో. కార్యములు 13:27; 1 పేతురు 1:10-11 చూడండి. యేసుప్రభువు పాత ఒడంబడిక గ్రంథాన్ని నెరవేర్చిన కొన్ని విధానాలను హీబ్రూవారికి రాసిన లేఖ చూపిస్తున్నది. “నెరవేర్చడానికే”– యేసు పరలోకంనుంచి భూమికి వచ్చిన అనేక కారణాల్లో ఇది ఒకటి. మత్తయి 9:13; మత్తయి 10:35; మత్తయి 20:28; లూకా 19:10; యోహాను 6:38; యోహాను 9:39; యోహాను 10:10-11; యోహాను 12:46 కూడా చూడండి.

18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
యెషయా 42:21

యేసుప్రభువు పాత ఒడంబడిక గ్రంథంపై తన ఆమోద ముద్ర వేసిన విషయాన్ని గమనించండి. మత్తయి 4:4; మత్తయి 15:3-6; మత్తయి 22:43; లూకా 24:44; యోహాను 10:35 కూడా చూడండి. అది దేవుని ఆత్మావేశం వల్ల రాయబడిన దేవుని వాక్కు అని యేసు భావించినట్టు స్పష్టంగా ఉంది. 2 తిమోతికి 3:16; హెబ్రీయులకు 1:1-2; 2 పేతురు 1:21 పోల్చి చూడండి. యేసు దేవుని అవతారం కాబట్టి, అన్నీ తెలిసినవాడు కాబట్టి, మనం కూడా ఆయన వెలిబుచ్చిన సంగతుల్ని గట్టిగా నమ్మాలి.

19. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.

ఇక్కడ మరో సారి యేసు 3వ వచనం దగ్గర్నుంచి దేవుని రాజ్యంలోని వారి గురించి, అంటే నూతన ఆధ్యాత్మిక జన్మద్వారా దేవుని సంతానంగా మారిన వారి గురించి మాట్లాడుతున్నాడని స్పష్టం అవుతున్నది. ఆయన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నించడం వల్ల దేవుని రాజ్యంలో ప్రవేశించలేము (అపో. కార్యములు 13:38-39; రోమీయులకు 3:21, రోమీయులకు 3:28; రోమీయులకు 8:3; గలతియులకు 2:16; ఎఫెసీయులకు 2:8-9; తీతుకు 3:4-7). అయితే ఇలా ప్రవేశించిన తరువాత తన విషయంలో ఆధ్యాత్మిక నియమాలు పని చేస్తూ ఉంటాయి.

20. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

“పరిసయ్యుల”– మత్తయి 3:7 నోట్. మనుషులంతా, మత నాయకులంతా తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉండడం జరగదని యేసు ఇక్కడ తేటతెల్లంగా నేర్పుతున్నాడు. ఒక రకమైన నీతినిజాయితీ అందుకు సరిపోదు. ఇది స్వనీతి. ఇది పరిసయ్యుల్లో కనిపించేది (మత్తయి 23:1-28; లూకా 18:10-14. రోమీయులకు 10:1-4; ఫిలిప్పీయులకు 3:7-9 కూడా చూడండి). పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు ఆనాటి ప్రజల మత నాయకులు. అయితే క్రీస్తులో నమ్మకం ఉంచిన అత్యల్పుడి నీతిన్యాయాలు కూడా వారి నీతిన్యాయాలకన్న ఎక్కువే, ఎక్కువగా ఉండితీరాల్సిందే. ఈ నీతిన్యాయాలు ఏమిటి? క్రీస్తులో నమ్మకం ద్వారా విశ్వాసులను క్రీస్తుకు జోడించి, ఆయన ఆత్మను వారిలోకి తీసుకువచ్చేదే. అలాంటివారు దేవుని ఎదుట నిర్దోషులు, న్యాయవంతులు అవుతారు. నిర్దోషమైన జీవితం సాధ్యపడేలా అంతరంగంలో కూడా మార్పు చెందుతారు (రోమీయులకు 3:24; రోమీయులకు 5:1-5; రోమీయులకు 8:3; 2 కోరింథీయులకు 5:17; ఎఫెసీయులకు 4:22-24). ఈ కొండమీది ప్రసంగం మిగతా భాగమంతా దేవుడు మెచ్చుకొనే ఈ నీతిన్యాయాలకు, ఆయన తిరస్కరించేదానికి ఉన్న తేడాలను తెలియజెప్తుంది. మారిన హృదయంలోనుంచి కలిగే న్యాయమైన ప్రవర్తన పాపులు తమ సహజ స్వభావాల మూలంగా చూపే ప్రవర్తన కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనదిగా ఉంటుంది. పాపులు తమ శాయశక్తులా ప్రయత్నించి చూపించగలిగే నీతిన్యాయాలు ముక్తి విషయంలో పనికిమాలినవి. యెషయా 64:6 చూడండి.

21. నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
నిర్గమకాండము 20:13, నిర్గమకాండము 21:12, లేవీయకాండము 24:17, ద్వితీయోపదేశకాండము 5:17

“హత్య”– నిర్గమకాండము 20:13. ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఈ ఆజ్ఞను మనిషి ప్రాణం తీయడానికే పరిమితం చేసి ఉంటారు. అయితే హత్యకు దారితీసే అంతరంగ స్థితిని గురించీ హత్య చేయాలన్న భావం తొణికిసలాడుతున్న తృణీకారంతో పలికే మాట గురించీ యేసుప్రభువు చెప్తున్నాడు. కీడు సంబంధమైన కోపం హృదయంలో హత్య చేయడం లాంటిదనీ, ఆ విషయంలో దోషులైనవారు, సాక్షాత్తూ మనిషి ప్రాణాలు తీసినవారి లాగానే నరకానికి పాత్రులనీ చెప్తున్నాడు (వ 22). అందువల్ల మనుషులు చట్ట సంబంధమైన వివాదాల విషయంలోనూ, కోపానికీ ద్వేషానికీ హత్య సంబంధమైన తలంపులకూ దారి తీసే మరే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి (1 యోహాను 3:15 చూడండి).

22. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

“నేనంటాను”– ఇలా అనడంలో యేసు అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా సంపూర్ణాధికారంతో మాట్లాడుతున్నట్టు సూచిస్తున్నాడు. యూదుల ఉన్నత న్యాయ సభను “సన్‌హెడ్రిన్” అన్నారు. ఇందులో యాజులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు మొత్తం 71 మంది సభ్యులు ఉన్నారు. నరకాగ్నిలో పడే ప్రమాదానికి గురి అయ్యేందుకు మనుషులు ఘోరమైన నేరాలుగా ఎంచేవాటిని చెయ్యవలసిన అవసరం లేదని ఈ వచనం వల్ల తేటతెల్లమౌతున్నది. హృదయ స్థితి ప్రాముఖ్యమైనదని యేసుప్రభువు హెచ్చరిస్తున్నాడు. “నరకాగ్ని”– మత్తయి 3:12; మత్తయి 7:19; మత్తయి 13:40, మత్తయి 13:42; మత్తయి 18:8; మత్తయి 25:41; ప్రకటన గ్రంథం 20:15; ప్రకటన గ్రంథం 21:8. నరకం అని అనువదించిన గ్రీకు మాట “గెహెన్న”. మార్కు 9:48 నోట్ చూడండి.

23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల

ఇతరులతో, ముఖ్యంగా మన సాటివారైన దేవుని పిల్లలతో మన సంబంధాలు సరిగా లేదనుకోండి, అది మన పొరపాటు ఫలితమే అయి ఉంది, దాన్ని మనం సరి చేసుకోగలిగిన స్థితిలో ఉండికూడా అలా చెయ్యకపోతే దేవుడు మన ఆరాధనను, కానుకలను అంగీకరించడు అని ఇందులోని భావం. మనం సమాధానపడే ప్రయత్నమేమీ చేయకపోతే హృదయంలో హత్య చేయడంతో సమానమైన కోపానికి తావు ఇచ్చినవాళ్ళం అవుతాం. అందువల్లనే ఆయన ఈ వచనాలను “అందుచేత” అనే మాటతో ఆరంభించాడు.

24. అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.

25. నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

దేవుని ప్రజలు ఇతరులతో సమాధానంగా జీవించవలసిన మరో విధానం ఇది. డబ్బు, ఆస్తి విషయాల్లో విరోధానికీ, పోట్లాటలకూ వారి జీవితంలో తావుండకూడదు (వ 44,45). దేవుని ప్రజలు తమపై కోర్టు కేసు వేయదలుచుకున్న వారితో ఒప్పందానికి రావాలని యేసు ఆదేశిస్తున్నాడు. దానికి వారు లోబడకపోతే అనేక ఇక్కట్లకు వారు గురయ్యేలా దేవుడు చేస్తాడు. 1 కోరింథీయులకు 6:1-8 పోల్చి చూడండి.

26. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
నిర్గమకాండము 20:14, ద్వితీయోపదేశకాండము 5:18

“వ్యభిచారం”– నిర్గమకాండము 20:14. మరో సారి అక్షరాలా ఉన్న ఆజ్ఞకంటే యేసు మరి కొంత ముందుకు వెళ్ళి హృదయంలోని తలంపుల విషయం నొక్కి చెప్తున్నాడు. పరిసయ్యులు బయటి చెడుక్రియల జోలికి వెళ్ళకుండా ఉంటూ తాము మంచివాళ్ళమనీ, దేవుని దృష్టిలో న్యాయవంతులమనీ అనుకునేవారు. అయితే అంతరంగ జీవితంలో, హృదయ స్థితి విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండేవారు (మత్తయి 23:25-28). దేవుని పిల్లలకు తమ హృదయంలో మొలకెత్తే కోరికలను బట్టి స్వభావ సిద్ధంగా తాము పాపాత్ములమని తెలుసు. ఆధ్యాత్మిక దారిద్య్రాన్ని అనుభవించి దుఃఖించడానికి ఇది ఒక కారణం (రోమీయులకు 7:7-8, రోమీయులకు 7:18 చూడండి). మనుషులు ధన్యులుగా కావాలని 3-12 వచనాలలోని లక్షణాలు వారికి కలగాలని యేసు ఈ వచనాలు పలికాడు, ఈ ప్రసంగంలోని ఉపదేశమంతా ఇచ్చాడు.

28. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

“హృదయంలో”– అంటే మోహం తలంపులు ఉన్నవారు ఇక వ్యభిచారం చేసినా నష్టమేమీ లేదని ప్రభువు ఉద్దేశం కాదు. లోపలి ఆలోచనలకూ, బయటి ప్రవర్తనకూ తేడా ఏమీ లేదని ఆయన చెప్పడం లేదు. మన మనసులోని ఆలోచనల కంటే మన చర్యలే ఇతరులకూ, మనకూ కూడా చాలా ఎక్కువ హాని కలిగిస్తాయి. సాటి మనిషిని ద్వేషించడం దానంతట అది చెడు విషయమే గానీ అతణ్ణి హత్య చెయ్యడం అనేది ఒక మెట్టు ముందుకు వెళ్ళి అతడి ప్రాణాన్ని దోచుకుంటుంది. కామ దృష్టి చెడు విషయమే గానీ వ్యభిచారమైతే ఒక మనిషిని కలుషితం చేసి మరొకరిని కూడా పాపంలోకి ఈడ్చి, తద్వారా కలిగే చెడు ఫలితాలన్నిటినీ వెంటబెట్టుకు వస్తుంది. ఒకడికి మోహం చూపు ఉంటే ఇక వెళ్ళి వ్యభిచారం చేసినా, ఆ మోహం చూపు కంటే ఎక్కువ పాపం కాదులే అనడం సైతాను కల్పించిన అబద్ధం. హృదయాన్నీ, బయటి చర్యనూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని యేసు నొక్కి చెప్తున్నాడు. 29,30 వచనాల్లో పవిత్రతను సంపాదించుకోవడానికి శరీర భాగాలను నరుక్కోవడం తోడ్పడుతుందని యేసుప్రభువు ఉద్దేశం కాదు. మన పాపానికి కారణమయ్యేవి, పాపం చేయించేవి మన కళ్ళు, చేతుల వంటి అవయవాలు కాదని మనకూ ఆయనకూ కూడా తెలుసు. కళ్ళు పీక్కోవడం, చేతులు నరుక్కోవడం ద్వారా మనం మంచివాళ్ళం అయిపోము, ఆ పద్ధతుల ద్వారా పాపాలు చేసే అవకాశాలు లేకుండా పోవని కూడా ఆయనకు తెలుసు. కుడి కన్ను పెరికివేస్తే ఎడమ కన్ను ఉంటుంది. రెండూ పెరికివేస్తే మనసులో, భ్రష్ట హృదయంలో ఆలోచనలూ ఊహలూ ఉండనే ఉంటాయి (మత్తయి 15:19-20; ఆదికాండము 8:21; యిర్మియా 17:9). పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుని ఉంది. దాన్ని జయించాలంటే సంపూర్ణ పశ్చాత్తాపం, పాత జీవితంలో పూర్తి తెగతెంపులు అవసరమని యేసు ఉద్దేశం. ఒక అత్యంత ప్రాముఖ్య సత్యాన్ని నొక్కి చెప్పేందుకు యేసు ఇలా కొట్టొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. అదేమంటే నరకం బారిన పడకుండా ఉండేందుకు ఒక మనిషి ఏం చేసేందుకైనా తెగించి ఉండాలి. ప్రతి పాపం నుంచీ, చెడు ప్రేరేపణ నుంచీ, దేవుని రాజ్యంలోకి ప్రవేశించనియ్యకుండా అడ్డుపడే ప్రతిదాని నుంచీ తనను తాను ఛేదించుకుని వేరుపడాలి. ఇలా చెయ్యని వ్యక్తి దేవుని రాజ్యానికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వడం లేదన్నమాట. దేవుని కోపానికి భయపడవలసినంతగా భయపడడం లేదన్నమాట. మోహం, అపరాధ చర్యలు శరీర అవయవాల్లాంటివి అనీ, వాటిని చావుకు గురి చేయాలనీ పౌలు నేర్పాడు. కొలొస్సయులకు 3:5; రోమీయులకు 8:13 చూడండి.

29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

30. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.

31. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా;
ద్వితీయోపదేశకాండము 24:1-3

“విడాకులు”– మత్తయి 19:3-9; ద్వితీయోపదేశకాండము 24:1 కూడా చూడండి. యేసుప్రభువు ఉపదేశం స్పష్టంగా ఉంది. దేవుని దృష్టిలో విడాకులు అంగీకారం అయ్యే పరిస్థితి ఒక్కటే ఒక్కటి. వివాహమైన వారిలో భార్య గానీ భర్త గానీ వ్యభిచారం చేస్తే విడాకులు ఇయ్యవచ్చు. అప్పుడు కూడా యేసు విడాకులు తీసుకోవాలని తెగేసి చెప్పడం లేదు గాని తీసుకోవచ్చని అనుమతి ఇస్తున్నాడు. 3-12 వచనాల్లోని లక్షణాలు కనీసం కొంతవరకైనా ఉన్న వారికోసమే ఈ ఉపదేశం అని గుర్తుంచుకోండి. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తి చాలా ఘోరమైన కారణం ఉంటే తప్ప తన భార్యకు విడాకులివ్వడం, లేక తన భర్తను వదిలెయ్యడం ఎలా చెయ్యగలుగుతారు? ఘోర కారణం ఉన్నా సరే తొందరపడి ఏదీ చెయ్యకూడదు. ఇద్దరం దేవుని క్షమాపణ పొందిన పాపులమే అని గుర్తుంచుకోవాలి. మత్తయి 6:14-15 పోల్చి చూడండి.

32. నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.

33. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
నిర్గమకాండము 20:7, లేవీయకాండము 19:12, సంఖ్యాకాండము 30:2, ద్వితీయోపదేశకాండము 5:11, ద్వితీయోపదేశకాండము 23:21

“ప్రమాణం”– నిజం చెప్తున్నానని ఎదుటి వ్యక్తిని నమ్మించేందుకు మనకు మనం (కొన్ని సార్లు చాలా నిర్లక్ష్యంగా) ప్రమాణాలు చేయడం గురించి ఈ ఉపదేశం. యాకోబు 5:12 కూడా చదవండి. మనం మన మాటకు కట్టుబడేవాళ్ళమై ఉండాలని, మనం మాట్లాడే దానంతటిలో మాట ఇచ్చేదానంతటిలో నూటికి నూరు శాతం నిజాయితీగా ఉండాలి. యేసుప్రభువు శిష్యులంగా మనం మనసులో కాదు అనుకుని బయటికి అవునని గానీ, మనసులో అవుననుకుని బయటికి కాదని గానీ ఎప్పుడూ చెప్పకూడదు. అబద్ధాలు, మోసం దేవునికి అసహ్యం. అలాంటివాటికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. కీర్తనల గ్రంథము 5:6; కీర్తనల గ్రంథము 15:2; సామెతలు 6:16-19; ఎఫెసీయులకు 4:15, ఎఫెసీయులకు 4:25; కొలొస్సయులకు 3:9-10, వాటి నోట్స్ కూడా చూడండి. దేవుని పిల్లలుగా మనం దేవుని పేరును వ్యర్థంగా పలకడం లేక తేలికగా మాట్లాడ్డం తగదు. ఆయన పేరు విషయంలోనూ, ఆయనకు సంబంధించిన ప్రతిదానిపట్లా సరైన గౌరవం ప్రదర్శించాలి (నిర్గమకాండము 20:7). అబద్ధాలు, దూషణలు, దేవుని పేరును వ్యర్థంగా పలకడం దుష్టుడైన సైతానునుంచి వస్తాయి (యోహాను 8:44).

34. నేను మీతో చెప్పునదేమనగా ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడనవద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు,
యెషయా 66:1

35. అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
కీర్తనల గ్రంథము 48:2, యెషయా 66:1

36. నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.

37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.

38. కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
నిర్గమకాండము 21:24, లేవీయకాండము 24:20, ద్వితీయోపదేశకాండము 19:21

నిర్గమకాండము 21:24-25; లేవీయకాండము 24:20. ఇది ఆ సమాజం, జాతి అనుసరించవలసిన సూత్రం. ఇది ఖచ్చితమైన న్యాయ విధి.

39. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

ఈ వచనాల్లో “మీతో” అనే మాట క్రీస్తు శిష్యులను ఉద్దేశించి పలికిన మాట. తన ప్రజల హృదయాల్లో ఆయన నెలకొల్పే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అనుసరించవలసిన న్యాయ నియమం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయానికి దీనితో ఏమీ సంబంధం లేదు. ప్రభుత్వం దుష్టత్వాన్ని ఎదిరించవలసిందే (రోమీయులకు 13:1-7). ఈ నియమం క్రీస్తు యొక్క శిష్యులకు వారికి కీడు చేసిన వారితో వ్యక్తిగతంగా ఉండవలసిన సంబంధం గురించినదే గానీ ఒక ప్రభుత్వానికీ వ్యక్తులకూ మధ్య గానీ, రెండు ప్రభుత్వాల మద్య గానీ ఉండవలసిన సంబంధాల గురించి కాదు. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు 3-12 వచనాల్లోని లక్షణాలను కనపరచాలి. పగ సాధించాలన్న కోరిక మనిషి భ్రష్ట స్వభావంలో లోతుగా వేరుపారి ఉంటుంది. చిన్న అవమానం, లేక కొద్దిపాటి గాయానికే కొందరు మనుషులు ఇతరుల ప్రాణాలు తీస్తారు. ఇది ఘోరం! మోషే ధర్మశాస్త్రంలోని ఒక ఉద్దేశం (నిర్గమకాండము 21:24-25) ఇలాంటివి జరగకుండా చేసిన సరైన న్యాయాన్ని నెలకొల్పడమే. అయితే యేసు మరి కాస్త ముందుకు వెళ్ళి తన ప్రజలు తమకు కలిగిన నష్టం, అన్యాయం విషయంలో ఎలాంటివారై ఉండాలో చూపిస్తున్నాడు. వారు తమ హక్కుల కోసం పోరాడకూడదు. స్వార్థం కోసం ఆలోచించకూడదు, తమకు కీడు చేసినవారికీ మేలు చేయడమెలాగా అనే ఆలోచించాలి. దేవుని ప్రజలు సైతానును ఎదిరించాలి (యాకోబు 4:7; 1 పేతురు 5:9), క్రీస్తు సంఘంలో పాపాన్నీ ఎదిరించాలి (1 కోరింథీయులకు 5:11-13; 1 తిమోతికి 5:20). అయితే వ్యక్తులుగా మనకు కీడు చేసే దుర్మార్గుల విషయం యేసు మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులు తమ కుటుంబాలను దుర్మార్గుల బారినుంచి సంరక్షించుకో కూడదనీ, లేక ఇతరులను కాపాడకూడదనీ కాదు. అయితే ఎవరన్నా తమకు హాని, అన్యాయం చేస్తే వారితో పోరాడ్డం, పగ తీర్చుకునే ప్రయత్నం చెయ్యకూడదని అర్థం. దేవుని రాజ్యంలోని వారు హింసను హింసతో, దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదిరించకూడదు (మత్తయి 26:52). యేసుక్రీస్తు తానే యూదుల పాపాలను ఎత్తి చూపించాడు, దేవుని ఆలయంలో వాళ్ళు చేస్తున్న చెడు పనులను ఎదిరించాడు (మత్తయి 21:12 చూడండి). అయితే ఆయన ముఖంపై ఉమ్మివేసినవారిని, ఆయన వీపుపై కొట్టినవారిని, ఆయన్ను సిలువ వేసినవారిని ఆయన ఎదిరించలేదు (తనకు సహాయంగా దేవదూతలను పిలువగలిగి ఉండి కూడా ఆయన అలా చెయ్యలేదు. మత్తయి 26:52-53). క్రీస్తును అనుసరించేవారు వ్యక్తిగతంగా తమకు కలిగిన హాని విషయంలో కూడా క్రీస్తును అనుసరించాలి. 1 పేతురు 2:21-23 చూడండి. రాజకీయ ఆశయాల కోసం సహాయ నిరాకరణోద్యమానికీ, సత్య2గ్రహానికీ ఈ వాక్య భాగానికీ ఎలాంటి సంబంధమూ లేదు.

40. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు.

ఇందులోని సూత్రం పై వచనంలో దాని వంటిదే. విశ్వాసులు స్వార్థాన్ని త్యజించి కృప, కరుణ, ప్రేమ, దయలతో నిండిన దేవుని ఆధ్యాత్మిక రాజ్యానికి ప్రతినిధులుగా ఉండాలి. క్రీస్తు శిష్యులు క్రీస్తు ఆలోచించిన రీతిగానే ఇతరుల గురించీ, వారి అవసరాల గురించీ ఆలోచించాలి. అయితే మద్యం తాగేందుకూ, మత్తు పదార్థాలు వాడేందుకూ డబ్బు అడిగే మనిషికి ఇవ్వాలా? లేక ఇతరుల్ని మోసగించడమే వృత్తిగా పెట్టుకున్న గుంటనక్కలకు సహాయం చెయ్యాలా? మనం ఇచ్చేది ఇతరుల్లో సోమరితనం, లేక అడుక్కునే స్వభావాన్ని ప్రోత్సహించి హాని చేసేదిగా ఉండకూడదు. మనం దయ కలిగి ఉండాలి గానీ తెలివితక్కువగా ఉండకూడదని యేసుప్రభువు కోరుతున్నాడు. ఎవరైనా నిజమైన అవసరతలో ఉంటే (మత్తయి 6:2) మనకు చేతనైతే సహాయపడాలి. 1 యోహాను 3:17-18 చూడండి. అలాంటివారు అడిగినదాన్ని అడిగినంత మొత్తంలో మనం ఇవ్వలేకపోవచ్చు. అయితే అడిగిన వారందరికీ ఎంతో కొంత ఇవ్వవచ్చు. అపో. కార్యములు 3:6 పోల్చి చూడండి.

43. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
లేవీయకాండము 19:18

దేవుని ఆధ్యాత్మిక రాజ్యానికి ఆయువుపట్టు ప్రేమే. దాని రాజు ప్రేమామయుడు (1 యోహాను 4:8), దానిలోని నియమం ప్రేమ (యోహాను 13:34). అందులోని వారంతా దీన్ని పాటించాలి. వారంతా ప్రేమ పరిపూర్ణతను తమ లక్ష్యంగా పెట్టుకోవాలి (వ 48. 1 యోహాను 4:16-18 పోల్చి చూడండి). దేవుని శాసనాలన్నిటినీ నెరవేర్చడమంటే ప్రేమ చూపడమే (రోమీయులకు 13:8-10). యూదులు తమ శత్రువులను ద్వేషించాలని పాత ఒడంబడికలో ఎక్కడా చెప్పలేదు గానీ ఇస్రాయేల్‌లోని మత నాయకులు సాంప్రదాయకంగా ఇచ్చే ఉపదేశం ఇదే. నిజానికి ఇది నిర్గమకాండము 23:4-5; సామెతలు 25:21 మొదలైన వచనాలకు వ్యతిరేకం. ప్రేమ సూత్రాన్ని పాటించడం మూలంగా మనం దేవుని పిల్లలం కాలేము. కానీ మనం దేవుని పిల్లలమైతే ఆ సూత్రాన్ని పాటించడం ద్వారా ఆ విషయాన్ని వెల్లడి చెయ్యాలి (వ 45). దేవుడు తన శత్రువులను ప్రేమించాడు (రోమీయులకు 5:8-10; కొలొస్సయులకు 1:21-22), వారికి మేలు చేస్తూ ఉన్నాడు.

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
నిర్గమకాండము 23:4-5, సామెతలు 25:21-22

45. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

46. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.

“సుంకంవారు”– సాధారణంగా ఆ కాలంలో యూదుల్ని పరిపాలిస్తున్న రోమ్‌వారిని సేవించే యూదులు వీరు. వారి సాటి యూదులు వారిని దేశద్రోహులుగా ఎంచారు. అంతేగాక సుంకంవారు పేరాశకు మారుపేరు.

47. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.

దేవుని ఆధ్యాత్మిక రాజ్యంలో లేనివారి కంటే ఆ రాజ్య నివాసుల ప్రవర్తన వేరుగా ఉండాలి, మెరుగుగా ఉండాలి, మంచి క్రియలు ఎక్కువగా చేయాలి. అలా చెయ్యకపోతే వారు ఆ రాజ్య నివాసులనడానికి రుజువేది? (వ 20 చూడండి).

48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
లేవీయకాండము 19:2, ద్వితీయోపదేశకాండము 18:13

లోపరహితుడైన పరిపూర్ణుడైన దేవుడు తన ప్రజల ఎదుట ఉంచగలిగే నియమం, ప్రమాణం, ఆదర్శం ఈ వచనంలోది ఒక్కటే. పాపంలో ఉన్న ఈ లోకం గాక, దేవుడే వారికి మాదిరిగా ఉండాలి. అయితే లోపం లేని పరిపూర్ణులు మాత్రమే (అలాంటి వారంటూ అసలు ఎప్పుడైనా దొరికితే) దీన్ని పూర్తిగా ఆచరించగలుగుతారు. అయినా దేవుని రాజ్యంలోని వారంతా కూడా దీన్ని లక్ష్యంగా, గురిగా పెట్టుకోవాలి. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇతర వచనాలు కూడా క్రైస్తవులకు లోపం లేని ప్రవర్తనే గురిగా ఉండాలని చూపుతున్నాయి. 2 కోరింథీయులకు 13:11; కొలొస్సయులకు 1:28; కొలొస్సయులకు 4:12; 2 తిమోతికి 3:17; హెబ్రీయులకు 13:21; యాకోబు 1:4; 1 యోహాను 2:1, 1 యోహాను 2:6 చూడండి. పరిపూర్ణతను గురిగా పెట్టుకోవడం అంటే దాన్ని సాధించినట్టు కాదు – రోమీయులకు 7:18, రోమీయులకు 7:25; ఫిలిప్పీయులకు 3:12; యాకోబు 3:2. మనల్ని పరిపాలించేది ఎవరు? మనమా లేక దేవుడా? వ 39-49లో దేన్ని కోరుకోవాలి అన్న విషయం ఉంది. ఏ సూత్రాన్ని అనుసరించాలి? మన స్వలాభమే ముందు ఉండాలా? మనం స్వార్థాన్ని కాపాడుతూ, దాని గురించి పగ సాధిస్తూ దానికే ప్రాముఖ్యత ఇవ్వాలా? లేక స్వార్థాన్ని పక్కన పెట్టి రాజ్యానికి ప్రాధాన్యత నివ్వాలా? కొండమీది ప్రసంగంలోని ముఖ్యాంశం స్వార్థాన్ని చంపుకుని, దేవుని విషయంలో జీవం కలిగి బ్రతకాలన్నదే. ఏది చేసినా దేవుణ్ణి సంతోషపెట్టేందుకే చెయ్యాలి, స్వార్థం తీర్చుకోవడానికి కాదు. ఈ ప్రసంగంలోని గొప్ప ఆధ్యాత్మిక ఆదేశాలను పాటించాలంటే అందుకు ప్రోత్సహించే గొప్ప కారణం ఒకటి ఉండాలి. ఇందుకు సహాయపడే ఏకైక మార్గం ఏది? యోహాను 14:23-24 చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

కొండపై క్రీస్తు ప్రసంగం. (1,2) 
అతని బోధనల మార్గదర్శకత్వం ద్వారా క్రీస్తు నుండి ఆనందాన్ని పొందని వారు ఇహలోకంలో లేదా పరలోకంలో దానిని కనుగొనలేరు. వారు దేనికి దూరంగా ఉండాలి, ఏది చెడు, మరియు వారు దేనిని వెంబడించాలి మరియు అభివృద్ధి చెందాలి, ఏది మంచితనం అని క్రీస్తు వారికి బోధించాడు.

ఎవరు ధన్యులు. (3-12) 
ఈ ప్రకరణంలో, మన రక్షకుడు ఆశీర్వదించబడిన వ్యక్తుల యొక్క ఎనిమిది లక్షణాలను అందించాడు, ఇవి క్రైస్తవుని యొక్క ప్రాథమిక ధర్మాలను సూచిస్తాయి.
1. ఆత్మలో వినయము గలవారు ధన్యులు. వారు తమ అధమ స్థితిని గుర్తించి వినయంతో దానిని చేరుకుంటారు. వారు తమ అవసరాన్ని గుర్తిస్తారు, తమ పాపాలకు పశ్చాత్తాపపడతారు మరియు విమోచకుని కోసం ఆరాటపడతారు. దయ యొక్క రాజ్యం అటువంటి వ్యక్తులకు చెందినది మరియు కీర్తి రాజ్యం వారి కోసం వేచి ఉంది.
2. దుఃఖించువారు ధన్యులు. ఇది నిజమైన పశ్చాత్తాపం, అప్రమత్తత, వినయం మరియు క్రీస్తు ద్వారా దేవుని దయపై నిరంతరం ఆధారపడటానికి దారితీసే దైవిక దుఃఖాన్ని సూచిస్తుంది. ఈ భూలోక ప్రయాణంలో కన్నీరు కార్చినప్పటికీ, ఈ దుఃఖితులకు వారి దేవునిలో ఓదార్పు లభిస్తుంది.
3. సాత్వికులు ధన్యులు. సాత్వికత అంటే దేవునికి లొంగిపోవడం, అవమానాలను భరించడం, సౌమ్యతతో ప్రతిస్పందించడం, కష్టాల్లో కూడా ఓర్పుతో ఉండడం. సౌమ్యత ఈ ప్రపంచంలో కూడా శ్రేయస్సు, సౌలభ్యం మరియు భద్రతకు దారితీస్తుంది.
4. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు. ఇది అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోరికను కలిగి ఉంటుంది, ఇవి క్రీస్తు యొక్క నీతి మరియు దేవుని విశ్వసనీయత ద్వారా సురక్షితమైనవి. అలాంటి హృదయపూర్వక కోరికలు దేవుని బహుమతులు, ఆయన వాటిని నెరవేరుస్తాడు.
5. దయగలవారు ధన్యులు. మన స్వంత పరీక్షలను మనం ఓపికగా భరించడమే కాకుండా, అవసరమైన వారికి కనికరం మరియు సహాయాన్ని కూడా అందించాలి. పాపంలో ఉన్నవారిపట్ల మనం జాలి చూపాలి మరియు వారిని నాశనం నుండి రక్షించడానికి ప్రయత్నించాలి.
6. హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పవిత్రత మరియు ఆనందం ఇక్కడ అందంగా ముడిపడి ఉన్నాయి. స్వచ్ఛమైన హృదయం విశ్వాసం ద్వారా సాధించబడుతుంది మరియు దేవుని నివాసం కోసం ప్రత్యేకించబడింది. అపవిత్రత అతని పవిత్రతతో సహజీవనం చేయలేని విధంగా స్వచ్ఛమైన వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు.
7. శాంతికర్తలు ధన్యులు. వారు శాంతిని ప్రోత్సహిస్తారు, కోరుకుంటారు మరియు ఆనందిస్తారు. వారు శాంతిని కాపాడుకోవడానికి మరియు విచ్ఛిన్నమైనప్పుడు దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తారు. శాంతి స్థాపకులు ఆశీర్వదిస్తే, శాంతికి విఘాతం కలిగించే వారికి అయ్యో!
8. నీతి నిమిత్తము హింసించబడినవారు ధన్యులు. ఈ సూత్రం క్రైస్తవ మతానికి ప్రత్యేకమైనది మరియు ఇతరుల కంటే ఎక్కువగా నొక్కి చెప్పబడింది. హింస దేవునితో యోగ్యతను సంపాదించుకోదు, కానీ ఆయన నిమిత్తము బాధపడేవారు, తమ జీవితాలను త్యాగం చేసేంత వరకు కూడా చివరికి నష్టపోకుండా చూస్తాడు.
బ్లెస్డ్ జీసస్, మీ బోధనలు ప్రపంచంలోని విలువల నుండి చాలా భిన్నంగా ఉంటాయి, ఇది తరచుగా గర్వించదగిన, ఆకర్షణీయమైన, ధనవంతుల, శక్తివంతమైన మరియు విజయవంతమైన వారిని గొప్పగా చేస్తుంది. మేము దేవుని దయ, అతని పిల్లలుగా గుర్తింపు మరియు అతని రాజ్యంలో వారసత్వాన్ని కోరుకుంటాము. ఈ ఆశీర్వాదాలు మరియు ఆశలతో, సవాలు మరియు వినయపూర్వకమైన పరిస్థితులను మనం హృదయపూర్వకంగా స్వాగతించగలము.

ఉపదేశాలు మరియు హెచ్చరికలు. (13-16) 
"నువ్వు ప్రపంచానికి రుచికరం. అజ్ఞానం మరియు దుష్టత్వంలో చిక్కుకున్న మానవత్వం, కుళ్ళిపోయే అంచున ఉన్న ఒక విస్తారమైన కుప్పను పోలి ఉంది. అయినప్పటికీ క్రీస్తు తన శిష్యులను వారి జీవితాలు మరియు బోధనల ద్వారా జ్ఞానం మరియు దయతో నింపడానికి పంపాడు. వారు చేయకపోతే ఈ పాత్రను నిర్వర్తిస్తే, అవి రుచిని కోల్పోయిన ఉప్పు లాంటివి.ఒక వ్యక్తి అనుగ్రహం లేకుండానే క్రీస్తు వృత్తిని అవలంబించగలిగితే, మరే ఇతర సిద్ధాంతం లేదా పద్ధతి వాటిని ఫలవంతం చేయదు.మన కాంతి కనిపించే పరోపకార చర్యల ద్వారా ప్రకాశించాలి.దేవుని మధ్య విషయాలు మరియు మన ఆత్మలు ప్రైవేట్‌గా ఉండాలి, కానీ ప్రజల దృష్టికి తెరిచిన ఆ అంశాలు మన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి మరియు మెచ్చుకోదగినవిగా ఉండాలి. మన లక్ష్యం దేవుని మహిమపరచడం."

క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ధృవీకరించడానికి వచ్చాడు. (17-20) 
దేవుని పవిత్ర ఆజ్ఞలలో దేనినైనా విస్మరించడానికి క్రీస్తు తన అనుచరులను అనుమతించాడని అనుకోకండి. తమ పాపపు పనుల గురించి పశ్చాత్తాపపడకుండా ఎవరూ క్రీస్తు నీతిమంతులలో పాలుపంచుకోలేరు. సువార్తలో వెల్లడి చేయబడిన దయ విశ్వాసులను మరింత గొప్ప స్వీయ ప్రతిబింబం మరియు వినయం వైపు నడిపిస్తుంది. క్రైస్తవుడు వారి నైతిక దిక్సూచిగా చట్టానికి కట్టుబడి ఉంటాడు మరియు అలా చేయడంలో ఆనందం పొందుతాడు. ఒక వ్యక్తి, తాను క్రీస్తు శిష్యునిగా చెప్పుకుంటూ, తన సామాజిక స్థితి లేదా కీర్తితో సంబంధం లేకుండా, దేవుని పవిత్ర చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించమని తమను లేదా ఇతరులను ప్రోత్సహిస్తే, వారు నిజమైన శిష్యులు కాలేరు. విశ్వాసం ద్వారా మాత్రమే పొందబడిన క్రీస్తు నీతి, దయ లేదా మహిమ యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలని కోరుకునే ఎవరికైనా అవసరం అయితే, పవిత్రత వైపు హృదయాన్ని మార్చడం ఒక వ్యక్తి యొక్క స్వభావం మరియు ప్రవర్తనలో లోతైన మార్పును తెస్తుంది.

ఆరవ ఆజ్ఞ. (21-26) 
ఆరవ ఆజ్ఞ ద్వారా అసలు హత్య మాత్రమే నిషేధించబడిందని యూదు ఉపాధ్యాయులు గతంలో అభిప్రాయపడ్డారు, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సమర్థవంతంగా తగ్గించారు. అయితే, క్రీస్తు ఈ ఆజ్ఞ యొక్క పూర్తి అర్థాన్ని వివరించాడు, దీని ద్వారా మనం భవిష్యత్తులో తీర్పు తీర్చబడతాము మరియు వర్తమానంలో జీవించాలి. తొందరపాటు కోపమైనా గుండెల్లో హత్యేనని ఆయన వెల్లడించారు. మన "సోదరుడు"ని సూచించేటప్పుడు, క్రీస్తు అంటే ఏ వ్యక్తి అయినా, వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా, మనమందరం ఉమ్మడి మానవత్వాన్ని పంచుకుంటాము. "రాకా" అనేది అహంకారం నుండి ఉద్భవించిన ధిక్కార పదం, అయితే "నువ్వు ఫూల్" అనేది ద్వేషంతో పుట్టిన ద్వేషపూరిత పదం. ఉద్దేశపూర్వక దూషణలు మరియు కఠినమైన తీర్పులు నెమ్మదిగా పనిచేసే విషం లాంటివి. ఈ పాపాలను ఎంత తేలికగా పరిగణించినా, తీర్పులో వ్యక్తులు నిస్సందేహంగా వాటికి జవాబుదారీగా ఉంటారని క్రీస్తు హెచ్చరించాడు.
మన సహోదరులందరితో క్రైస్తవ ప్రేమ మరియు శాంతిని కాపాడుకోవడంలో మనం శ్రద్ధగా ఉండాలి. సంఘర్షణ జరిగినప్పుడు, మన తప్పులను వెంటనే అంగీకరించాలి, మన సహోదరుల ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి మరియు మాటలో లేదా చేతలో ఏదైనా తప్పులను సరిదిద్దుకోవాలి. ఇది త్వరితగతిన చేయాలి ఎందుకంటే, సయోధ్య ఏర్పడే వరకు, పవిత్రమైన ఆచారాల ద్వారా దేవునితో సహవాసంలో పాల్గొనడానికి మనం అనర్హులం. ఏదైనా మతపరమైన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నప్పుడు, చిత్తశుద్ధితో ఆలోచించడం మరియు స్వీయ పరిశీలన కోసం దీనిని ఒక అవకాశంగా ఉపయోగించడం మంచిది. ఈ సలహా క్రీస్తు ద్వారా దేవునితో సయోధ్యను కోరుకోవడంలో సమానంగా ఉంటుంది. మనం సజీవంగా ఉన్నంత కాలం, మనం ఆయన తీర్పు పీఠానికి దారిలో ఉంటాము; మరణం తరువాత, చాలా ఆలస్యం అవుతుంది. విషయం యొక్క ప్రాముఖ్యత మరియు జీవితం యొక్క అనిశ్చితి కారణంగా, ఆలస్యం చేయకుండా దేవునితో శాంతిని కోరుకోవడం అత్యవసరం.

ఏడవ ఆజ్ఞ. (27-32) 
హృదయ కోరికలను అధిగమించడానికి కఠినమైన ప్రయత్నాలు అవసరం, తరచుగా అసౌకర్యంతో కూడి ఉంటుంది. అయినప్పటికీ, ఇది అవసరమైన ప్రయత్నం. మనకు ప్రసాదించబడినదంతా మన పాపాల నుండి మనల్ని రక్షించడానికే తప్ప వాటిని శాశ్వతం చేయడానికి కాదు. మన ఇంద్రియాలు మరియు సామర్థ్యాలపై నియంత్రణను కలిగి ఉండాలి, వాటిని అతిక్రమణలకు దారితీసే కార్యకలాపాలలో పాల్గొనకుండా నిరోధించాలి. వారి వస్త్రధారణ ద్వారా లేదా ఇతర మార్గాల్లో ఇతరులను పాపాత్మకమైన ప్రలోభాలకు గురిచేసేవారు లేదా పాపంలో వారిని విడిచిపెట్టేవారు లేదా వాటిని బహిర్గతం చేసేవారు వారి తప్పుకు బాధ్యత వహిస్తారు మరియు జవాబుదారీగా ఉంటారు. మన జీవితాలను కాపాడుకోవడానికి బాధాకరమైన వైద్య విధానాలను మనం భరించగలిగితే, మన ఆత్మల మోక్షానికి వచ్చినప్పుడు మన మనస్సు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంత ఎక్కువ సిద్ధంగా ఉండాలి? దేవుని అవసరాలన్నింటికీ ఒక దయగల అంశం ఉందని మరియు ఆయన దయ మరియు దయ ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తించడం చాలా అవసరం.

మూడవ ఆజ్ఞ. (33-37) 
గంభీరమైన ప్రమాణాలు, న్యాయస్థానంలో లేదా తగిన సందర్భాలలో, అవి సరియైన గౌరవప్రదంగా తీసుకున్నంత వరకు, సహజంగా తప్పు అని నమ్మవలసిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ, అనవసరమైన ప్రమాణాలు లేదా సాధారణ సంభాషణలో తీసుకోబడినవి పాపాత్మకమైనవిగా పరిగణించబడతాయి, అలాగే ప్రమాణం యొక్క అపరాధాన్ని నివారించడానికి దేవుని పేరును సూచించే వ్యక్తీకరణలు కూడా పాపాత్మకమైనవిగా పరిగణించబడతాయి. నైతికంగా నిటారుగా ఉన్న వ్యక్తులు ఎంత తక్కువగా ఉంటే, వారికి ప్రమాణాలు తక్కువగా ఉంటాయి, అయితే వారు తక్కువ ధర్మం కలిగి ఉంటారు, తక్కువ కట్టుబడి ప్రమాణాలు అవుతాయి. మన ప్రభువు ధృవీకరణలు లేదా తిరస్కరణల కోసం నిర్దిష్ట పదాలను సూచించలేదు కానీ ప్రమాణాలను నిరుపయోగంగా చేసే సత్యానికి స్థిరమైన నిబద్ధతను ప్రోత్సహిస్తాడు.

ప్రతీకార చట్టం. (38-42) 
స్పష్టమైన మార్గదర్శకత్వం ఇది: శాంతి కొరకు సహించగలిగే ఏదైనా హానిని సహించండి, మీ చింతలను ప్రభువు సంరక్షణకు అప్పగించండి. సారాంశంలో, క్రైస్తవులు వాదనలు మరియు వివాదాల నుండి దూరంగా ఉండాలి. తాము ఒక నిర్దిష్ట నేరాన్ని విస్మరించలేమని వాదించే వారికి, "మాంసము మరియు రక్తము" దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేవని గుర్తుంచుకోవాలి. ధర్మబద్ధమైన సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించే వారు ఎక్కువ శాంతి మరియు సంతృప్తిని పొందుతారు.

ప్రేమ చట్టం వివరించబడింది. (43-48)
యూదు ఉపాధ్యాయులు తమ సొంత దేశం, దేశం మరియు మత సమూహంలోని వారిని మాత్రమే స్నేహితులుగా పరిగణిస్తూ, "పొరుగువారు" అనే పదానికి పరిమిత నిర్వచనాన్ని కలిగి ఉన్నారు. అయితే, వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, అందరిపట్ల నిజమైన దయ చూపమని యేసు మనకు ఆదేశిస్తున్నాడు. వారి కొరకు మనం ప్రార్థించాలి. చాలా మంది దయతో దయతో ప్రతిస్పందించేటప్పుడు, చెడు ఎదురైనప్పటికీ దయతో స్పందించాలని మేము పిలుస్తాము. ఇది చాలా మంది ప్రజలు సాధారణంగా అనుసరించే దానికంటే గొప్ప సూత్రాన్ని ప్రదర్శిస్తుంది. కొందరు తమ సహోదరులను లేదా వారి పార్టీ, విశ్వాసాలు మరియు అభిప్రాయాలను పంచుకునే వారిని పలకరించి, ఆలింగనం చేసుకోవచ్చు, కానీ మన గౌరవం అలాంటి పద్ధతిలో పరిమితం కాకూడదు.
మన పరలోకపు తండ్రి 1 పేతురు 1:15-16 చూపిన మాదిరిని అనుసరించి మనల్ని మనం మోడల్ చేసుకోవడానికి కృషి చేస్తూ, దయ మరియు పవిత్రతలో పరిపూర్ణతను కోరుకోవడం క్రైస్తవుల బాధ్యత. క్రీస్తు అనుచరుల నుండి మనం ఎక్కువ ఆశించాలి మరియు ఇతరులలో కనిపించే దానికంటే మన జీవితాలలో ఎక్కువగా ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. మనల్ని మనం ఆయన బిడ్డలుగా నిరూపించుకోవడానికి శక్తినివ్వమని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |