John - యోహాను సువార్త 3 | View All
Study Bible (Beta)

1. యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.

పరిసయ్యుల గురించి మత్తయి 3:7 నోట్. ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఆచారాలు, మత కార్యకలాపాలూ ఆచరించడంతో కూడిన యూదుల మతానికి నీకొదేము చక్కటి ప్రతినిధి. ఇక్కడ మనం చదవబోతున్న సంభాషణలో యేసుప్రభువు ఒక విషయం స్పష్టం చేశాడు. అదేమంటే అలాంటి మతం అంతటినీ కలిపినా ఎవరినీ దేవుని సంతానంగా చెయ్యడం దానికి సాధ్యం కాదు.

2. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.

నీకొదేము రాత్రివేళ ఎందుకు వచ్చాడో మనకు తెలియదు, గానీ యేసు అతణ్ణి ఉన్నది ఉన్నట్టుగా మామూలుగా స్వీకరించాడనీ (యోహాను 6:37 పోల్చి చూడండి), అతనికో గొప్ప సత్యాన్ని నేర్పించాడనీ మాత్రం తెలుసు. ఈ సత్యం కొత్త ఒడంబడికలో దేవుడు వెల్లడించినదానికి ఆయువుపట్టు. “గురువర్యా (రబ్బీ)”– యోహాను 1:38 నోట్. యేసును దేవుని నుంచి వచ్చిన ఉపదేశకుడుగానే నీకొదేము ఎంచినట్టుంది గాని అభిషిక్తుడుగా దేవుని కుమారుడుగా కాదని తెలుస్తున్నది. అయితే యేసు చేసిన అద్భుతాలు ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయని అతడు గుర్తించగలిగాడు. యోహాను 2:11; మత్తయి 8:1 నోట్స్ చూడండి.

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యేసు జవాబు చాలా ముక్తసరిగా టూకీగా ఉంది. “నీవు అలా నిజంగా అనుకొంటున్నావా? అయితే నీవు నేర్చుకోవలసిన సంగతి ఒకటి నీకు నేర్పుతాను” అన్నట్టుగా ఉంది ఆయన జవాబు. యేసు దేవుని నుంచి వచ్చిన ఉపదేశకుడని ఇప్పుడు మనం అంటున్నామా? అలాగైతే మనక్కూడా ఆయన్ను బోధించనివ్వాలి. బైబిల్లో ఆయన చెప్పిన ప్రతి మాటనూ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను”– అనే మాట గురించి యోహాను 1:51 నోట్ చూడండి. కొత్తగా జన్మించడం గురించి యోహాను 1:13 నోట్ చూడండి. “కొత్తగా” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి “మళ్ళీ” లేక “పైనుంచి” అని కూడా అర్థం ఉంది. కొత్తగా జన్మించడమంటే పునర్జన్మ కాదు. మనుషులు శరీరంతో భౌతికంగా ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారనే సిద్ధాంతం బైబిలు ఉపదేశానికి విరుద్ధం (యోహాను 9:1-3; యోహాను 11:12 నోట్స్ చూడండి). ఒక వేళ మనుషులు మళ్ళీ మళ్ళీ పుట్టడం సాధ్యమైనప్పటికీ దానివల్ల నూతన ఆధ్యాత్మిక జన్మ సాధ్యం కాదు. మనుషులంతా పాపులే. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండడమంటే పాప భరిత జీవితాలను మళ్ళీ మళ్ళీ గడుపుతూ ఉండడమే. ఇది మనుషుల దోషాన్ని విపరీతంగా పెంచుతూ పోతుంది. నూతన జన్మ అంటే ఈ జీవితంలోనే ఇక్కడే జరిగేది. పరలోకం నుంచి దేవుడు చేసే నూతన సృష్టి కార్యమది. దేవుని ఘనమైన కార్యం మనుషులను నూతన సృష్టిగా, ఆధ్యాత్మిక జీవం గలవారుగా హృదయంలో అధ్భుతమైన మార్పు పొందినవారుగా చేస్తుంది. అది మరణం నుంచి జీవం లోకి వెళ్ళినట్టే (యోహాను 5:24; 2 కోరింథీయులకు 5:17-18; ఎఫెసీయులకు 2:1-5). ఇది లేకుండా దేవుని రాజ్యంలో ఎవరికీ భాగం లేదు. యూదుడుగా పుట్టి, ఆచారాలన్నీ పాటిస్తూ, మతనిష్ఠతో ఉండడం ఇదంతా నూతన జన్మ లేకుంటే వ్యర్థమే అని యేసు నీకొదేముతో చెప్తున్నాడు. దేవుని రాజ్యం గురించి మత్తయి 4:17 నోట్ చూడండి.

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

యేసు చెప్తున్నదేమిటో నీకొదేముకు అర్థం కాలేదు. లేదా, అది అసంభవం అంటూ “ముసలివారిలో అంత గొప్ప మార్పు కలగడం సాధ్యమా?” అని అడుగుతున్నాడు. ఇప్పటికీ మతనాయకులు అనేకమంది నీకొదేము ఉన్న స్థితిలోనే ఉన్నారు.

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

నూతన జన్మ ఎలా జరుగుతుందో ఈ వచనాల్లో యేసుప్రభువు వెల్లడిస్తున్నాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా ఇది కలుగుతుంది. “ఆత్మమూలంగా జన్మించడం” గురించి ఇక్కడ 3 సార్లు కనిపిస్తున్నాయి (వ 5,6,8). వ 5లో “నీళ్ళ మూలంగా” అనే మాటల విషయంలో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. పాత ఒడంబడిక గ్రంథంలో తరచుగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నీళ్ళు శుద్ధీకరణకు గుర్తుగా ఉన్నాయని కొందరన్నారు. నిర్గమకాండము 30:17-21; సంఖ్యాకాండము 19:9; సంఖ్యాకాండము 31:23; కీర్తనల గ్రంథము 51:7-10; యెషయా 44:3; యిర్మియా 4:14; యెహెఙ్కేలు 37:25 చూడండి. యెహెఙ్కేలు 36:25-26 ను “నీళ్ళమూలంగా దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే” అనేమాటలతో పోల్చి చూడండి. యెహెజ్కేలులో నీళ్ళు చిలకరించడం దేవుడు చేసే పనే గానీ మనుషులది కాదని గమనించండి. అందువల్ల హృదయంలో నుంచి పాపాల కల్మషాన్ని కడిగివేయడం గురించే గానీ నీటి బాప్తిసం గురించి అది చెప్పడం లేదని స్పష్టం అవుతున్నది. తీతుకు 3:5 పోల్చి చూడండి. అక్కడ కొత్త జన్మాన్ని “స్నానం” అని రాసి ఉంది. నీరు శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తుందో అలానే కొత్త జన్మం హృదయాన్ని శుభ్రపరుస్తుందన్న మాట. తీతుకు 3:5 లో నీటి బాప్తిసం గురించిన మాట లేనే లేదు. నీళ్ళమూలంగా అంటే దేవుని వాక్కుమూలంగా అని మరి కొందరు భావించారు. ఇక్కడ నీరు దేవుని వాక్కుకు సూచనగా ఉందని వారి అభిప్రాయం. దీనికి ఆధారంగా యోహాను 15:3; ఎఫెసీయులకు 5:26; యాకోబు 1:18; 1 పేతురు 1:23 మొదలైన వచనాలను వీరు చూపిస్తారు. మరి కొందరు ఇక్కడ నీళ్ళు యోహాను 7:37-39 లో లాగే దేవుని ఆత్మకు గుర్తుగా ఉందంటారు. “నీళ్ళమూలంగా, ఆత్మమూలంగా” అనడం ఒకే సంగతిని మరింత నొక్కి చెప్పిన విధానం అని వీరి ఉద్దేశం. మరి కొందరు నీళ్ళు ఈ లోకంలో శారీరికంగా పుట్టడానికి గుర్తు అంటారు. “మనిషి మొదటి పుట్టుక సరిపోదనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని ఆత్మమూలంగా కూడా జన్మించడం అవసరం” అని ఇక్కడ యేసు చెప్తున్నాడని వీరి అభిప్రాయం. మరి కొందరు పశ్చాత్తాపాన్నీ, పాపాలను ఒప్పుకొనే సంగతినీ గురించి చెప్పేందుకు “నీళ్ళమూలంగా” అనేమాట యేసు ఉపయోగించాడంటారు. వాటికి చిహ్నం నీటి బాప్తిసం గదా (మత్తయి 3:6 నోట్స్ చూడండి). మరి కొందరు ఇక్కడ నీళ్ళు అంటే నీటి బాప్తిసం అనీ, నూతన జన్మకు నీటి బాప్తిసం తప్పనిసరి అని బల్లగుద్ది వాదిస్తారు. నీటి బాప్తిసం జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ దాన్ని ఉపయోగిస్తూ దాని ద్వారా పని చేస్తూ దాన్ని తీసుకున్నవారిలో నూతన జీవం కలిగిస్తాడని వారంటారు. ఈ చివరిది తప్ప పైన చెప్పిన వివరణలన్నిటిలో ఏదైనా నిజం కావచ్చునని ఈ నోట్స్ రచయిత అభిప్రాయం. నూతన జన్మకు బాప్తిసం అవసరమని యేసుప్రభువు ఎక్కడా చెప్పలేదు. వ్యక్తులు నమ్మకం ద్వారా యేసుప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది (యోహాను 1:12-13) గానీ బాప్తిసం ఆచారంలో పాల్గొన్నప్పుడు కాదు. నూతన జన్మ తరువాత బాప్తిసం తీసుకోవాలి గానీ బాప్తిసంవల్ల నూతన జన్మ కలగదు. దేవుడు మాత్రమే నూతన జన్మ అనే అద్భుతాన్ని చేయగలడు. మనుషులు యేసుప్రభువును నమ్మినప్పుడే వారిలో ఆయన ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. పాపవిముక్తీ దేవుని రాజ్యంలో ప్రవేశించడమూ ఇది లేకుండా సాధ్యం కాదు (వ 7).

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

ఇక్కడ శరీరం అంటే మనిషి స్వభావసిద్ధంగా ఏమై ఉన్నాడో అదంతా అన్నమాట. రోమీయులకు 7:5, రోమీయులకు 7:18 నోట్స్ చూడండి. మనిషి తన పోలికలో పిల్లల్ని పుట్టించగలడు గానీ నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ఇవ్వలేడు. అలా చెయ్యాలన్న అతని ప్రయత్నాలన్నీ వ్యర్థమే. దేవుని ఆత్మ మాత్రమే (“నీళ్ళమూలంగా” అనే మాటలు ఈ వచనంలో లేవు, చూడండి) ఎవరిలోనైనా ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించగలడు.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
ప్రసంగి 11:5

దేవుని ఆత్మ కార్యం, ఆత్మమూలంగా జన్మించినవారి అంతరంగ జీవితం రెండూ చాలా నిగూఢమైనవి. గాలి కనిపించదు. దాని కదలికలు మనుషుల ఊహకు అందకుండా ఉంటాయి. గాలి వల్ల కలిగే ఫలితాల మూలంగా మాత్రమే అది మనుషులకు తెలుసు. దేవాత్మ వల్ల జన్మించినవారి సంగతి కూడా అంతే.

9. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా

నీకొదేము ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతడు అడిగిన ప్రశ్నను బట్టి మనం సంతోషించాలి, ఎందుకంటే దీనికి జవాబు చెప్పడంలో యేసుప్రభువు ఒక మనోహరమైన, ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు.

10. యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?

ఇస్రాయేల్‌వారికి ఉపదేశకుడుగా, పాత ఒడంబడికతో పరిచయం ఉన్నవాడుగా నీకొదేముకు ఈ సంగతులు ఇంత వింతగా అనిపించనవసరం లేదు. పాత ఒడంబడిక గ్రంథంలో అనేక చోట్ల చెప్పినట్టు మనుషుల భ్రష్ట స్థితి అతనికి తెలిసి ఉండాలి. అంతేగాక హృదయంలోను, బ్రతుకులోను మౌలికమైన మార్పులు వారికి అవసరమని కూడా తెలిసి ఉండాలి (ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; యిర్మియా 17:9). యిర్మియా 31:31-33; యెహెఙ్కేలు 11:19; యెహెఙ్కేలు 18:31; యెహెఙ్కేలు 36:26 మొదలైన వచనాలు తప్పకుండా అతనికి తెలుసు. అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని తాము తెలుసుకోకుండా ఇతరులకు బోధించడానికి బయలుదేరేవాళ్ళు దురదృష్టవశాత్తూ అనేకమంది ఇప్పటికీ ఉన్నారు. పాండిత్యం, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిలో కూడా ఎంతో ఆత్మసంబంధమైన అజ్ఞానం పేరుకుపోయి ఉండవచ్చు!

11. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యెషయా 55:4

యేసుప్రభువు ఉపదేశిస్తున్నప్పుడు కేవలం మత విషయాలపై ఏవేవో తన అభిప్రాయాలను తెలియజేయడం లేదు. తాను మాట్లాడుతున్నదేమిటో ఆయనకు తెలుసు. దైవికమైన అధికారంతో ఆయన మాట్లాడాడు (యోహాను 7:16-17; యోహాను 8:38; యోహాను 12:49-50; మత్తయి 7:28-29). మనం ఆయన మాటలు వినకపోతే ఆ నష్టం మనదే.

12. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?

యేసు నీకొదేముతో నీటిని గురించీ గాలిని గురించీ, ఈ భూమిపైన, భూనివాసులైన మనుషుల్లో జరిగే నూతన జన్మను గురించీ మాట్లాడాడు. పరలోక సంబంధమైన విషయాల గురించి ఈ క్రింది వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు – పరలోకంలో తన శాశ్వత నివాసం (వ 13), తాను స్వయంగా బలి కావడంద్వారా మనుషుల పాపాన్ని తీసివేయడం (వ 14), శాశ్వత జీవం (వ 15), దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఆయనచేత చేయించిన సంగతి (వ 16) మొదలైనవి పరలోక సంబంధమైన విషయాలు.

13. మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
సామెతలు 30:4

ఈ వచనంలో యేసు తాను అంత అధికారంతో పరలోక సంబంధమైన విషయాల గురించి ఎలా మాట్లాడ గలుగుతున్నాడో వెల్లడిస్తున్నాడు. అత్యున్నతమైన పరలోకంలో దేవుని సొంత నివాసంలో దేవుని చెంతనే నివసించిన ఏకైక వ్యక్తి యేసు. అక్కడినుంచి మనుషులకోసం దేవుణ్ణి గురించిన సత్యం తెలియజేసేందుకు ఆయన దిగివచ్చాడు. వ 31; యోహాను 1:1, యోహాను 1:14; యోహాను 6:38; యోహాను 8:23 పోల్చి చూడండి. “మానవ పుత్రుడు” గురించిన నోట్ మత్తయి 8:20. “పరలోకంలో...తప్ప”– యోహాను 1:18 పోల్చి చూడండి. యేసు పరలోకంనుండి దిగివచ్చి మనుషుల్లో మనిషిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన పరలోకంలోనూ ఉన్నాడు. దేవుని విషయంలో తప్ప ఇది మరెవరి విషయంలోనూ నిజం కాదు, ఎందుకంటే ఒక సమయంలో ఒకటికంటే ఎక్కువ చోట్ల ఉండడం దేవునికి మాత్రమే సాధ్యం.

14. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో,
సంఖ్యాకాండము 21:9

సంఖ్యాకాండము 21:4-9 నోట్స్‌ను చూడండి. మోషే కంచు పామును పైకెత్తినప్పుడు చనిపోతున్నవారు బ్రతికారు. పాపంలో చనిపోయిన మనుషులు (ఎఫెసీయులకు 2:1) ఆత్మ సంబంధంగా తిరిగి బ్రతకాలంటే యేసును పైకెత్తడం జరగాలి. ఇలా పైకెత్తడం సిలువ మీదికే (యోహాను 12:32-33 పోల్చి చూడండి). ఈ వచనాల్లో యేసుప్రభువు మనుషుల పాపాలకోసం తాను చేసే బలికీ వారి నూతన జన్మకూ ఉన్న సంబంధాన్ని చూపుతున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్లగా లోకమంతటి పాపాలను మోసుకుపోయాడు గనుకనే మనుషులు నూతన జన్మ, శాశ్వత జీవం పొందడానికి సాధ్యం అయింది. పాపం మనుషుల్ని పాడు చేసి వారిని శిక్షకు గురి చేస్తుంది. అయితే ఎవరైనా పశ్చాత్తాపపడి క్రీస్తులోను, తమకోసం ఆయన చేసిన బలిలోను నమ్మకం ఉంచితే దేవుని ఆత్మ వారిలో నూతన జీవాన్ని ఇస్తాడు (వ 5). ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది.

15. ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

యోహాను శుభవార్తకూ, మొత్తం బైబిలంతటికీ ప్రాణం అనదగిన వచనం ఇది. తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషులపట్ల దేవునికి జాలి, కనికరం ఉన్నాయి. మనుషులు మంచివారనీ తన ప్రేమకు యోగ్యులనీ కాదు ఆయన వారిని ప్రేమిస్తున్నది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టే ప్రేమిస్తున్నాడు (నిర్గమకాండము 34:6-7; 1 యోహాను 4:8). ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. తన కుమారుణ్ణి ఇచ్చివెయ్యడంద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువు పరచుకున్నాడు. (రోమీయులకు 5:8; తీతుకు 3:3-5; 1 యోహాను 3:16; 1 యోహాను 4:9-10). దేవుని ప్రేమ ఒక్క జాతికే పరిమితం కాదు (చాలామంది యూదులు ఇలా అనుకున్నారు). మానవాళినంతటినీ ఆయన ప్రేమించాడు (2 కోరింథీయులకు 5:19; 1 యోహాను 2:2; 1 తిమోతికి 2:3-4). “ఒకే ఒక”– క్రీస్తుకు పోలిక అంటూ ఎవరూ లేరు. ఆయన సాటి లేని వ్యక్తి. దేవుని స్వభావమంతటిలో ఆయన భాగస్వామ్యం గలవాడు (యోహాను 1:18; మత్తయి 3:17; ఫిలిప్పీయులకు 2:6). లోకంకోసం చనిపోవడానికి దేవుడు అనేక మంది కుమారుల్లో ఒకర్ని ఇవ్వలేదు. తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. గొప్పతనంలోనూ, విలువలోను వర్ణనాతీతమైన ఉచిత వరం ఇది (2 కోరింథీయులకు 9:15). యేసుప్రభువును పంపడంలో దేవుని ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా వెల్లడి అయింది. మనుషులు పాపంలో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. శాశ్వత జీవం కేవలం ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాదు. అది మామూలు జీవానికి భిన్నంగా ఉత్తమంగా ఉన్నది. శాశ్వత జీవమంటే పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. అది పాపం, మరణం నీడ కూడా లేకుండా దేవునితో సహవాసంలోని జీవం. ఆ జీవాన్ని పొందాలంటే ఒకటే మార్గమని యేసుప్రభువు ఇక్కడ మరోసారి అతి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనలో నమ్మకముంచడమే ఆ మార్గం (వ 36; యోహాను 1:12; యోహాను 5:24; యోహాను 6:47; యోహాను 8:24 కూడా చూడండి). శాశ్వతంగా నరకంలో నశించిపోవడానికీ, దేవునితో అనంతకాలం జీవించడానికీ ఉన్న తేడా క్రీస్తులో నమ్మకం ఉంచడంలోనే ఉంది.

17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

యోహాను 12:47. దేవుడు ఈ విశ్వానికంతటికీ న్యాయమైన తీర్పరి. తీర్పుకోసం ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడవలసిన సమయం రాబోతున్నది (ఆదికాండము 18:25; ద్వితీయోపదేశకాండము 32:36; 1 సమూయేలు 2:10; కీర్తనల గ్రంథము 7:8; కీర్తనల గ్రంథము 9:8; కీర్తనల గ్రంథము 82:8; కీర్తనల గ్రంథము 96:13; అపో. కార్యములు 17:30-31; 2 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 20:11-13). అయితే దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపిన ఉద్దేశం పూర్తిగా వేరు. వారి పాపాలకు న్యాయంగా రావలసిన శిక్షనుంచి వారిని విడిపించి రక్షించడమే ఆ ఉద్దేశం. మనుషుల పాపాలనూ శిక్షనూ తానే భరించడంద్వారా క్రీస్తు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు (యోహాను 1:29; యోహాను 3:15; 2 కోరింథీయులకు 5:21; 1 పేతురు 2:24). దేవుడు తనను పంపించాడని యేసు యోహాను శుభవార్తలో 40 సార్లు చెప్పాడు.

18. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

రోమీయులకు 8:1. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్పణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయనెంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారూ అంతే (రోమీయులకు 3:24-25; రోమీయులకు 5:1; ఎఫెసీయులకు 1:7; కొలొస్సయులకు 2:13; 1 యోహాను 2:12). అందువల్ల వారికిక శిక్షావిధి లేదు. క్రీస్తును నమ్మనివారి సంగతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారి పాపాలకు దేవుడు చూపిన ఏకైక నివారణను వారు నిరాకరిస్తున్నారు. దేవుని అతి శ్రేష్ఠమైన ఉచిత వరాన్ని విసర్జించడం ద్వారా తమ పాపాల జాబితాలో పాపాలను ఇంకా కలుపుతూ, తమ అపనమ్మకం మూలంగా దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నారు (1 యోహాను 5:10). ఇలాంటివారికి శిక్ష విధించడం తప్ప మరేదీ మిగలదు. బైబిలు ఉపదేశంలో నమ్మకానికి ఉన్న ప్రాధాన్యతను మళ్ళీ గమనించండి.

19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

మొత్తం లోకం ఇప్పటికీ దేవుని ఎదుట దోషిగా తీర్చబడి శిక్షావిధికి గురై ఉంది (రోమీయులకు 1:18-20; రోమీయులకు 3:9, రోమీయులకు 3:19). క్రీస్తును నమ్మనివారు తమ ప్రవర్తన చెడ్డదని చెప్పే తీర్పు కోసం దేవుని మహా తీర్పుదినం వరకు ఎదురు చూడనవసరం లేదు. ఈ రెండు వచనాల్లో ఈ తీర్పు రాసి ఉన్నది. వారు ఎలాంటివారో, తీర్పుకూ శిక్షకూ ఎంత అర్హులో తమ క్రియల ద్వారానే బయట పెడుతున్నారు. క్రీస్తు అనే వ్యక్తి రూపంలో వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. యోహాను 1:4-9; యోహాను 8:12 పోల్చి చూడండి. దేవుణ్ణి గురించి మనుషుల గురించి పాపవిముక్తి గురించి అద్భుతమైన సత్యాలను ఆయన లోకంలోకి తెచ్చాడు. కానీ మొత్తం మీద మనుషులు ఆయన్ను గానీ ఆయన తెచ్చిన సత్యాన్ని గానీ ఇష్టపడలేదు. వారికి వేరొకటి ప్రీతిపాత్రంగా ఉంది – చీకటి. చీకటి దాపరికానికీ కపటానికీ అజ్ఞానానికీ అసత్యానికీ దుర్మార్గతకూ సూచన. అలాంటి చీకటిని అంటే ఇష్టమున్నవారికి వెలుగు అంటే ఇష్ట ముండదు. వారు నరకానికి పాత్రులైన పాపులనీ, క్రీస్తు మాత్రమే వారిని దాని నుంచి తప్పించగలడనీ వారి స్థితిని ఉన్నదున్నట్టుగా ఆ వెలుగు బయటపెడుతుంది. అంతేగాక వారు చేయడానికి ఇష్టపడే చెడు కార్యాల్లో మునిగి తేలుతూ ఉండకుండా వెలుగు అడ్డుపడుతుంది. అందువల్ల వెలుగంటే వారికి ద్వేషం. అంటే వారు క్రీస్తునూ, ఆయన సత్యాన్నీ ద్వేషిస్తున్నారు (ఇది అతిశయోక్తి, అతివాదం కాదు. యేసు అనేకసార్లు చెప్పిన గంబీర సత్యమిది – యోహాను 7:7; యోహాను 15:18, యోహాను 15:23-25). దీన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏమంటే, మనుషుల అపనమ్మకానికి కారణం అందుకు సరైన హేతువులు వారికి ఉండడం కాదు. లేక, వారి బుద్ధి ఎంతో ఎక్కువ గనుక నమ్మలేకపోతున్నారనీ కాదు. వారిలోని పాపం, చీకటి కారణంగానే వారు నమ్మరు. ఈ పొరపాటుకు మూలం వారి ఆలోచనల్లో లేదు గాని వారి ఆశల్లో, అంతరంగంలోనే. క్రీస్తులో నమ్మకం అనేది చీకటికి బదులు మంచితనాన్ని, పవిత్రతను, సత్యాన్ని నీతిని ఎన్నుకోవడమే. చాలామంది ఇలా ఎన్నుకునేందుకు ఇష్టపడరు. పవిత్రత కంటే పాపాన్నీ, క్రీస్తుకంటే స్వార్థాన్నీ వారు కోరుకుంటారు.

20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.

21. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

అయితే సత్యాన్ని కోరుకుని, దాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారు కొందరున్నారు. వారు దేవుని వాక్కుకు కొంతవరకైనా విధేయత చూపుతారు. దేవుడు అలాంటి వారి హృదయాల్లో పని చేస్తున్నాడు. వెలుగుకు వారు భయపడరు. దాని దగ్గరకు వస్తారు. అందుచేత వీరు శుభవార్తను నమ్మి క్రీస్తును స్వీకరిస్తారు. నాలుగు శుభవార్తల్లోనూ శిష్యులు, ఇతరులు మరికొందరు ఇందుకు ఉదాహరణలు. ప్రపంచంలో ఈనాడు ఇలాంటివారు అనేకమంది ఉన్నారు.

22. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.

యోహాను 4:1-2.

23. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.

“సాలీము”ఖచ్చితంగా ఎక్కడున్నదీ తెలియదు. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడని చెప్పడంలో గల కారణం అతడు ముంచడం ద్వారా బాప్తిసమిచ్చేవాడని సూచిస్తున్నది (మత్తయి 3:6).

24. యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.

మత్తయి 14:1-12.

25. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.

మార్కు 7:1-4.

26. గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.

“గురువర్యా”– యోహాను 1:38. క్రీస్తుకు సాక్షిగా ఉండేందుకు యోహాన్ను దేవుడు పంపాడు (యోహాను 1:6-8). తరువాతి వచనాల్లో ఎంత అద్భుతంగా అతడీ పని చేస్తూ ఉన్నాడో చూడగలం. యోహాను క్రీస్తును గురించి అసూయపడేవాడు కాదు, పైగా ప్రజలు క్రీస్తును గుర్తించినందుకు ఉప్పొంగిపోతున్నాడు. తన పరిచర్య అంతటి నెరవేర్పును అందులో చూడగలిగాడు. తనవైపుకు ప్రజలను ఆకర్షించుకోవడం అతని ఉద్దేశం ఎన్నటికీ కాదు. వారికి యేసుప్రభువును చూపించడమే అతని పని. ఇందులో ఇతడు మనకందరికీ ఆదర్శం.

27. అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు.

తన ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఒక స్థానాన్ని, ఒక పరిచర్యను దేవుడు ఏర్పాటు చేశాడని యోహానుకు బాగా తెలుసు. ఒకడు మరొక స్థానంకోసం ప్రాకులాడ్డం గానీ మరొకణ్ణి చూచి అసూయ చెందడం గానీ తగదనీ, తనకోసం దేవుని ఏర్పాటుతో తృప్తిపడాలనీ కూడా అతనికి తెలుసు. సంఖ్యాకాండము 11:26-29; కీర్తనల గ్రంథము 75:6-7; యిర్మియా 45:5 పోల్చి చూడండి.

28. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
మలాకీ 3:1

యోహానుకు తన స్థానమేమిటో తెలుసు. దాన్నిబట్టి అతనికెంతో సంతోషం. యోహాను 1:19-27లో తన పరిచర్య ఏమిటో స్పష్టంగా అతడు చెప్పాడు. ఇక్కడ క్రీస్తును పెళ్ళికుమారుడుగా, ఆయన ప్రజలను పెళ్ళికూతురుగా అతడు వర్ణిస్తున్నాడు. తనను పెళ్ళికుమారునికి ఒక స్నేహితుడుగా మాత్రమే వర్ణిస్తున్నాడు. పెళ్ళిలో వధూవరులే ప్రాముఖ్యమైన వ్యక్తులు. పెళ్ళికొడుకు స్నేహితునికి అంత ప్రాముఖ్యత లేదు. పాత ఒడంబడిక గ్రంథంలో ఇస్రాయేల్‌జాతిని యెహోవాదేవుని భార్యగా వర్ణించిన సంగతి యోహానుకు తెలుసు (యెషయా 54:5; యెషయా 62:4-5; యిర్మియా 2:2; యిర్మియా 3:20; యెహెఙ్కేలు 16:8; హోషేయ 2:19-20). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో క్రీస్తు తనను తాను పెళ్ళికుమారునిగా చెప్పుకున్నాడు (మార్కు 2:19). ఆయన సంఘం పెళ్ళి కుమార్తెకు పోల్చబడింది (2 కోరింథీయులకు 11:2; ఎఫెసీయులకు 5:32; ప్రకటన గ్రంథం 19:7).

29. పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది.

30. ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.

క్రీస్తుపట్ల ప్రేమ, నిస్వార్థ త్యాగం, అణకువ చూపడం యోహాను జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ సుగుణాలు దేవుని దృష్టిలో అతి విలువ గలవి (మత్తయి 3:11; మత్తయి 10:37-39; మత్తయి 18:4; మత్తయి 20:25-28).

31. పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి
కీర్తనల గ్రంథము 97:9

పైనుంచి వచ్చినవాడు యేసుప్రభువు – వ 13; యోహాను 8:23; 1 కోరింథీయులకు 15:47. భూమికి చెందినవాడు యోహాను. యేసుప్రభువుకూ మిగతా మనుషులందరికీ ఉన్న ఒక తేడా ఇదే.

32. తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
యెషయా 55:4

వ 11-13.

33. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.

మనం క్రీస్తు మాటలపై నమ్మకం ఉంచితే దేవుడు సత్యవంతుడని చెప్తున్నామన్న మాట. అలా నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికుడు అని చెప్పినట్టే (1 యోహాను 5:10).

34. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.

యోహాను 7:16-17; యోహాను 8:38; యోహాను 12:49-50 పోల్చి చూడండి. ఇక్కడ “ఆత్మ” అంటే పవిత్రాత్మ – యోహాను 1:32; మత్తయి 3:16; యెషయా 11:1-2; యెషయా 61:1. దేవుని ఆత్మ గురించి నోట్స్ యోహాను 14:16-17.

35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.

తండ్రి అయిన దేవునికీ, కుమారుడైన దేవునికీ మధ్య ఉన్న పరస్పర ప్రేమ, అంటే దేవత్వంలోని వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ శుభవార్తలన్నిటిలోనూ కనిపిస్తున్నది గానీ మిగతావాటిలో కన్నా యోహాను శుభవార్తలో మరింత తేటగా ఇది వెల్లడి అయింది (మత్తయి 3:17; మార్కు 1:11; లూకా 3:22; యోహాను 5:20; యోహాను 10:17; యోహాను 14:31; యోహాను 15:9-10; యోహాను 17:23-24, యోహాను 17:26). తండ్రి అధికారమంతా కుమారునికి ఇచ్చాడు. యోహాను 5:22-27; యోహాను 17:2, యోహాను 17:6; మత్తయి 28:18; అపో. కార్యములు 2:36; హెబ్రీయులకు 1:2; కీర్తనల గ్రంథము 2:6-12 చూడండి.

36. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

పైనున్న వచనాల తరువాత సహజంగానే ఈ మాటలు వస్తున్నాయి. క్రీస్తులో నమ్మకం ఉంచినవారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయనొక్కడే. పొందవలసిన మార్గమూ ఇదొక్కటే. వ 16లో శాశ్వత జీవం గురించి నోట్ చూడండి. “నిరాకరించేవాడికి”– ఈ గ్రీకు పదాన్ని “నిరాకరించినవారికి”, లేక “తిరగబడినవారికి” అని కూడా అనువదించవచ్చు. క్రీస్తును నిరాకరించడమంటే, ఆయనకు విధేయత చూపకపోవడమంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీదా పాపులందరి మీదా దేవుని కోపం ఎప్పుడూ నిలిచే ఉంటుంది (మత్తయి 3:7; రోమీయులకు 1:18; ఎఫెసీయులకు 5:6; 1 థెస్సలొనీకయులకు 1:10; ప్రకటన గ్రంథం 6:16-17; ప్రకటన గ్రంథం 19:15. సంఖ్యాకాండము 25:3; ద్వితీయోపదేశకాండము 4:25; కీర్తనల గ్రంథము 90:7-11 నోట్స్ చూడండి.) పవిత్రమైన న్యాయ బద్ధమైన ఆయన స్వభావం దుర్మార్గతనంతటినీ అసహ్యించుకోవడమే ఆయన కోపానికి కారణం. ప్రతి వ్యక్తీ శాశ్వత జీవాన్ని పొందాలి, లేదా దేవుని కోపాన్ని అనుభవించాలి. మనుషుల ఎదుట ఈ రెండు మాత్రమే ఉన్నాయి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నికోడెమస్‌తో క్రీస్తు ప్రసంగం. (1-21) 
నికోడెమస్, భయం లేదా సిగ్గుతో, బహిరంగ ప్రదేశంలో కాకుండా రాత్రిపూట కవర్ కింద క్రీస్తుతో కలవడానికి ఎంచుకున్నాడు. మత విశ్వాసాలు ప్రాచుర్యం పొందని సమయాల్లో, చాలామంది నికోడెమస్ మాదిరిగానే ఇలాంటి రహస్య విధానాన్ని అవలంబిస్తారు. అయితే, రహస్య సమావేశం ఉన్నప్పటికీ, యేసు అతనిని స్వాగతించాడు, నీతి కోసం బలహీనమైన ప్రయత్నాలకు కూడా మద్దతు ఇవ్వడం మరియు పోషించడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించాడు. నికోడెమస్ మొదట నీడలో యేసును సంప్రదించగా, తరువాత అతను బహిరంగంగా అతనిని అంగీకరించాడు.
వారి సంభాషణ ఒక పాలకుడైన నికోడెమస్ యొక్క రాజకీయ ఆందోళనల కంటే వ్యక్తిగత మోక్షానికి సంబంధించిన విషయాలను పరిశోధించింది. యేసు పునరుత్పత్తి యొక్క ఆవశ్యకతను మరియు స్వభావాన్ని నొక్కి చెప్పాడు, దానిని కొత్త పుట్టుకతో పోల్చాడు-ముఖ్యంగా మునుపు తప్పుగా లేదా ప్రయోజనం లేకుండా జీవించిన వారికి జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం. ఈ పరివర్తనకు పూర్తి సమగ్ర మార్పు అవసరం-కొత్త స్వభావం, సూత్రాలు, ఆప్యాయతలు మరియు లక్ష్యాలు. పుట్టుక యొక్క రూపకం ఒకరి స్థితి మరియు స్వభావంలో లోతైన మరియు విశేషమైన మార్పును నొక్కి చెప్పింది.
స్వర్గం నుండి ఉద్భవించిన ఈ కొత్త జన్మ భావన సంఖ్యాకాండము 21:6-9లో చూసినట్లుగా, పాపం యొక్క ఘోరమైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. పాపం యొక్క ప్రారంభ ఆకర్షణ ఉన్నప్పటికీ, అది చివరికి హానిని కలిగిస్తుంది, పాము కాటుతో పోల్చబడింది. మన ఆధ్యాత్మిక రుగ్మతలకు పరిష్కారంగా సువార్తలో అందించబడిన క్రీస్తులో పరిహారం ఉంది. తమ పాపభరితమైన స్థితిని విస్మరించేవారు లేదా రక్షణ కొరకు క్రీస్తు యొక్క నిబంధనలను తిరస్కరించేవారు తమ మీద తాము నాశనం చేసుకుంటారు.
సువార్త సందేశం యేసుక్రీస్తును విశ్వసించే బాధ్యతను నొక్కి చెబుతూ, ప్రపంచానికి తన కుమారుడిని ఇవ్వడంలో దేవుని ప్రేమను వెల్లడిస్తుంది. ఈ విశ్వాసం ఆయనను విశ్వసించే వారికి శాశ్వత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రయోజనానికి దారి తీస్తుంది. మోక్షం అనేది క్రీస్తుకు మాత్రమే ప్రత్యేకమైనది, క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచాన్ని తనతో సమాధానపరచుకోవడం ద్వారా ప్రదర్శించబడింది. నిజమైన విశ్వాసులు తమ గత పాపాలు చేసినప్పటికీ దేవుని క్షమాపణ మరియు దయను అనుభవిస్తూ సంతోషాన్ని పొందుతారు మరియు నింద నుండి తప్పించుకుంటారు.
మరోవైపు, అవిశ్వాసం అనేది పరిహారం యొక్క తిరస్కరణగా ఖండించబడింది, ఇది దేవుని పట్ల హృదయ శత్రుత్వం మరియు పాపం పట్ల ప్రేమ నుండి ఉద్భవించింది. క్రీస్తును తిరస్కరించేవారి విధి భయంకరమైనది, ఖండించడం, దేవుని కోపం మరియు తనను తాను ఖండించుకునే హృదయంతో ఉంటుంది.
ఈ ప్రకరణం క్రీస్తుకు ప్రతిస్పందనను కూడా విభేదిస్తుంది: దుష్ట ప్రపంచం కాంతిని దూరం చేస్తుంది ఎందుకంటే అది వారి పాపపు పనులను బహిర్గతం చేస్తుంది, అయితే పునరుద్ధరించబడిన హృదయాలు దానిని స్వాగతిస్తాయి. రూపాంతరం చెందిన వ్యక్తి హృదయపూర్వకంగా వ్యవహరిస్తాడు, దేవుని చిత్తంతో మార్గనిర్దేశం చేస్తాడు మరియు అతని పట్ల ప్రేమతో ప్రేరేపించబడ్డాడు. పునరుత్పత్తి, ప్రధాన ఇతివృత్తం, భౌతిక విజయాలు మరియు ప్రాపంచిక విజయాలను కప్పివేస్తూ, పారామౌంట్ ఆందోళనగా ప్రదర్శించబడుతుంది.
ముగింపులో, కథనం పాఠకులను ప్రాపంచిక సాధనల కంటే ఆధ్యాత్మిక పునర్జన్మకు ప్రాధాన్యతనివ్వమని కోరింది, పునరుత్పత్తి లేని జీవితం దుఃఖానికి దారితీస్తుందని మరియు దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడానికి దారితీస్తుందని నొక్కి చెబుతుంది.

క్రీస్తు జాన్ యొక్క బాప్టిజం జాన్ యొక్క సాక్ష్యం. (22-36)
జాన్ తనకు అప్పగించిన స్థలం మరియు పనులు రెండింటిలోనూ పూర్తి సంతృప్తిని పొందాడు, అయినప్పటికీ యేసుకు మరింత ముఖ్యమైన మిషన్ ఉందని అతను గుర్తించాడు. యేసు పరిపాలన మరియు శాంతి శాశ్వతంగా ఉంటాయని, ఆయన నిరంతరం గౌరవం మరియు ప్రభావాన్ని పొందుతారని అతను అర్థం చేసుకున్నాడు. దీనికి విరుద్ధంగా, జాన్ తనకు తగ్గ ఫాలోయింగ్‌ను ఊహించాడు. దేవుని కుమారుడైన యేసు పరలోకం నుండి దిగివచ్చాడని తెలుసుకున్న జాన్, మరింత సూటిగా మతపరమైన విషయాలను ప్రస్తావించడానికే పరిమితమైన తన పాపాత్మకమైన, మర్త్య స్వభావాన్ని గుర్తించాడు. యేసు మాటలు దైవిక అధికారాన్ని కలిగి ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఆత్మచే మార్గనిర్దేశం చేయబడ్డాయి, ప్రవక్తల మాటల వలె పరిమితం కాలేదు. యేసుపై విశ్వాసాన్ని ఆలింగనం చేసుకోవడం శాశ్వత జీవితానికి ఏకైక మార్గం అని జాన్ నొక్కిచెప్పాడు, అయితే దేవుని కుమారుడిని తిరస్కరించిన వారు మోక్షానికి దూరంగా ఉంటారు, దేవుని శాశ్వతమైన కోపాన్ని సహిస్తారు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |