ప్రకటన 10:1 - 11 బలిష్ఠుడైన వేరొక దూత ... ... ... ... ... మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
మేఘము ధరించుకొనుట, శిరస్సుమీద ఇంద్రధనుస్సు, సూర్యబింబము వంటి ముఖము, అగ్నిస్తంభములవంటి పాదములు, ఒక చిన్న పుస్తకము అను మాటలు చదువుతున్నప్పుడు మనకు ప్రకటన మొదటి అధ్యాయములో 1:13 నుండి 1:16 వరకునూ, 4:3 మరియూ 5:1 గుర్తుకు వస్తున్నాయి కదూ! క్రీస్తు తన రాకడ దర్శనమును సూచించుచు పంపబడిన ఒక దేవ దూత మాత్రమే. అతని చేతిలో వున్నది చిన్న పుస్తకము, గంధము కాదు.
అతడు సింహము వలే గర్జించుట వినబడినప్పుడు అదే సమయమునకు విశ్వాసులను మోసపుచ్చు సాతాను సైతము గర్జిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు (1 పేతు 5:8).
ఆ ఏడు ఉరుములు ఏమని పలికాయో తెలిస్తే బాగుండును కదా! అనిపిస్తుంది. కాని దేవుడు కొన్ని మర్మాలు మర్మముగానే ఉంచుతారు. అలా లేకపోతే మనిషి నాకు తెలియనిది ఏముంది అంటాడు. దానియేలుతో సైతం దేవుడు: అది వాస్త వము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను (దాని 8:26). ఎందుచేత మనుష్యులు అలా అంటారు అంటే; చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను (దాని 12:4).
పోనీ నాకైనా తెలుపవచ్చు కదా అని దానియేలు అడిగినప్పుడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను (దాని 12:9). రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు (ద్వితీ 29:29). కనుక బయలుపరచబడినవి మొదట ధ్యానించుదాము.
ఐతే రక్షణ మర్మము మనకు తెలుపబడినది అని మనము గ్రహించాలి. అలాగే ఒకటి పరలోకం మరొకటి పాతాళం లేక నరకం అనే మర్మం తెలిస్తే అంతే చాలు ప్రియ సోదరీ సోదరుడా.
ఈ చిన్ని పుస్తకము దేవుని పరిశుద్ధ బైబిలు గ్రంధమును సూచించుచున్నది. యోహాను గారు ప్రకటన దర్శనము పొందిననాటికి లేక వ్రాసిననాటికి ఇట్టి గంధము ప్రచురింపను ముద్రింపను బడలేదు. ప్రియ స్నేహితుడా, దేవుని పరిశుద్ధ గ్రంధమును ఎలా చదువుచున్నావు? దేవ దూత దానిని తినివేయుము అంటున్నాడు.
ప్రవక్తయైన యిర్మియా అంటున్నాడు: నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని (యిర్మీ 15:16). అవును, భుజించాలి నెమరువేయాలి మరల మరల స్మరణ చేయాలి; అప్పుడుగాని ఆ మాటల మాధుర్యము అనుభవం కాదు. యేహెజ్కేలు ప్రవక్తతో ప్రభువు: ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.
నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధుర ముగా నుండెను (యెహే 3:1-3). ఐతే “నీవు ప్రవచింప నగత్యము”, “ప్రకటన చేయుము” అని చెప్పబడుచున్నది.
పరిశుద్ధ గ్రంధమును చదివిన నీవు ఒక సువార్తికునిగా మారావా? ఎవరికైనా దేవుని మాటలు చెపుతున్నావా? అంటే పెద్ద ప్రసంగాలు చెయ్యమని కాదు, క్రీస్తుకు సజీవ సాక్షిగా బ్రతుకుతున్నావా లేదా!! బైబిలులో అన్నీ మధురమైన సంగతులే ఉన్నాయా, ఎలా బోధించాలి అనుకుంటున్నావా; గ్రంథమును విప్పగా అది లోపటను వెలుపటను మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను (యెహే 2:10). దానిని ఆకళింపు చేసుకొనుటకు అది చేదు అనుసరించుటకు క్లిష్టమైనది.
ఏడు సంఘములకు వ్రాయుము అని పలికిన దేవుడు మరల మరల వ్రాయుము వ్రాయుము అని చెప్పలేదు గాని, సంభవింపనైయున్న ప్రతి కీడును గూర్చి కూడా, యోహాను గారు వ్రాసి మనకు అందించారు. అందుకు దేవునికి స్తోత్రము. ఏడవ ముద్ర విప్పినప్పుడు సిద్ధముగానుండి వూదుటకు మొదలు పెట్టిన ఆరవ దూత బూర విషయము ధ్యానించుచున్నాము. ముందుకు సాగునట్లు దేవుడు మనతో నుండును గాక. ఆమెన్