ప్రకటన 14:1 మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.
ప్రకటన 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
ప్రకటన 14:3 వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
ప్రకటన 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱ పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
ప్రకటన 14:5 వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
ప్రక 7:4 లో కనబడిన దేవుని ముద్ర గల అనగా క్రీస్తు నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న లక్ష నలువది నాలుగు వేలమంది గొర్రెపిల్లతో వున్నారు. సీయోను పర్వతము పరలోకపు ఎరుషలేమును సూచించుచున్నది. గొర్రెపిల్ల క్రీస్తును మరియూ అత్యున్నత సింహాసనాసీనుడైన దేవాది దేవుని వారు ఆరాధించు సంగీతముల సునాదములు వినబడుచూ అవి వీణలు మ్రోగినట్లు శ్రవణానందము కలిగించునట్లు మ్రోగుచున్నవి.
యోహాను గారు అనేకసార్లు వినిన శబ్దములు జలముల శబ్దము వలెనో ఉరుముల శబ్దము వలెనో గర్జించు సింహపు స్వరము వలెనో వినబడినవి. ఆ గ్రంధము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడైన ఆ గొర్రెపిల్లకు స్తోత్రము చేయుచూ ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అంటూ ఆరాధించినప్పుడు రక్షింపబడిన వారు భూలోకములో ఒక క్రొత్తపాట పాడుదురు (ప్రకటన 5:9’ 10) అని ప్రకటిస్తూ వున్నారు. వారు పరలోకములో కూడా ఆ సింహాసనము ఎదుట ఆ క్రొత్త కీర్తన పాడుచున్నారు.
యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును (యెష 51:11). వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యిర్మీ 31:12). వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు కాదు కాని దానియందు అపవిత్రులు కానివారు. తమ రక్షణ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని గొర్రెపిల్ల క్రీస్తుతో కూడ సంచరించెదరు (ప్రక 3:4). మరియూ వారు యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు (కీర్త 119:1).
ప్రియులారా మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి (1 కొరిం 6:20). మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి (రోమా 6:13).
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది(రోమా 12:1). క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయు వారముగా నుందుము గాక. ఆమెన్.
ప్రకటన 14:6 అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.
ప్రకటన 14:7 అతడుమీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు సువార్త అనగా ప్రకటించబడిన సువార్త ప్రపంచమును చుట్టి వచ్చుటను సూచించు చున్నది. ముగ్గురు దూతలలో మొదటి దూత సువార్త ప్రకటించు దూత. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు (రోమా 14:1) అను వాక్య భావమిదే.
నేడు అంతర్జాలము (Internet) ద్వారా దేవుని సువార్త ప్రపంచమంతటా మారుమ్రోగుచున్నది. ఒకచోట సువార్త వర్తమానము ప్రకటింప మొదలుపెట్టిన క్షణములోనే ప్రపంచ నలుమూలల సామాజిక మాధ్యమాల ద్వారా సజీవముగా (Live) వినబడుచూ (Audio) ముఖచిత్రము (Video) కనబడుచున్నది.
ప్రియ స్నేహితుడా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి (కొల 2:3 ) కావా. నిత్య సువార్త అనగా నిత్యత్వమును గూర్చిన వర్తమానము లేక నిత్యజీవమును గూర్చిన వాక్యము అని భావన. అందుకే కదా యేసయ్య అన్నారు: మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు 16:15). సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (మార్కు 14:9). సర్వలోకము లేక సర్వసృష్టి అనే మాటల భావన ఇక్కడ మనకు సుస్పష్టమగుచున్నది.
(దేవుని) రాజ్యమును గూర్చిన సువార్త (మత్త 4:23), దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త (మార్కు 1:1, దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త (అపో 8:12), సమాధానకరమైన సువార్త (అపో 10:36), దేవుని కృపాసువార్త (అపో 20:24), దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త (2 కొరిం 4:4), రక్షణ సువార్త (ఎఫే 1:13), సమాధాన సువార్త (ఎఫే 2:17), మహిమగల సువార్త (1 తిమో 1:8), నిత్యసువార్త (ప్రకటన 14:6).
పరి పరి విధములుగా పలు మాధ్యమాల ద్వారా అనగా ఆకాశవాణి ద్వారా, టీవీ ద్వారా, కరపత్రాల రూపములో మనియూ ఇంటర్నెట్ ద్వారా సువార్త ప్రకటింప బడుచుండగానూ, తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు ఈ కాలములో; దేవుని తీర్పు మనయొద్దనే ఆరంభమైతే నేటికినీ దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? (1 పేతు 4:17). ఇంకనూ సువార్త అందని వారి కొరకునూ సువార్త అందని ప్రాంతములలో సువార్త ప్రకటించు వారికొరకునూ ప్రార్ధన చేద్దామా. ప్రభువు మనతో నుండును గాక. ఆమెన్
ప్రకటన 14:8 వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.
ముగ్గురు దూతలలో రెండవ దూత ప్రకటించుట ఇక్కడ మనము గ్రహించాలి. బబులోను లోకమునకు సాదృశ్యము. లోకమునకు తీర్పు సమయము సమీపించిన కొలది లోకము వినాశనమునకు ఎలా చేరువ అవుతుందో తెలిపే అంశములు దీనిలో మనకు కనబడుతున్నాయి. బబులోను గూర్చి వ్రాయబడిన వాక్య భాగములు గమనించినట్లైతే మనకు అవగాహన అవుతుంది.
ప్రక 14:8 లో మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన మహా బబులోను అని వుండగా;
ప్రక 16:19 లో ప్రసిద్ధమైన మహాపట్టణము అనియూ; తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను దానికి ఇయ్యవలెనని దేవుని సముఖమందు జ్ఞాపకము చేయబడినది.
ప్రక 17:5 లో అపవాది దాని నొసట వ్రాసుకున్న పేరు వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లి.
ప్రక 18:2 లో మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైనది.
ప్రక 18:10 లో దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.
ప్రక 18:21 లో బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును అని పలికినాడు. ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేసి, వారి నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన మీదట లోకపు గతి ఏమౌనో బయలుపరచ బడుచున్నది.
లోకమును గూర్చి ఒక్క మాటలో చెప్పబడిన వాక్యమేదనగా : లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే (1 యోహా 2:16). ప్రియ దేవుని బిడ్డా, నీవు జాగ్రత్త. క్రీస్తు రక్తాభిషేకం నీమీద ఉండును గాక. ఆమెన్
ప్రకటన 14:9 మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల
ప్రకటన 14:10 ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
ప్రకటన 14:11 వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
ప్రకటన 14 వ అధ్యాయము ఆరంభమునుండి చూసినట్లైతే ఆకాశ మధ్యమున ప్రకటింపబడుచున్న దేవుని సువార్త వివరణ కనబడుచున్నది. ఇది క్రీస్తు రాకడ హెచ్చరిక వర్తమానము అని గ్రహించాలి, మనము. ఈ నిత్య సువార్త ప్రకటించుచున్న మొదటి దేవదూత; లోకమునకు తీర్పుతీర్చు గడియ వచ్చినది. రెండవ దూత మహా బబులోను కూలిపోయినది అనగా లోకమునకు అంతము వచ్చియున్నది.
ఇక మూడవ దూత క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేసిన వారికీ తమ నొసటియందేమి చేతి మీదనేమి దాని పేరుగల ముద్ర వేయించుకొనినవారికి సంభవింపబోవునది ప్రకటించుచున్నది. వాడు దేవుని కోపమను మద్యమును త్రాగును మరియు పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుండును.
ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా జీవమార్గమును మరణమార్గ మును నేను మీ యెదుట పెట్టుచున్నాను (యిర్మీ 21:8). ప్రియ స్నేహితుడా, ఇదే రక్షణ దినము. ఆయన సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు ఆయన కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు (కీర్త 16:11). ప్రార్ధించు, ప్రకటించు. ప్రభువు నీతో నుండును గాక. ఆమెన్
ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
ప్రకటన 14:13 అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
ప్రభువు ముందుగానే చెప్పారు; నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు (మత్త 5:11). మరియు, మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు (లూకా 21:19). పరిశుద్ధుల ఓర్పు ఏయే విషయాలలో అనేది మనకు ఇక్కడ స్పష్టముగా వున్నది. 1. దేవుని ఆజ్ఞలను అనుసరించు విషయములో పరీక్ష, 2. యేసు నా రక్షకుడని కడవరకూ సాక్ష్యము నిలుపుకొనుటను గూర్చి పరీక్ష. ఈ రెంటిలోనూ విజయము పొందాలంటే మరణమును సైతము లెక్క చేయరాదు అంటుంది వాక్యము. అదే ప్రభుతో ప్రభువులో ప్రభువు కొరకు జీవించుట, మరణించుట.
ఇది క్రీస్తు అంతిమ తీర్పుకు ముందు క్రైస్తవులకు సంభావించబోవు శ్రమలను సూచించుచున్నది. అలాంటి పరిశుద్ధులు ప్రభువునందు మరణించిన వారని లేక ప్రభువునందు నిద్రించిన వారని సంబోధిస్తూ; ప్రభువునందు మృతినొందు మృతులు అనియూ, అట్టి మరణము ఒక ధన్యత అనియూ పరిశుద్ధాత్మ ప్రకటిస్తున్నట్లు గమనించ గలము. వారు తమ ప్రయాసములు మాని; అనగా ఇహ లోక కష్టాలు మాని అనుకుంటే తప్పు.
ఈ లోకము విడిచిన ప్రతి ఒక్కరూ ఈలోక ప్రయాస మానియే పరమపదిస్తారు. కాని, ఆత్మ చెప్పుచున్నది మనము ధ్యానించినట్లైతే; విశాదమవుతున్నది ఏమంటే; వారు దేవుని నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని అర్ధం. నిత్య విశ్రాంతి నిర్వచనము యెషయా గ్రంధములో వివరించ బడినది: భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు (యెష 57:1,2)
పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని (హెబ్రీ 3:7-11).
పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట మనము జాగ్రత్తగా చదువుదాం; నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు మరియూ వారి క్రియల చొప్పున వారి ప్రతిఫలము వారు పొందుతారు. మీరు చేసిన కార్యమును, మీరు... తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు (హెబ్రీ 6:10). ప్రియ స్నేహితుడా, నీవు ప్రభువు కొరకు జీవించి, ప్రభువులో నీ జీవితాన్ని ముగించ తీర్మానము కలిగి వున్నావా, లేదా? ఏసుక్రీస్తు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్
ప్రకటన 14:14 మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.
ప్రకటన 14:15 అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.
ప్రభువు ముందుగా చెప్పిన మాటలను ఒక్కసారి మనము స్మరణకు తెచ్చుకుందాము: మనుష్య కుమారుడు ప్రభా వముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు (మత్త 24:30).
ఇది కోతకాలమును సూచించు క్రీస్తు ప్రవచన వాక్యము. దాని నేరవేర్పును ప్రకటన గ్రంధకర్త చూచుచున్నాడు మరియూ అట్లు ప్రకటించ బడుట వినుచున్నాడు. శిరస్సు మీద సువర్ణ కిరీటము ధరించినవాడు రాజులకు రాజు, రారాజు ఏసుక్రీస్తు అని రూడిగా చెప్పవచ్చును. దావీదు తన కీర్తనలో “అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు (కీర్త 21:3)” అంటూవున్నాడు. ఆయన చేతిలో కొడవలి ఆ న్యాయాధిపతి యొక్క తీర్పులను సూచించుచున్నది.
కోయుము అని ప్రకటించబడిన ఆ స్వరము యేసు ఉపమాన రీతిగా బోధిస్తూ పలికిన మాటలు గమనమునకు వచ్చుచున్నవి; కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను (మత్త 13:30).
భూమి పైరుపండి యున్నది – అనగా గోదుమలునూ పంటకు వచ్చినవి, గురుగులునూ పంటకు వచ్చినవి అని మనము గ్రహించాలి. కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి – అనగా, మొదట గురుగులు, ఆ తదుపరి గోధుమలు కోయబడునని భావం. ఒకటి అగ్నిలో వేయబడుటకు కోయబదుట, రెండవది తన కొట్టులో చేర్చబడుటకు కోయబదుట.
ప్రియ స్నేహితుడా, ఏ కోతలో కోయబడతావో ఆలోచించు. ఇది కృపాకాలము. దేవుని కృప మొదట ఆ తరువాత దేవుని ఉగ్రత. కాని తీర్పు దినమున దేవుని ఉగ్రత మొదట, ఆ తరువాత ఆయన శాశ్వత కృప. కనుక సమయముండగానే రక్షణ తీర్మానము చేసుకో. ప్రభుని ఆత్మ మనతో నుండి నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 14:16 మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
ప్రకటన 14:17 ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.
ప్రకటన 14:18 మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
ప్రకటన 14:19 కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను
ప్రకటన 14:20 ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.
ఇంకొక దూత, మరియొక దూత అను మాటలు మనము మత్తయి సువార్తలో చదివినప్పుడు మనుష్యకుమా రుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు (మత్త 13:41) అని వ్రాయబడినది.
ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును (మత్త 13:49,50) అది ఆరని అగ్ని (మత్త 3:12). ఉపమాన రీతిగా గురుగులు అని చెప్పబడిన సంగతి ఇక్కడ ద్రాక్షలుగా చెప్పబడుట గమనిద్దాం. ప్రవక్త ద్వారా తండ్రి ఈ మర్మమును చక్కగా తెలిపినాడు: .ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను (యెష 5:2). నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? (యెష 5:4). ప్రియ స్నేహితుడా, అవి కారు ద్రాక్షలు.
అందుకే అవి కోయబడి, దేవుని కోపమను పెద్ద తొట్టిలో వేయబడినవి అని గ్రంధకర్త దర్శనం. ఆ ద్రాక్షల తొట్టినుండి రక్తము ప్రవహించును; ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగు కొందురు (కీర్త 58:10). వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము (ద్వితీ 32:32,33). నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు (మార్కు 9:48).
ప్రియ సోదరీ సోదరుడా, సందేహపడువారిమీద కనికరము చూపుము. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుము (యూదా 1:22,23). సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించువారితో సహకరించు. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక (యూదా 1:24,25). ఆమెన్