ప్రకటన 15:1 మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.
ఆశ్చర్యమైన అను మాటను పరి. యోహాను గారు ప్రకటన గ్రంధములో రెండు మారులు వ్రాసినారు. ఒకటి దేవుని కోపము సమాప్తమగుట, రెండవది పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లిన బబులోను దర్శనము (ప్రక 17:6). కడవరి తెగుళ్లు దేవుని కోపమునకు ముగింపు అన్నట్టుగా కనబడుచున్నది.
అనేక సార్లు మానవులమైన మనము అంటూ ఉంటాము; దేవుడు లోకములో ఇంత అన్యాయము జరుగుతూ వుంటే, ఎంత కాలం చూస్తూ వూరుకుంటాడు అని. చూసినట్లైతే దేవునికి కోపము వస్తే భూమి మీద క్షేమము కరువై పోతుంది అని గ్రహించాలి మనము. ఒకే సారి ఒక తెగులు ప్రపంచ నలుమూలలా అనగా అన్ని ఖండాలలోని అన్ని దేశాలలోనూ, అన్ని దీవులలోనూ వ్యాపించింది [అది ఎబోలా కావచ్చు కరోనా కావచ్చు మరింకేదైనా కావచ్చు] అదే దేవుని ఉగ్రత లేక దేవుని కోపము.
అలా అని దేవుని కోపమూ నిత్యమూ ఉంటుందా అంటే, ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు (కీర్త 103:9) అని లేఖనము సెలవిస్తూ వున్నది. నాడు ఇగుప్టు మీదికి దేవుని కోపము దిగి రాగా దేశమంతటి మీద తెగులు వ్యాపించిన దినమున దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిచ్చినది ఏమనగా : మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు (నిర్గ 12:13).
ప్రియ సోదరుడా, తెగులునుండి తప్పించబడుటకు క్రీస్తు రక్తము గాక మరొక ఆయుధముగాని ఔషధముగాని లేదని జ్ఞాపకముంచుకో. ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీద దేవుని కోపము రగులుకొనిన దినమున మోషే చెప్పినట్లు అహరోను సమాజముమధ్యకు పరుగెత్తి పోయి ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను (సంఖ్య 16:47,48).
రెండవ ఔషధము ప్రాయశ్చిత్త ధూపము అనగా సమర్పణతో చేయు ఆరాధన. ఆధునిక క్రైస్తవుడు ప్రార్ధన ఎంతైనా చేస్తాడు గాని ఆరాధన ఎరుగనివాడుగా వున్నాడు. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము (కీర్త 33:1). కడవరి తెగుళ్ల కాలము ఆరంభమైనదని గ్రహించుదాము.
ప్రార్ధనలో సింహ భాగము ఆయన నామును ఘనపరచుదాము, స్తుతించుదాము, కొనియాడుదాము, పొగడుదాము,కీర్తించుదాము, మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక అని పలుకుదాం. దేవుడు మనల ఆరాధించు ఆత్మతో నింప నడిపించునుగాక. ఆమెన్
ప్రకటన 15:2 మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
ప్రకటన 15:3 వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
ప్రకటన 15:4 ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
వీరు జయించిన వారు. జయించిన వారికి దేవుని వాగ్దానములు ఏడు సంఘములతో ఆత్మ మాటాడిన అంశములో బయలుపరచిన సత్యాలు ధ్యానించి యున్నాము. వారు నిత్య ఆరాదికులుగా వుంటారు. వారు రెండు కీర్తనలు పాడుచున్నారు. మోషే కీర్తన అనగా ఐగుప్తు అనే పాపపు బానిసత్వము నుండి విదిపించబడిన విడుదల కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అనగా మరణించి పాతాళమును మృతుల లోకమును సమాధిని గెలిచి తిరిగి లేచిన పునరుత్థాన కీర్తన.
వారిలో హతసాక్షులు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు మరణమువరకూ నమ్మకముగా వున్నవారు; తమ నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన అనగా ఏడు తెగుళ్లు భూమిమీదకు పంపబడుట లేక దేవుని ఉగ్టత పాత్రలు క్రుమ్మరింప బడుటకు సిద్ధముగా నుండుట చూచి న్యాయాధిపతి యైన దేవుని ఆరాధించి స్తుతించుచున్నారు.
ఒక పాపి రక్షించబడితే పరలోకములో సంతోషము. అలాగే ఒక క్రీస్తు విరోధి శిక్షించబడితే పరలోకములో కీర్తనలు. పరలోకము అంటే అదే; అక్కడ దుఃఖము వుండదు నిట్టూర్పు వుండదు కన్నీరు ఉండదు. వీణా నాదములతోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ పవిత్రుడైన ఆ దేవుని నిత్యమూ మహిమ పరచుటయే ఉండును. ఒక దినములో అక్కడ నేను కూడా వుంటానను నిరీక్షణయే నన్ను ఇలా నడిపిస్తుంది. ఆమెన్
ప్రకటన 15:5 అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
ప్రకటన 15:6 ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
ప్రకటన 15:7 అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.
ప్రకటన 15:8 అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.
ఇశ్రాయేలు పయనం అనంతరం వారి మధ్య వేయబడిన సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము ఇక్కడ యోహానుగారు చూచాను అంటున్నారు. ప్రక 11:19లో పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో చూచాను అని వ్రాశారు.
ప్రియ స్నేహితుడా, అది పరలోకములో దేవుని పరిశుద్ధ స్థలమును సూచించుచున్నది. భూమిమీద మానవ చరిత్ర మాసిపోయినా సర్వలోకములకు నిత్యుడగు దేవుడు వున్నాడు, ఉంటాడు. అక్కడనుండే దేవుని ఉగ్రత బయలువెళుతుందని గ్రహించాలి మనము. ఎప్పుడైతే దేవుని కోపము ఆ ఆలయమునుండి బయటికి పంపబడినదో,అప్పుడే ఆ ఆలయము దేవుని మహిమతో నింపబడినది.
భూమి మీద మోషే ప్రత్యక్ష గుడారమును వేసిన దినమున దేవుని మహిమ యొక్క తేజస్సు మందిరము నిండెను. అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను నిర్గ 40:33-35).
ఐననేమి - మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను (యెష 57:15).
ప్రియ స్నేహితుడా, ఈ దర్శనము మనకు ఏమి నేర్పుచున్నది, మహిమాన్వితుడైన పరలోక దేవుడు వినయమును, దీనత్వమునే కోరుచున్నాడు. అందు నిమిత్తమే కదా తన కుమారుని మానవ రూపమునకు మార్చినాడు. ఆ యేసయ్య తన మనసు విప్పి మాటాడుతూ: నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమెన్
ప్రకటన గ్రంధం చదువుకుందాం
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును (మత్త 11:29).