18 వ అధ్యాయము
ప్రకటన 18:1 – 24 అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట … … … … ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడె ననెను.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (యోహా 3:16). ఐననూ లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుడు తన చిత్తమును జరిగించుచున్నాడు (1 యోహా 2:17). మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును (1 పేతు 4:3). ఇక మిగిలినదేమున్నది; ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే (1 యోహా 2:16).
ఇది అన్యులు తెచ్చిన చేటు అందామా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు : వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి (ఎఫే 2:3). అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టు ఐనది.
భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి. పల్లెలు విడిచి పట్టణములకు వలసలు మొదట బ్రతుకుదెరువు కోసమైతే, చివరికది పాపపు నిలయములుగా మారిపోయిన వైనం మనము ఎరుగుదుము. లోకమునకు సాదృశ్యమే ఈ బాబులోను పట్టణము. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును, తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును అనుభవించు సమయము ఆసన్నమైనది. చివరికి దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.
పరలోకమా, పరిశుద్ధు లారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. నోవాహు దినములను గజ్ఞాపకము చేస్తూ ప్రభువైన యేసు చెప్పెను : నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును (మత్త 24:37-39).
అవును, ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు (మార్కు 13:30, 31). ప్రియ నేస్తం, మన తరములోనే ఇవి సంభవించ వచ్చు, మరి నీవు సిద్ధమా. బలిష్ఠుడైన యొక దూత అనగా ప్రధాన దూతలలో ఒకడు ఈలాగు చెప్పు చున్నాడు: దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. ఏలయన, ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను. నేటి మన తరములోనే చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము.
కూల్చిన దేవుని మందిరాలెన్నో; చంపబడిన దైవ జనులేందరో !! ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసి యున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను (యెష 21:9). ఇదే కడవరి హెచ్చరిక: బబులోను నుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి (యెష 48:20).
తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి యున్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికార కాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు (యిర్మీ 51:5,6). బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగినదానిని వానినోటనుండి కక్కించు చున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడిరావు బబులోను ప్రాకారము కూలును; నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి (యిర్మీ 51:44,45).
సువార్త ప్రకటింప త్వరపడుదాము, అనేక ఆత్మల రక్షణ కొరకు అడుగు ముందుకు వేద్దాం. ప్రభువు మనతో నుండును గాక. ఆమెన్