7 సంఘముల విషయమైన ప్రవచనముల పునశ్చరణ:
ప్రకటన గ్రంధము మొదటి 3 అధ్యాయములలో సంఘములకు దేవుని ప్రత్యక్షతలు లేక దర్శనములు వర్తమానములు మెప్పులు విమర్శలు సలహాలు వాగ్దానములు ఇంతవరకు చూస్తూ వచ్చాము. 1 వ అధ్యాయము నుండి ౩వ అధ్యాయము వరకు గల 71 వచనములలో సంఘము అనిగాని సంఘపు అనిగాని వెరశి 18 సార్లు సంఘము గూర్చి ప్రస్థావించ బడినది. తిరిగి 19 వ సారి అనగా చివరి సారిగా ప్రక 22:16 లో కనబడుచున్నది. అది కేవలము ముగింపు మాత్రమే.
4 వ అధ్యాయము నుండి చివరి వరకూ గమనించినట్లైతే గోర్రేపెల్ల వివాహము కొరకు సిద్ధపాటు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిలు గ్రంధము ముఖ్యముగా మానవులను రక్షింపబడిన వారు రక్షణ లేని వారు అను రెండు భాగాలుగా విభజించు చున్నది. దేవుడు ఒక వర్గము మీద ప్రేమ వాత్సల్యత చూపుతూ మరొక వర్గము వారిని ఇప్పుడైనా మారుమనస్సు పొందండి అంటూ హెఛరిస్థున్నట్టు మనకు స్పష్టమవుతున్నది.
4 వ అధ్యాయము మొదలు మిగతా అధ్యాయములలో సంఘములో వున్నవారు సంఘము వెలుపల వున్నవారు అనే భావన నుండి విడిపించి పరలోకములో సంభవములు భూలోకములో సంభవములు అను భావన స్ఫురించు ప్రవచనములు వ్రాయబడినట్టు గమనించ గలము. ముందుగా, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ప్రతి వాగ్దానము ఎలా నెరవేర బోవుచున్నది ఒక్క సారి గమనించుకొని ముందుకు సాగుదాము.
ఎఫేసు సంఘ వాగ్దానము: దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును (ప్రక 2:7), నేరవేర్పు: జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు (ప్రక 22:14).
స్ముర్న సంఘ వాగ్దానము: రెండవ మరణము వలన ఏ హానియుచెందడు (ప్రక 2:11). నెరవేర్పు: మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము (ప్రక 20:14).
పెర్గము సంఘ వాద్గానము: తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు (ప్రక 2:17). నెరవేర్పు: మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి (ప్రక 14:1).
తుయతైర సంఘ వాగ్దానము: జనులమీద అధికారము ఇచ్చెదను, వేకువ చుక్కను ఇచ్చెదను (ప్రక 2:26, 28). నెరవేర్పు: అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను (ప్రక 20:4). సంఘములకోసము నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను (ప్రక 22:16).సార్దీస్ సంఘ వాగ్దానము: తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును (ప్రక 3:5). నెరవేర్పు: వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపల్లఎదుటను నిలువబడిరి (ప్రక 7:9). వీరు గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి (ప్రక 7:14).
ఫిలదెల్ఫియ సంఘ వాద్గానము: నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను (ప్రక 3:12). నెరవేర్పు: ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి (ప్రక 14:1). ఆయన నామము వారి నొసళ్లయందుండును (ప్రక 22:4).
లవోదికయ సంఘ వాద్గానము: నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను (ప్రక 3:21). నెరవేర్పు: అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను (ప్రక 20:4).
క్రీస్తు ఆత్మ మనతో నుండునుగాక. ఆమెన్
ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను (ప్రక 3:8) అని పలికిన దేవుడు పరి. యోహాను గారికి చూపించాడు. నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను దర్శన సత్యాన్ని బయలు పరచుచున్నాడు.
మొదట వినిన స్వరము అనగా అది బూరధ్వనివంటి గొప్పస్వరము (ప్రక 1:10) మాటలాడుచూ యోహాను గారి ఆత్మను పరలోకమునకు ఆహ్వానించుచున్నది. ఇక్కడికి ఎక్కిరమ్ము – ఈమాట మనుష్య జ్ఞానమునకు అతీతమైనది. ప్రక 1:17 లో బ్రతికియుండగనే చచ్చినవానివలె నైతిని అన్నారు పరి. యోహాను గారు. కాని ఇప్పుడు దేహమును విడిచి వెళ్ళాలి.
అలనాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు సమాజమునకు ప్రతినిధిగా మోషేను (నిర్గ 19:3, 8, 20, 21; 24:2; 32:31; 34:4) సీనాయి పర్వత శిఖరము మీదికి శరీరముతోనే రమ్మని పిలిచిన సంగతి మనకు విదితమే. అలాగే ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలకు (మత్త 10:6) ప్రతినిధిగా మృత్యుంజయుడైన యేసును మహిమ శరీరముతో పరలోకమునకు చేర్చుకొనుట (అపో 1:11 ) మనము చూశాము.
దేవుడు ఇపుడు ఏడు సంఘములకు అనగా సార్వత్రిక సంఘమునకు ప్రతినిధిగా పరి. యోహాను గారిని సజీవమైన తన దేహమును భూమిమీద విడిచి ఆత్మను మాత్రము పరలోకమునకు ఎక్కి రమ్మని పిలుచుట ఆశ్చర్యము కలిగించుచున్నది. ఐతే, ఆత్మ చూసిన సంగతులను తిరిగి వచ్చిన పిమ్మట మరలా ఈ ప్రకటన గ్రంధమును వ్రాయుట కొనసాగించాలి. అద్భుత కరమైన విషయమును దైవాత్మతో గ్రహించ వలెనే గాని మాటలతో వర్ణించ నశక్యము. సంఘము ఎత్తబడినదనుటకు సూచన ఇదే.
అందునుబట్టియే, 1 వ అధ్యాయము నుండి ౩వ అధ్యాయము వరకు గల 71 వచనములలో సంఘము 18 సార్లు సంఘము 4 వ అధ్యాయము నుండి 21 వ అధ్యాయము వరకు మనకు కానరాదు. ఇకమీదట జరుగవలసినవాటిని అనగా సంఘమునకు మరియు విడువబడిన లోకమునకు ఇక సంభవింప బోవునవి ముందుగానే పరి. యోహాను గారికి చూపించుటకు త్రియేక దేవుని సంకల్పమైయున్నది.
యెహోవా దినము అని, అంత్య దినము అని, ఉగ్రత దినము అని, ప్రభువు దినము అని అనేక రీతులుగా ప్రవచించిన ప్రవక్తలకు సైతము బయలు పరచబడని అనేక మర్మములు దేవుడు యోహాను గారి ద్వారా మనకు అనుగ్రహించుట క్రీస్తు ద్వారా దేవుని సంకల్పమైనది. అందును బట్టి ప్రభువుకు వందనములు.
ఈ మర్మముల స్పష్టత కొరకు ప్రవక్తయైన దానియేలు గారు అడిగినప్పుడు అతనితో; దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము (దాని 12:4) అన్నారు. మరలా అతడు నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని నా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను (దాని 12:8) గాని, యోహాను గారు అడుగక ముందే నీకు కనుపరచెదను అంటున్నారు.
ఇంతటి మర్మములు గ్రహించుకొనుటకు మనకు పరిశుద్ధత, ప్రార్ధన కావాలి. ఎందుకనగా; అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు, వారు ఈ సంగతులను గ్రహించెదరు (దాని 12:10). ఈ ప్రవచన వాక్య భాగములను పదే పదే శ్రద్ధగా శుద్ధ మనసుతో ప్రార్ధన పూర్వకముగా చదివి ధ్యానించి గ్రహించి పరమునకు చేరు పర్యంతము మదిని నిలుపుకొందుము గాక. ఆమెన్
ప్రకటన 4:2 వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
ప్రకటన 4:3 ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
ప్రకటన 1:10-11 ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా – అను వాక్య ధ్యానములో ఆత్మ వశుడగుటను గూర్చి ధ్యానించి యున్నాము. పత్మాసు ద్వీపమున పరి. యోహాను గారు ఆత్మవశుడగుట ఇది రెండవ సారి.
పరలోకమందు వేయబడిన ఒక సింహాసనమును ఆ సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండుటయు చూస్తున్నారు. ఇట్టి మహిమ గల సింహాసనమును దానిపై కూర్చున్న ఒక రూపమును చూచిన ఇతర ప్రవక్తల దర్శనములు కలవు.
1] ప్ర. యెషయా దర్శనము: అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను (యెష 6:1).
2] ప్ర. దానియేలు దర్శనము: ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహా సనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను (దాని 7:9).
3] ప్ర. యిర్మియా దర్శనము: ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము (యిర్మి 17:12).
4] ప్ర. యేహెజ్కేలు దర్శనము: నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను (యెహే 1:26).
5] ప్ర. మీకాయా దర్శనము: యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని (1 రాజు 22:19).
6] అపో. స్తెఫను పొందిన దర్శనము: పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి; ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను (అపో 7:55, 56).
ప్రియ స్నేహితుడా, ఒక పరిశుద్ధుడు పరలోకమునకు వెళితే మొట్టమొదట సింహాసనా సీనుడైన ప్రభువును, ఆయన కుడిపార్శ్వమున వున్న యేసయ్యను, దూతల సమూహమును చూస్తాము అని తేటతెల్లము అవుతున్నది. సూర్య కాంత పద్మ రాగముల బోలిన వానిని ఆపాద మస్తకము అభివర్ణించ బడిన భాగము ప్రక 1:13 నుండి 1:20 వరకు చూశాము.
మరకతము వలె ప్రకాశించు చున్న ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి వున్నది. ఇంద్రధనుస్సు దేవుడు ఆదిలో ఆకాశములో వేసిన ఏడు రంగుల ముద్ర. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము (యెహే 1:28). అది ఆయన ప్రభావమును లోకమునకు చేసిన వాగ్దానమును సూచించు చున్నది.
జల ప్రణయ అనంతరము: మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను (ఆది 9:8-17). వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవునికి స్తోత్రము కలుగును గాక, ఆమెన్
ప్రకటన 4:4 సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ఇరువదినలుగురు పెద్దలు ఎవరు ? పెద్దలు అనే మాట పరలోకములో వాడబడుచున్నదా? అక్కడ కూడా పెద్ద, చిన్న వ్యత్యాసం ఉంటుందా? యెష 24:23 లో చూసినట్లైతే: చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును. ఈ వచనములో పెద్దలు దేవదూతలు.
మరి దేవదూతలకు సింహాసనములు ఇవ్వబడతాయా? ప్రధానదూత అనే మాట మనము 1 థెస్స 4:16 లో చదువుతున్నాము. మరి ప్రధాన, అప్రధాన దూతలు కూడా ఉంటారా? ఇది అత్యంత నిగూఢమైన అంశము. ఐతే, మహా అధిపతియగు మిఖాయేలు (దాని 12:1), గబ్రియేలు (దాని 8:16) అను పేరులు మాత్రము మనకు బైబిలులో కనబడు చున్నవి.
కతోలికు వారి పాత నిబంధనలో అదనముగా వున్న 6 గ్రంధములలో రఫాయేలు అను పేరు కూడా వున్నది. ఆయనకు పైగా వున్న దూతలు సెరాపులు (యెష 6:2) నిత్యము స్తుతించు వారు అనియూ, యెహోవా కెరూబుల మధ్యను (యెష 37:16) నివసించు వాడనియూ, ఆకాశమంతటి క్రిందనున్న మహోన్నతుని పరిశుద్ధులు (దాని 7:27) అనగా ఆయన సింహాసనము దిగువన దేవదూతలు వున్నారనియూ, పరలోక సైన్యసమూహము సైతము వున్నట్లు లూకా 2:13 లో చదువగలము. కనుక దేవదూతలకు సింహాసనములు ఇవ్వబడవు.
క్రొత్త నిబంధన గ్రంధములో చూసినట్లైతే తన శిష్యులకు ఏసుక్రీస్తు వారు చేసిన వాగ్దానము కనిపించుచున్నది. నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28). ఈ వాగ్దానము చేసిన సమయములో యూదా ఇస్కరియోతు సహితము వారి మధ్యన వున్నాడు. ఐతే పేతురు; అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను (అపో 1:17). ఆ తరువాత తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు ప్రార్ధన చేసి, చీట్లు వేసినపుడు మత్తీయపేరట చీటి వచ్చినది (అపో 1:16-26).
పన్నెండు మందికి ఇవ్వబడిన వాగ్దానానుసారము ఇరువది నలుగురిలో వీరున్నారు అని అనుకొందాము. మరి మిగతా పన్నిద్దరు ఎవరు? ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారు అంటూ వింటూ ఉంటాము. పన్నెండు సంఖ్యను బట్టి అంటున్నామే గాని, ప్రామాణిక వాక్యమేదీ మనకు కనబడుటలేదు ఎందుకనగా, పాత నిబంధనలో ఎవరికీ ఇలాంటి వాగ్దానము ఇవ్వబడినట్లు లేదు.
నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము (నిర్గ 28:1). అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుము (నిర్గ 28:3) అని మోషేతో అన్నారు. దేవుడైన యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చివారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము (సంఖ్య 3:5, 6).
యెహోషువ ఈ లేవీయులకు వాగ్దాన దేశములో ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు (యెహో 14:3).
దావీదు ద్వారా దేవుడు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను (1 దిన 24:3). అట్లు దేవునికి ప్రతిష్ఠితులగు లేవీయులలో నుండి అధికారులుగాను, పరిశుద్ధ స్థలమునకు అధికారులుగాను నియమింప బడిన వారి సంఖ్య ఇరువది నాలుగు (1 దిన 24:5-18).
ఆరీతిని గమనించినట్లైతే, ఒక్క గోత్రము వారు మాత్రమే యాజకత్వ హక్కును పొందియున్నారు. యేసు ప్రభువును ప్రకటించుటకును, ఆయనకు బాప్తిస్మం ఇచ్చుటకును, బా. యోహానును ఈ లోకమునకు పంపుటకు దేవుడు అహరోను కుమార్తెలలో ఒకతెయైన ఎలీసబెతును (లూకా 1:5) ఎన్నుకున్నారు. మరి వీరే ఇరువది నలుగురు వుండగా, ఆ ఇరువది నలుగురు పెద్దలలో అపోస్తలుల స్థానమెక్కడ!!
అసలు ప్రభువు తన శిష్యులకు ఏమని మాట ఇచ్చారు చూద్దాం: యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28).
[1]. (ప్రపంచ) పునర్జననమందు – పరలోకమందు అని చెప్పలేదు. [2]. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద – ఈ లోక రాజ్యములన్నియూ ఏకమైనప్పుడు (ప్రపంచ పునర్జన్మము), క్రీస్తు సింహాసనము [3]. తీర్పుతీర్చుదురు – ఈ లోకమునకు రాబోవు తీర్పులో. అందుకే ఒలీవల వనమనబడిన కొండమీద యేసు కడవరి దర్శన సమయములో అనగా ఆరోహణ సమయము లో కూడి వచ్చిన వారు అడిగారు: యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? (అపో 1:6).
21:18
ప్రియ స్నేహితుడా, క్రీస్తు రాజ్యము స్థాపించ బడినప్పుడు, అపోస్తలులకు నియమింపబోవు అధికారమును సూచించుచూ యేసు ఈ మాట అన్నారు. ఇదే మాటను అపో. పౌలు సైతము: పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరా? (1 కొరిం 6:2) అంటూ కోరిందీ సంఘమునకు వ్రాసారు. ప్రియ దేవుని బిడ్డా, “నిత్యము” యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని [లేవీగోత్రీయులను] నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు (ద్వితీ 18:5). యెహోవాయే వారికి స్వాస్థ్యము (ద్వితీ 10:9). వారే ఆ ఇరువది నలుగురు పెద్దలు.
ఇంతవరకు నడిపించిన పరిశుద్ధాత్ముడు మనతో నుండి ముందుకు సాగుటకు పురికొల్పును గాక. ఆమెన్
ప్రకటన 4:5 ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
దేవుడొక్కడే (గల 3:20), ఆత్మయు ఒక్కడే (ఎఫే 4:4), దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే (1 తిమో 2:5), ప్రభువు ఒక్కడే (ఎఫే 4:5), విశ్వాస మొక్కటే (ఎఫే 4:5), బాప్తిస్మ మొక్కటే (ఎఫే 4:5).
ప్రియ నేస్తం, పరిశుద్ధాత్మ ఒక్కడే కాని దేవుని ఆత్మలు యేడు. ఈ వచనములో దేవుని ఆత్మలు ప్రజ్వలించుచ్చున్న దీపములవలే కనబడుచున్నవి. అవి సింహాసనములో నుండి భూమిమీడకు పంపబడినప్పుడు మెరుపులవలే కనబడుచున్నవి ఉరుములవలే వినబడుచున్నవి. మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి (నిర్గ 19:16).
ప్రకటన 5:6 చూచినట్లైతే, ఆ గొఱ్ఱపిల్లకు ఏడు ఏడు కన్నులవలే కనబడుచున్నవి, కాని అవి భూమి మీదికి పంపబడినప్పుడు దేవుని ఆత్మలుగా వున్నవి. దేవుడైన యెహోవా మోషేతో: తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను (నిర్గ 25:10). మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను (నిర్గ 25:31). దీప వృక్షము యొక్క ఒక ప్రక్కనుండి మూడు కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను (నిర్గ 25:32). నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను (నిర్గ 25:37). పరలోక నమూనా మనకు ఇక్కడ కనబడుచున్నది.
దేవుని సింహాసనము ముందు ప్రజ్వలించుచున్న ఆ యేడు దీపములు లేక యేడు ఆత్మల చేత అభిషేకించ బడిన వారున్నారు. [బా. యోహాను] మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను (యోహా 5:35), [యేసు క్రీస్తు] నిజమైన వెలుగై ఉండెను ( యోహా 1:9), బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు (దాని 12:3), [విశ్వాసులు] జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు (ఫిలి 2:16). కాని, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది (కొల 2:17).
దావీదు చిగురులో యిమిడి యున్న ఏడాత్మలు : 1. యెహోవా (తండ్రి) ఆత్మ 2. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ 3. వివేకములకు ఆధారమగు ఆత్మ 4. ఆలోచనకు ఆధారమగు ఆత్మ 5. బలములకు ఆధారమగు ఆత్మ 6. తెలివిని పుట్టించు ఆత్మ 7. యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ (యెష 11:2). అందును బట్టియే క్రీస్తు పరిచర్యలు యేడు విధములు. 1. ప్రకృతిని శాసించుట, 2. వాక్కు చేతనే స్వస్థపరచుట, 3. మరణించిన వారిని బ్రతికించుట, 4. పుట్టందుల కన్నులు తెరచుట, 5. వేల మందికి ఆహారము పెట్టుట, 6. లోక రక్షణకై సిలువలో ప్రాణమర్పించుట, 7. పునరుత్థానము చెంది తిరిగి పరమునకు ఆరోహణమగుట.
ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను (ఎఫే 1:19). ఆమెన్
ప్రకటన 4:6 - 8 మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసన మునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
సింహమువంటిది; దూడవంటిది మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; పక్షిరాజువంటిది. సింహాసన మునకు మధ్యను, చుట్టును, ఆ నాలుగు జీవులుండెను. అనగా అవి సింహాసనమును ఆవరించి యున్నవి. ఇది చర్ముఖ దైవ మహిమను చాటించుచున్నది. నలుదిక్కుల వ్యాపించి యున్న దేవుని సార్వభౌమాధికారమునకు సూచనగా వున్నది.
యేహెజ్కేలు గారు చూచినప్పుడు ఒక్కో వైపు నాలుగేసి ముఖములున్న నాలుగు జీవులను చూసారు. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు (యెహే 1:10).
సర్వసృష్ఠికి క్రీస్తును ప్రకటించుచున్ననాలుగు సువార్తలకు [మత్తయి, మార్కు, లూకా, యోహాను] అవి ప్రతిబింబముల వలెనే వున్నవి అని బైబిలు పండితుల అభిప్రాయము. నాలుగు జీవుల ప్రభావమే నాలుగు సువార్తలను చాటుచుండగా, మహిమగల ఆ సువార్త పరిచర్యలో నీ వంతు ఏమిటి స్నేహితుడా?
ప్రవక్తయైన యెషయా దర్శనములోనూ (యెష 6:3), యోహాను గారి దర్శనములోనూ కూడా, ఆరాధనలు వినబడుచున్నవి. నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు, సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి (యెష 6:3, ప్రకటన 4:8).
ప్రియ విశ్వాసీ, పరలోకములో ప్రార్ధన లేదు, ఆరాధన వుంది. నీ ప్రార్ధనా సమయములో ఆరాధన భాగమెంత ? అట్లు ఆరాధించు వారు కావలేననియే తండ్రి కోరిక అని యేసయ్య చెప్పారు (యోహా 4:23). ప్రార్ధన విశ్వాసి కార్యము, ఆరాధన దేవ దూతల కార్యము, అది పరిశుద్ధతతో నిండినది. మనస్సాక్షి విషయములో కలుగజేయు ఆరాధకునిగా మనము మన ప్రభువుకు మహిమ కరముగా జీవించుదుము గాక. ఆమెన్
ప్రకటన 4:9 ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలు గునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా
ప్రకటన 4:10 ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు
ప్రకటన 4:11 ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
పరిశుద్ధుడైన దేవుడు నిత్యమూ ఆరాధింప బడుచుండగా, ఆరాధన సమయము పరలోకములో ఎలా వుంటుంది అనే దృశ్యమును చూసింది చూసినట్టు యోహాను గారు వ్రాస్తున్నారు. ఆరాధించుట అనగా ఘనపరచుట, కృతజ్ఞతలు చెల్లించుట, సాగిలపడుట, నమస్కారము చేయుట, సృష్టికర్తయని పొగడుట, కిరీటములను దించుట.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను (కొల 1:16).
ఆరాధించు మందిరములో, సంఘములో, హృదయములో దేవుని మహిమ తేజస్సు వితానముండును అని మరువ రాదు. అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి (2 దిన 7:3).
నమస్కారము చేయుట ఆరాధనలో భాగమేనని కీర్తనా కారుడు కీర్త 72:11 లో రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు అని వ్రాయుచున్నాడు. దావీదు: మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి (1 దిన 29:20).
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును (కీర్త 48:14). ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక (రోమా 11:36). ఆమేన్.
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.