ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను (ఆది 1:1, 2).
ఈ సృష్టి రహస్యానికి అక్షర రూపము ఇచ్చి ఆదికాండము అను పేరుతో ఒక అధ్బుత గ్రంధాన్ని వ్రాసిన మోషే గారు సృష్టి జరుగుతున్నప్పుడు ఎక్కడ వున్నారు? అది సంభవించిన ఎన్ని సంవత్సరాల తరువాత ఆ దృశ్య దర్శనాన్ని పొంది వుంటారు? ఒక వేళ తన శరీరము సీనాయి పర్వతము మీద ఉన్నా, ఆత్మ మాత్రం వర్తమానము లోకి వెళ్లి చూస్తేనే ఇది సాధ్యం.
ఈలోక అంతము జరుగబోయే విషయము వ్రాయడానికి యోహాను గారి శరీరము పత్మసు లోనే వున్నా ప్రక 4:1 ప్రకారము ఆత్మ పరలోకములో వున్నది లేక భవిష్యత్తులోనికి వెళ్ళింది.
బా. యోహాను గారు యోర్దాను నదీ తీరాన యేసును గూర్చి సాక్ష్యమిస్తూ, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును (మత్త 3:11) అని ప్రస్తుతంలో ప్రకటించి, మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల (యోహా 1:29) అని భవిష్యత్తును బయలుపరిచాడు. అంతే కాదు, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన (యోహా 1:30) అంటూ వివరణ ఇచ్చాడు. దైవ జ్ఞానము ఆత్మచేత బోధించబడినప్పుడు అది సృష్టి ఆరంభమైనా అది సృష్టి అంతమైనా ఒకటే.
ఈ 5 వ అధ్యాయములో: సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని అని సాక్ష్యమిస్తున్నాడు. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది (మత్త 13:11) అని పలికిన యేసయ్య మనకొరకు వ్రాయించి ఉంచిన ప్రకటన గ్రంధ దైవ మర్మములు ధ్యాన పూర్వకముగా చదువుదాము.
ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను (ప్రక 4:1) అని పిలువబడగానే పరమునకు వెళ్ళిన యోహానుగారి ఆత్మ మొదట సింహాసనాసీనుడైన దేవుని, ఆయన పరివారమును, వారుచేయుచున్న ఆరాధనను మనకు 4 వ అధ్యాయములో చూపినాడు. 5 వ అధ్యాయమునుండి లోకమునకు రానున్న తీర్పు సంభవింపనై యున్న విపత్తులు ధ్యానించ బోతున్నాము. అవి నిశ్చయముగా నెరవేరరబోవు అగ్నివంటి సత్యములు.
ప్రక 1:1, 2 లో ఉపోద్ఘాతము ధ్యానించాము.
ప్రక 1:3 లో ఆశీర్వాదములు ధ్యానించాము.
ప్రక 1:4 లో ఏడు సంఘముల పేరులు, వాటికీ లేఖలు వ్రాయమని యోహానుకు దేవుని ఉత్తర్వులు ధ్యానించాము.
ప్రక 1:5 నుండి 1:9 వరకు ప్రభువు యొక్క ఘనతను తెలుపు యోహానుగారి సాక్ష్యమును ధ్యానించియున్నాము. కేవలము నాలుగు వచనములలో పది విధములుగా ప్రభువును ఘనపరిచాడు: 1.నమ్మకమైన సాక్షి, 2.మృతులలోనుండి లేచిన ఆదిసంభూతుడు, 3.భూపతులకు అధిపతి, 4.కృపాసమాధానముల ననుగ్రహించు వాడు (ప్రక 1:5); 5.మనలను ప్రేమించుచున్న వాడు, 6.పాపములనుండి మనలను విడిపించినవాడు, 7.మనలను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసినవాడు (ప్రక 1:6); 8.మేఘారూడుడు (ప్రక 1:7); 9.అల్ఫాయు ఓమెగయు ఐనవాడు, 10.సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు (ప్రక 1:8);
ప్రక 1:10 నుండి 1:20 లో మహిమా స్వరూపి యైన దేవుని ఆపాద మస్తకము అభివర్ణించిన సంగతులు ధ్యానించాము. 2 వ మరియు 3 వ అధ్యాయములలో ఏడు సంఘముల ఆరంభ స్థితి, ఆ తదుపరి సంభవింపబోవు పరిణామాలు వాటికి తగిన బహుమానాలు శిక్షలు కూడా ధ్యానించాము.
పరమునకు వెళ్ళిన సంఘము చూడబోయే ఆ అద్భుత పరలోకాన్ని 4 వ అధ్యాయంలో ధ్యానించినాము.
5 వ అధ్యాయము నుండి గ్రంధములు విప్పబడుట, ఇరువదియొక్క తీర్పులు ధ్యానించ బోతున్నాము. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. చివరి భాగము గొర్రెపిల్ల వరుడు సంఘ వధువుల పరిశుద్ధ వివాహము. ప్రభువు కృప మనతో నుండి ముందుకు నడిపించి మహిమ పొందును గాక. ఆమెన్
ప్రకటన 5:1 మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహా సనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను (2 పేతు 1:20). ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి (2 పేతు 1:21).
ఐతే ప్రకటన గ్రంధము కేవలము మిగతా ప్రవక్తల చేత వ్రాయించబడిన ప్రవచన గ్రంధముల వంటిది కాదు అని కూడా మనము గ్రహించాలి. దీనికి మూల గ్రంధము పరలోకములో వున్నది. అదిదేవునిచే వ్రాయబడినదని నమ్మతగినది. ఏలయనగా, ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను (నిర్గ 31:18).
అది ఏడు ముద్రలు వేయబడినదై, సింహాసనాసీనుడైన దేవుని చేతిలో వున్నది. భవిష్యత్తులో జరుగబోయే సమస్తమూ అనగా పరలోకములోనూ, భూలోకములోనూ సంభవింపనై యున్న సంగతులన్నియూ అందు పొందుపరచబడి ముద్ర వేయబడి వున్నది.
క్రీస్తు పూర్వము 740 సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తు సిలువ దృశ్యమును యెషయా ప్రవక్త 53 వ అధ్యాయములో వ్రాసినప్పుడు ఎవరు నమ్మారు ? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? (యెష 53:1). అలాగే దేవుని కుడిచేతిలో వున్న ఈ తీర్పుల గ్రంధము ఒక అద్భుత రహస్య గ్రంధము. అది విప్పబడుటకు, అందున్న మర్మములు మనకు తెలియబడుటకు అనుమతించిన ప్రభువుకు వేలాది వందన స్తుతులు చెల్లించుదాము.
కుడి చేయి అనేక ఆశీర్వాదములను ఆయన విధించు శాసనములను సూచించుచున్నది. కుమారుడైన యేసు క్రీస్తు వారు సైతము కుడివైపున కూర్చుని యున్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. అక్కడ నుండియే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే (రోమా 8:34).
ఏడు ముద్రలు గట్టిగా వేసియున్నది అనగా ఎవరూ విప్పగాలేని విధముగా వున్నదనియూ, ఇంతవరకు ఎవరి చేతనూ విప్పబడలేదనియూ అర్ధమగుచున్నది. మరియూ అందున్న తీర్పులను ఎవడూ మార్చలేనిదిగానూ వున్నది. రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు (ఎస్తే 8:8).
ఒక గ్రంధము అనగా, అది ఒక గ్రంధపు చుట్ట వలె వున్నదా లేక ఒక పుస్తకము వలే వున్నదా యిదమిద్ధముగా ఎవరమూ చెప్పలేము. ఆ ముద్రలు విప్పబడుటను, అందున్న మర్మములను వివరించు సంగతులు మనకు తెలియబడునట్లు ఆత్మ దేవుడు మనలను ముందుకు నడిపించును గాక. ఆమెన్
ప్రకటన 5:2-4 మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
బలిష్టుడైన దూత అనే పదంలోనే అతని స్వర గాంభీర్యం స్పస్టంగా కనిపిస్తున్నది. ఆ శబ్ద తరంగాలు పరలోకములోను భూమిమీదకును భూమిక్రిందకును వ్యాపించినాయి. భూరాజులు గాని చక్రవర్తులు గాని సహస్రాధిపతులు గాని అధికారులు గాని చివరికి యజమానులు గాని దాసులు గాని దేవదూతలు గాని ప్రదానులుగాని ఎవనికినీ “నేనున్నాను” అనుటకు శక్తి చాలలేదు.
యోహానుగారు ఏడ్చుచున్నాను అని వ్రాస్తున్నారు. ఎందుకు యోహాను ఏడ్చాడు? అది అతని ఆత్మలోని తీవ్రతను తెలియపరచుచున్నది. గ్రంధము కనబడు చున్నది, ముద్రలు వేయబడి వున్నది, లోపటను వెలుపలను ఏవో వ్రాతలు వున్నట్లు గ్రహింపు అగుచున్నది. అవి ఏమని వ్రాయబడినవి, వాటి మర్మములేమిటి తెలిసికొనవలెనన్న జిజ్ఞాస అతనిని తొందర పెట్టుచున్నది.
ప్రియ మిత్రుడా, మన చేతిలో వున్న పరిశుద్ధ గ్రంధము చదువుటకు అందున్న మర్మములు ఎరుగుటకు మన ఆత్మలో తీవ్రత ఎంత వున్నది? ఒక్కసారి ప్రశ్నించు కుందాము.
ప్రభువైన యెహోవా అంటున్నారు: మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము (ద్వితీ 31:19). నేటి మన తరము వారికి దేవుడు అనుగ్రహించిన కృప బహు గొప్పది, ఏలయన మనకర్ధమయ్యే మన మాతృ భాషలో దేవుని పరిశుద్ధ గ్రంధమును కలిగియున్నాము.
నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహిం చుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు; మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సము ద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృద యమున నీ నోట నున్నది (ద్వితీ 30:11-14).
అంతే కాదు, నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును (యిర్మీ 33:3) అను వాగ్దానము కూడా మనకున్నది. బైబిలులో నీకు అర్ధముకాని వాక్య భాగము ఏదైనా వున్నట్లైతే ఆ ఒక్క భాగమును లేదా ఆ ఒక్క అధ్యాయమును యేడు మారులు చదివి చూడు తప్పక దేవుని మర్మము నీకు తెలియజేయు ఆత్మను దేవుడు నీలోనికి పంపుతాడు. నీవు తెలుసుకుంటావు, ఇంకొకరికి తెలియపరుస్తావు.
అట్లు దేవుడు మనలను తన ఆత్మ చేత ఆవరించి అభిషేకించి మహిమ పొందును గాక. ఆమెన్
ప్రకటన 5:5, 6 ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ఇరువదినలుగురు పెద్దలు ఎవరు అనే విషయాన్ని ప్రక 4:4 లో ధ్యానిస్తూ వచ్చాము, వారిలో ఒకడు యోహాను గారిని ఓదార్చుట మనకు కనబడుచున్నది. అదే గోత్రములో పుట్టిన ఏసుక్రీస్తును సింహము వలే వున్నట్లు అభివర్ణిస్తూ, జయము పొందెను అని చెప్పుచున్నాడు.
ఇశ్రాయేలు వారిలోని యూదా గోత్రికుల జాతీయతకు మరియూ నాగరికతకు సింహము గురుతుగా వున్నది. దానిని బట్టి యేసుకు హెబ్రీ భాషలో యూదా గోత్రపు సింహము అను అర్ధమిచ్చు పేరు పెట్టబడినది. ఆ స్వరము యూదా గోత్రపు సింహము అని పలికినది గాని కనిపించుచున్నది మాత్రము వధింపబడినట్లున్న గొర్రెపిల్ల.
బా. యోహాను గారు ప్రకటించిన దినమున అత్యంత విధేయత కలిగి అతని చేతనే బాప్స్మము పొంద వచ్చిన లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లకు భిన్నముగా కనబడుచున్నది ఈ దర్శనము. ఇపుడు గోర్రేపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు వున్నవి. ఏడు కొమ్ములు భూలోక పరలోకములలోని అధికారమును అభిషేకమును సూచించు చున్నవి.
ఏడు కన్నులు మన అంతరంగములోనికి తొంగిచూడ శక్తిగల ఆత్మ నేత్రములై యున్నవి. అవి భూమి మీదకు పంపబడినప్పుడు ఏడంతల శక్తి గలవిగా వున్నవి. యేడు ఆత్మల వివరణ ప్రక 3:1 లో మనము ధ్యానించి యున్నాము. తదుపరి ధ్యానము కొరకు ప్రార్ధన చేద్దాము. ప్రభువు ఆత్మ మనతోనుండును గాక. ఆమెన్
ప్రకటన 5:7, 8 ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
తండ్రి చేతిలోనున్న ఆ గ్రంధమును తీసుకొనుట ద్వారా, ఏడు కొమ్ములును ఏడు కన్నులును గలవాడు అనగా వధింపబడినట్లుండిన ఆ గొఱ్ఱపిల్ల ఇప్పుడు యూదా గోత్రపు కొదమ సింహమై పరలోకములోను భూమి మీదను భామి క్రిందను తీర్పు తీర్చు అధికారము పొందినట్లు గ్రహించగలము. గూఢమైన సంగతులు గ్రహించగల హృదయమునిమ్మని ప్రార్ధన చేద్దాం. ఆత్మ దేవుడు అట్లు మనకు సహాయము చేయును గాక. ఆమెన్
ఒక్కసారి క్రీస్తు మహిమను చూసినట్లైతే;
(1) ఆదికాండము 1 లో యేసు; ఆయన [తండ్రి] యొద్ద ప్రధానశిల్పిగానై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుండెను (సామె 8:30).
(2) ఇశ్రాయేలు అరణ్య ప్రయాణములో; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే (1 కొరిం 10:4).
(3) పాత క్రొత్త నిబంధనల మధ్య చీకటి ఈ లోకమును ఆవరించిన దినమున: నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది (యోహా 1:9).
(4) కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను (మార్కు 1:15). (5) ఈ లోకమునకు తీర్పు సమయము అఆసన్న మైనది, ఆ గొర్రెపిల్ల ఆ గ్రంధమును తీసుకొనెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కియ్యబడెను.
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు (దాని 7:14). ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు (దాని 7:27).
ప్రక 4:4 లో మనము ధ్యానించినప్పుడు కిరీటములు ధరించిన ఇరువదినలుగురు పెద్దలను గమనించాము. ప్రక 4:9, 10 వచనములు గమనిస్తే అక్కడ నాలుగు జీవులు కీర్తనలు పాడుచున్నట్లు ఇరువదినలుగురు పెద్దలు సాగిలపడి నమస్కరించుచున్నట్టు కనబడుచున్నది. కాని, ఇప్పుడైతే సార్వభౌమాధికారియైన దేవుడు పరలోక భూలోకములలో సర్వాధికారము యూదా గోత్రపు సింహమునకు ఇచ్చినప్పుడు వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొని సాగిల పడుచున్నారు.
ప్రియ స్నేహితుడా, ఈ వచనము చదువుతున్నప్పుడు ఒక్కసారి తలవంచి ఆయనకు నమస్కరించుదామా. ఇంత మహిమగల దేవుని సంఘములో ఒక అంగముగా నన్ను మనలను చేసిన దేవునికి ఒక జీవితకాలము ఆరాధించినా ఆ ఋణము తీర్చలేనిదే.
నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును (యెష 48:13).
సృష్టికి మూలరాతిని వేసి నప్పుడు ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినవి, దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసిరి (యోబు 38:7).
రక్షకుడు పుట్టిన వార్త ప్రకటించబడగానే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసెను (లూకా 2:13, 14).
ఇప్పుడు పరలోకములోనే వీణల జయద్వనులు, దూపార్పణలు. యాజక ధర్మము మరువని ఆ ఇరువదినలుగురు పెద్దలు బూలోకమునుండి వచ్చిన పరిశుద్ధుల ప్రార్ధనలచే వారిచేత నున్న సువర్ణ పాత్రలను నింపి దూపార్చనలు చేయుచున్నారు.
ఘనత మహిమ స్తుతి ప్రభావములు యుగయుగములకు మన ప్రభువునకే చెల్లునుగాక. ఆమెన్
ప్రకటన 5:9, 10 ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
ఆ గ్రంధమును విప్పుటకు పరలోకములోగాని భూమి మీద గాని భూమి క్రింద గాని యోగ్యులు లేరు. తెలిసికొన వలసిన విషయమేమనగా, ఆ యోగ్యత అర్హత ఏమిటి? అది క్రీస్తులో ఎలా వున్నది? అనగా రుధిరమునే క్రయ ధనముగా చెల్లించి దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు. అలా కొన్నవారిని తనకు దాసులుగానో తన అనుచరులుగానో సైన్యముగానో చేసుకొనలేదు. వారిని పరలోక వారసులుగాను, ఒక దైవ రాజ్యముగాను యాజకులుగాను చేసి, వారినోట ఒక క్రొత్త పాట వుంచియు న్నాడు.
యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన దినమున మోషేయు ఇశ్రాయేలీయులును యెహో వానుగూర్చి కీర్తన పాడిరి (నిర్గ 15:1). పుస్తకము చూడకుండానే కీర్తనలు పాడాలి నేస్తం. మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము (ద్వితీ 31:19). మోషే గారు ధర్మశాస్త్రము మాత్రము వ్రాశారా కొన్ని కీర్తనలు కూడా వ్రాశారా? కీర్తనల గ్రంధములో మొషే కీర్తనలు కూడా వున్నాయి, గమనిద్దాం.
మోషే ఆ దినమందే కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను (ద్వితీ 31:22). దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును కీర్తన పాడిరి (న్యాయా 5:1). మందిరములో పాటలు ఐపోయే సమయానికి వెళుతున్నావా? సగం ఆరాధన చేయలేక పోతున్నావని గుర్తించు. యెహోవా కీర్తనీయుడు. సోలోమోను తన జ్ఞాన సంపత్తిని బట్టి వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను (1 రాజు 4:32).
క్రొత్త నిబంధనలో కీర్తనలు ఉన్నాయా, క్రైస్తవులు పాటలు పాడవచ్చా అని ప్రశ్నించే వారు లేకపోలేదు. చెరసాలలో మధ్యరాత్రివేళ పౌలును సీలయు ఖయిదీలు వినుచుండగా దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడిరి (అపో 16:25). యేసు క్రీస్తు, శిష్యులు కీర్తనలు పాడినారా? యేసు ప్రభువు పాడనప్పుడు మనము పాడాలా? క్రొత్త నిబంధనలో వాయిద్యములు లేవు కనుక మందిరములో వాయిద్యములు వాయించకూడదు అనికూడా కొందరి క్రైస్తవుల అభిప్రాయము.
ప్రక 5:8 లో ఆ నాలుగుజీవులును, వీణలను పట్టుకొని యున్నారు. పరలోకములోనే వాయిద్యములు వున్నాయి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి తన శరీర రక్తములకు సాదృశ్యముగా రొట్టెను ద్రాక్షా రసమును వారికిచ్చిన తదుపరి, వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి (మత్త 26:30). ఈ వచనములో – వారు పాడిరి – అంటే ఎవరెవరు పాడివుంటారు?
ప్రియ నేస్తం, పరలోకములో కీర్తనలు పాడుట వున్నది. సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు (ప్రక 14:3). దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు (ప్రక 15:4). మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను (కీర్త 22:25). సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి, స్తోత్రగీతములు పాడుడి (కీర్త 98:4, 5).
చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నాము (1 పేతు 2:9). అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను (కీర్త 18:49). యెహోవా స్తుతినొందును గాక. దినదినము నా నోట సంతోషగానముందును గాక. ఆమెన్
ప్రకటన 5:11, 12 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. వారువధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
ప్రకటన 5:13, 14 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆ నాలుగు జీవులుఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
ఆవరించియున్నఅనేక దూతల స్వరము, వారి లెక్క కొట్లలో వున్నట్టు యోహాను గారి దర్శనము. కోట్ల కొలది అంటే ఎన్ని కోట్లు అని మనము అనుకోవచ్చును అంటే ఎవరూ లెక్కింపలేని సంఖ్య అని అర్ధము.
దాని 7:10 లో వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి అని వ్రాయబడినది.
దైవజనుడైన మోషే దర్శనములో వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు [దేవుని కుమారుడు] మెరియు చుండెను (ద్వితీ 33:2).
కీర్తనా కారుడైతే కీర్త 68:17 లో దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు అని స్తుతించుచున్నాడు.
అపో. పౌలు భక్తుడు వేలకొలది దేవదూతలు (హెబ్రీ 12:22) అని వ్రాశారు. కోట్లు ఎక్కడ, వేలు ఎక్కడ !!
మీకాయా ప్రవక్త సంఖ్యలు చెప్పక, యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని (1 రాజు 22:19).
లూకా గ్రంధ కర్త పరలోక సైన్యసమూహము (లూకా 2:13) అని వ్రాస్తున్నారు.
ప్రియ స్నేహితుడా, అంత పెద్ద సమూహము ఒక్క సారిగా బహుశా ఏక కంఠముతో ఆరాధించుచున్న స్వరము యోహాను విన్నాడు. వారు చేయుచున్న ఆరాధన సుస్పష్టముగా వున్నది. వారువధింపబడిన గొఱ్ఱపిల్లను సంపూర్ణ లేక పరిపూర్ణ ఆరాధనతో మహిమ పరచుచున్నారు. ఎట్లనగా వారు ఏడు ఘనతలు ఆరోపిస్తున్నారు. గొఱ్ఱపిల్ల 1.శక్తియు 2.ఐశ్వర్యమును 3.జ్ఞానమును 4.బలమును 5.ఘనతయు 6.మహిమయు 7.స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు.
యేసు రక్షకుడు జన్మించినప్పుడు వారు భూమి మీదకు వచ్చినప్పుడు ఏమని ఆరాధించారు: సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసిరి (లూకా 2:14).
ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రభువును ఆరాధించునప్పుడు మనము యేమైయున్నామో కాదు మన ప్రభువు మనకు యేమైయున్నాడు, చెప్పనశక్యమైన ఆయన మహిమ ఎంత గొప్పది అనే విషయాలు మదినుంచుకొని ఆరాధించుదాము. యేసయ్య నేర్పిన ఆరాధన తర్బీడు చేద్దాము : దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను (యోహా 4:24).
ఆత్మతో ఆరాధించుట అనగా ఆత్మ సంభంధమైన సంగతులతోను ఆత్మసంబంధమైన పాటలతోను ఆరాధించాలి; అంతే గాని మన జ్ఞానము మన కవిత్వము మన సాహిత్యము అక్కరలేదు, అది మంచిది కూడా కాదు.
ఆ దినమున ఆ పరలోక ఆరాధన ఆయన చేతిపనియైన సృష్టి అంతటా మారుమ్రోగుచున్నది. ఆత్మవశుడైన యోహాను పరలోకములో వున్నాడు. అక్కడ సంభవించే ప్రతి గమనా గమనములకు లోకము ఎలా స్పందిస్తుందో చూస్తున్నాడు. ప్రవక్తయైన యెషయా తన మనోనేత్రముతో చూచి అంటున్నాడు: భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది (యెష 14:7).
ఈ దర్శనములో యోహాను గారు తన ఆత్మ నేత్రదృష్టితో ఒక్కసారి పరలోక భూలోకాలను చుట్టి వచ్చాడు. చూడగా, పరలోకంలోను భూలోకంలోను భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుచున్నట్లు గమనిస్తున్నాడు.
ప్రతి సృష్టము అనగా సమస్త వస్తువులును యాజకుని ద్వారా రక్త ప్రోక్షణతో శుద్ధిచేయబడును (హెబ్రీ 9:22). ఆ దినమున పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు బలుల వలన శుద్ధిచేయబడవలసియుండగా పరలోక సంబంధ మైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన అనగా గొర్రెపిల్ల రక్తము వలన శుద్ధిచేయబడి ప్రభువును ఆరాధించును. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను (హెబ్రీ 9:24).
ప్రార్ధన ముగియగానే లేదా ఆరాధన అర్పించగానే ఆమెన్ చెప్పుట ఎంత ప్రాముఖ్యమో మనకు కనబడుచున్నది. నాలుగు జీవులు ఆమెన్ చెప్పినట్లు, అంతట పెద్దలు సాగిలపడినట్లు వ్రాయబడినది. ఆమెన్ చెప్పుటద్వారా మనము ఆ ప్రార్ధనతో ఏకీభవిస్తున్నామని అర్ధం. అదే, ఆరాధన ఐతే మనము కూడా ఆ ఆరాధనలో పాల్గొను చున్నామని అర్ధం.
ప్రియ విశ్వాసీ, ప్రార్ధన చేద్దాం, ప్రార్ధించే వారితో ఏకీభవిద్దాం; ఆరాధన చేద్దాం, ఆరాధించే వారితో ఏకీభవిద్దాం. ఆయన సన్నిధిలో సాగిలపడుదము; ఏలయన ఆయన మన దేవుడు, మనము ఆయన మేపు గొర్రెలము. ప్రభుని ఆత్మ మనతో నుండును గాక. ఆమెన్ ఆమెన్