ప్రకటన 7:1-8 అటుతరువాత ...... లక్ష నలువది నాలుగు వేలమంది ...... ముద్రింపబడిరి.
తరువాత (ప్రక 18:21) అటుతరువాత (ప్రక 7:1, 9; 15:5; 18:1; 19:1) ఇటుతరువాత (ప్రక 9:12) ఈ సంగతులు జరిగిన తరువాత (ప్రక 4:1) యోహాను గారి రచనా శైలిలో ఈ పదములు వాడుట వాడుకగా వున్నది.
తరువాత అనగా ఆ మాటకు ముందు వెనుక వున్న సందర్బాలకు మధ్య కొంత కాలము వ్యవధి వున్నదని మనము గ్రహించాలి. ఈ ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ప్రకృతి విలయతాండవము, అన్య జనుల ఘోష చూశాము.
కొన్ని దినములు అలా సంభవించిన పిదప నలుదిక్కుల వాయువులు బంధింపబడుట అనగా ప్రకృతి నిమ్మళించినది. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?( సామెతలు 30:4) ఆయన [యేసు] గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను (మత్త 8:26).
దూత చేతిలో దేవుని ముద్ర వున్నది. అది నిజ క్రైస్తవులపై వేయబడనై యున్నది. ఆ ముద్రలో ఏమని వున్నది ఫిలదెల్ఫియ సంఘ వర్తమానములో దేవుడు ముందుగానే బయలుపరచినారు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను (ప్రక 3:12).
ముద్రించు వరకు అనే మాటతో మనకు ఏమి అర్ధమగుచున్నది ప్రియ విశ్వాసీ? ముద్రించిన పిదప మరి భయంకరమైన పరిస్ధితి భూమి మీద సంభావింపనై యున్నది కదా. అది మన తరములో సంభవించినచో నీవు సిద్ధమా. ముద్ర వుంటే సురక్షితం, లేని యెడల; నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి (యెహే 9:5). ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు (యెహే 9:6).
అట్టి ముద్రను ఇశ్రాయేలీయులపై వేయ బడినప్పుడు గోతముల వారిగా లెక్క చెప్పబడినది. ఆనాడు ఇగుప్టు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగిన వారు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మంది (నిర్గ 38:26 ). నేడు ఇశ్రాయేలు దేశపు జనాభా ఎనుబదియారు లక్షల ఏబదియైదు వేల ఐదు వందల ముప్పదియైదు అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభువు రాకడ సమయానికి ఇంకా వృద్ధి అగుట తధ్యం కాదా.
మరి కేవలము లక్ష నలువది నాలుగు వేలమంది మాత్రమే ముద్రింపబడుట ఏమిటి? ప్రియ స్నేహితుడా, గ్రంథములోని కొన్ని ప్రామాణిక సంఖ్యలను వున్నవి ఉన్నట్టుగా భావించ కూడదు. ఉదాహరణకు: మూడు, యేడు, పన్నెండు, పదునాలుగు, వెయ్యి వంటివి. ప్రార్ధనా పూర్వకముగా ముందుకు సాగుదమా, ప్రభువు మనతోనుండి మనకు బోధించును గాక. ఆమెన్
ప్రకటన 7:9-17 అటు తరువాత నేను చూడగా, ఇదిగో ...... ...... ...... దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు (మత్త 8:11) అనగా ముందు చెప్పబడిన 1,44,000 మంది యూదులతో కూడా క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ ఫలము పొందిన క్రైస్తవులు ఇక్కడ కనబడుచున్నారు.
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును (మత్త 24:14). అట్లు వారు ఒక లెక్కింపలేని జనసమూహముగా కనబడుచున్నారు. వారెవరు అంటే, ప్రతి జనములోనుండి ప్రతి వంశములోనుండి ప్రజలలోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి అనగా ప్రపంచ నలుమూలలనుండి ప్రోగుచేయబడిన నిజమైన క్రైస్తవులు.
మొదట ప్రకటన 4:8లో నాలుగు జీవుల ఆరాధన చూశాము. ఆ తదుపరి ప్రకటన 4:11 లో ఇరువది నలుగురు పెద్దల ఆరాధన ధ్యానించియున్నాము. ఐతే ఇది రక్షింపబడిన క్రైస్తవ విస్వాసుల ఆరాధన. వారి వస్త్రములు తెల్లనివి, వారి చేతిలో ఖర్జూరపు మట్టలున్నవి అనగా జయశాలి యేసు క్రీస్తు యొక్క రాకడను ప్రచురపరచుచు స్తుతించుచున్నారు. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేయు చున్నారు (యోహా 12:13).
ఇది అద్భుతమైన యేడు మాటల ఆరాధన. 1. స్తోత్రమును 2.మహిమయు 3.జ్ఞానమును 4.కృతజ్ఞతా స్తుతియు 5.ఘనతయు 6.శక్తియు 7.బలమును కలుగును గాక – ప్రియులారా మనము నేర్చుకుందాము.
దేవదూత యోహాను గారిని అడిగారు, వీరెవరు? ఎక్కడ నుండి వచ్చారు? అని. సార్దీస్ సంఘముతో ప్రభువు చేసిన వాగ్దానము యేమనగా, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు (ప్రక 3:4). ప్రక 4:4 ప్రకారం సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. మరియూ, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను (ప్రక 6:9-11).
ఇపుడు ఎందుకు యోహాను గారు ఈ ముగ్గురిలో ఒకరై ఉండవచ్చును అనిగాని, సార్దీస్ సంఘస్తులని గాని చెప్పలేక పోయారు. వీరు గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. వారు లోకాంతము వరకూ రక్షింపబడిన వారు అని మననము గ్రహించాలి.
ప్రియ స్నేహితుడా, మనము పరలోకములో ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము ఇక్కడ తేట తెల్లమౌతుంది. గొఱ్ఱపిల్ల రక్తములో కడుగ బడినావా? నేడే రక్షణ దినము. ఇప్పుడే పాపము లోప్పుకో, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేయును. యెషయా ప్రవచనము: యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును (యెష 1:18) అని వాగ్దానము చేశారు కదా,
ఈరోజే తీర్మానము చేసుకో, సమయముండగానే తీర్మానము చేసుకో. ఆ నిత్య రాజ్యములో ఆరాధన, ఆరాధన, ఆరాధన అంతే గాని ఆకలి లేదు, దాహము లేదు, అస్తమయము లేనే లేదు. జీవజలములతో సేదదీరుతూ దుఃఖము నిట్టూర్పులులేని రాజ్యమది. ముందుకు సాగుదామా, ప్రార్ధన చేద్దాం. ప్రభువు మనతో నుండునుగాక. ఆమెన్