Psalms - కీర్తనల గ్రంథము 119 | View All

1. (ఆలెఫ్‌) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు

ఈ మహనీయమైన కీర్తన దేవుని వాక్కును పొగడుతూ రాసినది. దాదాపు ప్రతి వచనంలోనూ రచయిత దేవుడు తెలియజేసిన సత్యాలను సూచించే పదం ఏదో ఒకటి ఉపయోగించాడు – ఉపదేశం, వాక్కు, చట్టాలు, ఆజ్ఞలు మొదలైన పదాలు. హీబ్రూ అక్షరమాలలోని 22 అక్షరాలతో ఈ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. ఒక భాగంలోని ప్రతి వచనం ఆ భాగాన్ని సూచిస్తున్న అక్షరంతోనే ఆరంభం అయ్యేది. ఈ విధంగా ఈ కీర్తన 22 ముత్యాల హారాన్ని పోలివుంది. ఇది విశ్వాసులకు దేవుని వాక్కు విషయం స్తుతి, ప్రేమ, ఉపయోగం గురించిన అ,ఆ,ఇ,ఈ లు. ఈ కీర్తనలో రచయిత దేవుని వాక్కును తన జీవితంలో ఉపయోగించుకున్నట్టుగా మనం కూడా చేయడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మార్గం. ఈ సందర్భంలో యేసు క్రీస్తు సజీవమైన దేవుని వాక్కు అనీ, దేవుడు మనుషులకు చెప్పబూనుకున్నదాని శ్రీకారం, మంగళ వాక్యం, ఆదీ అంతమూ, అల్ఫా ఓమెగ ఆయనేననీ మనం గుర్తుంచుకోవాలి. యేసుప్రభువునూ దేవుని లిఖిత వాక్కునూ వేరు చేయడం సాధ్యం కాదు. ఆ వాక్కును మన జీవితాల్లో అనుసరిస్తూ ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభువునుంచి ప్రభావం, బలం, కృప మనకు సరఫరా అవుతున్నదన్నమాట. దేవుని వాక్కు పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు యేసుప్రభువు పట్ల కూడా మన ప్రేమ అధికం అవుతూ, మన బ్రతుకుల్లో కృపాపుష్పాలు వికసిస్తూ ఉంటాయి. కీర్తనల గ్రంథము 1:1-3 లో కీర్తనలు గ్రంథంలోని ముఖ్యాంశం ఉంది. అక్కడ టూకీగా వర్ణించబడిన ధన్యతకు దారి ఇక్కడ పూర్తిగా వెల్లడి అయింది. ఇక్కడ మొదటి వచనంలో (ఈ కీర్తన అంతటిలో) “ఉపదేశం” అని తర్జుమా చేసిన హీబ్రూ పదాన్ని ధర్మశాస్త్రం అని కూడా రాయవచ్చు. ఆ పదానికి ఈ రెండు అర్థాలున్నాయి. మనుషులకు దీవెనలు కలగడం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన తన వాక్కును మనకిచ్చాడు. వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల లేక విన్నందువల్ల లేక ప్రకటించడం, ఉపదేశించడంవల్ల ధన్యత కలగదు. దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది. పవిత్రతలో నుంచి ఆనందం కలుగుతుంది. విశ్వాసులు దేవుని వాక్కుకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటే, పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వతానందం వస్తుంది. ధన్యత, దీవెనల గురించి ఇతర నోట్స్ ఆదికాండము 12:3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; మత్తయి 5:3-12; లూకా 11:28; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:9 గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:3.

2. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.

దేవుని అనుగ్రహాన్ని, బలప్రభావాలను, సన్నిధిని వెదకకుండా మనం దేవుని త్రోవల్లో నడుచుకోలేము. వాస్తవంగా ఆయన్ను ఎంత ఎక్కువగా వెదికితే అంత ఎక్కువగా ఆయన మన అనుభవంలోకి వస్తాడు, అంత ఎక్కువగా ఆయనకు విధేయత చూపడం మనం నేర్చుకుంటాం, అంత ఎక్కువగా ధన్యులమౌతాం. విశ్వాసి ఎప్పుడూ దేవుణ్ణి వెదకుతూ కనుగొంటూ ఉండాలి (1 దినవృత్తాంతములు 16:11; మత్తయి 7:7-8). ఇలా వెదకడం “హృదయపూర్తిగా”– అంటే మనసారా, అందులోని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, దేవుని సన్నిధి గురించి అర్రులు చాచుతూ వెదకాలి (ద్వితీయోపదేశకాండము 4:29; యిర్మియా 29:13).

3. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు

వ 1,2 ప్రకారం జీవించనివారు దేవుని త్రోవల్లో నడుచుకోరు. వారు తప్పక పొరపాటు చేస్తూ, నిజమైన ధన్యత ఏమిటో గుర్తించలేకపోతారు.

4. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.

దేవుని ఆదేశాలు కేవలం మనసుకోసం గాక జీవితం మారాలని ఇవ్వబడ్డాయి. దేవుడు మనకు చెప్పినదాన్ని చెయ్యడానికి మనం ప్రయత్నించకపోతే మన భక్తి వ్యర్థమే – మత్తయి 7:21-23; లూకా 11:27-28; యోహాను 14:15 యోహాను 14:21; యోహాను 15:10; 1 యోహాను 5:3.

5. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.

తాను వర్ణించిన ధన్య జీవితాన్ని కొంతవరకు అనుభవించినా తానింకా పూర్తిగా అనుభవించడం లేదని రచయిత భావం. అయితే అతనికి తన బలహీనతలు, భ్రష్టస్వభావం, తప్పులు తెలిసినప్పటికీ ఆ ధన్య జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఉవ్విళ్ళూరుతున్నాడు. మన గురి ఏమిటో అది చాలా ప్రాముఖ్యం. అల్పమైన ఆధ్యాత్మిక ప్రమాణాలు, అనుభవాలతో మనం తృప్తి చెంది ఊరుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఎలా ఉంటుంది?

6. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.

“ఆశాభంగమేమీ”– వ 46,80; 1 యోహాను 2:28.

7. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

దేవుని వాక్కును ఒక విశ్వాసి ఎంత చక్కగా అర్థం చేసుకుంటే దానికోసం అంత ఎక్కువగా అతడు కృతజ్ఞతతో నిండి ఉండాలి. మనుషులకు దేవుడు ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఈవుల్లో బైబిలు ఒకటి.

8. నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము.

కీర్తనల గ్రంథము 27:9; కీర్తనల గ్రంథము 38:21; కీర్తనల గ్రంథము 71:9 కీర్తనల గ్రంథము 71:18. దేవుని వాక్కుకు అనుగుణంగా జీవించాలని అతడు నిశ్చయించుకున్నాడు. అలాగైతే తనను విడిచిపెట్టవద్దని దేవుణ్ణి బ్రతిమాలు తున్నాడెందుకు? ఎందుకంటే తానెన్ని మంచి తీర్మానాలు చేసుకున్నా, ఎంత కృతనిశ్చయుడై ఉన్నా గతంలో దారి తప్పిపోయాననీ, మళ్ళీ దారి తప్పవచ్చుననీ అతనికి తెలుసు (వ 176 చూడండి). దేవుడు తన పవిత్రత, న్యాయం చొప్పున అతడి పాపాలను పరిగణిస్తే అతణ్ణి ఆయన పూర్తిగా వదిలేస్తాడని అతడు గ్రహించాడు. విశ్వాసులను దేవుడు విడిచిపెట్టడని చెప్తున్న వాగ్దానాలను వారు బహు విలువైనవిగా ఎంచాలి (కీర్తనల గ్రంథము 37:28; కీర్తనల గ్రంథము 94:14; కీర్తనల గ్రంథము 118:6; ద్వితీయోపదేశకాండము 4:31; ద్వితీయోపదేశకాండము 31:6; యెషయా 41:17; హెబ్రీయులకు 13:5). దేవుడు ఒకవేళ తమను విడిచిపెట్టినట్టు కనిపిస్తే అది కొంతవరకే, తాత్కాలికంగానే.

9. (బేత్‌) ¸యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?

ఒక యువకుడు అడగతగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాల్లో ఒకటి. దీనికి జవాబు ఇందులోనూ తరువాతి వచనాల్లోనూ కనిపిస్తున్నది. జీవిత శుద్ధి ఎలా సాధ్యమంటే అది దేవుని వాక్కును అభ్యాసం చేయడం వల్ల (వ 9), అలా చేసేందుకు దేవుని కృపనూ బలాన్నీ వెదుకుతూ ఉండడం వల్ల (వ 10), ఆలోచనలకూ ఆశలకూ దేవుని వాక్కునే కేంద్రంగా చేసుకోవడం వల్ల (వ 11), దేవుని సహాయం మూలంగా ఆయన వాక్కుకు అర్థం నేర్చుకుంటూ (వ 12) నేర్చుకున్న తరువాత ఆ వాక్కును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల (వ 13), అందులో ఆనందిస్తూ, దాన్నే ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం వల్ల (వ 14-16) కలుగుతుంది.

10. నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.

వ 2. దేవుని ఆజ్ఞలనుండి తొలగిపోవడం చాలా తేలిక. అలా చేయడమే మన భ్రష్ట స్వభావాల సహజ గుణం. అందుకే హృదయపూర్వకంగా దేవుని వెదకవలసిన అవసరం ఉంది.

11. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

ద్వితీయోపదేశకాండము 6:6-8. పాపంతో విశ్వాసి చేసే పోరాటంలో దేవుని వాక్కుకున్న ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పడం (యోహాను 15:3 యోహాను 15:7; ఎఫెసీయులకు 6:17; కొలొస్సయులకు 3:16-17). మన తలంపుల్లో, ఆశల్లో, ఆశయాల్లో, కోరికల్లో, ధ్యానంలో దానికి కేంద్ర స్థానం ఉండాలి. మన చర్యల ఉత్పత్తి స్థానం దగ్గర అది ఉండాలి. పాపం ఎప్పుడూ దేవునికే వ్యతిరేకం అని గమనించండి – కీర్తనల గ్రంథము 51:4.

12. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.

మనం పాపం నుంచి దూరంగా ఉండగలిగితే అది మనల్ని మనం పొగడుకునేలా చెయ్యకూడదు. అలా చేసిన దేవుణ్ణే స్తుతించాలి. ఈ కీర్తనలో తొమ్మిది సార్లు తనకు ఉపదేశించాలని రచయిత దేవుణ్ణి అడుగుతున్నాడు – వ 12, 26, 33, 64, 66, 68, 108, 124,135 (కీర్తనల గ్రంథము 25:4-5; కీర్తనల గ్రంథము 143:8 కీర్తనల గ్రంథము 143:10 కూడా చూడండి). అతడు దీన్ని ఎంత విలువైనదిగా ఎంచుతున్నాడో, ఎంత మనస్ఫూర్తిగా దీన్ని వెదకుతున్నాడో ఇందువల్ల తెలుస్తున్నది.

13. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.

దేవుని చట్టాలన్నిటి గురించి మాట్లాడడం రచయితకు ఆనందం. ఎందుకంటే అవి అక్షరాలా దేవుని నోటినుంచి వెలువడ్డాయి (వ 72; ద్వితీయోపదేశకాండము 8:3; మత్తయి 4:4).

14. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.

దేవుని వాక్కును ఆచరణలో పెట్టడంలోనే మనిషికి కలిగే ఆనందాలన్నిటిలోకి పరమానందం. అప్పుడది మనకు వెండి బంగారాల కన్న చాలా ఎక్కువ విలువైనదౌతుంది (వ 72; కీర్తనల గ్రంథము 19:10; సామెతలు 2:1-5).

15. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.

వ 97,148; కీర్తనల గ్రంథము 1:2.

16. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.

కీర్తనల గ్రంథము 112:1.

17. (గీమెల్‌) నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.

ఈ వచనం, వ 22,23లను బట్టి చూస్తే రచయిత కష్టంలో బాధలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అతనికి తెలుసు. ఇలాంటి సమయాల్లో ఉండే మనందరికీ ఇతడు ఆదర్శం. అతడు దేవుని చట్టాలను తలపోస్తూ ఉన్నాడు (వ 23), వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు (వ 24), వాటిని ఆచరణలో పెడదామని నిశ్చయించుకున్నాడు (వ 17).

18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.

ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో ఉన్నా దేవుడు మన మనోనేత్రాలు తెరిచేటంతవరకు వాటిని మనం చూడలేము. ఇక్కడ రచయిత ప్రార్థించినట్టు మనమూ ప్రార్థించడం మంచిది. లూకా 24:45; ఎఫెసీయులకు 1:17-18 చూడండి.

19. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.

“పరాయివాణ్ణి”– లేవీయకాండము 25:23; ఫిలిప్పీయులకు 3:20; హెబ్రీయులకు 11:13. రచయిత నడతకు తగినట్టుగానే దేవుడు అతనిపట్ల ప్రవర్తించదలుచుకుంటే ఆయన తన సత్యాన్ని అతనికి తెలియనివ్వకుండా దాచిపెట్టవలసి ఉంటుందని రచయిత అనుకుంటున్నట్టున్నాడు.

20. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.

కీర్తనల గ్రంథము 42:2; కీర్తనల గ్రంథము 84:2. దేవుని వాక్కును తెలుసుకోవాలని రచయితకున్నంత తీవ్రమైన అభిలాష మనకుంటే, త్వరలోనే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయగలం.

21. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.

కీర్తనల గ్రంథము 5:5; ద్వితీయోపదేశకాండము 27:6; యిర్మియా 20:7; యిర్మియా 50:32; దానియేలు 4:37.

22. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొలగింపుము.

కీర్తనల గ్రంథము 39:8; కీర్తనల గ్రంథము 69:7; కీర్తనల గ్రంథము 79:4; దానియేలు 9:16.

23. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.

వ 161; కీర్తనల గ్రంథము 31:13; కీర్తనల గ్రంథము 50:20; కీర్తనల గ్రంథము 101:5; 1 పేతురు 3:15-16.

24. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

మనం దేవుడంటే లెక్కలేని విరోధ లోకంలో ఎలా జీవించాలో దేవుని వాక్కు అమోఘమైన రీతిలో మనకు నేర్పిస్తుంది.

25. (దాలెత్‌) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.

కీర్తనల గ్రంథము 44:25. ఈ కీర్తనలో 9 సార్లు రచయిత తనను బ్రతికించవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు (వ 25, 37, 40, 88, 107, 149, 154, 156, 159). ఇలా అడగడంలో ఇది అతని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమో, దీన్ని అతడు ఎంత మనస్ఫూర్తిగా వెతుకుతున్నాడో అర్థం అవుతున్నది. బ్రతికించాలని ప్రార్థించడమంటే దాదాపు మరణ స్థితిలో తాను ఉన్నానని అనుకున్నాడన్న మాట. ఇది శారీరకంగా కొనప్రాణంతో ఉన్నాడో లేక ఆధ్యాత్మికంగా నీరసించిన స్థితిలో ఉండి తిరిగి కోలుకోవలసిన స్థితిలో ఉన్నాడో చెప్పడం లేదు. హీబ్రూ పదం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిశ్చయం. తరచుగా విశ్వాసి ఆధ్యాత్మిక అనుభవంలో దేవునితో వినువీధుల్లోకి ఎగరాలని ఆశిస్తే తన కాళ్ళు బురదలో కూరుకుపోయి ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇది ఆత్మ సంబంధంగా తనకు జీవ స్థితి గాక మరణ స్థితిలాగే అనిపిస్తుంది. దేవుడు విశ్వాసులను బ్రతికించడం ఎప్పుడూ తన వాక్కు మూలంగానే.

26. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము

తాను చేస్తున్నదేమిటో అతడు దేవునికి చెప్తున్నాడు. మనం దేవునితో మనసు విప్పి, ఉన్నది ఉన్నట్టుగా, ఒక చిన్న పిల్లవాడు ప్రేమగల తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు (కీర్తనల గ్రంథము 62:8; 1కీర్తనల గ్రంథము 42:1-2; యోబు 10:1-2). “నేర్పు”– వ 12; కీర్తనల గ్రంథము 27:11; కీర్తనల గ్రంథము 86:11.

27. నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

కీర్తనల గ్రంథము 105:2; కీర్తనల గ్రంథము 145:5.

28. వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.

కీర్తనల గ్రంథము 6:7; కీర్తనల గ్రంథము 116:3; యెషయా 51:11; యిర్మియా 45:3. శత్రువువంటి ఈ లోకంలో తరచుగా క్రీస్తు భక్తుల అనుభవం ఇదే. ఈ రచయిత ప్రార్థించినట్టు మనమూ తరచుగా ప్రార్థించవలసి వస్తుంది.

29. కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము

కీర్తనల గ్రంథము 26:4. ఇతడు మోసంతో గానీ మోసకారులతో గానీ ఎలాంటి పొత్తూ పెట్టుకోదలచుకోలేదు.

30. సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను

కీర్తనల గ్రంథము 26:3. ఇంతకన్నా ఉత్తమమైనదాన్ని ఎవరూ ఎంచుకోలేరు (యోహాను 14:6). సత్య మార్గం దేవుని వాక్కులో మాత్రమే వెల్లడి అయింది. అక్కడ ఈ మార్గాన్ని చక్కగా చదును చేయడం, దారి చూపే గుర్తులు నాటడం, గమ్యం స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. మనం సత్య మార్గంలో నడవకపోతే నిజమైనవారం కాకపోతే ఇంకా కపట దారిలోనే ఉన్నామన్నమాట. అది నాశనానికి నడిపించే విశాలమైన దారి.

31. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.

ఆశాభంగం కలగకుండా ఉండాలంటే మనం కూడా సత్యాన్ని, విధేయతను గట్టిగా కోరుకోవాలి, వాటిని జారవిడుచుకోకూడదు.

32. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
2 కోరింథీయులకు 6:11

దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించడానికీ, దేవుని ప్రతి మాటనూ ప్రేమించి తల వంచడానికీ అవసరమైన విశాల హృదయం మనకు కావాలి. మన విధేయత వడిగా, తీవ్రంగా, సంపూర్ణంగా ఉండాలే గాని నీరసంగా, సందేహ పూర్వకంగా, నత్త నడకలాగా ఉండకూడదు. ఇలా ఉండాలంటే తన స్వశక్తి చాలునని రచయిత అనుకోలేదు. సత్య మార్గంలో తాను అలసట లేకుండా పరుగెత్తాలంటే తనలో దేవుడే ఆ పని జరిగించాలని అతనికి తెలుసు (యెషయా 40:31; ఫిలిప్పీయులకు 2:13; కొలొస్సయులకు 1:29).

33. (హే) యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.

కీర్తనల గ్రంథము 25:4-5; 1 రాజులు 3:9-10; లూకా 24:45; 1 యోహాను 5:20. ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో అతడు గ్రహించాడు. అందుకోసం తన స్వంత తెలివితేటలు సరిపోవని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు దేవునికి మొరపెడుతున్నాడు. పూర్తిగా శాశ్వతంగా విధేయుడై ఉండాలని అతడు ఆశిస్తున్నట్టు గమనించండి. ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడం దేవుని వాక్కుకూ సంకల్పానికీ అనుగుణంగా జీవించేలా చెయ్యాలి. లేకపోతే అదంతా ప్రయోజనం లేనిది.

34. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.

35. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.

దేవుని మార్గమంటే అతనికి ఆనందం. దానిప్రకారం తాను నడుచుకోవాలని అతనికి తెలుసు. కానీ స్వభావ సిద్ధంగా తనకు అది చేతకాదని కూడా తెలుసు (రోమీయులకు 7:18-25 పోల్చి చూడండి). దేవుని బలప్రభావాలు మాత్రమే ఆయనకు ఇష్టమైన రీతిలో బ్రతికేలా మనల్ని చేయగలవు. అందుకనే రచయిత ఇలా ప్రార్థిస్తున్నాడు.

36. లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.

దేవుని మార్గమంటే అతనికి ఆనందం అయినప్పటికీ ఇహలోక విషయాల వెంట పరుగులెత్తేలా చేసే ధోరణి ఒకటి తనలో ఉందని అతనికి తెలుసు. అంతరంగంలో తన జీవనం సరిగా ఉండాలని, తన ఉద్దేశాలు, కోరికలు, హృదయ వాంఛలు అన్నీ దేవుని వైపే ఉండాలనీ దేవునికి అనుకూలంగా ఉండాలనీ ప్రార్థిస్తున్నాడు. దీన్ని దేవుడు మాత్రమే మనలో చేయగలడు.

37. వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.

రచయిత తన చూపులను తానే మరల్చుకోలేడా? కండ్ల కోరికలెంత బలమైనవో అతనికి తెలుసునన్నమాట (1 యోహాను 2:16-17). దేవుడొక్కడే ఆ శక్తిని బద్దలు కొట్టగలడని కూడా తెలుసు. రచయిత తన బలహీనతను సూచిస్తూ, నూతన జీవం, బలం తనకు అవసరమని ఒప్పుకుంటున్నాడు.

38. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.

ఈ భయభక్తుల గురించిన నోట్స్ కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11; సామెతలు 1:7.

39. నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.

వ 22; కీర్తనల గ్రంథము 69:9; కీర్తనల గ్రంథము 89:51; యెషయా 25:8; యెషయా 51:7; యెషయా 54:4.

40. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.

వ 20; కీర్తనల గ్రంథము 42:2; కీర్తనల గ్రంథము 84:2.

41. (వావ్‌) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.

వ 76,116,154,170 దేవుడు చేసేదంతా వాక్కుకు అనుగుణంగానే. ఆయన వాక్కును మనమెంత బాగా అర్థం చేసుకుంటే, ఆయన ఏమి చేసేదీ, ఏమి చెయ్యాలని ఆలోచించేదీ అర్థం చేసుకోవచ్చు.

42. అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.

కీర్తనల గ్రంథము 42:10; కొలొస్సయులకు 4:6; 1 పేతురు 3:15-16.

43. నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.

దేవుని పక్షంగా మాట్లాడలేని పరిస్థితికి, ఆత్మ సంబంధమైన దుస్థితికి తనను దిగజారనియ్యవద్దని రచయిత ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 51:12-15 లో రాసిన ప్రకారం ఇది దావీదుకు జరిగింది. పౌలు కూడా తాను మాట్లాడవలసిన రీతిలోనే ఎప్పుడూ మాట్లాడగలిగేలా తనకోసం ప్రార్థించ వలసిందని ఎఫెసు సంఘంవారిని కోరాడు (ఎఫెసీయులకు 6:19-20).

44. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును

శరీర సహజమైన గుండె నిబ్బరంతో చేసుకున్న తీర్మానం కాదిది. వ 41 లోని తన ప్రార్థన నెరవేరుతుందన్న ఆశాభావంతోనే.

45. నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును

కీర్తనల గ్రంథము 18:19; కీర్తనల గ్రంథము 31:8; యోబు 36:16.

46. సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
రోమీయులకు 1:16

మత్తయి 10:18; అపో. కార్యములు 26:1-2.

47. నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.

వ 77,143; కీర్తనల గ్రంథము 112:1.

48. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్‌.

కీర్తనల గ్రంథము 28:2. దేవుని ఆజ్ఞల పట్ల అతనికున్న ప్రేమకు సూచనగా ఇక్కడ చేతులు ఎత్తుతాను అంటున్నాడు. చిన్న పిల్లలు కూడా తమకు కావలసినవాటి వైపు చేతులు చాపుతారు.

49. (జాయిన్‌) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసి కొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.

ఈ భాగానికి “గుర్తుంచుకోవడంలో ఆదరణ” అని పేరు పెట్టవచ్చు. దేవుని భయం లేని మనుషుల వేళాకోళం మూలంగా రచయిత బాధపడుతున్నాడు. కానీ దేవుని వాక్కులోనూ, ఆయన కృపాభరితమైన లక్షణాలను, విధానాలను జ్ఞాపకం చేసుకోవడంలోనూ తనను తాను ధైర్యపరచు కుంటున్నాడు. అన్యాయంగా బాధలకు గురి అవుతున్న ప్రజలందరికీ దీనంతట్లోనూ ఇతడు మాదిరి. దేవుడిచ్చిన ప్రత్యేకమైన వాగ్దానాల గురించి ఇతడు మాట్లాడుతున్నాడు. తలచుకో అని దేవుణ్ణి అనడంలో ఆయన మర్చిపోతాడని కాదు ఉద్దేశం. రచయిత మనిషి కాబట్టి మనుషులు మాట్లాడే రీతిలో మాట్లాడుతున్నాడు. అసలు మనకుండేది మానవ భాషే గదా. తన ప్రజలకు సంబంధించినది దేన్నీ దేవుడు మర్చిపోడు, వారి పాపాలు తప్ప (యెషయా 49:15; హెబ్రీయులకు 6:10; హెబ్రీయులకు 8:12; హెబ్రీయులకు 10:17).

50. నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

కొందరికి బాధలుండవు, ఆదరణ ఉంటుంది. కొందరికి ఆదరణ ఉండదు, బాధలుంటాయి. విశ్వాసులకైతే మొత్తంమీద రెండూ ఉంటాయి. బాధకాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని వాగ్దానాలే. ఏ కష్టమూ కూడా పూర్తిగా తుడిచి పెట్టెయ్యలేని సజీవమైన ఆశాభావాన్ని అవి ఇస్తాయి.

51. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను.

వ 61,83,87. దేవుని ప్రజలను హేళన చెయ్యడంలో గర్విష్ఠుల ఉద్దేశం ఏమిటంటే వారిని సరైన త్రోవనుంచి మళ్ళించాలనే. అయితే ఇక్కడ మాత్రం వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమే.

52. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని.

ప్రతి పరీక్షకూ కష్టానికీ మనం గనుక వెతికి చూడగలిగితే దేవుని వాక్కులో ఆదరణ, ప్రోత్సాహం ఉన్నాయి (రోమీయులకు 15:4).

53. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది

న్యాయాన్ని అతిక్రమిస్తూ, దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉంటే దుర్మార్గుల ప్రవర్తన తరచుగా విశ్వాసులకు కోపం కలిగిస్తుంది. దేవుడు లేని అలాంటి వారికి సంభవించబోయే భయంకర శిక్షను తలంచుకొని తరచు దుఃఖం కూడా వేస్తూ ఉంటుంది (వ 136; నిర్గమకాండము 32:19; యిర్మియా 8:18-22; లూకా 19:41-44; అపో. కార్యములు 17:16; 2 కోరింథీయులకు 5:11).

54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను.

వ 172; కీర్తనల గ్రంథము 101:1; కీర్తనల గ్రంథము 138:5; యోబు 35:10; ఎఫెసీయులకు 5:19.

55. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను

వ 62; కీర్తనల గ్రంథము 42:8; కీర్తనల గ్రంథము 63:6. నిద్ర పట్టని రాత్రులలో మన కష్టాలు, విషమ పరీక్షలను తలచుకోవడం కన్నా దేవుని దయ గల లక్షణాలను ధ్యానించుకోవడం ఎంతో ఉత్తమం (కీర్తనల గ్రంథము 36:4; సామెతలు 4:16; మీకా 2:1).

56. నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.

దేవుని వాక్కుకు అనుగుణంగా జీవించే శక్తి దేవుని నుంచి పొందగల అన్ని దీవెనల కంటే గొప్ప దీవెన ఇది.

57. (హేత్‌)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.

రాబోయే భాగంలో రచయిత విశ్వాసులందరిలోను ఉండవలసిన, లేక ఉన్న లక్షణాలు కొన్నింటిని తనలో ఉన్నట్టు చూస్తున్నాడు. అవేవంటే వారి వాటా యెహోవాయే అని చెప్పి ఆయన వాక్కుకు వారు లోబడేందుకు ఇష్టపడుతారు (వ 57), ప్రార్థనలో ఆయనను వెదకుతారు (వ 58), తమ చర్యలను తలపోసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు (వ 59), లోబడేందుకు వారు వేగిరపాటు చూపాలి (వ 60), హింసలకు నలిగిపోకూడదు (వ 61), కృతజ్ఞత గలిగి ఉండాలి (వ 62), ఇతర విశ్వాసులతో సహవాసం కోరుకోవాలి (వ 63), దేవుడు తమకు ఉపదేశించాలని ఆశతో ఎదురుచూడాలి (వ 64). “వాటా”– కీర్తనల గ్రంథము 16:5; కీర్తనల గ్రంథము 73:26; ద్వితీయోపదేశకాండము 32:9; యిర్మియా 51:19; విలాపవాక్యములు 3:24. “అనుగుణంగా ప్రవర్తిస్తానని”– వ 17,67,101.

58. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

వ 41; కీర్తనల గ్రంథము 34:4; ద్వితీయోపదేశకాండము 4:29; 1 దినవృత్తాంతములు 16:11.

59. నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.

విలాపవాక్యములు 3:40; హగ్గయి 1:5.

60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.

లోబడడంలో ఆలస్యం చేయడమంటే లోబడక పోవడమే. చాలామంది పాపం చేయడానికి వేగిర పడుతారు. దేవుని వాక్కుకు లోబడడం ద్వారా పాపాన్ని జయించేందుకు మనం వేగిరపడుదాం.

61. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు

వ 51,83,87. పరిహాసాలు గానీ హింసలు గానీ అతణ్ణి దేవుని వాక్కునుంచి మళ్ళించలేకపోయాయి.

62. న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

వ 55. విశ్వాసులు కృతజ్ఞులై ఉండవలసిన అనేక విషయాల్లో ఇదొకటి. “కృతజ్ఞతలు”– కీర్తనల గ్రంథము 7:7; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; లేవీయకాండము 7:12-13; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

63. నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలికాడను.

కీర్తనల గ్రంథము 15:4; కీర్తనల గ్రంథము 101:6-7; అపో. కార్యములు 2:46; హెబ్రీయులకు 10:25. ఒక మనిషి స్నేహితులను బట్టి అతడు ఎలాంటివాడో తెలుస్తుంది. రచయిత తన మిత్రులను జాగ్రత్తగా ఎన్నుకున్నాడు.

64. (తే­త్‌) యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.

“నిండివుంది”– కీర్తనల గ్రంథము 33:5; యెషయా 6:3; మత్తయి 5:44-48. “నేర్పు”వ 12. “బాధల మూలంగా నేర్చుకోవడం” అని ఈ భాగానికి పేరు పెట్టవచ్చు (వ 67,71). మనకు వచ్చే బాధలు మనకేమీ పాఠాలు నేర్పకపోతే, లేక మనల్ని మరింత మంచివారుగా చెయ్యకపోతే వాటివల్ల మనకేమీ ఉపయోగం లేదు. అలా చేస్తే గనుక అవి మనకెంతో లాభదాయకం. బాధలు వచ్చినప్పుడు ఈ రచయిత దేవునిపై సణుక్కోలేదు. వాటి మూలంగా దేవుని వాక్కును, దేవుని మంచితనాన్ని మరింతగా నేర్చుకున్నాడు. యోబు 3:20 దగ్గర బాధల గురించి నోట్. ఈ వచనంలో రచయిత దేవుడు తనను ఆశీర్వదించడంలోనే గాక తనకు అవసరమైన విషయాలను నేర్పించే ఆ బాధలను తనకు పంపడంలో కూడా ఆయన మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు.

65. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.

66. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.

వ 12.

67. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.

వాతావరణం బావుంటే బయట నడుస్తాం. గాలివాన మొదలౌతుంటే ఇంటి దారి పడతాం. బాధలు అతణ్ణి దేవునిలో తన ఇంటికి తిరిగి వెళ్ళడం (కీర్తనల గ్రంథము 90:1), విధేయతతో దేవుని వాక్కుకు తిరగడం నేర్పించాయి. హెబ్రీయులకు 2:10; హెబ్రీయులకు 5:8 చూడండి. ఈ నియమం నిజం గనుక అన్ని కష్టాలు బాధలను తప్పించుకోవాలని మనం అంతగా తహతహలాడకూడదు. దేవుని వాక్కుకూ సంకల్పానికీ అనుగుణంగా మనల్ని చేసే అనుభవాలన్నిటినీ మనం ఆహ్వానించాలి.

68. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము.

కీర్తనల గ్రంథము 100:5; కీర్తనల గ్రంథము 106:1; కీర్తనల గ్రంథము 107:1; కీర్తనల గ్రంథము 135:3.

69. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.

కీర్తనల గ్రంథము 5:9; కీర్తనల గ్రంథము 10:7; కీర్తనల గ్రంథము 52:4; కీర్తనల గ్రంథము 109:2. వ 51లో గర్విష్ఠులు తనను హేళన చేస్తున్నారనీ, వ 61లో దుర్మార్గుల బంధకాల్లో ఉన్నాననీ అన్నాడు. ఇక్కడ గర్విష్ఠులు తన మీద అబద్ధాలు కల్పిస్తున్నారంటున్నాడు. అయితే వీటిలో ఏదీ అతణ్ణి దేవుని వాక్కునుండి మళ్ళించలేదు.

70. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.

కీర్తనల గ్రంథము 17:10; కీర్తనల గ్రంథము 73:7. విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య ఉన్న గొప్ప తేడా చూడండి. విశ్వాసులకు గొప్ప ఆనందాన్ని కలిగించేది అవిశ్వాసుల్లో ఎలాంటి చలనమూ కలగజేయదు.

71. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

వ 65,75; ద్వితీయోపదేశకాండము 8:2-5; హెబ్రీయులకు 12:5-11. బాధలు అనుభవించడం మంచిదంటున్నాడు. మంచిది గానీ సుఖకరమైనది కాదు. దేవుని వాక్కులోని సత్యాన్ని, రమ్యతను చూచేలా మన కళ్ళు తెరిచేదీ, దానికి విధేయులమయ్యేలా చేసేదీ ఏదైనా సరే, మంచిదే. రచయిత కష్టాలు మనుషుల మూలంగా కలిగాయి గాని దేవుడు వాటిని అతని మేలుకే ఉపయోగించాడు (ఆదికాండము 50:20; రోమీయులకు 8:28 చూడండి). దేవుడు వ్యాధిలోనుంచి ఆరోగ్యాన్ని పేదరికంలోనుంచి ఐశ్వర్యాన్ని, బలహీనతలోనుంచి బలాన్ని తెస్తాడు. మనల్ని పరలోకానికి చేరువ చేసేది మనం మోయవలసిన సిలువే.

72. వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

వ 14,57,111,127,162; కీర్తనల గ్రంథము 19:10; యోబు 28:17; సామెతలు 2:4-5. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనుకుంటే ఈ రచయితలాగా దేవుని వాక్కుకు విలువనివ్వాలి.

73. (యోద్‌) నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయచేయుము.

“రూపొందించావు”– కీర్తనల గ్రంథము 138:8; కీర్తనల గ్రంథము 139:13-16; ఆదికాండము 1:27. “గ్రహింపు”– వ 12,18,26,27,33,34. దేవుడు తనను వివేకవంతమైన పవిత్రమైన జీవితం గడిపేందుకే చేశాడు గాని అజ్ఞానంలో అవిధేయతలో ఉండేందుకు కాదు. ఏ తెలివితక్కువ వాడైనా పాపం చెయ్యగలడు. పవిత్రంగా ఉండగలగడానికి మాత్రం దేవుని వాక్కును గురించిన గొప్ప గ్రహింపు అవసరం, దేవుడు ఆరంభించిన పనిని పూర్తి చేయవలసిందని రచయిత ఆయన్ను బతిమాలుతున్నాడు.

74. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతోషింతురు

కీర్తనల గ్రంథము 34:2. తన జీవితం ఇతరులకు ఆనందం, ఆశీర్వాదాలు కలిగేదిగా ఉండాలని కోరుతున్నాడు.

75. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

వ 7,138,172; ద్వితీయోపదేశకాండము 4:8 భక్తిహీనుల చేతిలో తనను బాధల పాలు చేసినా ఇదంతా దేవుని లోపరహితమైన న్యాయం, విశ్వసనీయతలకు అనుగుణంగానే జరిగిందని రచయితకు తెలుసు. తన ప్రజల విషయంలో దేవుడు తన నియమాలెప్పుడూ మీరడు. వారిని ఆయన బాధలకు అప్పగించేది మంచి ఉద్దేశంతోనే (హెబ్రీయులకు 12:10; ప్రకటన గ్రంథం 3:19).

76. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.

వ 41.

77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.

అతని కష్టాలెంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్నిసార్లు జీవితం మీదే విరక్తి చెందాడు. దేవుని కనికరం మాత్రమే తన ప్రాణం నిలబెట్టగలదని భావించాడు. అయితే ఆ కష్టాలన్నిటిలో అతనికి ఆనందం ఉంది. రచయితకు లాగానే దేవుని వాక్కు మన పాలిట కూడా ఆనందప్రదం కాకపోతే, దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలని అనుకొనే హక్కు మనకు లేదు. మనం దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉండాలని దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలా?

78. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.

ఇలాంటి ప్రార్థనల గురించి నోట్ కీర్తనల గ్రంథము 35:8.

79. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.

రచయితకు వాటిల్లిన కష్టాలను చూచి బహుశా కొందరు విశ్వాసులు అతనికి దూరమయ్యారేమో. భయభక్తులు గల వారందరితోను తనకు లోపరహితమైన సహవాసం తిరిగి నెలకొనాలని ఇతని కోరిక.

80. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.

“సిగ్గు”– వ 6,46; 1 యోహాను 2:28. పాపం, అవిధేయత ఎప్పుడూ తలవంపులు తెస్తాయి. “నిర్దోషంగా”– వ 1. బయట నిర్దోషంగా ఉంటే సరిపోదు, తన అంతరంగ జీవితం, దాని ఉద్దేశాలు, ఆశయాలు, కోరికలు కూడా నిర్దోషంగా ఉండాలని కోరుతున్నాడు.

81. (కఫ్‌) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను

ఈ భాగంలో గొప్ప హింసల్లో చిక్కుకున్న రచయిత తన పక్షంగా దేవుడు చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుని వాక్కు తాను నమ్మకం ఉంచుతున్నానని అతనికి తెలుసు. దేవుడు దాన్ని నెరవేర్చడం కోసం ఎదురు చూస్తున్నాడు. “నీరసించిపోతూ ఉంది”– వ 20; కీర్తనల గ్రంథము 84:2. “ఆశ”– వ 43,74,114,147; రోమీయులకు 5:2-5

82. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి

కీర్తనల గ్రంథము 6:7; కీర్తనల గ్రంథము 69:3; విలాపవాక్యములు 2:11.

83. నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.

రచయిత ఆ హింసల్లో తనను తాను గుడారంలో వేలాడుతూ, పాతబడిపోయి పొగకు చూరిపోయి వేడికి ముడతలు పడిపోయిన ద్రాక్ష తిత్తికి పోల్చుకుంటున్నాడు. “మరచిపోవడం లేదు”– వ 51,61,87. పొగలో ఉన్నా వేడిలో ఉన్నా దేవుని వాక్కును మాత్రం మనం వదలకూడదు.

84. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?

కీర్తనల గ్రంథము 6:3; కీర్తనల గ్రంథము 13:1; కీర్తనల గ్రంథము 35:17; కీర్తనల గ్రంథము 89:46; కీర్తనల గ్రంథము 90:16; కీర్తనల గ్రంథము 94:3; ప్రకటన గ్రంథం 6:10.

85. నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.

కీర్తనల గ్రంథము 35:7; కీర్తనల గ్రంథము 57:6; యిర్మియా 18:20 యిర్మియా 18:22; మార్కు 12:13; లూకా 11:53-54. అందువల్ల మనం పాముల్లాగా తెలివి కలిగి, పావురాల్లాగా హాని చేయనివారుగా ఉండాలి.

86. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.

“నమ్మతగ్గవి”– వ 138; కీర్తనల గ్రంథము 19:7; కీర్తనల గ్రంథము 111:7; మత్తయి 5:17-18.

87. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.

వ 51,61,83. మనుషులు తనకేమీ చేసినప్పటికీ తాను మాత్రం దేవుని వాక్కుకే అంటిపెట్టుకొని ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. హింసలు, కష్టాలు మనల్ని దేవుని వాక్కును వదిలేసేలా చేస్తే మన నమ్మకం అసలు నిజమైనదేనా?

88. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్‌.

దేవుని వాక్కును మనుషులు రాసి పెట్టినప్పటికీ అది దేవుని నోటనుంచే వచ్చింది (మత్తయి 4:4; 2 పేతురు 1:21). మనకు వాక్కుపట్ల విధేయతే జీవితం అయి ఉండాలి.

89. (లామెద్‌) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.

కీర్తనల గ్రంథము 111:7-8; మత్తయి 5:18; 1 పేతురు 1:25. దేవుని వాక్కు పరలోకంలో సుస్థిరంగా శాశ్వతంగా ఉంది కాబట్టి భూమి పై జరిగేదేదీ దాన్ని పడగొట్టడం అసాధ్యం.

90. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది

కీర్తనల గ్రంథము 36:5; కీర్తనల గ్రంథము 45:17; కీర్తనల గ్రంథము 89:1; కీర్తనల గ్రంథము 90:1. దేవుడు ఈ భూమిపట్ల ఈ లోకంలో తన స్థిరమైన ఉద్దేశాలకు అనుగుణంగా పని చేస్తూ తన వాక్కును నెరవేర్చుకొంటాడు.

91. సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి

“సమస్తమూ”– కీర్తనల గ్రంథము 104:2-4; యిర్మియా 31:35. సూక్ష్మమైన అణువునుంచి పెనుతారల సమూహాలవరకు జంతుజాలం, చేపలు, పక్షులు దేవుని నియమాలకు లోబడుతాయి. ఈ విశ్వమంతటిలోనూ సైతాను, వాడి దూతలు, వాణ్ణి అనుసరించే మనుషులు మాత్రమే దేవునికి లోబడక, ఆయన సేవకులుగా ఉండేందుకు నిరాకరిస్తూ ఉంటారు. “నిర్ణయాలు”– యిర్మియా 33:25. సృష్టి కేవలం దాని సహజ ధర్మాల పైనే ఆధారపడి లేదు. దేవుని నియమాలు దాన్ని ఏలుతూ ఉన్నాయి.

92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.

దేవుని వాక్కును ఎరిగే ఆనందం లేకుండా మనుషులు ఎలా జీవించగలరు? ఆశాభావం లేకుండా, దేవుడు లేకుండా వారు నిరాశలో మరణించకుండా ఎలా ఉండగలరు? నిరాశకూ, జీవితం అర్థం లేకుండా అయిపోయిన స్థితికీ నివారణ దేవుని వాక్కే.

93. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.

వ 50 నోట్.

94. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.

విశ్వాసులు దేవునికి చెందినవారు (1 కోరింథీయులకు 6:19-20). ఆయన వారిని సృష్టించాడు, ఎన్నుకున్నాడు, విమోచించాడు, నూతన ఆధ్యాత్మిక జీవంతో నింపాడు. శాశ్వతంగా వారిని తనవారుగా చేసుకున్నాడు. ఆయనకు లోబడడానికి ప్రయత్నించడం ద్వారా ఆయనకు చెందినవారమని వారు రుజువు చేస్తున్నారు. ఈ సత్యాన్ని బట్టి తనపట్ల జరిగించామని రచయిత దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనం విశ్వాసులమైతే మనం కూడా అలా చేయవచ్చు.

95. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.

వ 51,61,85.

96. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది.

ఈ భూమి పై శ్రేష్ఠమైనదని మనుషులు అనుకునేదంతా, వారి అతిశయ కారణాలన్నీ, లోప రహితంగా కనిపించేవన్నీ లోపాలతో కూడినవే. దేవుని ఉపదేశానికి అపారమైన లోపం లేని పరిపూర్ణత ఉంది (కీర్తనల గ్రంథము 19:7).

97. (మేమ్‌) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.

దేవుని వాక్కువల్ల కలిగే జ్ఞానం, గ్రహింపు ఈ భాగంలోని విషయం. “ధ్యానిస్తాను”– వ 15, 47, 49. మన మనసులు మనకిష్టమైన విషయాల మీదా వ్యక్తుల మీదా ఎప్పుడూ లగ్నమై ఉంటాయి.

98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.

వ 130; కీర్తనల గ్రంథము 19:7; ద్వితీయోపదేశకాండము 4:6; సామెతలు 2:1-5; 2 తిమోతికి 3:15. దేవుని వాక్కే విశ్వాసుల జ్ఞానం. అయితే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలదు. హృదయంలో ఉండాలి, విధేయత గల జీవితానికి కేంద్రంగా ఉండాలి.

99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

100. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.

101. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను

చెడు మార్గాలకూ దేవుని వాక్కుకూ ఒకదానికొకటి పొసగదు. అవి రెండూ కలవవు.

102. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.

దేవుడే మనకు ఉపాధ్యాయుడుగా ఉండడం అత్యద్భుతమైన విషయం! (యెషయా 54:13; యిర్మియా 31:33-34; 1 కోరింథీయులకు 2:13; 1 థెస్సలొనీకయులకు 4:9; హెబ్రీయులకు 8:10-11; హెబ్రీయులకు 10:16; 1 యోహాను 2:27). దేవుడు మనకు నేర్పించాలని మనం కోరితే నమ్మిక, విధేయత అవసరం.

103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

కీర్తనల గ్రంథము 19:10; సామెతలు 24:13-14.

104. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.

వ 128; సామెతలు 13:5. తప్పు త్రోవలు దేవుణ్ణి అగౌరవపరుస్తాయి. మనుషులకు హాని చేస్తాయి. కాబట్టి దేవుని ఆదేశాలవల్ల కలిగిన గ్రహింపు ఆ త్రోవలను అసహ్యించుకొనేలా చేస్తుంది.

105. (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.

ఈ భాగంలో చెప్పిన విషయం దేవుని వాక్కులోని గొప్ప విలువ, ఎంత కష్టం కలిగినా సరే దానిప్రకారం జీవించాలన్న రచయిత నిశ్చయం. “దీపం”– సామెతలు 20:27; 2 పేతురు 1:19. “కాంతి”– కీర్తనల గ్రంథము 19:8; సామెతలు 6:23. దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి. ఎలా నడుచుకోవాలో గమ్యమేమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసినా నిరాకరించినా మనం చీకటినే కోరుకుంటున్నామన్న మాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు.

106. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.

నెహెమ్యా 10:29.

107. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

వ 25; రోమీయులకు 7:24.

108. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము

“నేను అర్పించేది”– అంటే స్తుతులు (కీర్తనల గ్రంథము 33:1; కీర్తనల గ్రంథము 51:15; కీర్తనల గ్రంథము 63:5; కీర్తనల గ్రంథము 71:8; కీర్తనల గ్రంథము 109:3; హెబ్రీయులకు 13:15-16). “నేర్పు”– వ 12; కీర్తనల గ్రంథము 25:4-5; కీర్తనల గ్రంథము 143:8 కీర్తనల గ్రంథము 143:10.

109. నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.

1 కోరింథీయులకు 15:30-31; 2 కోరింథీయులకు 6:9; 2 కోరింథీయులకు 11:23.

110. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.

వ 51,61,83,87.

111. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

కనాను దేశం ఇస్రాయేల్‌ప్రజల సొత్తు (కీర్తనల గ్రంథము 105:11; యెహోషువ 1:6). అయితే ఏ దేశం కన్నా ఎంతో విలువైనది దేవుని వాక్కు. అది శాశ్వతమైన వారసత్వం (మత్తయి 24:35). కలకాలం నిలిచే ఆనందం.

112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.

వ 106. దేవుని వాక్కుకు లోబడాలంటే దృఢ చిత్తం, మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టడం అవసరం. ఇవి లేకపోతే మన స్వభావంలోని బలహీనత వల్ల దేవుని వాక్కును మరచిపోవడం, దాని ఉపదేశం నుంచి కొట్టుకుపోవడం తేలిక.

113. (సామెహ్‌) ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

1 రాజులు 18:21; యాకోబు 1:6-7; యాకోబు 4:8. దేవుని వాక్కుపట్ల అతనికి ఇంత తీవ్రమైన ప్రేమ ఉంది కాబట్టి దానికి విరుద్ధమైన విషయాలు, వ్యక్తులు అంటే అతనికి ఏవగింపు. దేవుని వాక్కుకు లోబడడంలో జాగు చేస్తే, లోబడాలా వద్దా అని ఆలోచించడం మొదలుపెడితే అందుకు మూల కారణం పాపం పట్ల ఆశ అన్నమాట.

114. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.

“డాలు”– కీర్తనల గ్రంథము 3:3; కీర్తనల గ్రంథము 18:2; కీర్తనల గ్రంథము 28:7; ఆదికాండము 15:1. “ఆశాభావం”– వ 43, 81, 147.

115. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.

కీర్తనల గ్రంథము 6:8; కీర్తనల గ్రంథము 97:10; కీర్తనల గ్రంథము 139:19. దేవుణ్ణి ప్రేమించేవారు దుర్మార్గాన్ని ప్రేమించేవారితో కలిసి సంతోషంగా ఉండలేరు.

116. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.

కీర్తనల గ్రంథము 41:1-3; కీర్తనల గ్రంథము 55:22; యెషయా 41:10; యెషయా 46:4.

117. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

118. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే.

అలాంటివారు తామే చాలా తెలివైన వాళ్ళమనీ గొప్పవాళ్ళమనీ అనుకోవచ్చు గానీ దేవుణ్ణి కూడా తమ గురించి అలాంటి భావాలే కలిగి ఉండాలని ఒప్పించలేరు (గలతియులకు 6:7).

119. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి

మలాకీ 4:1; మత్తయి 25:41; ప్రకటన గ్రంథం 21:8. దేవుని ఆజ్ఞలు దుష్టత్వానికంతటికీ వ్యతిరేకం కాబట్టి, వాటి ప్రకారమే దేవుడు భూమినుండి దుర్మార్గులను తొలగించి దాన్ని శుద్ధంగా చేస్తాడు కాబట్టి రచయితకు ఆ ఆజ్ఞలంటే ప్రీతి.

120. నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

దుర్మార్గుల నాశనాన్ని తలచుకుంటే తన సంగతి ఇతనికి వణుకు పుడుతున్నది. తనకు భ్రష్ట స్వభావం ఉందనీ, దేవుని కృప మాత్రమే తనను దుర్మార్గానికి దూరంగా ఉంచగలదని అతనికి బాగా తెలుసు. దేవుని పట్ల భయం గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11. కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11.

121. (అయిన్‌) నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము.

లూకా 18:9-12 లోని పరిసయ్యుల్లాగా ఇతడు తానే న్యాయవంతుణ్ణి అనుకోవడం లేదు. ఈ కీర్తన అంతటిలోనూ తన బలహీనత, లోపాలు, తప్పుల గురించి బాగా ఎరిగినవాడని కనిపిస్తున్నది. విశ్వాసుల్లో తాము అల్పులమన్న అభిప్రాయం, ఉన్నత విలువలు గల జీవిత విధానం రెండూ కనిపించాలి. అయితే మొత్తంమీద దేవుని కృపవల్ల తాను దేవుని న్యాయ మార్గాలకు అనుగుణంగానే జీవిస్తున్నానని అతనికి తెలుసు. తాను దేవుని నిజమైన సేవకుణ్ణని అతనికి తెలుసు.

122. మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.

123. నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి.

వ 82; కీర్తనల గ్రంథము 6:7; కీర్తనల గ్రంథము 63:3; విలాపవాక్యములు 2:11.

124. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము

“వ్యవహరించు”– వ 88; కీర్తనల గ్రంథము 25:7; కీర్తనల గ్రంథము 69:16; కీర్తనల గ్రంథము 109:26. “నేర్పు”– వ 12.

125. నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము

మనం దేవుని సేవకులమైతే ఆయన మనకిచ్చే సూచనలనూ ఆదేశాలనూ అర్థం చేసుకోవాలనుకుంటాం. ఆయన మనకు జ్ఞానమిస్తాడన్న నమ్మకంతో ప్రార్థించగలం (యాకోబు 1:5; 1 యోహాను 5:14-15).

126. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.

మనం దేవుని సేవకులమైతే ఆయన మనకిచ్చే సూచనలనూ ఆదేశాలనూ అర్థం చేసుకోవాలనుకుంటాం. ఆయన మనకు జ్ఞానమిస్తాడన్న నమ్మకంతో ప్రార్థించగలం (యాకోబు 1:5; 1 యోహాను 5:14-15).

127. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.

వ 14,57,111,162; కీర్తనల గ్రంథము 19:10.

128. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.

“యథార్థమని”– కీర్తనల గ్రంథము 19:8; కీర్తనల గ్రంథము 33:4. “తప్పు మార్గాలు”– వ 104,163; కీర్తనల గ్రంథము 97:10; సామెతలు 13:5.

129. (పే) నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.

వ 13. దేవుని వాక్కునిండా దేవుని ఆశ్చర్యకరమైన సత్యాలు, వాగ్దానాలు, ఆదేశాలు, వెల్లడైన రహస్యాలు ఉన్నాయి. కానీ కేవలం దేవుని వాక్కును పొగడి ఊరుకుంటే సరిపోతుందని రచయిత అనుకోలేదు. దానికి విధేయుడు కావాలని అతని కోరిక. వాక్కును ప్రశంసిస్తే దీవెనలు రావు, లోబడితేనే.

130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.

వ 105; కీర్తనల గ్రంథము 19:7-8.

131. నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.

వ 20. మనం అంధకార లోకంలో జీవిస్తున్నాం. దాని నిండా మత సిద్ధాంతాలూ, వేదాంత ఉపదేశాలూ, దేవుణ్ణి గురించీ పాపవిముక్తి గురించీ తప్పుడు ఊహాగానాలూ, నరకానికి తీసుకుపోయే పాకుడు పట్టిన చీకటి దారులూ ఉన్నాయి. మనం కూడా రచయిత లాగానే దేవుని వాక్కు గురించిన గ్రహింపు కోసం రొప్పుతూ ఉండాలి. దాన్ని పఠించేందుకు వీలైన పద్ధతులన్నిటినీ ఉపయోగించాలి.

132. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.

కీర్తనల గ్రంథము 6:4; కీర్తనల గ్రంథము 25:6; కీర్తనల గ్రంథము 69:16; కీర్తనల గ్రంథము 86:16. దేవుడు తమ నుండి ముఖం తిప్పేసుకున్నాడనీ, తమ బాధలకూ కష్టాలకూ తమను వదిలేశాడనీ విశ్వాసులకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మన స్వంత అభిప్రాయాలనూ మనోభావాలనూ నమ్మకూడదు, దేవుని మార్పులేని వాగ్దానాలపైనే నమ్మకముంచాలి.

133. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

మన శత్రువులు మనపై అధికారం చెలాయించడం విచారకరమైన విషయం. మనకు ఆ గర్భశత్రువైన పాపం మనల్ని ఏలడం మరింత విచారకరం, ప్రమాదకరం కూడా. పాపం బారినుంచి విడుదల లభించడమనేది జీవితంలో దేవుని వాక్కులోని శక్తి మూలంగానే (వ 11; యోహాను 8:31-36; రోమీయులకు 6:16).

134. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచింపుము.

వ 122. దేవుని వాక్కులో ఉన్న ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చాలంటే మనుషుల దౌర్జన్యం నుంచి విడుదల అవసరమే.

135. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము.

“ప్రకాశించేలా”– కీర్తనల గ్రంథము 4:6; కీర్తనల గ్రంథము 67:1; కీర్తనల గ్రంథము 80:3; సంఖ్యాకాండము 6:25. “నేర్పు”– వ 12; కీర్తనల గ్రంథము 25:4-5.

136. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.

దేవుని శిక్ష అంటే ఏమిటో, ఆపదలంటే ఏమిటో, పాపులమీదికీ అవిధేయులమీదికీ వచ్చే బాధలు, విపత్తు, నాశనం ఏమిటో ఈ రచయితకు కొంతవరకు తెలుసు. అందుకే ఇతడు ఏడుస్తున్నాడు (యెషయా 22:4; యిర్మియా 9:1; విలాపవాక్యములు 1:16; విలాపవాక్యములు 3:48; లూకా 19:41-44; రోమీయులకు 9:1-3 పోల్చి చూడండి).

137. (సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు
ప్రకటన గ్రంథం 16:5-7, ప్రకటన గ్రంథం 19:2

ఈ భాగంలోని విషయం దేవుని నీతిన్యాయాలు, ఆయన ఆదేశాలు శాశ్వతంగా న్యాయమైనవి అనే విషయం (కీర్తనల గ్రంథము 129:4; కీర్తనల గ్రంథము 145:17; యెషయా 24:16; యిర్మియా 23:6; దానియేలు 9:7; జెఫన్యా 3:5; యోహాను 17:25).

138. నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.

“విశ్వసనీయత”– వ 86; కీర్తనల గ్రంథము 19:7; కీర్తనల గ్రంథము 111:7; మత్తయి 5:17-18. “శాసనాలు”– వ 75; కీర్తనల గ్రంథము 19:7; నెహెమ్యా 9:13.

139. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.

కీర్తనల గ్రంథము 69:9; యోహాను 2:17. అందరూ దేవుణ్ణి గౌరవించాలని, దేవుని వాక్కు అధికారం క్రిందికి రావాలని ఒక తీవ్రమైన ఆసక్తి రచయితను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. మనుషుల అవిధేయత వల్ల దేవునికి అగౌరవం కలిగినప్పుడు అతనికి చాలా బాధ అనిపించింది. విశ్వాసులకు ఇలాంటి ఆసక్తి చాలా అవసరం.

140. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది.

“మహా పవిత్రం”– ఈ హీబ్రూ పదానికి ఒక విలువైన లోహం కరిగించి శుద్ధి చేయబడినట్టు అర్థం ఉంది. కీర్తనల గ్రంథము 12:6 చూడండి. దేవుని వాక్కులో ఎలాంటి చెత్త, కల్మషం, పనికిరానిదేదీ లేదు. ఈ రచయితకు దానిపట్ల ఉన్న హృదయపూర్వకమైన ప్రేమకు మనకు కూడా ఉండవలసిన ప్రేమకు అది అర్హమైనదే.

141. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను.

“అల్పుణ్ణి”– కీర్తనల గ్రంథము 22:6. దేవుని వాక్కుపట్ల ప్రేమ, వినయ గుణం కలిసే ఉండాలి. “మరచిపొయ్యే”– వ 57,61,83,87.

142. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

వ 151,160.

143. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి

ఒక విశ్వాసి మాత్రమే దేవుని వాక్కు వల్ల తీవ్రమైన బాధ, ఆనందం కూడా ఏక కాలంలో అనుభవించ గలడు.

144. నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

వ 34,73,125,169. తెలివిని లేక గ్రహింపును ప్రసాదించాలని రచయిత చేసిన ఐదు ప్రార్థనల్లో ఇది నాలుగవది. తొమ్మిది సార్లు దేవుణ్ణి తనకు నేర్పించవలసిందని అడిగాడు. ఈ విధంగా ఒక్కసారి కూడా మనం అడిగామా?

145. (ఖొఫ్‌) యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము.

వ 10.

146. నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.

వ 77.

147. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను

కీర్తనల గ్రంథము 5:3; కీర్తనల గ్రంథము 57:8; కీర్తనల గ్రంథము 108:2; మార్కు 1:35. వేకువ జామునే ప్రార్థన, వాక్కును ధ్యానించడం ఈ రెండింటి కోసం విశ్వాసులందరూ ఒక సమయాన్ని ఎంచుకొని, దానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించాలి, గానీ వారి ఆశాభావం మట్టుకు వారి క్రమశిక్షణలో, వారి ప్రార్థనల్లో గాక దేవుని వాక్కులోనే ఉండాలి.

148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును.

కీర్తనల గ్రంథము 63:6; లూకా 6:12. ప్రత్యేకమైన అక్కర ఉన్న సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు అవసరం.

149. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

ఆపద సమయంలో ఆదుకోవలసిందని, లేక ఆధ్యాత్మికంగా బ్రతికించాలని రచయిత కోరుతూ ఉండవచ్చును. వ 25 చూడండి.

150. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు

కొంతమంది మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత అజ్ఞానంలో ఉంటారంటే వారు కేవలం చెడుగా ప్రవర్తించడమే కాక చాలా ఆతురతతో అలా చేస్తారు (ఎఫెసీయులకు 4:19; 1 పేతురు 4:3). విశ్వాసులను చెడగొట్టించేందుకు ప్రయత్నించడానికి వారు విశ్వాసుల దగ్గర ఉన్నారు గాని దేవునికి దూరంగా ఉన్నారు.

151. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.

యెహోవా చేరువగా ఉంటే ఆయన తన సేవకులను కాపాడుతాడు. తగిన కాలంలో తగిన విధంగా దుర్మార్గుల పని పడతాడు.

152. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.

వ 111:8; లూకా 21:33.

153. (రేష్‌) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము

ఈ భాగంలో రచయిత గొప్ప కష్టంలో ఉండి దేవుణ్ణి తన సంగతి విచారించి ఆయన జ్ఞానం, కృప చొప్పున తనను కడతేర్చాలంటున్నాడు.

154. నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

కీర్తనల గ్రంథము 35:1; 1 సమూయేలు 24:15; యిర్మియా 50:34.

155. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.

దుర్మార్గులు కావాలని దేవుని వాక్కును తెలుసుకోకుండా ఉంటారు కాబట్టి రక్షణకు దూరంగా ఉంటారు. వారు దేవుణ్ణి ఆయన వాక్కును వెదికితే వారు కూడా పాపవిముక్తిని రక్షణ పొందగలరు (యెషయా 55:7; యాకోబు 4:8-10).

156. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

“వాత్సల్యత”– కీర్తనల గ్రంథము 103:8; కీర్తనల గ్రంథము 106:45; విలాపవాక్యములు 3:22-23. “బ్రతికించు”– వ 25,107.

157. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగకయున్నాను.

వ 113; కీర్తనల గ్రంథము 3:1-2; కీర్తనల గ్రంథము 44:15-18.

158. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

కీర్తనల గ్రంథము 5:6; కీర్తనల గ్రంథము 139:21-22; లేవీయకాండము 26:30.

159. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము

రచయిత తాను దేవుని వాక్కును నిజంగా ప్రేమిస్తున్నాననడానికి దేవుణ్ణే సాక్షిగా పిలుస్తున్నాడు. దీనినే తన ప్రార్థనకు ఆధారంగా చేస్తున్నాడు.

160. నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

వ 89; కీర్తనల గ్రంథము 111:8.

161. (షీన్‌) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.
యోహాను 15:25

“హింసించారు”– వ 23, 122, 157. “భయభక్తులు”– వ 120; ఎజ్రా 9:4; యెషయా 66:2.

162. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.<