Daniel - దానియేలు 4 | View All
Study Bible (Beta)

1. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

దేవుడు నెబుకద్‌నెజరును తన గురించిన మరింత లోతైన జ్ఞానంలోకి నడిపించిన తీరు ఈ అధ్యాయం వెల్లడిస్తుంది. దీన్ని చక్రవర్తే రాశాడు. బహుశా రాజ్యమంతటా ప్రకటించి ఉండవచ్చు 1,2 వచనాలు.

2. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.
యోహాను 4:48

3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

4. నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కలకంటిని; అది నాకు భయము కలుగజేసెను.

5. నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.

6. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని.

దానియేలు 2:5-9 పోల్చి చూడండి. ఈ సారి బబులోను “జ్ఞానుల”కు రాజు క్రితం సారికంటే సులభమైనదాన్ని చేయమన్నాడు, అయినా వీరు దాన్ని కూడా సాధించలేక పోయారు. అలాంటివారికి ఎప్పుడు ఎక్కడైనా సరే ఇలానే జరుగుతుంది.

7. శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేనుకనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.

8. కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని.

దానియేలు 1:7.

9. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము.

దానియేలు మాంత్రికుడు కాదని చక్రవర్తి ఇంకా గ్రహించలేదు. దానియేలు జ్ఞానం ఏదో మంత్రవిద్యో, ఇంద్రజాలమో కాదనీ నిజ దేవుని నుంచి వచ్చినదనీ అతనికింకా తెలియదు.

10. నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.

11. ఆ చెట్టు వృద్ధిపొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.

12. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
మత్తయి 13:32, మార్కు 4:32, లూకా 13:19

13. మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా,

“పవిత్రుడు”– ఒక దేవదూత.

14. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.

15. అయితే అది మంచునకు తడిసి పశువులవలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి.

16. ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.

“కాలాలు”– వ 23,25,32. అంటే బహుశా 7 సంవత్సరాలు. దానియేలు 7:25 కూడా చూడండి.

17. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.

దానియేలు 2:36-45 లో తాను సత్యాన్ని విన్నప్పటికీ నెబుకద్‌నెజరు ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు (వ 25).

18. బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడవంటిని.

19. అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు - బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

దేవుని సేవకులు కొన్ని సార్లు అప్రియమైన నిజాలను కూడా చెప్తూ ఉండవలసి వస్తుంది.

20. తాము చూచిన చెట్టు వృద్ధినొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.

21. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా
లూకా 13:19

22. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగల వాడవైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

“చెట్టు”– బైబిలు అక్కడక్కడా వ్యక్తులనూ రాజ్యాలనూ చెట్లతో పోలుస్తుంది (కీర్తనల గ్రంథము 1:3; కీర్తనల గ్రంథము 37:35; కీర్తనల గ్రంథము 52:8; కీర్తనల గ్రంథము 92:12; యెషయా 17:6; యిర్మియా 11:16; యెహెఙ్కేలు 17:22-24; రోమీయులకు 11:17).

23. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.

24. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా

25. తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.

26. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.

“పరలోకం పరిపాలిస్తుందని”– అంటే దేవుడు పరిపాలిస్తున్నాడని అర్థం. బైబిల్లో ఈ సత్యం తేటతెల్లంగా వెల్లడైంది (కీర్తనల గ్రంథము 10:16; కీర్తనల గ్రంథము 47:2 (నోట్‌); కీర్తనల గ్రంథము 93:1; కీర్తనల గ్రంథము 96:10; కీర్తనల గ్రంథము 97:1; యెషయా 52:7; ప్రకటన గ్రంథం 19:6). అయితే దీన్ని అంగీకరించడానికి మనుషులు ఎంత జాగు చేస్తారు, ఎంత అయిష్టత చూపుతారు! మానవ చరిత్రలో అధిక భాగం పరలోక అధికారి పై తిరుగుబాటే గదా.

27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములుమాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

ఉన్నత పదవుల్లో ఉన్నవారిపట్ల వ్యవహరించడంలో దానియేలు ధైర్యం, దేవుని విషయాల్లో అతని విశ్వసనీయత చూడండి. “దీనావస్థలో ఉన్నవారు”– అధికారంలో ఉన్నవారు న్యాయం దయ చూపాలని దేవుడు శాసిస్తున్నాడు.

28. పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.

29. పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా

30. రాజు బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.
ప్రకటన గ్రంథం 14:8, ప్రకటన గ్రంథం 16:19, ప్రకటన గ్రంథం 17:5, ప్రకటన గ్రంథం 18:2-10

దేవుడు దానియేలు ద్వారా తెలియ జేసిన సత్యాల గురించి తలపోసేందుకు రాజుకు సంవత్సరం గడువు ఉంది. అయితే గర్వమనేది సత్యానికి బద్ధ శత్రువు. అది హృదయాన్ని బండబారిపోయేలా చేస్తుంది (దానియేలు 5:20. గర్వం గురించి దేవుని వైఖరి ఆయన వాక్కులో స్పష్టంగా తెలుస్తూ ఉంది. సామెత దానియేలు 6:16-17; దానియేలు 8:13; యెషయా 2:10-18; యెషయా 23:9; యిర్మియా 13:9; యాకోబు 4:6).

31. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.

“వాణి”– ఈ రాజు విషయంలో దేవుడు తీసుకుంటున్న విశేషమైన ఆశ్చర్యకరమైన చర్యల్లో ఒకటి.

32. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

33. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.

తాను చేస్తానన్న విధంగా దేవుడెప్పుడూ చేస్తాడు (సామెతలు 19:21; యెషయా 14:24; యెషయా 44:26; యెషయా 46:10; మత్తయి 5:18).

34. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకునున్నవి.
ప్రకటన గ్రంథం 4:9-10

“తలెత్తి”– మానసిక ఆరోగ్యం బుద్ది స్థిరత రాజుకు తిరిగి సమకూరుతున్నాయని చెప్పడానికి సూచన. దేవుని వైపు సహాయం కోసం చూడనివారు. దేవుని గొప్పతనాన్నీ అధికారాన్నీ ఒప్పుకోనివారు ఆధ్యాత్మికంగా వెర్రివారు, వెర్రివారందరిలోకి వెర్రివారిలా ప్రవర్తిస్తారు (కీర్తనల గ్రంథము 14:1; ప్రసంగి 9:3 మొ।।). రాజు ఏమి చెయ్యాలని దేవుడు చెప్పాడో సరిగ్గా అదే చేశాడు. వ 25,32లో “మీరు గుర్తించేవరకు” అనే మాట గమనించండి.

35. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

“శూన్యం”– యెషయా 40:15-17. “తనకిష్టం వచ్చినట్టు”– కీర్తనల గ్రంథము 115:3; కీర్తనల గ్రంథము 135:6; రోమీయులకు 11:33-36. “జరిగిస్తాడు”– ద్వితీయోపదేశకాండము 32:39; యోబు 9:4; యెషయా 45:9; రోమీయులకు 9:20. మనుషులంతా నేర్చుకోవలసినదాన్ని ఇప్పుడీ రాజు నేర్చుకున్నాడు. ఏకైక నిజ దేవునికి ఈ భూగోళం పైనా, విశ్వమంతటి పైనా శాశ్వతమైన సర్వ సహాధిపత్యం ఉంది.

36. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని.

ఇదంతా కేవలం దేవుని కృపవల్ల కలిగింది. పరలోక రాజు ప్రేమ, కరుణ, దయ గల దేవుడు.

37. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు నున్నాను.
యోహాను 4:48

ఒక వ్యక్తి తనను తాను చేసిన కార్యాలను పొగడుకోవడం మాని దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టడం గొప్ప విషయం. అది అతని హృదయంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యమే. “న్యాయం”– ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 33:4-5 మొ।।. “అణచివేయగలడు”– కీర్తనల గ్రంథము 18:27; సామెతలు 3:34; సామెతలు 16:18; యాకోబు 4:10.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నెబుచాడ్నెజార్ యెహోవా శక్తిని గుర్తించాడు. (1-18) 
ఈ అధ్యాయం యొక్క ప్రారంభ మరియు ముగింపు ఆశ యొక్క మెరుపును అందిస్తాయి, నెబుచాడ్నెజార్ దైవిక దయ యొక్క శక్తికి మరియు దైవిక దయ యొక్క అనంతమైన లోతులకు నిదర్శనంగా ఉపయోగపడగలడని సూచిస్తున్నాయి. అతని పిచ్చి నుండి కోలుకున్న తరువాత, అతను కథను చాలా దూరం వ్యాపింపజేయడం, భవిష్యత్ తరాల కోసం దానిని భద్రపరచడం తన లక్ష్యం, దేవుడు అతనిని ఎలా న్యాయంగా తగ్గించి, దయతో పునరుద్ధరించాడు అనేదానికి సాక్ష్యంగా. ఒక పాపి వారి నిజమైన స్వభావానికి మేల్కొన్నప్పుడు, వారు దేవుని యొక్క విశేషమైన దయను పంచుకోవడానికి బలవంతం చేయబడతారు, తద్వారా ఇతరుల శ్రేయస్సుకు దోహదపడతారు.
నెబుచాడ్నెజార్ తన గర్వం కారణంగా ఎదుర్కొన్న దైవిక తీర్పులను వివరించే ముందు, కలలు లేదా దర్శనాల ద్వారా అతను పొందిన హెచ్చరికలను వివరించాడు. ఈ ద్యోతకాలు అతని కోసం తరువాత వివరించబడ్డాయి, గొప్ప గౌరవం ఉన్న వ్యక్తిని తక్కువ చేసి ఏడు సంవత్సరాల పాటు వారి కారణాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది-నిస్సందేహంగా తీవ్రమైన తాత్కాలిక శిక్ష. దేవుడు మనపై విధించే బాహ్య పరీక్షలతో సంబంధం లేకుండా, మనం వాటిని ఓపికగా భరించాలి మరియు మన హేతువును ఉపయోగించడాన్ని మరియు మన మనస్సాక్షి యొక్క శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉండాలి.
ప్రభువు తన వివేకంతో, ఒక పాపిని తదుపరి అతిక్రమణలకు పాల్పడకుండా నిరోధించడానికి లేదా విశ్వాసి తన పేరును చెడగొట్టకుండా నిరోధించడానికి అటువంటి చర్యలను ఎంచుకున్నట్లయితే, వారి తప్పుడు చర్యల యొక్క పరిణామాల కంటే అలాంటి భయంకరమైన జోక్యం కూడా ఉత్తమం. దేవుడు, న్యాయమూర్తిగా, దానిని నియమించాడు మరియు స్వర్గంలోని దేవదూతలు కూడా ఈ దైవిక నిర్ణయాన్ని మెచ్చుకుంటారు. గొప్ప దేవునికి దేవదూతల సలహా లేదా ఒప్పందం అవసరం లేనప్పటికీ, వారి సమ్మతి ఈ తీర్పు యొక్క గంభీరతను నొక్కి చెబుతుంది. ఈ చర్య కోసం డిమాండ్ పవిత్రుల నుండి వస్తుంది-దేవుని బాధాకరమైన ప్రజలు. అణచివేయబడినవారు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన వాటిని వింటాడు.
మన నుండి ఎన్నటికీ తీసివేయబడని ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకుందాం మరియు అన్నింటికంటే, అహంకారం మరియు దేవుణ్ణి మరచిపోయే ధోరణి నుండి కాపాడుకుందాం.

దానియేలు తన కలను అర్థం చేసుకున్నాడు. (19-27) 
అటువంటి శక్తిమంతుడైన పాలకునిపై బరువైన తీర్పు వెలువడడాన్ని చూసినప్పుడు దానియేలు విస్మయం మరియు భయంతో నిండిపోయాడు మరియు అతను సౌమ్యత మరియు భక్తితో తన సలహాను అందించాడు. పశ్చాత్తాప ప్రక్రియలో, తప్పులో పాల్గొనడం మానేయడమే కాకుండా సద్గుణాలను పెంపొందించడం కూడా చాలా అవసరం. ఇది రాబోయే తీర్పును పూర్తిగా నివారించలేకపోయినా, దాని రాకను ఆలస్యం చేయవచ్చు లేదా దాని తీవ్రతను తగ్గించవచ్చు. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగేవారు చివరికి శాశ్వతమైన బాధల నుండి తప్పించబడతారు.

దాని నెరవేర్పు. (28-37)
గర్వం మరియు ఆత్మాభిమానం తరచుగా గొప్ప వ్యక్తులను వలలో వేసుకుంటాయి, దేవునికి మాత్రమే సంబంధించిన కీర్తిని తప్పుగా పొందేలా చేస్తుంది. నెబుచాడ్నెజార్ విషయంలో, గర్వపూరితమైన మాటలు అతని పెదవులపై ఉండగానే, ఒక శక్తివంతమైన దైవిక శాసనం వెలువడింది. అతని అవగాహన మరియు జ్ఞాపకశక్తి తీసివేయబడింది మరియు అతని హేతుబద్ధమైన ఆత్మ యొక్క అన్ని సామర్థ్యాలు విచ్ఛిన్నమయ్యాయి. ఇది జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గంభీరంగా గుర్తుచేస్తుంది మరియు మన తెలివిని తీసివేయడానికి దేవుణ్ణి ప్రేరేపించే చర్యలకు దూరంగా ఉంటుంది. లేఖనాలు బోధిస్తున్నట్లుగా, "అహంకారులను దేవుడు వ్యతిరేకిస్తాడు."
నెబుచాడ్నెజ్జార్, కేవలం మర్త్యుని కంటే ఎక్కువగా ఉండాలని కోరుకున్నాడు, దేవునిచే న్యాయంగా తక్కువ స్థితికి తగ్గించబడ్డాడు. ఈ ఎపిసోడ్ దేవుని గురించిన ఒక ప్రాథమిక సత్యాన్ని నొక్కి చెబుతుంది - ఆయన సర్వోన్నతుడు, శాశ్వతుడు, మరియు అతని రాజ్యం కూడా తనలాగే శాశ్వతమైనది మరియు సర్వతో కూడినది. అతని శక్తిని ఎదిరించలేము. వ్యక్తులు తమను తాము లొంగదీసుకుని, తమ పాపాలను ఒప్పుకొని, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు వారు ఆయన అనుగ్రహాన్ని ఆశించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా, దేవుడు మొదటి ఆదాము యొక్క పాపం ద్వారా కోల్పోయిన గౌరవాన్ని వారికి పునరుద్ధరించడమే కాకుండా, రెండవ ఆదాము యొక్క నీతి మరియు దయ ద్వారా వారికి ఉన్నతమైన మహిమను కూడా ప్రసాదిస్తాడు.
బాధలకు ఒక ప్రయోజనం ఉంటుంది మరియు అవి తాము అనుకున్న పనిని సాధించే వరకు మాత్రమే కొనసాగుతాయి. నెబుచాడ్నెజ్జార్ తన పునరుద్ధరణ తర్వాత కేవలం ఒక సంవత్సరం మాత్రమే జీవించాడని నమ్ముతున్నప్పటికీ, నిజమైన పశ్చాత్తాపం మరియు అంగీకరించబడిన విశ్వాసిగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వృత్తాంతం ప్రభువు గర్విష్ఠులను ఎలా అణగదొక్కాడో వివరిస్తుంది, అయితే ఆయనను పిలిచే వినయపూర్వకమైన, పశ్చాత్తాపం చెందిన పాపిపై దయ మరియు ఓదార్పునిస్తుంది.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |