Acts - అపొ. కార్యములు 1 | View All

1. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన

“తియొఫిలస్”– లూకా 1:3. నాలుగు శుభవార్త గ్రంథాల్లో రాసివున్న యేసు చర్యలూ ఉపదేశాలూ ఆయన సేవకు ఆరంభం మాత్రమే. ఆయన చనిపోయి, సజీవంగా లేచి, పరలోకానికి వెళ్ళిన తరువాత తన సేవకులద్వారా తన పనిని సాగించుకొంటూ ఉన్నాడు. అపొ కా గ్రంథంలో ఈ విషయాలలో కొన్ని రాసివున్నాయి – అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 3:6, అపో. కార్యములు 3:16, అపో. కార్యములు 3:26; అపో. కార్యములు 4:10, అపో. కార్యములు 4:30; అపో. కార్యములు 5:31; అపో. కార్యములు 7:56; అపో. కార్యములు 9:3-16; అపో. కార్యములు 18:9-10; అపో. కార్యములు 26:15-18. మత్తయి 28:20; మార్కు 16:20 పోల్చి చూడండి.

2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

వ 9-11; మార్కు 16:19; లూకా 24:51. పవిత్రాత్మ గురించి నోట్స్ మత్తయి 3:16; యోహాను 7:39; యోహాను 14:16-17, యోహాను 14:26; యోహాను 20:22. ఆదికాండము 1:2 కూడా చూడండి. “ఎన్నుకొన్న”– మార్కు 3:13-19; మార్కు 6:12-16. “రాయబారులు” అని తర్జుమా చేసిన గ్రీకు మాట “ఆదేశాలతో పంపబడినవారు” అని అర్థమిస్తుంది (మత్తయి 10:2).

3. ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

“బాధలు”– అంటే ఆయన సిలువ మరణం. అపో. కార్యములు 2:24; అపో. కార్యములు 17:3; అపో. కార్యములు 26:23 పోల్చి చూడండి. ఆయన మరణంనుంచి సజీవంగా లేచాడని రుజువులు చూపెట్టాడు (మత్తయి 28:16-18; మార్కు 16:12-14; లూకా 24:36-43; యోహాను 20:19-29; యోహాను 21:1; 1 కోరింథీయులకు 15:5-8). ఈ రుజువులు నమ్మకం పుట్టించేటంత స్పష్టంగా దృఢంగా ఉన్నాయి. యేసు చనిపోయి లేచిన సత్యాన్ని ఆయన రాయబారులు చాలా నిశ్చయతతో అంతటా ప్రకటించారు – అపో. కార్యములు 2:24, అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 5:30-32; అపో. కార్యములు 10:40; అపో. కార్యములు 13:30-31; అపో. కార్యములు 17:31. ఇది వారి ఉపదేశానికి కేంద్రంగా ఉంది. క్రీస్తు లేచిన రోజు నుంచి పరలోకానికి వెళ్ళే రోజువరకు ఉన్న కాలం ఎంతో తెలియజేసేది ఈ ఒక్క బైబిలు వచనమే. ఈ కాలంలో యేసు తన శిష్యులకు నేర్పించినవి కొన్నిటి గురించి లూకా 24:44-47 లో ఉంది. “దేవుని రాజ్యాన్ని”– మత్తయి 4:17 నోట్. అపో. కార్యములు 1:6; అపో. కార్యములు 8:12; అపో. కార్యములు 14:22; అపో. కార్యములు 19:8; అపో. కార్యములు 20:25; అపో. కార్యములు 28:23, అపో. కార్యములు 28:31 కూడా చూడండి.

4. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;

లూకా 24:49; యోహాను 14:16-17, యోహాను 14:26. వారికి పవిత్రాత్మ బలప్రభావాలు కలిగేవరకు క్రీస్తు సేవకోసం కావలసిన అన్ని సామర్థ్యాలు వారికి ఉండి ఉండవు. క్రీస్తును గురించిన సత్యాలనూ పాత ఒడంబడిక విషయాలనూ తెలుసుకోవడం మాత్రమే వారు చేయవలసిన పనికోసం వారిని సిద్ధపరచదు. పవిత్రాత్మ నింపుదల వారికి అవసరం.

5. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను.

మత్తయి 3:11; మార్కు 1:8; లూకా 3:16. “పవిత్రాత్మలో బాప్తిసం”– యేసు శిష్యులు పొందినదాన్ని వర్ణించడంలో నాలుగు మాటలు ఈ గ్రంథంలో వాడడం జరిగింది – ఇక్కడ “బాప్తిసం పొందుతారు” వ 8లో “మిమ్ములను ఆవరించినప్పుడు” అపో. కార్యములు 2:4 లో “నిండిపోయారు” అపో. కార్యములు 10:47 లో “పవిత్రాత్మను పొందారు” ఈ నాలుగు మాటలూ ఒకే ఒక సంఘటన గురించి వాడబడ్డాయి. ఈ సంఘటన వర్ణన అపో. కార్యములు 2:14 లో ఉంది. ఆ రోజున క్రీస్తు ఒక కొత్త విధంగా పవిత్రాత్మను వారికి దయ చేశాడు. ఇది వారిని పవిత్రాత్మలో ముంచడంలాంటిది, లేక వారిమీద పవిత్రాత్మను కుమ్మరించడం లాంటిది (అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 10:45), లేక వారి అంతరంగాన్నంతటినీ పవిత్రాత్మతో నింపివేయడం వంటిది. దాని ఫలితంగా వారు దేవుని ఆత్మలో బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవుని ఆత్మద్వారా ప్రేరణలూ ఉద్దేశాలూ పొందుతూ ఆ ఆత్మ ఆధీనంలో ఉన్నారు. నిజ క్రైస్తవులుగా జీవించడానికీ సరైన రీతిగా దేవుణ్ణి సేవించడానికీ ఆ ఆత్మ మూలంగా బలప్రభావాలు పొందారు. ఆ నాటినుంచి నేటివరకూ వ్యక్తులు యేసు క్రీస్తుమీది నమ్మకం ద్వారా దేవుని ఆత్మను పొందారు (యోహాను 7:37-39; గలతియులకు 3:2-3, గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:13. లూకా 11:9-13 పోల్చి చూడండి). క్రీస్తుమీద విశ్వాసం పెట్టిన ప్రతి ఒక్కరూ పవిత్రాత్మలో (లేక “తో”, లేక “చేత” గ్రీకు పదంలో ఈ మూడు అర్థాలున్నాయి) క్రీస్తు శరీరంలోకి బాప్తిసం పొందారు (1 కోరింథీయులకు 12:12-13). ప్రతి విశ్వాసీ ఎప్పుడూ పవిత్రాత్మతో నిండి ఉండాలి (ఎఫెసీయులకు 5:18). పవిత్రాత్మలో (లేక “తో”) బాప్తిసం పొందడం గురించిన రిఫరెన్సులు కొద్దిగానే ఉన్నాయి. నాలుగు శుభవార్త గ్రంథాల్లోను రాసి ఉన్న బాప్తిసమిచ్చే యోహాను మాటలు; ఇక్కడ యేసు మాటలు (అపో. కార్యములు 11:16 లో పేతురు ఈ మాటలనే ఎత్తి చెప్పాడు); 1 కోరింథీయులకు 12:13 లో పౌలు రాసిన మాటలు – ఇంతే. ప్రతి సందర్భంలోనూ ఈ బాప్తిసం పొందిన వారి గురించి బహువచనం వాడబడింది. ఒక్క వ్యక్తి మాత్రమే ఆత్మ బాప్తిసం పొందడం గురించి ఎక్కడా రాసిలేదు.

6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన

యేసుప్రభువు నలభై రోజులపాటు దేవుని రాజ్యాన్ని గురించి వారికి నేర్పుతూ వచ్చాడు (3 వ), వారు పాత ఒడంబడిక గ్రంథాన్ని అర్థం చేసుకొనేలా ఆయన వారి మనసులను తెరిచాడు (లూకా 24:45. క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన రోజునే వారు ఈ ప్రశ్న అడిగారు – వ 9). కాబట్టి ఇస్రాయేల్‌ప్రజల విషయంలో దేవుని ఏర్పాటు తెలిసి ఈ ప్రశ్న అడిగారు గాని అజ్ఞానంలో కాదు. దేవుడు ఇస్రాయేల్ నుంచి రాజ్యాన్ని తీసేశాడని వారికి తెలుసు (మత్తయి 21:43). అయినా భవిష్యత్తులో దేవుడు ఆ జాతిని తనవైపుకు మళ్ళీ త్రిప్పి, లోకంలో ఉన్నత స్థానానికీ ప్రభావానికీ హెచ్చిస్తాడని యేసు చెప్పిన దాన్ని బట్టి వారికి తెలుసు (అపో. కార్యములు 3:19-21; యెషయా 2:2-4; యెషయా 14:1-2; జెకర్యా 14:16-21 కూడా చూడండి). అయితే దేవుడు ఎప్పుడు ఇలా చేస్తాడో అది మాత్రం వారికి తెలియదు. వారి ప్రశ్నను గమనించండి – “నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని అడిగారు గాని “నీవు ఇస్రాయేల్‌ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తావా”? అని కాదు.

7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.

తాను ఇస్రాయేల్‌కు దేవుని రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తానన్న వారి నమ్మకం తప్పని ఆయన చెప్పలేదు. నలభై రోజులుగా ఆయన ఈ రాజ్యాన్ని గురించి వారికి నేర్పుతూ వచ్చాడు గనుక దీని విషయాలన్నీ వారు గ్రహించాలన్నది ఆయన ఉద్దేశమని స్పష్టమే. వారు లోకంలో ఆయన ప్రతినిధులుగా, ఆయన సంఘానికి ఉపదేశకులుగా ఉంటారు. ఆయన ఇస్రాయేల్‌కు తన రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తాడన్న వారి నమ్మకం సరైనది కాకపోతే అది వారికి చెప్పకుండా ఉండేవాడా? ఆయన ఈ ప్రధానమైన సిద్ధాంతాన్ని గురించి వారిని అజ్ఞానంలో, తప్పు అభిప్రాయంతో విడిచిపెట్టి ఉండేవాడా? అలా అనుకోగలమా? ఆయన చేసినది ఒక్కటే – తేదీలు కాలాలూ తెలుసుకోవడం వారి పని కాదని మాత్రమే చెప్పాడు.

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను

వ 5. ఇక్కడ బలప్రభావాలు అంటే దేవుడిచ్చే శక్తిసామర్థ్యాలు. ఇవి అస్వాభావికమైనవి, అమానుషమైనవి, మానవాతీతమైనవి. వారిని ఎదిరించే లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండేందుకూ, తగిన రీతిగా జీవించేందుకూ మాట్లాడేందుకూ సేవ చేసేందుకూ వారికి స్వభావసిద్ధంగా ఉన్న శక్తికంటే ఎక్కువ శక్తి అవసరం. కొత్త జన్మ మూలంగా (యోహాను 3:3, యోహాను 3:5 యోహాను 3:8) వారికి కలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి అవసరం. ఇప్పటికీ ఇది నిజం. “సాక్షులై”– అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 5:32; అపో. కార్యములు 10:39; అపో. కార్యములు 13:31; లూకా 24:48; యోహాను 15:27. ఈ గ్రంథంలో దీని వేరువేరు రూపాలలో ఈ మాట 39 సార్లు కనబడుతున్నది. తాను చూచినది, లేక విన్నది, లేక అనుభవపూర్వకంగా తెలుసుకొన్నది ఇతరులకు చెప్పేవాడే సాక్షి. క్రీస్తు రాయబారులు యేసు భూమిమీద బతికి, చనిపోయి, లేచి, శరీరంతో పరలోకానికి వెళ్ళాడనే సత్యాలను ప్రకటించారు. ఆ విషయాలను వారు తమ సొంత కళ్ళతో చూశారు (1 యోహాను 1:1-2). యేసు ఉపదేశించినప్పుడు వారు విని అవే సంగతులను ఉపదేశించారు. ఈ వచనం తీసుకొని ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా చేయవచ్చు – జెరుసలంలో సాక్ష్యం (1-7 అధ్యాయాలు), యూదయ, సమరయలలో సాక్ష్యం (8–12 అధ్యాయాలు), లోకంలోని ఇతర ప్రాంతాలలో సాక్ష్యం (13–28 అధ్యాయాలు). ఈ సాక్ష్యం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు లోకంలో అంతటా ఉన్న దేవుని సేవకులు యేసుకు చెందిన మొదటి శిష్యులు చెప్పిన సాక్ష్యం మూలంగా నేర్చుకొన్న సత్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేగాక క్రీస్తుతో తమ సొంత అనుభవాన్ని గురించి సాక్ష్యం చెప్పగలరు.

9. ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
కీర్తనల గ్రంథము 47:5

అపో. కార్యములు 2:2; మార్కు 16:19; లూకా 24:51; ఫిలిప్పీయులకు 2:9-11. “మేఘం”– బైబిల్లో కొన్ని సార్లు దేవుని సన్నిధికీ, మహిమా ప్రకాశానికీ సూచనగా ఉంది (నిర్గమకాండము 13:21; నిర్గమకాండము 16:10; నిర్గమకాండము 19:9, నిర్గమకాండము 19:16; నిర్గమకాండము 24:15; నిర్గమకాండము 34:5; నిర్గమకాండము 40:34-35; 1 రాజులు 8:10-11; యెషయా 4:5; యెషయా 19:1; మత్తయి 17:5; ప్రకటన గ్రంథం 10:1; ప్రకటన గ్రంథం 14:14). యేసుప్రభువు అంతర్థానం అయ్యాడు. అప్పటినుంచి ఆయన శిష్యులు కనుదృష్టితో కాదు, విశ్వాసంతో బ్రతకాలి. యేసు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి, దేవుని కుడి వైపుకు (అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 3:21). పరలోకం నుంచి ఇక్కడికి ఎంత దూరం? పరలోకం బహుశా చాలా దగ్గరగా ఉందేమో (అపో. కార్యములు 7:55-56). అది భూమిమీద ఉన్న మనుషులకు కనబడని ఆధ్యాత్మిక లోకం. అది ఈ భౌతిక లోకం పక్కనే ఉండవచ్చు.

10. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి

మార్కు 16:5; లూకా 24:4; యోహాను 20:12 పోల్చి చూడండి.

11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

ఈ మాటల అర్థాన్ని ఇలా తీసుకోవచ్చు – యేసు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంత కాలం ఉంటాడు. వెంటనే ఆయన తిరిగి రాడు గనుక వారు అక్కడుండి ఆయనకోసం చూస్తూ ఉండనవసరం లేదు. వారు చేయవలసిన పనులున్నాయి. క్రీస్తు రెండో రాకడ గురించి మత్తయి 24:30; మత్తయి 26:64; మార్కు 13:26; లూకా 21:27; యోహాను 14:3 మొ।। చూడండి.

12. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,

ఆలీవ్ కొండ జెరుసలంకు తూర్పు దిక్కున దాదాపు ఒక కిలోమీటరు దూరాన ఉంది. యూదులు తమ విశ్రాంతి దినాన ఎంత దూరం నడవవచ్చునో దాన్ని యూద మతగురువులు నిర్ణయించారు.

13. వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.

బహుశా ఈ గది యోహాను 20:19, యోహాను 20:26 లో ఉన్న గదే.

14. వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.

యేసు తమకు వాగ్దానం చేసినదాని విషయం వారు ప్రార్థన చేస్తున్నారనాలా? (వ 4:5,8; లూకా 11:13; లూకా 24:49). కొందరు స్త్రీలు కూడా క్రీస్తులో నమ్మకముంచారు – లూకా 23:49, లూకా 23:55; లూకా 24:1, లూకా 24:10. యేసు తల్లి మరియ యోహాను దగ్గర నివాసమున్నది (అపో. కార్యములు 19:26-27). బైబిల్లో ఆమె పేరు కనబడడం ఇది ఆఖరు సారి. రాయబారుల దృష్టిలో ప్రాధాన్యత ఆమెకు కాదు, ఆమె కుమారునికే చెందేది. మొట్టమొదట యేసు తమ్ముళ్ళు (మత్తయి 13:55) ఆయన దేవుని కుమారుడనీ ఇస్రాయేల్‌ప్రజల అభిషిక్తుడనీ నమ్మలేదు (యోహాను 7:5). ఆయన మరణంనుంచి లేచిన తరువాత వారు నమ్మి ఆయన శిష్యులతో చేరారు. వీరంతా పది రోజుల పాటు పవిత్రాత్మ రాకడ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పవిత్రాత్మ వచ్చి ఉన్నాడు గనుక ఆయన రావాలని మనం ఆయనకోసం ఎదురు చూడనవసరం లేదు. అయితే దేవుని సన్నిధిలో ఉండి ఆయన ముఖాన్ని వెదుకుతూ ఉండడం పవిత్రాత్మ సంపూర్ణత కోసం మన హృదయాలను సిద్ధం చేస్తుంది.

15. ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను

యేసు జెరుసలంలో దివ్యమైన సత్యాలు నేర్పుతూ ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసినా, మొదటి విశ్వాసుల గుంపుగా సమకూడినవారు 120 మంది మాత్రమే. ఒకవేళ ఆ నగరంలో ఇతర విశ్వాసులు ఉన్నారేమో గాని ఏవో కారణాలవల్ల వారింకా ఈ గుంపుతో సమకూడలేదు. 1 కోరింథీయులకు 15:6 లో 500 మంది విశ్వాసులున్న సంగతి కనిపిస్తుంది గాని బహుశా వారిలో చాలామంది గలలీలో ఉన్నారేమో. పవిత్రాత్మ వచ్చాక ఒకే రోజున 3,000 మంది పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మారు (అపో. కార్యములు 2:41; యోహాను 14:12; యోహాను 16:7-8 పోల్చి చూడండి).

16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
కీర్తనల గ్రంథము 41:9

యేసుప్రభువులాగే పేతురు పాత ఒడంబడిక గ్రంథంపై నమ్మకం ఉంచాడు. అది పవిత్రాత్మ మూలంగా కలిగినదనీ అది నెరవేరక తప్పదనీ అతడు నమ్మాడు. అపో. కార్యములు 4:25-26; మత్తయి 4:4; మత్తయి 5:17-18; మత్తయి 15:3, మత్తయి 15:6; లూకా 24:44-46; యోహాను 10:35 పోల్చి చూడండి.

17. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.

మత్తయి 10:1-4.

18. ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.

మత్తయి 27:3-8 వచనాలను బట్టి చూస్తే ప్రముఖ యాజులు ఆ పొలాన్ని కొన్నారు. బహుశా యూదా పేరున దాన్ని కొన్నారు గనుక అతడు చనిపోయాకే అది అతనికి “దొరికింది”. అతడు ఉరిపెట్టుకొని చచ్చాడు. అయితే ఆ తాడు తెగి, లేదా చెట్టు కొమ్మ విరిగి అతడు నేలమీదికి పడినట్టు కనిపిస్తున్నది. ఆ విధంగా ఇక్కడ వర్ణించిన ఫలితాలు కలిగాయి.

19. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

20. అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
కీర్తనల గ్రంథము 69:25, కీర్తనల గ్రంథము 109:8

కీర్తనల గ్రంథము 69:25; కీర్తనల గ్రంథము 109:8.

21. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు,

యేసు చేసినవాటినీ నేర్పినవాటినీ తాము చూస్తూ వింటూ ఉన్నామన్న విషయానికి వారు ప్రాధాన్యత ఇచ్చారని గమనించండి. యోహాను 15:27 పోల్చి చూడండి.

22. ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.

23. అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి

దీనిలో వారు జ్ఞానంతో ప్రవర్తించారా? తప్పు చేశారా? ఈ మత్తీయ క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇంకెక్కడా కనబడడు. వారు ఇద్దరినే నిలబెట్టారని గమనించండి. చీట్లు వేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరి పేర చీటి రావాలి. ప్రభువు అతణ్ణి ఎన్నుకొన్నా ఎన్నుకోకపోయినా అతని పేర చీటి రావాలి. ఆ ఇద్దరిని నిలబెట్టకముందు వారు ప్రార్థన చేశారని రాసిలేదు, తరువాతే వారు ఈ సంగతి గురించి ప్రార్థన చేశారని రాసి ఉంది. ఇద్దరిలో ఒకణ్ణి ఎన్నుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం దేవుణ్ణి హద్దులలో పెట్టినట్టే గదా. ఆ ఇద్దరిని తప్ప మరెవరినైనా ఎన్నుకోవడానికి వారు దేవునికి అవకాశం ఇవ్వలేదు. ఈ రచయిత అభిప్రాయం ఏమంటే తరువాత యేసుప్రభువు పౌలును పన్నెండుగురు రాయబారులలో ఒకడుగా నియమించాడు (రోమీయులకు 1:7; 1 కోరింథీయులకు 9:1; 1 కోరింథీయులకు 15:8-10; 2 కోరింథీయులకు 12:12; గలతియులకు 1:1). దేవుని నగరానికి ఉన్న పన్నెండు పునాదులలో ఒకదానిమీద మత్తీయ పేరు కనిపిస్తుందని, పౌలు పేరు మాత్రం కనిపించదని ఈ రచయిత నమ్మలేడు (ప్రకటన గ్రంథం 21:14). చీట్లు వేయడం గురించి లేవీయకాండము 16:8; యెహోషువ 18:6, యెహోషువ 18:8, యెహోషువ 18:10; 1 సమూయేలు 14:42 చూడండి.

24. ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,

25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

26. అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
సామెతలు 16:33



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు పునరుత్థానానికి రుజువులు. (1-5) 
మన ప్రభువు శిష్యులకు అప్పగించిన పనుల గురించి బోధించాడు. యెరూషలేమును విడిచిపెట్టకూడదని క్రీస్తు ఆదేశాన్ని అనుసరించి, అపొస్తలులు పరిశుద్ధాత్మ యొక్క రాబోయే కుమ్మరింపును ఊహించి ఒకచోట చేరారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ దైవిక బాప్టిజం వారి ఆత్మలను జ్ఞానోదయం మరియు పవిత్రం చేస్తూ అద్భుతాలు చేయడానికి వారికి శక్తినిస్తుంది. అటువంటి ధృవీకరణ దైవిక వాగ్దానము యొక్క విశ్వసనీయతను బలపరుస్తుంది మరియు దేవుని వాగ్దానాలన్నీ ధృవీకరించబడిన మరియు నెరవేర్చబడిన క్రీస్తు నుండి ఉద్భవించినందున, దానిపై మన నమ్మకాన్ని ప్రేరేపిస్తుంది.

క్రీస్తు ఆరోహణము. (6-11) 
తమ మాస్టర్ నిర్దేశించని లేదా కొనసాగించమని ప్రోత్సహించని విషయాల గురించి విచారించడానికి వారు ఆసక్తిగా ఉన్నారు. అతని ఆరోహణ మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం త్వరలో ఈ అంచనాలను తొలగిస్తుందని గుర్తించి, మన ప్రభువు మందలింపుతో ప్రతిస్పందించాడు. ఇది అన్ని యుగాలలో అతని చర్చికి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది, నిషేధించబడిన జ్ఞానాన్ని కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమని వారిని ప్రోత్సహిస్తుంది. అతను తన మరణానికి ముందు మరియు అతని పునరుత్థానం తర్వాత వారి విధులను నెరవేర్చడానికి తన శిష్యులకు ఇప్పటికే సూచనలను అందించాడు మరియు ఈ జ్ఞానం క్రైస్తవునికి సరిపోతుంది.
విశ్వాసులకు, వారి పరీక్షలు మరియు సేవలకు తగిన బలాన్ని అందిస్తానని ఆయన వాగ్దానం చేశాడనేది పుష్కలమైన హామీ. పరిశుద్ధాత్మ ప్రభావంతో, వారు భూమిపై క్రీస్తుకు సాక్ష్యమివ్వగలరు, పరలోకంలో ఉన్నప్పుడు, అతను వారి వ్యవహారాలను పరిపూర్ణ జ్ఞానం, సత్యం మరియు ప్రేమతో నిర్వహిస్తాడు. పనిలేకుండా చూస్తూ, పనికిమాలిన పనులలో మునిగిపోయే బదులు, మాస్టర్ యొక్క రెండవ రాకడ గురించిన ఆలోచనలు మనల్ని చర్య మరియు మేల్కొలుపుకు ప్రేరేపించాలి. విస్మయం లేదా భయం యొక్క క్షణాలలో, అతను తిరిగి వస్తాడని ఎదురుచూడటం మనకు ఓదార్పునిస్తుంది మరియు ధైర్యాన్నిస్తుంది. ఆయన దృష్టిలో నిరపరాధులుగా ఉండేందుకు మనం శ్రద్ధగా కృషి చేస్తున్నప్పుడు, ఆ రోజు గురించి మన నిరీక్షణ స్థిరంగా మరియు ఆనందంగా ఉండనివ్వండి.

అపొస్తలులు ప్రార్థనలో ఏకమయ్యారు. (12-14) 
దేవుడు తన ప్రజలకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందించగలడు. దేవుని ప్రజలందరూ చేయాలనుకుంటున్నట్లుగా వారు మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సమయంలో, క్రీస్తు శిష్యులు కష్టాలు మరియు ఆపదలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, బాధల సమయాల్లో, ప్రార్థనలో నివారణ కనుగొనబడింది, ఎందుకంటే ఆందోళనలను నిశ్శబ్దం చేసే మరియు భయాలను తొలగించే శక్తి దీనికి ఉంది. ముందున్న ముఖ్యమైన పనితో, వారు తమ మిషన్‌ను ప్రారంభించడానికి ముందు ప్రార్థన ద్వారా దేవుని ఉనికిని హృదయపూర్వకంగా కోరుకున్నారు. ఆత్మ యొక్క అవరోహణను ఊహించి, వారి ప్రార్థనలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రార్థనా స్థితిలో ఉన్నవారు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందేందుకు సరైన స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మను పంపుతానని క్రీస్తు వాగ్దానం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తగ్గించలేదు; బదులుగా, అది ఉత్తేజపరిచేందుకు మరియు బలపరిచేందుకు ఉపయోగపడింది. ఒక చిన్న, ప్రేమగల, ఆదర్శప్రాయమైన సమూహం, తీవ్రంగా ప్రార్థిస్తూ మరియు ఉత్సాహంగా క్రీస్తు కారణాన్ని ముందుకు తీసుకువెళుతుంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది.

జుడాస్ స్థానంలో మథియాస్ ఎంపికయ్యాడు. (15-26)
అపొస్తలులు ప్రపంచానికి ప్రకటించాల్సిన ప్రధాన సందేశం క్రీస్తు పునరుత్థానం. ఈ సంఘటన అతని మెస్సీయత్వానికి మరియు అతనిపై మనకున్న నిరీక్షణకు అత్యంత ప్రాముఖ్యమైన సాక్ష్యంగా పనిచేసింది. వారి నియామకం ప్రాపంచిక ప్రతిష్ట మరియు పాలన కోసం కాదు, క్రీస్తును మరియు అతని పునరుత్థానం యొక్క పరివర్తన శక్తిని బోధించే ఉద్దేశ్యంతో. అతని సర్వజ్ఞతను అంగీకరిస్తూ దేవునికి విజ్ఞప్తి చేయబడింది-అందరి హృదయాలను తెలిసినవాడు, మన గురించి మన స్వంత అవగాహనను మించిన జ్ఞానం. దేవుడు తన స్వంత సేవకులను ఎన్నుకోవడం సముచితం, మరియు అతను తన ఎంపికలను ప్రొవిడెన్షియల్ ఏర్పాట్లు లేదా అతని ఆత్మ యొక్క ప్రసాదం ద్వారా వెల్లడించినప్పుడు, మనం అతని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. మనకు సంభవించే ప్రతిదానిని నిర్ణయించడంలో అతని హస్తాన్ని మనం గుర్తిద్దాం, ముఖ్యంగా మనపై నమ్మకం ఉంచబడిన సందర్భాల్లో.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |