ద్వితీయోపదేశకాండము 14:3-21. కొన్నిటిని తినకూడదని ఈ నిషేధాలను దేవుడు విధించడానికి అనేకమైన కారణాలున్నట్లు కనిపిస్తున్నది. గమనించి చూస్తే మొత్తంమీద “అశుద్ధం” అని చెప్పిన చాలా రకాల జంతువులు, “శుద్ధం” అని చెప్పిన గొర్రె, మేక మొదలైన వాటిలాగా ఎలానూ తినదగ్గవి కావు. ఆరోగ్యకరం, శ్రేష్ఠం అయిన మాంసాహారాలనే తన ప్రజలు తినాలని దేవుని కోరిక. అంతేకాక భూమిమీద ఉన్న ఇతర జనాలతో కలవకుండా ఇస్రాయేల్ ప్రజ ప్రత్యేకంగా ఉండడం దేవుని సంకల్పం (నిర్గమకాండము 19:5-6 ద్వితీయోపదేశకాండము 7:6 ద్వితీయోపదేశకాండము 14:2). తన రహస్య సత్యాలను వెల్లడి చేయడానికీ, లోక రక్షకుణ్ణి పంపించడానికీ దేవుడు ఇస్రాయేల్‌ను ఎన్నుకోవడమే ఇందుకు కారణం. ఒక జాతి ప్రజలను వేరుగా ప్రత్యేకంగా ఉంచే ఒక విధానమేదంటే వారి ఆహార నియమాలను ప్రత్యేకించడమే. విశ్రాంతి దినం, సున్నతి సంస్కారం, పండుగలు, సన్నిధిగుడారం ఆరాధన వీటన్నిటికీ తోడు ఖచ్చితమైన ఆహార నియమాలు – ఇవన్నీ ఇస్రాయేల్ వారిని ప్రత్యేకమైన జనాంగంగా తీర్చిదిద్ది అలానే ఉంచుతూ వచ్చాయి. ఇది దేవుని సంకల్పం.
ఇంతేగాక దేవుడు సంకేతాలు, ఉదాహరణలు, సూచనలు, దృష్టాంతాల రూపంలో తన ప్రజలకు మంచి, చెడు, తప్పు, ఒప్పు, ఆరోగ్యకరం, అనారోగ్యకరం, ఈ విధమైన తేడాలను గమనించి నడుచుకొనే జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. వారు అపవిత్రమైనదేదైనా మాలిన్యమైనదేదైనా సరే, దానినుంచి దూరంగా ఉండడానికి చూడాలి. కొందరు బైబిలు పండితులు రాసినట్టు ఒకవేళ మనుషుల పాపాలు అశుద్ధ జంతువుల్లాంటివని దేవుడు ఉపదేశిస్తున్నాడేమో. జిత్తులమారి నక్క, అసహ్యాన్ని తినే పంది, తలబిరుసు గాడిద, ఏది పడితే దాన్ని ఆత్రంగా తినే కుక్క, క్రూరమైన సింహం, పులి, కుళ్ళి కంపుకొట్టే శవాలను పీక్కుతినే రాబందు, చీకటి అంటే ఇష్టమున్న గుడ్లగూబ, మురికి గుంటల అడుగున ఉండే జారుడు గుణం గల చేపలు, కాటేసే విషసర్పం, భూమి మీద ప్రాకుతూ దేకుతూ ఉండే అనేకమైన జీవాలు, పెంట కుప్పల్లో మురుగులో తిరిగే క్రిమి కీటకాలు మొదలైన అపవిత్ర జంతువుల్లాంటివే మనుషుల పాపాలు. ఈ విధంగా మనిషి పాపం అసహ్యం, క్రూరం, ప్రమాదకరం, వినాశకరం, కుళ్ళు అయినదన్నట్టు చూపబడింది. నిజంగానే పాపం ఇలాంటిదే.
ఏది ఏమైనా ఈ అధ్యాయంలో కనిపించే ఆదేశాలు దేవుని ప్రజలు ఏమి తినవచ్చు, ఏమి తినకూడదు అన్న విషయానికి సంబంధించినవి కాబట్టి దృష్టాంత రూపంలో ఉన్న దీని ప్రధాన అంతరార్థం ఇది అయి ఉండవచ్చు – దేవుని ప్రజలు మానసిక, ఆధ్యాత్మిక ఆహారాలకు సంబంధించి తినదగినవీ ఆరోగ్యకరమైనవీ కొన్నీ, తినకూడనవీ అనారోగ్యకారణమైనవీ కొన్నీ ఉన్నాయి. దేవుని ప్రజలు అర్పించినవే యాజులకు ఆహారం. ఈ అర్పణలు క్రీస్తుకు సూచనలు (లేవీయకాండము 2:3 లేవీయకాండము 6:26 లేవీయకాండము 7:6-10 లేవీయకాండము 7:13-14 లేవీయకాండము 7:31-36). ఈ ఆహార పదార్థాలే మొత్తంగా దేవుని ప్రజలందరూ తినవలసినవి (లేవీయకాండము 11:3), గానీ వీరు తినగూడని జంతువులు కొన్ని ఉన్నాయి. వాటి శవాలను తాకడం కూడా నిషేధమే. ఇవి తినరాని అశుద్ధమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని సూచిస్తూ ఉన్నాయి.
ఆహారం అంటే ఆలోచనలు, ఊహలు, మన మనస్సుల్లోకీ హృదయాల్లోకీ మనం రానిచ్చే విషయాలన్నీ అని అర్థం. ఈ విషయాలు ఎలాంటివై వుండాలో అన్న సంగతిని బైబిలు స్పష్టంగా చూపిస్తున్నది. కీర్తనల గ్రంథము 1:1-2 కీర్తనల గ్రంథము 119:11 మత్తయి 16:6 మత్తయి 16:12 ఫిలిప్పీయులకు 4:8 కొలొస్సయులకు 2:8 కొలొస్సయులకు 3:16 హెబ్రీయులకు 5:11-14 1 పేతురు 2:2-3 చూడండి. లోకమంతా దుర్మార్గంలోను చీకటి లోను ఉంది (1 యోహాను 5:19). దాని ఊహలు, ఉపదేశాలు, వేదాంతాలు, మత సిద్ధాంతాలు అన్నీ అపవిత్రాలు, నాశనకారకాలు. మనుషులు దేవుని వాక్కును ఆరగించకపోతే వారు మానసికంగా ఆరగించేది బొద్దింకలు, ఎలుకలు, తేళ్ళు, గోదురు కప్పలు, గొంగళి పురుగులు, నాగుపాముల లాంటి వికారమైన అసహ్యకరమైన వాటిలాంటివే కావచ్చు. ఎందుకంటే లోకంలో దొరికేవి చాలా మట్టుకు ఇలాంటివే. ఈ అధ్యాయంలో చెప్పిన అశుద్ధ జీవులు కొత్త ఒడంబడికలో అశుద్ధాలుగా ఎంచబడలేదు (అపో. కార్యములు 10:9-16 1 కోరింథీయులకు 10:25-26 1 తిమోతికి 4:3-5). దీన్ని బట్టి అవి వాటంతట అవే ఎప్పుడూ అశుద్ధ జీవులు కావు గాని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేందుకు వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడని తెలుస్తున్నది. ఉదాహరణలకు సంబంధించిన అంతరార్థాలను దేవుడు నేర్పించిన తరువాత ఇక వాటికి సంబంధించిన ఆదేశాలను రద్దు చేశాడన్న మాట.